Monday, December 31, 2012

Architecture Day, ఆర్కిటెక్చర్‌ డే



  •  


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Octo 1st.)  -ఆర్కిటెక్చర్‌ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ఈరోజు వరల్డ్‌ ఆర్కిటెక్చర్‌ డే. సౌఖ్యం, సుందరం వాస్తు శిల్పం. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న వాస్తుశిల్పులందరికీ శుభాభి వందనాలు. వాస్తుశిల్పకళకు మనదేశం పెట్టింది పేరు. గుళ్ళు, గోపురాలు, రాజుల కోటలు, రాజస్తాన్‌ కట్టడాలు - అన్నీ వాస్తుశిల్పి అపురూప నైపుణ్యానికి నిదర్శనం. ఇల్లు, ఆఫీసు, గుడి, బడి, పరిశ్రమ, దర్శనీయ భవంతి - ఏదైనా కావచ్చు... ప్రతిదీ సుఖసౌఖ్యాలనిచ్చేదిగా, ఆనందానుభూతి మిగిల్చేది గా వుండాలి. దాని ఆకర్షణ, కళాత్మకతల వెనుక ఆర్కిటెక్టు మనసు, మెదడు ఉన్నాయని విస్మరిం చలేం. ఎంత చెట్టుకు అంత గాలి చందంగా వంద గజాల స్థలం మొదలు ఎకరాల కొద్దీ విస్తరించిన ఫామ్‌ హౌజుల వరకు డిజైన్‌ చేస్తున్నారు వాస్తుశిల్పులు. మామూలు ఇంటి నుండి మల్టిస్టోరీడ్‌ బిల్డింగ్‌ వరకు ఎక్కడికక్కడ తమ పనితనాన్నిచాటుకుంటున్నారు ఆర్కిటెక్టులు. ఇంటిని అందం గా రూపొందించడమే కాదు, దానితో పోటీపడేలా ఫర్నిచర్‌ను కూడా సూచిసారు. శిల, శిల్పంగా మారినట్లు మంచి ఆర్కిటెక్టు చేతిలోమామూలు ఇల్లు కూడా మహా సుందరంగా తయారౌతుంది. ఫ్లాట్‌ కావచ్చు, ఇండిపెండెంట్‌ హౌజ్‌ కావచ్చు.. ఏమైతేనేం సొంతింటి ఆలోచనే గొప్పది. ఎంత గొప్ప ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలైనట్టు ఇంటి ఆలోచన రావాలేగానీ, దాన్ని సాధించడం బ్రహ్మవిద్యేం కాదు. సరే, రేపోమాపో ఓ స్వీట్‌హోం కొనబోతున్నారు, లేదా స్వయంగా దగ్గరుండి కట్టించుకోబోతున్నారు.. బాగానే వుంది. మరి, ఆ ఇంటి ప్రణాళిక ఏమిటి? ఆర్కిటెక్ట్‌తో ప్లాన్‌ గీయించుకున్నారా? పునాది, పిల్లర్లు, తలుపులు, కిటికీలకు ఏ మెటీరియల్‌ వాడుతున్నారు? ఎన్ని గజాల స్థలంలో ఎన్ని గదులు నిర్మిస్తున్నారు? ఈస్ట్‌ ఫేసింగా, వెస్ట్‌ ఫేసింగా? వాస్తు పాటిస్తున్నారా? ఆర్కిటెక్ట్‌ సహాయం తీసుకున్నారా? ఇవన్నీ ఆలోచించి, ముందడుగు వేయాలని మర్చిపోకండి.

మన పూర్వికులు అందించిన వాస్తు, యోగా, ఆయుర్వేదం లాంటివి విస్మరించినందునే మనం సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. వాస్తులో సైన్సు, జ్యోతిష్యం ఇమిడివుంటాయి. సూర్య, చంద్రకాంతులు, వేడి, భూమిలో వుండే వాతావరణం, గాలి వీచే దిక్కు, ఆకర్షణశక్తి అన్నీ వుంటాయి. మనదేశం వాస్తుకు ప్రతీతి. రుషులు వాస్తు సూత్రాలను అందించారు. హరప్ప, మొహంజొదారో నాగరికతలు మన వాస్తును ప్రతిబింబిస్తాయి. అధర్వణవేదంలోని స్తపత్య వేదభాగంలో వాస్తును పొందుపరిచారు. రామాయణ, మహాభారతాల్లో, మత్స్యపురాణంలో వాస్తు ప్రస్తావన వుంది. ఉదాహరణకు -- వాస్తుశాస్త్రంవల్ల లోకమంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సుభిక్షంగా వుంటుంది. మనం జ్ఞానంతో దివ్యత్వం పొందుతాం. లోకికానందమే గాక స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి అని.  వాస్తు అనేది ఒక తెగ, వర్గం, మతానికి పరిమితమైంది కాదు, అందరికీ సంబంధించిందని తేటతెల్లమౌతుంది.

గుళ్ళు, గోపురాలు, స్కూళ్ళు, కాలేజీలు, ప్యాలెస్‌ లాంటి ఇంద్ర భవనాలకే తప్ప మామూలు ఇళ్ళకు ఆర్కిటెక్ట్‌తో పనిలేదు అనుకుంటారు చాలామంది. కానీ, చిన్న ఇళ్ళను కూడా ఆర్కిటెక్టుతో డిజైన్‌ చేయించుకుంటే కేవలం ఎండావానలనుంచి రక్షించే గూడు కాకుండా అందానికి అర్థం చెప్పేలా తయారౌతుంది. ఇంటికిలైఫ్‌ టైం పెరుగుతుంది. ఉన్న స్థలంలో ఇంటికి ఎంత కేటాయించాలి, ఓపెన్‌ ప్లేస్‌ ఎటువైపు ఎంత వుంచాలి, స్టీలు, సిమెంటు, తలుపులు, కిటికీలు, అద్దాలు, కార్వింగులు అన్నీ అందంగా అమరుతాయి. ఇంటి ప్లాన్‌ మొదలు, అందులో వుంచాల్సిన ఫర్నిచర్‌ వరకు.. అంటే మాక్రో లెవెల్‌ నుండి మైక్రో లెవెల్‌ వరకు ఆర్కిటెక్ట్‌ ప్రమేయం వుంటుంది. ఇంటిని ఊహించి, వర్ణించి, ప్రయత్నించి, దాన్ని కళ్ళముందు నిలుపుతాడు. ఆ ఇల్లు విశాలంగా, వీలుగా, సౌకర్యవంతంగా, సాంకేతికంగా, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు నిదర్శనంగా, అందంగా, అపురూపంగా వుంటుంది. సృజనాత్మకత ఉట్టిపడ్తూనే పది కాలాలపాటు పదిలంగా వుంటుంది.

వాస్తు ఈనాటిది కాదు. మన తాతముత్తాతల కాలంనుండీ వుంది. వాస్తు చాదస్తం కాదు, శాస్త్రం. ఆగ్నేయంలో వంటిల్లు వుండాలంటే.. ఏం.. నైరుతిలో వండితే కూర ఉడకదా, అని వెక్కిరించేవాళ్ళు ఆవేశం తగ్గించి ఆలోచించాలి. పెద్దలు చెప్పిన ప్రతిదాన్నీ  తిరస్కరించిపారేయడం విప్లవమూ కాదు, ప్రతి ఆచారాన్నీ గుడ్డిగా అనుసరించడం విధేయతా కాదు. సబబు కాదని మనసుకు తోస్తే నిరభ్యంతరంగా ఖండించొచ్చు. పూర్వం కట్టెలపొయ్యిమీద వండుకునే రోజుల్లో ఆగ్నేయంలో గాలి బాగా వీస్తుంది కనుక, మరీ కష్టపడి ఊదాల్సిన అవసరం లేకుండా పొయ్యి మండుతుందని అలా పెట్టుకునేవారు. ఇప్పుడు గ్యాస్‌స్టవ్‌లే కదా, ఊదాల్సిన పనేముంది అనుకోవచ్చు.. కానీ వంట చేసేప్పుడు వచ్చే నూనెతో కూడిన పొగ పోయేందుకైనా ఆగ్నేయం శ్రేష్ఠం. పైగా ఆగ్నేయం అంటే తూర్పుముఖంగా వుంటుంది కనుక లోనికి చక్కటి వెల్తురు వస్తుంది. ఏ పుచ్చొంకాయలో పొరపాటున కూరలో వేసే అగత్యం లేకుండా కాంతిలో వంట పూర్తిచేసుకోవచ్చు. ఇక వాయువ్యంలో వాటర్‌ ట్యాంక్‌, బీర్వాలు లాంటి బరువు, నైరుతిలో బాత్రూం ఇలా నిర్దేశించిన ప్రతి అంశానికీ శాస్త్రీయ కారణం వుంది. అదేంటో తెలుసుకుని న్యాయమనిపిస్తే పాటించి లేదంటే మానేయొచ్చు. వాస్తులోనూ చాదస్తాలున్నాయి. స్థూల అంశాలు అందరూ ఒకలా చెప్పినా, సూక్ష్మ విషయాల్లో బేధాభిప్రాయా లున్నాయి. ఒకరు ఉన్న తలుపు తీయిస్తే ఇంకొకరు గోడ పగలగొట్టి, తలుపు పెట్టమంటారు. ఇలా ఇంటిని కూలగొడ్తూ, పునర్నిర్మిస్తూ పోతే కలిసిరావడం సంగతేమో కానీ, ఆర్థిక నష్టము, మనసుకు కష్టము తప్పవు.

వాస్తుశిల్పకళలో ఆయా దేశాలు, ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిఫలిస్తాయి. చారిత్రక నేపథ్యం, నాగరికత తొంగిచూస్తాయి. ఆర్కిటెక్చర్‌కి పర్షియా (ఇప్పుడు ఇరాన్‌) పెట్టింది పేరు. వర్చువస్‌ అనే రోమన్‌ వాస్తుశిల్పి క్రిస్తుశకం 1వ శతాబ్దంలోనే బ్రహ్మాండమైన గ్రంథం రాశారు. అది ఇంగ్లీష్‌, ఇటాలియన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషల్లోకి అనువాదం కావడానికి ఏకంగా 17 శతాబ్దాలు పట్టింది. వర్చువస్‌ తన పుస్తకంలో మూడు సూత్రాలను పొందుపరిచాడు. అవేంటంటే- మొదట నాణ్యత వుండాలన్నాడు. పనివాడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టాయి చందంగా కూలిపోతే ఆర్థికనష్టమే కాదు, ప్రాణాలే పోవచ్చు. నీళ్ళు కారడం, పగుళ్ళివ్వడం లాంటి డ్యామేజ్‌లేమీ లేకుండా నిర్మాణం ఏళ్ళ తరబడి పదిలంగా వుండాలన్నాడు వర్చువస్‌. కట్టడం కేవలం చూసి
ఆనందించడానిక్కాదు, ప్రయోజనం నెరవేరాలి, లేకుంటే వృధాప్రయత్నమే అని స్పష్టం చేశాడు. ఆ కట్టడం కేవలం అవసరాలు తీరిస్తే సరిపోదు, వీలైనంత సౌకర్యంగా, సుందరంగా వుండి, అలరిస్తూ, ఆలోచింపచేసి, ఉత్తేజాన్నివ్వాలన్నాడు. ఈ మూడు విషయాల్లో తృప్తి కలిగినప్పుడే అది నిజమైన వాస్తుశిల్పకళ  అని తేల్చాడు. ఎంత చక్కటి సూత్రీకరణ కదూ! అరబ్‌ దేశాలనుండి దిగుమతి ఐనదే తాజ్‌మహల్‌, చార్మినార్‌, గోల్కండఖిలా కట్టడాల్లోని పనితనం. 400 సంవత్సరాలకు పైబడ్డ చార్మినార్‌ ఇంకా పదిలంగానే వుంది. అది సౌందర్య ప్రతీక. ఇక ప్రయోజనం అంటే ఏ మీనార్‌ ఎక్కి చూసినా నగరం కనిపిస్తూ అలరిస్తుంది. చార్మినార్‌ ఇచ్చే ఆనందానుభూతి గురించి వేరే చెప్పాలా?!  పార్తెనాన్‌, అథెన్స్‌, గ్రీస్‌ నగరాల్లో కట్టడాలు కళాత్మకంగా వుండి ప్రపంచఖ్యాతి పొందాయి. నిర్మాణం చూడముచ్చటగా, సౌకర్యంగా, ఆరోగ్యం, ఆహ్లాదకరంగా, మానసిక శాంతి సమకూరేలా వుండాలన్నదే ఏ ఆర్కిటెక్టు అభిప్రాయమైనా. 20వశతాబ్దపు వాస్తుశిల్పి లే కార్‌బ్యూసియర్‌- రాళ్ళు, సిమెంటు, చెక్కలను ఉపయోగించి కట్టడం నిర్మిస్తారు. అది గనుక వసతియోగ్యంగా, హృదయాన్ని తాకేలా, చూడముచ్చటగా వుండి సంతోషాన్ని కలిగిస్తే అదే అర్కిటెక్చర్‌ అనిపించుకుంటుంది- అన్నాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓపెరా హౌజ్‌ను డిజైన్‌ చేసింది ఉట్‌జాన్‌ నన్‌జియా రొండానిని. మానవ శాస్త్రాలన్నిటినీ రంగరించి కట్టిన ఈ నిర్మాణం సృజనాత్మకంగానూ, సుఖసౌఖ్యాలతోనూ నిండివుంది. ఇందులో సామాజిక పురోగతిస్పష్టమౌతోంది. ఇక డెన్మార్క్‌ వాస్తుశిల్ప శాస్త్రానికి పెట్టింది పేరు. ఇక్కడి కట్టడాలు ఆశ్రయానికి, రక్షణకు, ప్రార్థనకు నెలవులు. అంగోకర్‌,  కాంబోడియాలది అతి ప్రాచీన సంస్కృతి. మన మొహెంజెదారో, ఈజిప్టుల మెసపొటేమియా నాగరికతలు, అలాగే గ్రీకు, రోమన్‌ నాగరికతలు ఎంత ప్రసిద్ధమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ శిథిలాలు నాటి వాస్తును తెలియజేశాయి. రోమన్‌ ఆర్కిటెక్ట్‌ వర్చువస్‌, చైనా వాస్తుశిల్పి కావ్‌ గాంగ్‌ జి, శ్రీలంక వాస్తు విద్యాశాస్త్ర  నిపుణుడు మంజుశ్రీ తదితరులు ఆర్కిటెక్చర్‌లో ఆద్యులు. సంస్కృతంలో లిఖితమైన మన వాస్తుశాస్త్రం అతి పురాతనమైంది.

వాస్తుశిల్పంలో అరబ్‌, యూరప్‌, బౌద్ధ, హిందూ, శిక్కు - ఇలా దేనికదే తమదైన స్వభావంతో, ప్రత్యేకతతో నిండివున్నాయి. తాజ్‌మహల్‌లో హిందూముస్లిం సమ్మిళిత వాస్తుకళ కనిపిస్తుంది. ఈ కట్టడం 7వ శతాబ్దంలో ప్రారంభమైంది. మధ్య ఆసియా, స్పెయ్‌న్‌, ఉత్తర ఆఫ్రికాల్లోనూ మతపరమైన లక్షణాలు ఫలించే ఈ సంప్రదాయం కనిపిస్తుంది. ప్రాచీన, మధ్యయుగాల్లో యూరప్‌ దేశాల్లో మత సంబంధమైన కట్టడాలు అనేకం నిర్మితమైనప్పటికీ వాటిని తీర్చిదిద్దిన ఆర్కిటెక్టుల వివరాలు లభించవు. ఈ కాలంలో వాస్తుశిల్పం బాగా వృద్ధిచెందిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాతికాలంలోని బ్రునెల్లెస్చి, ఆల్బెర్టి, మైఖేలాంజిలో, పల్లాడియో లాంటి ఆర్కిటెక్టులు లోకప్రసిద్ధులు. ఇక ఆధునిక యుగం ప్రారంభంలో పరిశ్రమలు విస్తరించాయి. ఆయా రంగాలకు సంబంధించిన అవగాహన, శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికత పెరగడంతో నిర్మాణాల్లో అందం కంటే అవసరం ప్రాధాన్యత సంతరించుకుంది.

మధ్యయుగం నాటికి ఆధునికతను సంతరించుకుంది. యునైటెడ్‌ కింగ్‌డంలోని థేమ్స్‌నదిపై నిర్మించిన లండన్‌ బ్రిడ్జి 860 అడుగుల పొడవున విస్తరించివుంది. 1973లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి అవసరమైనప్పుడు చీలిపోయే దీని సాంకేతిక నైపుణ్యం గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ఇరవయ్యో శతాబ్దంలో అత్యాధునిక భవంతులు, పారిశ్రామిక కట్టడాలు, మల్టిస్టోరీడ్‌ బిల్డింగులు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌సిటీలో ఒకటి, రెండు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ టవర్లు 1966లో ప్రారంభమై 1972, 73 సంవత్సరాల్లో పూర్తయ్యాయి. 110 అంతస్తులతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడాలుగా నిలిచాయి. మొదటిదాని పొడవు 1727 అడుగులు. పైకప్పు వైశాల్యం 1368 అడుగులు. రెండింటి ప్లింత్‌ ఏరియా 43 లక్షల చదరపు గజాలు. వీటికి 99 లిఫ్టులు (ఎలివేటర్లు) ఉన్నాయి. మినోరు యమాసకి, ఎమిరీ రోత్‌ అండ్‌ సన్స్‌ అనే ఆర్కిటెక్టులు, లెస్లీ ఇ. రాబర్ట్‌సన్‌, ఆయన సహాయులు ఇంజనీర్లుగా
వ్యవహరించారు. 2001 సెప్టెంబర్‌ 11న టెర్రరిస్టుల మృత్యుకోరలు వీటిని పొట్టనపెట్టుకోగా, కొత్త వరల్ట్‌ ట్రేడ్‌ సెంటర్లు 2002లో ప్రారంభమై 2006లో ముగిశాయి. ఇవి 226 మీటర్ల ఎత్తులో 52 అంతస్తులతో ఉన్నాయి. విస్తీర్ణం 17 లక్షల చదరపు గజాలు. డేవిడ్‌ చైల్డ్స్‌ ఆర్కిటెక్టుగా, డబ్ల్యు.ఎస్‌.పి. కాంటర్‌ సీనక్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇక మనదేశంలో అత్యంత పొడవైన కట్టడం కౌలాలంపూర్‌లోని వేదాధ్యయన కేంద్రం. ఇది పాట్రానాస్‌ టవర్లకంటే 700 అడుగుల ఎత్తులో వుంది.

పెద్ద కట్టడాల సంగతి అలా వుంచితే సగటు మనిషికి సొంతిల్లు అనేది కనీస కోరిక. మనిషన్నాక కూస్తంత కళాపోషణ వుండాలన్నది రావుగోపాల్రావు డైలాగ్‌. మనిషన్నాక ఓ ఇల్లు కట్టుకోవాలన్నది మెజారిటీ డైలాగ్‌ కాదు, డ్రీమ్‌. సొంతిల్లు అనేది అందరి ఆశ, ఆశయం. డబ్బున్న ఉన్నత కుటుంబాలకు ఇళ్ళు కాదు, భవనాలే వుంటాయి. అట్టడుగు వర్గాలవారికి ఇళ్ళు కాకున్నా తల దాచుకోడానికి సొంత గుడిసెలుంటాయి. గమ్మత్తేమిటంటే మధ్య తరగతివారికే ఇల్లు సమకూర్చుకోవడం భారమౌతుంది. కనీస అవసరాలన్నీ పోను సొంతింటికోసం సొమ్ము కూడబెట్టుకోవడం కోట్లాదిమంది కనీస లక్ష్యంగా వుంది. లోనిచ్చి ఆదుకునేందుకు బ్యాంకులున్నాయి. సొంతిల్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆనందాన్నిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్‌ దినోత్సవం సందర్భంగా అందరూ ఇళ్ళు
కట్టుకోవాలని కోరుకుందాం. ఆర్కిటెక్టులు మరింత పురోగతి సాధించి ఇంకా  కళాత్మకమైన, ప్రయోజనాత్మకమైన నిర్మాణాలు రూపొందిస్తారని ఆశిద్దాం.

  • =========================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .