Monday, August 12, 2013

closing Day of Telegraph in India, ఇండియాలో మూయబడిన తంత్రి దినము

  •  

  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (15.జూలై-2013 .) -   closing Day of Telegraph in India, ఇండియాలో మూయబడిన తంత్రి దినము - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము 


జులై 15తో టెలిగ్రాఫ్‌కు ముగింపు-సాంేకతికత పెరగడంతో పనికిరాకుండా పోయిన టెలిగ్రాఫ్ ,
తొలి తరంలో ఎంతో కీలక భూమిక--టెలిగ్రాములది 160 ఏళ్ల చరిత్ర,
తొలిసారి 1850లో మన దేశంలో ఏర్పాటు--కొల్‌కతా - డైమండ్ హార్బర్‌ల మధ్య పంపిణీ.

ఇవాళ సాంకేతిక అద్భుతం అనుకున్నది రేపు పాత పద్ధతిగా మారుతుంది. రేపు వచ్చేది.. ఎల్లుండికి కనుమరుగవుతుంది. సమాజంలోకి కొత్త వస్తువులు రావడం పాత వస్తువులు పోవడం సహజం. మనిషి పుట్టుక చావు ఎలానో సాంకేతిక అలాగే . . . ఇలా కాలగర్భంలో కలిసిపోయిన వస్తువులు, పద్దతులు ఎన్నో ఉన్నాయి . ఇక వాటిని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడమే. తాజాగా చరిత్ర పుస్తకాలకు ఎక్కబోతోంది టెలిగ్రాఫ్‌. .. టెలిఫోన్‌, సెల్‌ఫోన్లు పల్లెలకు విస్తరించడంతో టెలిగ్రాఫ్‌కు ఆదరణ కరువైనది.

ఒకప్పుడు ప్రధాన సమాచార పంపిణీ వ్యవస్థగా ఉన్నది కొద్ది రోజుల్లో అటెకక్కబోతోంది. ఈ సందర్భంగా టెలిగ్రాఫ్‌కు సంబంధించి పలు విశేషాలు... ఆఖరు టెలిగ్రామ్‌ ఆదివారము మధ్యాహ్నం 11 గంటల 45 నిముషాలకి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రసిడెంట్ రాహుల గాంధీ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఢిల్లీ టెలిగ్రాఫ్ ఆఫీషునుండి టెలిగ్రామ్‌ వెళ్ళింది.

ఇప్పుడంటే ప్రతీ వ్యక్తి చేతిలో ఫోన్‌ ఉంది కానీ 18వ శతాబ్దంలో సమాచార మార్పిడికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంతో మంది శ్రమించి 1895లో టెలిగ్రాఫ్‌ విధానం ప్రవేశపెట్టారు. డాట్‌.. డాష్‌.. ఫుల్‌స్టాప్‌ల ఆధారంగా ఇది ఒక చోటి నుంచి మరోచోటికి సమాచారాన్ని పంపిస్తుంది. సాంకేతికత పెరిగిపోవడంతో దీంతో ఉపయోగం లేకుండా మారింది. కానీ 19వ శతాబ్దం ఆరంభంలో టెలిగ్రాఫ్‌ సమాచార పంపిణీలో కీలక పాత్ర పోషించింది. దాదాపు 160 ఏళ్ల చరిత్ర ఉన్న టెలిగ్రాఫ్‌ కథ జులై -15-2013 తో ముగియనుంది.

టెలిగ్రాఫ్‌ అంటే సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపించడం. ఈ పద్దతిని కనిపెట్టిన వ్యక్తి మోర్స్‌. అయన పూర్తి పేరు శామ్యూల్‌ ఫిన్లీ బ్రీస్‌మోర్స్‌. ఈయన 1791 ఏప్రిల్‌ 27న అమెరికాలో చార్ట్‌టౌన్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మోర్సికి బొమ్మలు వేయడమన్నా, చేయడమన్నా చాలా ఇష్టం. ఎప్పుడూ రకరకాల బొమ్మలు చేస్తూనో, రంగులతో బొమ్మలు చిత్రిస్తూనో గడిపేవాడు. అల్లరి అబ్బాయేకాని చదువులో కూడా ముందుండేవాడు. లెక్కలు, సైన్స్‌లను అంతగా ఇష్టపడేవాడు కాదు. అందువల్ల లండన్‌లో పెయింటింగ్‌ నేర్చుకున్నాడు.

1832లో న్యూయార్క్‌ యూనివర్శిటీలో చిత్రకళ ఆచార్యుడిగా ఉద్యోగం చేశాడు. అదే సమయంలో ఎలక్ట్రోమాగ్నెటిక్‌ టెలిగ్రాప్‌ పరికరాన్ని రుపొందించాడు. దీనితో తీగెల ద్వారా, సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా సంకేతాలనీ రూపొందించాడు. దానినే మోర్స్‌ కోడ్‌ అంటారు. వాషింగ్‌టన్‌ డిసి, బాల్టిమోర్‌
అనే రెండు ప్రదేశాల మధ్య టెలిగ్రాఫ్‌ లైన్‌ నిర్మించారు. ఆ తరువాత 1844 మే, 24న మోర్స్‌ మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ పంపాడు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్‌ వ్యవస్థను విస్తరించి సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో సహాయపడింది. చిన్న సంకేతాలను డాట్‌(.) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి ఉండే సంకేతాలను డాష్‌(-) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, సంకేతాలను తయారు చేశారు. అమెరికాలో తొలి టెలిగ్రామ్‌ను 1838 జనవరి 11న మూడు కిలోమీటర్ల దూరానికి ప్రయోగాత్మకంగా పంపారు.

దృశ్య టెలిగ్రాఫ్‌
క్రీ.పూ.500 ప్రాంతంలో పర్షియా చక్రవర్తి డేరియన్‌ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించడానికి బిగ్గరగా అరవగలిగే వాళ్లను కొండశిఖరాలపై నియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్‌ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాల నుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. ఆఫ్రికాలో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే, వివిధ శబ్ద స్వరాలు ఏర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపుతూ ఉండేవారు.

టెలిగ్రాఫ్‌ విధానంలో మార్పులు
మోర్స్‌ విధానాన్ని అమెరికాలో థామస్‌ అల్వా ఎడిసన్‌, జర్మనీలో వెర్నర్‌ సీమెన్స్‌, ఇంగ్లండ్‌లోఆయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. లండన్‌లో జన్మించిన డేవిడ్‌ ఎడ్వర్డ్‌ హగ్స్‌ అనే సంగీత శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్‌ యంత్రాన్ని నిర్మించాడు. పియానోలో ఉన్నట్టుగా ఇందులో ఒక కీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్‌ ఈ సాధనం నుండే తయారుచేయబడినది. అనేక దేశాల్లో టెలిగ్రాఫ్‌ యంత్రాల స్థానే టెలిప్రింటర్లు వచ్చాయి. టెలిఫోన్‌ లాగా మనకు కావలసిన సంఖ్యను డయల్‌ చేసి సందేశాలను టెలిప్రింటర్‌ ద్వారా పంపడానికి వీలయింది. నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్‌ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానంలో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. కాలం, దూరం,అత్యల్పమైపోయింది. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్‌ తీగలతోనూ, కేబుల్స్‌తోను అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నాయి. అయితే సాంకేతికత కారణంగా ఈ  బంధం జులై 15తో తెగిపోనుంది.

మన దేశంలో...
1850లో కొల్‌కత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య మొదటి ప్రయోగాత్మక విద్యుత్‌ టెలిగ్రాఫ్‌ లైన్‌ ప్రారంభం అయింది. 1851లో దాన్ని బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ కోసం ఆరంభించారు. ఆ కాలంలో ప్రజా పనుల విభాగంలో తంతి(టెలిగ్రాఫ్‌) కూడా ఓ విభాగంగా మారింది. ఉత్తర ప్రాంతంలోని కొల్‌కతా, పెషావర్‌లను ఆగ్రా, ముంబయ్‌ల మీదుగా సిన్ద్వా లోయల ద్వారా, దక్షిణాన ఉన్న చెన్నైతో పాటు ఊటీ ఉదక మండలం, బెంగుళూరులను కలిపే 4,000 మైళ్ల (6,400 కిలోమీటర్ల) టెలిగ్రాఫ్‌ లైన్ల నిర్మాణం నవంబర్‌ 1853లో ప్రారంభమైంది.
భారతదేశంలోని టెలిగ్రాఫ్‌కు మార్గదర్శకత్వం వహించిన డాక్టర్‌ విలియం ఓషౌఘ్నెస్సి ప్రజా పనుల విభాగానికి చెందినవారు. ఆయన ఈ కాలమంతా టెలికాం రంగ అభివృద్ధి కోసమే పనిచేశారు. 1854 నుంచి టెలిగ్రాఫ్‌ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన సాంకేతికతో ఇక టెలిగ్రాంలతో అవసరం లేదని, వాటికి మంగళం పాడేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 2013 జూలై 15నుంచి టెలిగ్రాం అన్న పదం ఇక వినపడదు. విదేశాలకు పంపే టెలిగ్రాంలను రెండు నెలల క్రితమే ఆపేశారు.

తొలి టెలిగ్రాఫ్‌
1794లో తొలిసారిగా పారిస్‌, లిల్లీ నగరాలు మధ్య తొలి చాప్‌ టెలిగ్రాఫ్‌ సంబంధం ఏర్పాటయింది. ఎత్తయిన స్తంభాలు, అక్షరాలు, చిహ్నాల ద్వారా సంకేతాలను తెలియజేసేవారు. మొదటి సారి పారిస్‌ నుంచి 130 మైళ్ల దూరంలో ఉండే లిల్లీ నగరానికి 22 స్తంబాల మీదుగా సందేశాలను పంపడానికి 2 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. స్కాట్లండ్‌ వైద్యుడు చార్లెస్‌ మారిసన్‌ విద్యుత్‌ ద్వారా సంకేతాలను ప్రసారం చేయవచ్చని 1753లోనే సూచించాడు.

విశేషాలు
  • 1845 జనవరి ఒకటిన ఓ హత్య జరిగింది. ‘‘సాల్టిల్‌లో ఓ హత్య జరిగింది. హంతకుడు స్లో అనే ప్రాంతంలో రైలు ఎక్కాడు. గోధుమ రంగు కోటు ధరించి ఉన్నాడు’’ అనే టెలిగ్రాఫ్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇలా అందింది. అప్రమత్తమైన పోలీసులు హంతకుడి పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష వేసింది. టెలిగ్రాఫ్‌ తీగలే ఉరితీశాయని ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు. 
  • తొలిసారిగా 1848లో హాంబర్డ్‌, కక్స్‌ హావన్‌ మధ్య మోర్స్‌ టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఏర్పాటయింది.
  • 1895లో ఫ్రాన్స్‌ లో ఆల్బెర్ట్‌ టర్‌పైన్‌ అనే శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు.
  • 1897, మే 17న ఇటలీలో మార్కోనీ అనే శాస్తజ్ఞ్రుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్‌ తపాలా కార్యాలయ ఇంజనీర్‌ సహకారంతో మొదటి వైర్‌లెస్‌ సంకేతాలను నీటి పైనుండి లివర్‌నాక్‌ నుండి వేల్స్‌ వరకు ప్రసారం చేయించాడు.
  • మన దేశంలో 1902లో సాగర్‌ ఐలాండ్స్‌, సాండ్‌ హెడ్‌‌‌‌స మధ్య మొట్టమొదటి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ కేంద్రం ప్రారంభం అయింది.
  • సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని తమ రాజ భవనానికి మాత్రం టెలిగ్రాఫ్‌ సౌకర్యాన్ని కల్పించడానికి జార్‌ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్‌ సీమెన్స్‌ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్కన తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్‌ రష్యా అంతటా టెలిగ్రాఫ్‌ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
  • 1850 : మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ లైన్స్‌ కలకత్తా నుంచి డైమండ్‌ హార్బర్‌ వరకు ప్రారంభమయ్యాయి.
  • 1851 : ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టెలిగ్రాఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
  • 1853 : టెలిగ్రాఫ్‌ కోసం ప్రత్యేక విభాగం ఏర్పడింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
  • 1854 : దేశం మొత్తం మీద నాలుగు వేల మైళ్ల టెలిగ్రాఫ్‌ లైన్లు నిర్మాణం జరిగింది.
  • 1885 : ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది.
  • 1902 : సాగర్‌ ఐలాండ్‌, శాండ్‌ హెడ్‌ ల మధ్య తొలి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషన్‌ ఏర్పాటైంది.
  • 1927 : ఇండియా, యుకె మధ్య రేడియో టెలిగ్రాఫ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.
  • 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.

===========================
collected by Dr.Seshagirirao(Srikakulam)
  • =============================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .