Saturday, May 4, 2013

Frist Andhra meet of 100 years , ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి



  •  



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) -Frist Andhra meet of 100 years  , ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము




సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం శాతవాహనుల సామ్రాజ్యం విస్తరించిన కాలంలో తెలుగు భాష, సంస్కృతిల వికాసం ప్రారంభమైంది. శాతవాహనులు తెలుగు ప్రజల సంస్కృతీ వికాసానికి ఎనలేని కృషి చేశారు. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన తరువాత తెలుగు నేల చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ తరువాత విదేశీ దాడులమూలంగా తెలుగు ప్రజలు తమ అస్తిత్వాన్ని కోల్పో యారు. పరాయి పాలనలో తెలుగు భాష, సంస్కృతిలకు గ్రహణం పట్టింది. తెలుగునేలలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిష్‌వారి పాలనలో మద్రాసు రాష్ట్రంలో ఉండగా, తెలంగాణ జిల్లాలు హైదరాబాద్‌ రాజ్యంలో ఉండేవి. ఇరవ య్యవ శతాబ్దం ప్రారంభం దాకు తెలుగువారికి ఒక అస్తిత్వం, గుర్తింపు ఉండేవి కావు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగిన అనంతరమే తెలుగునేలలో స్వాతంత్య్రోదమ్య స్ఫూర్తి రగిలింది. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు అనేకమంది మహనీయులు నడుంబిగించారు.

తెలుగువాడి వాణి, తెలుగువాడి జీవం ఆంధ్ర మహాసభలే. ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి ఈ సభల ద్వారా అభివృద్ధిలోకి వచ్చాయి. ఆంధ్రోద్యమానికి ఇవి ఆయువుపట్టులాంటివి. ఈ ఆంధ్ర మహాసభలకు బాపట్లలోనే అంకురార్పణ జరిగింది. ఆంధ్రోద్యమానికి బీజం బాపట్ల గడ్డమీదే పడింది. బాపట్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావనకు నారుపోసింది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల రూపురేఖలు దిద్దింది. ఆంధ్రుల హృదయాలలో మోసులెత్తిన అభిమాన, చైతన్యాలకు బాపట్ల ముత్యాల పందిరి వేసింది. తెలుగువారి వ్యక్తిత్వం, ఆంధ్రభాష గుర్తింపు కోసం కృషి చేయాలన్న పూనిక బాపట్లలోనే జరిగింది.

19వ శతాబ్దం ప్రారంభానికి కోస్తా రాయలసీమ జిల్లాలు ఆంగ్లేయుల పాలన క్రింద మద్రాసు రాష్ట్రంలోను, తెలంగాణా ప్రాంతం అసఫ్‌జాహీ రాజుల పాలనలో హైదరాబాద్‌ రాష్ట్రంలోను ఉన్నాయి.

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం దాకా ఆంధ్రులకొక ప్రత్యేక అస్తిత్వం, గుర్తింపు ఉండేవికావు. వారిని 'మద్రాసీ'లుగానే ఉత్తర భారత ప్రాంతంలో వ్యవహరించేవారు, స్వదేశీ, వందేమాతరం ఉద్యమాలతో తెలుగుజాతి జాగృతమైంది.

1908లో బొంబాయి నుండి కాశీనాధుని నాగేశ్వరరావు సారథ్యంలో 'ఆంధ్రపత్రిక', ముట్నూరి కృష్ణారావు సారథ్యంలో బందరు నుండి 'కృష్ణాపత్రిక' వెలువడటం ఆంధ్రోద్యమానికి దోహదం చేసింది. 1908లో బందరులో తొలిసారిగా ఆంధ్ర మహాసభ అంటూ ఒకటి జరిగినా, దానిని మత సంస్కరణ, సామాజిక పునరుద్ధరణ ఆశయాలతో నిర్వహించారు. 1910లో విజ్ఞాన చంద్రికా మండలివారు ప్రచురించిన 'ఆంధ్రల చరిత్ర' -తెలుగువారి మహోన్నత చరిత్రను, పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది.

1911లో ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం మద్రాసు రాష్ట్రంలోను, నిజాం రాజ్యంలోను, మైసూర్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ఉండే తెలుగు ప్రజల మొత్తం ప్రాంతాన్ని బృహదాంధ్ర చిత్రపటంగా రూపొందించారు. తెలుగువారంతా ఒక ప్రత్యేక పాలనా విభాగంగా రూపొందాలన్న కోరిక 1911 డిసెంబర్‌ 12వ తేదీన ఢిల్లీ దర్బారు జరిగే సమయంలో వ్యక్తమయింది. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి దుస్థితిపై పత్రికలలో ప్రచురింపబడిన వ్యాసాలు ఆంధ్రులలో నూతన భావాలకు, ఉత్సాహానికి దోహదం చేశాయి.

మద్రాసు రాష్ట్ర విస్తీర్ణంలో ఆంధ్రా ప్రాంతం 58 శాతం, జనాభాలో తెలుగువారు 40 శాతం ఉన్నప్పటికీ, విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో వారు ఎంతో నిరాదరణకు గురయ్యేవారు. 1911లో బెంగాల్‌ రాష్ట్ర విభజన రద్దై, బీహార్‌ ప్రత్యేక రాష్ట్రస్థాయి పొందాక, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనేక విధాలుగా అణగారి ఉన్న, తెలుగువారు భాషా ప్రాతిపదికపై ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడానికి ఉద్యుక్తులయ్యారు. మొదటిసారిగా ఈ భావం గుంటూరు 'యంగ్‌మెన్స్‌ లిటరరీ సొసైటీ' సభ్యులలో తలెత్తింది.

1912 మే లో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు మండలాల సంయుక్త కాంగ్రెస్‌ సమావేశంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాని జిల్లా సభలో ఆ చర్చ రాదని, దానికోసం ప్రత్యేకంగా ఆంధ్ర మహాసభ నొకదానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గుంటూరుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం, చల్లా శేషగిరిరావు, దేశభక్త కొండా వెంకటప్పయ్య, వింజమూరి భావనాచారి పరస్పరం చర్చించుకొని అఖిలాంధ్ర సమావేశం నిర్వహించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కొండా వెంకటప్పయ్యను కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ వీరు ఆంగ్ల, తెలుగు భాషలలో 'ఆంధ్రోద్యమం' అనే ఒక చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావులు కలసి 'ఆంధ్ర రాష్ట్రం' అనే పుస్తకాన్ని రాశారు. 1913లో బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభను జరపాలని నిర్ణయించారు.

1912లో కొమఱ్ఱాజు లక్ష్మణరావు 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ' ప్రచురణ కూడా ఆంధ్రుల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించింది. భారతజాతిని బలోపేతం చేయాలంటే, ముందు ఆంధ్రుల ఐకమత్యం ఎంతో అవసరమని 1912లో 'కృష్ణాపత్రిక' ప్రబోధించింది. తగిన అవకాశాలు, ప్రోత్సాహం లేకనే ఆంధ్రులు వెనుకబడి ఉన్నారు కాని, తమిళుల కంటే వారు ఏ మాత్రం తీసిపోరని 'భరతమాత' పత్రిక 1912 సంవత్సరంలోనే పేర్కొంది.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమనేది, అన్నివిధాల -విస్తీర్ణంలోను, జనాభాలోను, ఆదాయంలోను -ఆచరణ యోగ్యమయినదని మిగతా ఏ రాష్ట్రాలకు అది తీసిపోదని 1912 నవంబర్‌ 29 నాటి 'ధర్మప్రకాశిక' ప్రకటించింది. గవర్నర్‌ కార్యవర్గంలోనూ, హైకోర్టు న్యాయమూర్తులుగాను, రెవిన్యూ బోర్డు సభ్యులుగాను వ్యవహరించుటకు తగిన ఆంధ్రులు అనేకమంది ఉన్నారని 1912 అక్టోబర్‌ 9 నాటి 'దేశమాత' పత్రిక పేర్కొంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా బెజవాడ అన్ని విధాల యోగ్యమయినదని 1912 ఆగస్టు 23 నాటి 'కృష్ణాపత్రిక' ప్రకటించింది.

1912 మార్చి 14న ఆంధ్ర మహాసభ కార్యనిర్వాహక వర్గంవారు న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షతన సమావేశమై, కొండా వెంకటప్పయ్యను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగాను, న్యాపతి సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, నోరి వెంకటేశ్వర్లును కార్యదర్శులుగా ఎన్నుకొన్నారు. కాంగ్రెస్‌ మహాసభలకు

బాపట్లకు చెందిన చోరగుడి వెంకటాద్రి ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా వ్యవహరించారు. బాపట్లలో జిల్లా కాంగ్రెస్‌ మహాసభ పూర్తయిన మరుసటి రోజు అనగా 1913 మే 26న ఆంధ్ర మహాసభ జరపాలని నిర్ణయించారు.

1913 మే 24వ తేదీ కృష్ణాపత్రికలో ముట్నూరు కృష్ణారావు 'మాతృ సందర్శనము' పేరిట దిగువ సంపాదకీయం రాశారు.

''రేపు బాపట్ల మహాక్షేత్రమున ఆంధ్ర జనని మహా వైభవంతో అవతరించబోతున్నది. ఆమె నారాధింప అష్టదిక్పాలురు, అష్టవసువులు సప్త మహాఋషులు, యక్ష, కిన్నెర గంధర్వులతో నరుదెంచుచున్నారు. ఆనాడు వైకుంఠంబు నుండి నాదోపాసకుడగు త్యాగరాజాచార్యుడు, నారదాది ముని బృందములతో

నేతెంచుచున్నారు. రాజరాజ నరేంద్ర, ప్రతాపరుద్ర, శ్రీకృష్ణ దేవరాయాది నృపతులు, వారి ననుగమించి బొబ్బిలి, పల్నాడు, కొండవీడు, గుత్తి, పెనుగొండ వీరులను సమావేశమగుచున్నారు. వేయేల, ఆంధ్ర చరిత్రలక్ష్మి, సపరివారముగ నా సభాస్థలి నావిర్భవింపబోవుచున్నది.

అదిగో, అన్నివైపుల నుండియు విద్యాధివరులు, సంఘ సంస్కర్తలు, మతోథ్థరకులు, రాజ్యాంగ వేత్తలు, గాయకులు, కవులు, దేశభక్తులు, ఆమె ప్రియ పుత్రులగు వారెల్లరూ తల్లి చరణారవిందములపై తమ పూజాద్రవ్యముల నర్పింపబోవుతున్నారు. ఏమి ఆ కోలాహలము, ఆ సంబరము, అమ్మ తనయనుంగు బిడ్డలను జూచుటకు వచ్చుచున్నదనియా?

ఆంధ్ర జననీ, నేడు గదా, మా తపస్సు ఫలించె, మా యభీష్టము లీడేరె, మా కన్నుల కఱవుతీరె. తల్లీ, నీ చల్లని చూపుల వలన మాకు కల తాపములన్నియు నుపశమించుగాక, నీ హస్త స్పర్శచే మాకెక్కువ జవసత్తువులు చేకూరుగాక, నీ సందర్శనముచే మా మనోధైర్యము చిక్కబడును గాక, నీయాశీర్వచనంబుచే మాకెల్ల శుభములు చేకూరుగాక''. ఈ విధంగా ప్రథమాంధ్ర మహాసభ ఏర్పడి తెలుగు భాష, సంస్కృతి వికాసానికి దోహదం చేసింది. ఈ ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి సంవత్సరంలో మాతృభాషాబిమానులంతా నడుం బిగించి తెలుగు భాష పరిరక్షణకోసం కృషి చేయాల్సిన ఆవశక్యత ఉంది.

apr  -   Sat, 4 May 2013
  •  ============================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .