Friday, January 4, 2013

Louis-Braille birth day-అంధులకు వెలుగు లూయీ బ్రెయిలీ జయంతి




గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Jan 04 th) -Louis-Braille birth day-అంధులకు వెలుగు లూయీ బ్రెయిలీ జయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


జనవరి 4 లూయీ బ్రెయిలీ జయంతి . అమావాస్య చీకట్లో అంధకార జీవితాన్ని గడుపుతున్న అంధుల పాలిట పున్నమి వెన్నెలల వెలుగు ప్రదాత లూయీ బ్రెయిలీ. మానిక్‌ బారన్‌, సైమన్‌ రెనా బ్రెయిలీ దంపతులకు లూయీ బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్‌ లోని క్రూవే గ్రామంలో జన్మించారు. దృష్టిలోపం ఉన్నవాళ్ళకీ, అంధులకీ ఉపయోగపడే విధంగా ఆరు అక్షరాలతోనే చదవడానికీ, రాయడానికీ వీలుగా ఒక అక్షరమాల రూపొందించాడు. పైకి ఉబ్బెత్తుగా ఉండి, చేతి వేళ్ళతో స్పృశిస్తూ చదవుకోగలిగేటట్లు చేసి అంధులపాలిట లూయీ బ్రెయిలీ దైవంగా మారాడు.

బ్రెయిలీ కనిపెట్టిన ఈ లిపిని తర్వాత కాలంలో అతని పేరుతోనే పిలిచారు. నేడు రికార్డింగ్‌ సదుపాయం వచ్చినా, అంధులు కూడా చదువుకున్నారని చెప్పడానికి ఒక ప్రామాణిక ఆధారం బ్రెయిలీ లిపిలో రాయడం, చదవడం. నిజానికి ఈ లిపికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అంత సులువుగా లభించలేదు. ఎంతో పోరాడాల్సి వచ్చింది. బ్రెయిలీ లిపిలో అనేక పుస్తకాలు నేడు అందుబాటులోకి వస్తున్నాయి. లెబ్రరీల్లోనూ ఈ పుస్తకాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషికి ముఖ్యమైనవి కళ్ళు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలన్నారు. జ్ఞానానికి నిజమైన వాకిళ్ళు కళ్ళు. లూయీ బ్రెయిలీ అందరిలాగే పుట్టాడు. మూడేళ్ళ వరకూ బాగానే ఉన్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారు చేస్తున్న దగ్గరకెళ్ళి ఆడుకుంటుండేవాడు. కత్తి మొన కన్నుకి తగిలింది. అలా ఒక కన్ను పోయింది. తర్వాత రెండవ కన్ను కూడా పోయింది.

తన అక్కతో పాటు పాఠశాలకు వెళ్ళే లూయీకి చదువు మీద ఆసక్తి కలిగింది. ఇంటికొచ్చి ఆ పాఠాల్ని చెప్తుండేవాడు.అతని శ్రద్ధాసక్తుల్ని గమనించిన తండ్రి చిన్న మేకుల్ని ఒక చెక్కపై అక్షరాలుగా చేసి లూయీ  చేతుల్తో చదివించే వాడు. లూయీ కి మంచి ధారణ, గ్రహణశక్తి ఉండటం వల్ల పాఠశాల్లో ఉపాధ్యాయుల మన్ననల్ని పొందేవాడు. పదవ ఏట పారిస్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లెండ్‌ లో స్కాలర్‌షిప్పుకి ఎంపికయ్యాడు.

1784లో వాలెంటీన్‌ హావే స్థాపించిన అంధుల పాఠశాలలో అంధులకు వివిధ వృత్తి పనుల్లో శిక్షణ నిస్తుండే వారు. చదువుకోవడానికి వీలుగా రాగి రేకులపై ఉబ్బెత్తు అక్షరాల్ని రాసేవారు. చదువుకోవడమే తప్ప ప్రతి విద్యార్థీ రాయాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పనిగా ఉండేది. రాగి రేకులపై రాసిన అక్షరాల్ని చదువుకోవాలంటే, వాటిని మోయడం పెద్దబరువుగా కూడా ఉండేది. ఆ పద్ధతిలో అంధుల కోసం రాసే ఆ విధానాన్ని లెన్‌టెప్‌ అని పిలిచేవారు. లూయీ  తాను చదువుకున్న పాఠశాలలోనే తన 17వ ఏట ఉపాధ్యాయుడయ్యాడు.

లూయీ బ్రెయిలీ చదువు చెప్తూనే, సులభమైన రీతిలో అంధులు చదువుకునేలా, రాయగలిగేలా అక్షరమాలను రూపొందించాలని ప్రయత్నిస్తుండేవాడు.ఆ పాఠశాలను ఫ్రెంచి మాజీ ఆర్మీ కెప్టెన్‌ చార్లెస్‌ బార్బేయర్‌ సందర్శించాడు. ఆ సందర్భంగా తాను కనుగొన్న 12 గుర్తులతో రూపొందించిన రాత్రి చదువు గురించి ప్రస్తావించాడు. అది నిజానికి సైనికులకు మాత్రమే తెలిసే రహస్య సంకేతాల్ని తమ వేళ్ళ ద్వారా స్పృశించి తెలుసుకునే విద్య. అప్పటి నుండీ అటువంటి పద్ధతిలోనే మరింత సులభంగా, తేలికైన పద్ధతిలో ఆరు అక్షరాల్లో అంధులు చదువుకొనే, రాయగలిగే లిపిని లూయీ బ్రెయిలీ కనిపెట్టాడు.

-దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే కృషిలో భాగంగా లెక్కల్ని అభ్యసించడానికి, సంగీతాన్ని నేర్చుకోవడానికీ ఈ లిపి ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. 1829 లో ‘మెథడ్‌ ఆఫ్‌ రైటింగ్‌, మ్యూజిక్‌ అండ్‌ ప్లైన్‌ సాంగ్స్‌ బై మీన్స్‌ ఆఫ్‌ డాట్స్‌ ఫర్‌ యూస్‌బె ది బ్లెండ్‌ అండ్‌ ఎరేంజ్‌డ్‌ ఫర్‌ దెమ్‌’ అనే పుస్తకాన్ని లూయీ బ్రెయిలీ ప్రచురించాడు. 1839లో డాట్స్‌తో ముద్రణ చేసే విధానం గురించి కూడా పుస్తకాల్ని ప్రచురించాడు. 1852 జనవరి 6వ తేదీన క్షయ వ్యాధితో లూయీ బ్రెయిలీ మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలంతా లూయీ బ్రెయిలీ జయంతులు, వర్థంతులతో అంధులంతా ఆయనకు స్మరించుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన అంధులందరీకీ వెలుగు ప్రదాత కావడమే. రచయిత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అంధ విద్యార్థి, బ్రెయిలీ లిపిలో ఈ వ్యాసం రాశారు

-January 4, 2011@surya telugu daily paper
శ్రీకాకుళం లో అంధులకు బ్రెయిలీ :

చీకటిలో దిక్కు తెలీదు.-వెలుగు కోసం ఆగితే వస్తుందనే ఆశలేదు...ఆగడం కాదు ఆగే ఆలోచన కూడా మాకు లేదు అంటున్నారు
ఆ విద్యార్థులు...కంటి నిండా చూపునకు నోచకున్నా గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉందంటున్నారు.
అంతటి ఆత్మవిశ్వాసం మీకుంటే మీకు మేమున్నాం అంటోంది అమ్మలాంటి ఓ స్వచ్ఛంద సంస్థ. ‘సమన్వయ’తో ముందుకు సాగుదాం రండంటోంది. చీకటిని చీల్చే శక్తియుక్తులు సంతరించుకునేందుకు సహకరిస్తోంది.

చక్కగా చదువుకుంటున్నా, ఉన్నతస్థాయికి చేరాలనే ఆలోచన ఉన్నా చూపు లేకపోవడం అనే ఒక్క కారణం వల్ల అంధులకు మద్దతు ఇచ్చేవారు లేకపోవడం స్వర్ణలతను తరచు ఆవేదనకు గురిచేసేది. ఆ ఆవేదన నుంచే ఆశయం అంకురించింది. అదే ఆమెను నడిపిస్తోంది. అంధ విద్యార్థులను విజయపథాన పయనింప చేస్తోంది. బేగంపేటలోని ఎయిర్‌లైన్స్ కాలనీలో ఉంది మల్టీ డిజేబులిటీస్ ఉన్న విద్యార్థులకు సహకారాన్ని అందించే సమన్వయ్. దీని నిర్వాహకురాలే స్వర్ణలత.

అంతా ‘ఐ’క్యంగా...

‘‘10 వతరగతి వరకూ అవసరమైన సేవలను ఉచితంగా అందించే సంస్థలున్నా, పెద్ద చదువులు చదవాలనుకునే అంధ విద్యార్థులకు మాత్రం సరైన సహకారం లేదు. అందుకే మేం ఈ సంస్థను స్థాపించాం’’ అని స్వర్ణలత చెప్పారు. చూపు లేకపోవడంతో పాటు పలు రకాల వైకల్యాలతో పుట్టిన కుమార్తె సాహిత్యను పెంచి పెద్ద చేస్తూ, మరో పక్క అంధుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ గడించిన అనుభవంతో స్వర్ణలత ఈ సంస్థను నెలకొల్పారు. సంధ్యారెడ్డి, లతామణి, సుమిత్ర తదితర సన్నిహితులతో కలిసి దీన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

గెలుపు చవి చూస్తూ...

ఎంబిఎ, ఎంసిఏ, బిటెక్ తదితర ఉన్నత చదువులు చదువుకోవాలని కోరుకునే అంధ విద్యార్థుల లక్ష్యసాధనలో తోడ్పడడమే లక్ష్యంగా, టెన్త్‌క్లాస్ దాటిన వారికి కౌన్సిలింగ్, సులభమైన శైలిలో స్టడీ మెటీరియల్ రూపొందించి అందివ్వడం దగ్గర్నుంచి చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో స్థిరపడేదాకా వారికి చేయూతని కొనసాగిస్తోంది‘సమన్వయ్’. ‘‘ఉయ్యూరుకు చెందిన నాగబాబు అనే విద్యార్థికి ఇ-సెట్ రాసేందుకు హాల్‌టిక్కెట్ ఇచ్చారు కానీ పరీక్ష టైమ్ వచ్చేసరికి కుదరదన్నారు. అప్పుడు కోర్టుకెళ్లి పోరాడి మరీ అనుమతి తెచ్చుకున్నాం. ఇంతా చేసి ఎంట్రన్స్‌లో మంచి ర్యాంక్ వచ్చినా సీటివ్వడానికి మళ్లీ ఇబ్బంది పెట్టారు. అప్పుడూ పోరాటమే. మరోసారి పవన్ అనే విద్యార్థి విషయంలోనూ అలాగే జరిగింది’’ అంటూ అంధవిద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను స్వర్ణలత వివరించారు. దృష్టిలోపం సమస్యకు కారణాలతో పాటు సమస్య తీవ్రతలో కూడా విద్యార్థి విద్యార్థికీ వ్యత్యాసం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడి టీచర్లు శిక్షణ అందిస్తున్నారు.

కరకాల దృష్టిలోపాలు, సంబంధిత సమస్యల పట్ల క్షుణ్ణమైన అవగాహన ఉన్న స్వర్ణలత సారథ్యం కారణంగా ఇక్కడి విద్యార్థులు సముచితమైన సేవలు అందుకుంటున్నారు. ‘‘మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నవారు 40 నిమిషాలకు మించి ఒకచోట కూర్చోవడం కష్టం. అందుకు తగినట్టుగా, అలాగే గ్రూప్ టీచింగ్ కంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి శిక్షణ ఇవ్వడం పైనే మేం దృష్టి పెట్టాం’’ అని చెప్పారు స్వర్ణలత. ఏదేమైతేనేం...ఈ సంస్థ కృషి, అందించిన సహకారం ఫలితంగా వందలాదిమంది అంధవిద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధించారు. విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాగరాజు, తొలి ప్రయత్నంలోనే కంపెనీ సెక్రటరీ టెస్ట్ పాసైన తొలి అంధవిద్యార్థిగా రికార్డు సృష్టించిన ఆంజనేయులు, జెఎన్‌యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్, బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి... తదితరులు సమన్వయ్ సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తారు.

అడుగడుగునా ఆసరా...

చిన్నవయసులోనే దృష్టిలోపాన్ని గుర్తించడం దగ్గర్నుంచి పలు దశల్లో సమన్వయ్ అంధులకు ఆసరాగా నిలుస్తుంది. కంప్యూటర్స్ వాడకంతో పాటు జాస్‌లో ఇంగ్లీషు యాక్సెంట్ అర్థం చేసుకునేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు. తమసెంటర్‌కు వచ్చినవారికే కాకుండా వేరే నగరాల నుంచి వచ్చినవారికి కూడా సహకారం అందిస్తున్నారు. ‘‘ఇ లెర్నింగ్ మా ప్రత్యేకత. ప్రస్తుతం విశాఖ నుంచి ఒక ఎంబిఎ విద్యార్థి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతను కాలేజి మొదలవడానికి ముందే తన బుక్స్ మొత్తం మాకు పంపుతాడు. మేం వాటిని కర్జ్‌వీల్ అనే సాఫ్ట్‌వేర్ వినియోగించి ఆ సమాచారాన్ని వర్డ్‌లోకి మార్చి, ఎడిట్ చేసి ఆ తర్వాత అతనికి ఈ మెయిల్ ద్వారా పంపుతాం. ఆ కుర్రాడు జాస్(అంధవిద్యార్థుల చదువుకు వీలు కల్పించే సాఫ్ట్‌వేర్) ద్వారా దాన్ని చదువుకుంటాడు. అదే విధంగా విజయవాడలో ఉండి సిఎ చేస్తున్న ఉదయశ్రీకి కూడా స్టడీ మెటీరియల్ పంపుతున్నాం’’ అంటూ స్వర్ణలత వివరించారు.

‘‘చూపులేనివారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధారణ విద్యార్థులతో కలిపేయాలి. వారిని విడిగా ఎంత కాలం ఉంచితే మిగిలిన ప్రపంచంతో మమేకమవడం అంతే ఆలస్యమౌతుంది’’ అనేది స్వర్ణలత అభిప్రాయం. కళ్లు లేని కారణంగా చూడలేకపోవడం లోపం కాదు. అలాంటి వారి కష్టాన్ని చూసే మనసు లేకపోవడమే అసలైన లోపం. దానిని మిగిలిన ప్రపంచం పూర్తిగా తొలగించుకుంటే... ‘బ్రెయిలీ’లిపి లాంటి మరెన్నో అద్భుతాలు సాకారమవుతాయి. అందరి దృష్టీ పడేంత గొప్పస్థాయిని అందుకోవాలనే అంధవిద్యార్థుల కల నెరవేరుతుంది.

మనసుతో చూ(చే)స్తారు!

‘‘మేమంతా ఇప్పుడే సాహిత్య బర్త్‌డే పార్టీ చేసుకున్నాం. కేక్ కట్ చేసి ఫుల్ హంగామా చేశాం’’ హుషారుగా చెప్పాడు బాలకృష్ణ. ‘‘నాగార్జున ంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్యే ఢమరుకం చూశా’’ అని చెప్పాడు ఆంజనేయులు. నచ్చిన అమ్మాయిని చూసుకుని మరో ఏడెనిమిదేళ్లలో ఓ ఇంటివాడిని అవ్వాలనుకుంటున్నట్టు శేఖర్ ప్రకటించేశాడు. ఎంబిఎ పూర్తి చేసి, సినీ కొరియోగ్రాఫర్ కావాలనేదే నా లక్ష్యం’’ అని చెప్పిన శ్రీధర్‌ది వరంగల్. ‘‘నా డ్యాన్స్ చూస్తారా’’ అంటూనే దాయి దాయి దామ్మా మెరిసే కుందనాల బొమ్మా పాటలోని డ్యాన్స్‌బిట్‌ను అచ్చం మెగాస్టార్లా వేసి వావ్ అనిపించాడు.
  • ======================
 Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .