Friday, May 24, 2013

International Biodiversity Day,నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

  •  
  •  

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.మే 22.) -International Biodiversity Day,నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం  - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



మే 22 తేదీని అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా, 2010ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ప్లానెటరీ సొసైటీఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎన్‌ రఘునందన్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఆక్టివిజమ్‌(సిఇఎ), సొసైటీఫర్‌ హ్యూమన్‌ అవేర్‌నెస్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (షార్డ్‌), అట్లాంటా ఫౌండేషన్‌ సహకారంతో శనివారం నుంచి జూన్‌ 5 వరకు జీవవైవిధ్యానికిసంబంధించిన వీడియోలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.


భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అంతెందుకు మీలో ఎంతమంది 'పిచ్చుక'ను చూశారు? చాలామంది చూడలేదనే చెపుతారు కదూ! ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ 'జీవవైవిధ్య దినోత్సవం'.  ఈ నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిధ్యం' గురించి, అందులో పిచ్చుకమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు)  ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎలా కాపాడుకొందాం..?

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

పిచ్చుక

ఏదేమైనా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో మన పిచ్చుకమ్మ కూడా చేరిపోయింది. పాపం కదూ! ఇక పిచ్చుక విషయానికొస్తే... పిచ్చుకను ఇంగ్లీషులో స్పారో అంటారు. ఇది చిన్ని పక్షి. కొంచెం బొద్దుగా, గోధుమరంగు ఈకలు ఉంటాయి. ఈకల చివర్లలో ముదురు గోధుమరంగుతో చిత్రకారుడు చిత్రించినట్లే ఉంటాయి. పొట్ట భాగంలో తెలుపురంగు ఉంటుంది. దీని తోక పొట్టిగా ఉంటుంది. ముక్కు మాత్రం చాలా గట్టిగా ఉంటుందర్రా! వడ్డు గింజల్ని మనం కూడా అంత వేగంగా వలవలేం. ఇది మాత్రం ముక్కుతో టక్కున వలిచి, గింజను గుటుక్కున మింగేస్తుంది. ఇది చిన్ని చిన్ని పురుగుల్ని కూడా తింటుందర్రా! దీని నాలుకలో గట్టి ఎముక ఉంటుందంట.

ప్రాచీనకాలంలో అసలు ఈ పిచ్చుకలు యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో బాగా ఉండేవి. ఆస్ట్రేలియా, అమెరికాకు కూడా విస్తరించి అక్కడ పట్టణాల్లో బాగా స్థిరపడిపోయాయంట. అమెరికా పిచ్చుకలు ఆధునిక పిచ్చుకలకు నాటి పిచ్చుకలకు కొన్ని పోలికలున్నా తేడాలు చాలానే ఉన్నాయంట. మానవుడి జీవనశైలిలో వచ్చిన మార్పులు 'పిచ్చుకపై బ్రహ్మస్త్రం'గా పరిణమించింది. పట్టణీకరణ, చెట్లు తగ్గిపోవడం, రసాయనాల వాడకం అధికం కావడం వంటి
కారణాలు కూడా ఇవి అంతరించి పోవడానికి దారితీశాయి. ప్రధానంగా సెల్యూలర్‌ టవర్లు  నుంచి వెలువడే అయస్కాంతతరంగాలు పిచ్చుక జాతికి ముప్పుగా  మారిందంట. నిజమైన పిచ్చుకలలో ఇంచుమించుగా 35 జాతులున్నా పిచ్చుక తన గూడును ఎంతో అందంగా నిర్మించుకుంటుంది. కానీ నేటి పరిస్థితుల్లో వీటిని రక్షించుకోవాలంటే కృత్రిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయాలంటున్నారు మన శాస్త్రవేత్తలు.

    'ఈ భూప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు. కానీ దురాశను తీర్చడం మాత్రం సాధ్యం కాదు'-----    -మహాత్మాగాంధీ
    'ఈ భూమిపై తేనెటీగలు పూర్తిగా అంతరించిపోయిన నాలుగు సంవత్సరాలకు మానవజాతి మిగలకపోవచ్చు' -----    - ఐన్‌స్టీన్‌

 Srikakulam

  ప్రకృతి మన నేస్తం-పర్యావరణ రక్షణలో సిక్కోలు సైతం..మూగజీవాలకు అంతులేని కష్టం పర్యావరణ పరిరక్షణ.. ఇప్పుడిది మానవాళికి అత్యవసరం..పచ్చదనం హరించుకుపోతూ.. పర్యావరణానికి నేస్తాలయిన జంతువులు, పక్షులు మృత్యువాత పడడంతో విశ్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలకు కారకుడు బుద్ధిజీవిగా పేరొందిన మనిషేనన్న కఠోర నిజం ఆలోచింపజేయాల్సిన తరుణమిదే. విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనల్లో పర్యావరణ
హితానికే ఎక్కువ కల్పిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సులను ఏర్పాటు చేసి ప్రపంచానికి అవగాహన కలిగిస్తోంది. ఇందులో సిక్కోలు కూడా  'మేము సైతం' అంటోంది. మంగళవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం'

జిల్లాలో 70.767 హెక్టార్ల అటవీ విస్తీర్ణముంది.. జిల్లాలో 50 రకాల జంతుజాతులు, 122 రకాల పక్షులు, 35 రకాల సర్ప జాతులు ఉన్నాయి. అందులో ప్రధానమైన వన్యప్రాణులు వివిధ సమస్యల మూలంగా మృత్యువాత పడుతున్నాయి.

సిక్కోలు జీవవైవిధ్యం.. చిన్నారి హితులు
* తేలినీలాపురం.. జీవవైవిధ్యంలో మన జిల్లా ప్రాధాన్యానికి చక్కని ఉదాహరణ. సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా నుంచి ఇక్కడకు వచ్చిన విహంగ నేస్తాలను చూసేందుకు ఏటా పాఠశాల చిన్నారులు వెళ్తుంటారు.

* ఎక్కడ నుంచో మన జిల్లాకు వచ్చిన వయ్యారిభామ, గుర్రపుడెక్క, ఈఫటోరియం, సర్కారుతుమ్మ మొదలైనవి విస్తరించి.. స్థానికంగా మొక్కల పెరుగుదలకు ఆటంకంగా మారి, మనకు వ్యాధులు కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలుచోట్ల పాఠశాల చిన్నారులు వయ్యారిభామ మొక్కలను పుష్పాలు రాకముందే తగలబెడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

* కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు రుషీకేశ్‌, ధనుష్‌ 'వ్యర్థంతో అర్థం' అనే ప్రాజెక్టును తయారు చేశారు. మన ఇళ్లల్లో ఉన్న చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేయడం. తడి చెత్త నుంచి వ్యర్థ ఆహార పదార్థాలతో వంటగ్యాస్‌ తయారీ, పొడిచెత్తను మళ్లీ   ఉపయోగించడం, పునఃశ్చక్రియ చేయడాన్ని వివరించారు.

* ఇదే పాఠశాలకు చెందిన శిరీష ప్రాజెక్టు 'అలల నుంచి విద్యుత్తు' ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో చోటుచేసుకుంది.

* జిల్లాలో ఇలాంటి పర్యావరణమిత్రులు చాలా పాఠశాలల్లో ఉన్నారు

వెంటాడుతోన్న నిర్లక్ష్యం
* ప్రధాన నీటి వనరులుగా ఉన్న తమిరి చెరువు, సుంకిడి సాగరం, గంగాసాగరం, మహేంద్రతనయ నదితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల వద్దకు వన్యప్రాణులు వస్తున్నాయి.

* వన్యప్రాణులు నివసించే మహేంద్రగిరుల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయకపోవడం, ఆక్రమణలు, ఇతర సమస్యల మూలంగా చిన్న చెరువులు, కాలువలు మాయమవడంతో వీటి మనుగడకు ముప్పు ఏర్పడింది.

* కాశీబుగ్గ అటవీ రేంజి పరిధిలో 7811 ఎకరాల విస్తీర్ణంలో జింక, దుప్పి, అడవి పంది, కుందేలు, హైనా తదితర 20కి పైగా జంతు జాతులు, నెమలి, కంసుపిట్ట, అడవికోడి తదితర 35 రకాల పక్షిజాతులు మహేంద్రగిరుల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి పందులు, నెమళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

* బీల ప్రాంతంలో పాముల మెట్ట, కాకులమెట్టల పరిధిలో మొక్కలు, చెట్లు తొలగించడంతో అడవి పందులు పొలాలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. గత ఖరీఫ్‌తోపాటు.. ప్రస్తుతం రబీలో వరి పంట అడవి పందుల దాడికి పెద్దఎత్తున నష్టపోయింది.

* మహేంద్రగిరుల్లో ఆహారం కొరత, మంచినీరు దొరక్కపోవడంతో ఎలుగుబంట్లు ఉద్దానం, తీరప్రాంత గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఎర్రముక్కాం, సిరిమామిడి, మామిడిపల్లి, దున్నూరు, లోహరిబంద గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆరు నెలల కాలంలో ఐదుగురు వ్యక్తులు ఎలుగుబంట్ల దాడికి గురై గాయాలపాలయ్యారు.

పంట రక్షణ పేరిట..
పంట పొలాలు, చెరుకు తోటలు, దుంప, కూరగాయలు, ఇతర వ్యవసాయ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకునే పేరిట గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు ఎక్కువ జంతువులు బలవుతున్నాయి. బాతుపురం, మాలగోవిందపురం, కోష్ఠ, బోగాబెణి, భోగాపురం, కళింగదళ, కృష్ణాపురం, కుంబరినౌగాం, గురంటి, కొనక, సాబకోట, గంతరు, గూండాం, పొత్తంగి, కిల్లోయి, ఎం.ఎస్‌.పల్లి, జె.భైరిపురం, జలంత్రకోట, జె.శాసనాం, రామకృష్ణాపురం, సుంకిడి, బుషాభద్ర, పొత్రఖండ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అడవిపందులు, జింక, దుప్పిలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కంచిలి మండలంలో క్వారీల పేలుళ్ల ప్రభావం వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. రిజర్వు అటవీ ప్రాంతంలో ఎటువంటి పేలుళ్లు చేపట్టకూడదన్న అంశాన్ని పెడచెవిన పెట్టారు. సోంపేట, కంచిలి, మందస లాంటి మండల కేంద్రాల్లో సైతం అధికసంఖ్యలో కోతులు చొరబడుతున్నాయి.

కలప దొంగలు..
మహేంద్రగిరుల్లో దట్టంగా పెరిగిన అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన కలప అక్రమ నరికివేతకు గురవుతున్నాయి. మద్ది, టేకు, ఇరుగుడు, తెల్ల గుమ్మడి, మామిడి, నరమామిడి, నీలగిరి, వెదురు నరికివేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు.

కంటితుడుపు చర్యలే..
కాశీబుగ్గ రేంజి పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో 20 వేలకుపైగా వన్యప్రాణులు ఉండగా వాటికి నీటి ఏర్పాట్ల కోసం కేవలం రూ. 50 వేలు మంజూరు చేశారు. ఈ మొత్తాలతో నాలుగైదు నీటి కుండీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.

వన్య ప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు
జీవవైవిధ్యానికి విఘాతం కలిగించి వన్యప్రాణుల ఉనికికి ముప్పు కలిగిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. వివిధ కారణాలతో వన్యప్రాణులు జనావాసాల మధ్యకు రావడం పరిపాటిగా మారింది. తాగునీటికోసం గ్రామాలవైపు వస్తున్న మూగ జీవాలపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు. వన్యప్రాణులను వేటాడిన వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వివిధ కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తే అటవీ శాఖాధికారులకు సమాచారమివ్వాలి. అడవుల నరికివేతతోపాటు సహజసిద్ధంగా ఉన్న నీటి వనరులు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న సమాచారాన్ని ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం.----అరుణ్‌ ప్రకాశ్‌, అటవీశాఖ రేంజర్‌, కాశీబుగ్గ

పర్యావరణం, జీవావరణానికి ముప్పు
పాలకుల చర్యలతో పర్యావరణం, జీవావరణానికి పెనుముప్పు ఏర్పడింది. అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటిని గనులు, ఇతర అంశాలకు కేటాయించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాలో అపారమైన చిత్తడి నేలలు, అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోకపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడి ప్రాణాలు కోల్పోతున్నాయి.----బీన ఢిల్లీరావు, ప్రధాన కార్యదర్శి, పర్యావరణ పరిరక్షణ సంఘం,స్వేచ్ఛావతి.. స్వర్ణముఖధారి


courtesy with : న్యూస్‌టుడే - పలాస పట్టణం, సోంపేట/కంచిలి

  • =======================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .