Thursday, January 5, 2012

హ్యాపీ న్యూ ఇయర్స్ డే, Happy New year day



  • image : courtesy with Andhrajyoti news paper

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (1st Jan) -హ్యాపీ న్యూ ఇయర్స్ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే ఏకైక పండుగ జనవరి 1 నూతనసంవత్సర ప్రారంభం . కొత్తసంవత్సరానికి స్వాగం చెప్తూ ... పాత సంవత్సరానికీ వీడ్కోలు పలుకుతూ డిశంబర్ 31 అర్ధరాత్రి నుండి జనవరి 1 ఉదయము వరకు జరిగే ఉతవాలలో వయసు తేడాలు మరిచి ఉత్సాహము గా పాల్గొంటారు.  ప్రపంచ వ్యాప్తము గా నేడు అనుసరిస్తున్న క్యాలండర్ " గ్రెగేరియం క్యాలెండర్ " దీని ప్రకారము జనవరి 1 నుండి కొత్త సంవత్సరము ప్రారంభవవుతుంది. అంతకు ముందు కొన్ని దేశాలు లో " జులియన్‌ క్యాలండర్ " వాడుకలో ఉండేది . ఆ క్యాలండర్ ప్రకారము కొత్తసంవత్సరము  జనవరి 14 నుండి ప్రారంభవవుతుంది . ఇంకా కొన్ని క్రైస్తవ విభాగాలు జులియన్‌ క్యాలండర్ నే వాడడము కనిపిస్తుంది . 

క్యాలెండర్ మారడం ప్రతి సంవత్సరం పెద్ద సంబరమే. ఆ వేడుకను ప్రపంచ దేశాల్లో అనేక పద్ధతుల్లో జరుపుకుంటారు. తమ తమ సంస్కృతులను నూతన సంవత్సర వేడుకలకు జోడిస్తారు. వివిధ మతాలు, దేశాలు జరుపుకునే సంబరాల గురించే ఈ వ్యాసం.

మతాలు, సంస్కృతులు, దేశాలకు అతీతంగా జరుపుకుంటున్న అంతర్జాతీయ పండుగ జనవరి 1. నూతన సంవత్సరానికి మతపరమైన వైవిధ్యం ఉన్నా అందరి ఆమోదం పొంది న్యూ ఇయర్‌గా గుర్తించబడింది జనవరి ఒకటి. క్రైస్తవాన్ని అనుసరించే దేశాల్లో కొత్త సంవత్సరం రోజున పాటించే కొన్ని నమ్మకాలివి.

ఇంగ్లాండ్ : కొత్త సంవత్సరం నాడు అతిథి ఇంట్లోకి అడుగుపెడితే గుడ్‌లక్ అని బ్రిటన్‌వాసుల నమ్మకం. బహుమతులతో లోపలికి వచ్చిన అతిథిని వెనక తలుపు నుంచి మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఖాళీ చేతులతో వచ్చే అతిథిని అసలు లోపలికి అడుగు పెట్టనివ్వరు. ఎర్ర రంగు జుట్టున్న వారు ఎదురైతే దురదృష్టం ఏడాదంతా వెంటాడుతుందనే విశ్వాసం కూడా ఉంది. మన దేశంలో భోగిలాగే వీరు కూడా పాత వస్తువులను కాల్చేసే సంప్రదాయాన్ని పాటిస్తారు.

బ్రెజిల్ : ఇక్కడ కార్న్‌వాల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పొడవైన దుస్తులు ధరించి, సంప్రదాయ నృత్యాలు చేస్తూ వీధుల వెంట సాగే ఊరేగింపులో పాల్గొనేందుకు అసంఖ్యాకంగా ప్రజలు తరలి వస్తారు. హోరెత్తించే సంగీతం, వాద్యాలు, సాంబ, frevo, pagode, Axe and forro నృత్యాలతో ప్రదర్శనకారులు ముందుకు సాగుతుంటారు.

ఐర్లాండ్ : నూతన సంవత్సరం రోజు గాలి వీచే దిశను బట్టి భవిష్యత్తును అంచనా వేసుకుంటారు ఐర్లాండ్ వాసులు. తలుపులు, కిటికీలపై బ్రెడ్, చీజ్‌లను అంటించి ఉంచుతారు. చెడు ఆత్మలు వాటిని తిని ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతాయని నమ్ముతారు.

ఆస్ట్రియా : గ్లామరస్ న్యూ ఇయర్‌కి ఆస్ట్రియా ఫేమస్. 31 రాత్రి నుంచి మొదలయ్యే నాట్యం కొత్త సంవత్సరం సమీపించేసరికి ఉల్లాసభరితంగా మారుతుంది. తెల్లని గౌను, నల్ల జాకెట్ ధరించి నర్తిస్తూ వేలాది జంటలు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తాయి. వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

పెరూ : నూతన సంవత్సరం రోజున 12 ద్రాక్షపళ్లు తినడం వీరి ఆచారం. 13వ పండు తినడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. రోజంతా ఇంటిని దీపాల వెలుగులతో నింపి ఉంచుతారు.

దక్షిణాఫ్రికా : కొత్త సంవత్సరం అడుగుపెట్టిన వెంటనే తుపాకులు పేలతాయి. వెనువెంటనే చర్చి గంటలు. దాంతో న్యూఇయర్ వేడుకలు మొదలౌతాయి. రంగురంగుల దుస్తులు ధరించి సంప్రదాయ వాయిద్యాలైన డప్పులు, బూరలతో పెద్దఎత్తున సాగే ఉత్సవాలు కొత్త సంవత్సరానికి శుభ స్వాగతాన్ని పలుకుతాయి.

అమెరికా : డిసెంబర్ 31 అర్థరాత్రి గడియారం 12 గంటలను సూచించగానే ప్రియమైన వారికి ముద్దివ్వడంతో అమెరికన్ల నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొన్ని చోట్ల ముఖాలకు చిత్రమైన మాస్క్‌లతో ఊరేగింపుగా నడుస్తూ క్తొత సంవత్సరం గంటలు మోగగానే వాటిని తీసేస్తారు. పాత సంవత్సరంలోని బాధలు, కష్టాలను మాస్కులుగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున వాటినించి విముక్తి లభించాలని ఆత్మీయులను ఆలింగనం చేసుకుంటూ కోరుకుంటారు.

ఆస్ట్రేలియా : సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జనవరి 1 వేడుకలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వెలుగు జిలుగుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగే ఈ వేడుకలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండీ యాత్రికులు వస్తారు. డిసెంబర్ 31 రాత్రి కాల్చే 80 వేల మందుగుండు సామగ్రి సిడ్నీకి సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకూ వెలుగులు వెదజల్లుతాయి. పూర్వీకుల కోసం ఏదైనా త్యాగం చేయడం వీరి నూతన సంవత్సర వేడుకల్లో ప్రధానంగా కనిపిస్తుంది.

ఫ్రాన్స్ : పారిస్‌లో జరిగే నూతన సంవత్సర వేడుకలు చూడాలని కోరుకోని వారుండరు. వేలాది మంది గాయనీగాయకులు, నాట్యకారులు, వినోదాన్ని పంచే ఎన్నో కార్యక్రమాల నడుమ కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతారు. కళాకారులంతా వీధుల్లో ప్రదర్శనగా తిరుగుతూనే ఉంటారు. 31 రాత్రి మొదలైన ప్రదర్శన నెమ్మదిగా సాగుతూ జనవరి ఒకటి ఉదయానికి ఈఫిల్ టవర్‌ను చేరుకుంటుంది. ఈ ఉత్సవాలను చూసేందుకు లక్షలాదిమంది న్యూ ఇయర్‌కి కొద్ది రోజుల ముందే పారిస్‌కు చేరుకుంటారు.

జర్మనీ : కొత్త సంవత్సర వేడుకలను జర్మనీలో సిల్వెస్టర్ అని పిలుస్తారు. నాలుగో శతాబ్దానికి చెందిన ఒక సాధువు పేరే సిల్వెస్టర్. రోమన్ చక్రవర్తి కాన్‌స్టన్‌టైన్ చేత బాప్టిజాన్ని స్వీకరింపజేసిన వ్యక్తి సిల్వెస్టర్. ఆయన పేరు మీదే నూతన సంవత్సర వేడుకలకు ఆ పేరు పెట్టారు. భవిష్యత్తును చెప్పించుకోవడం (పంచాంగ శ్రవణంలాగా) వీరి ఆనవాయితీ. భవిష్యత్తును తెలుసుకోవడానికి వీరికో చిత్రమైన పద్ధతి ఉంది. చల్లని నీటిలో కరిగించిన సీసాన్ని పోస్తారు.

అది నీటిలో ఏర్పరిచే రూపాన్ని బట్టి భవిష్యత్ ఎలా ఉండబోతోందో నిర్ణయిస్తారు. హృదయాకారంలో లేక ఉంగరం ఆకారంలో ఉంటే పెళ్లి, ఓడ ఆకారంలో ఉంటే దూర ప్రయాణం, పంది ఆకృతి కనిపిస్తే రాబోయే సంవత్సరంలో ఆహార సమృద్ధి ఉంటుందని నమ్ముతారు. నూతన సంవత్సరం రోజున ఆహారంలో కొద్ది భాగం వదిలిపెట్టే ఆచారం కూడా ఉంది. విందులో షాంపైన్‌తోపాటు కార్ప్ అనే ఒక రకమైన చేప, క్యాబేజి, కేరట్ తప్పనిసరిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆర్థికపరిస్థితులు నిలకడగా ఉంటాయని నమ్ముతారు.

స్కాట్‌లాండ్ : డిసెంబర్ 31 వీరికి సెలవు దినం. జనవరి ఒకటికి ముందే అప్పులన్నీ తీర్చేసుకుంటారు. కొత్త సంవత్సరం రోజున జునిపెర్ అనే చెట్టు కొమ్మకు నిప్పు అంటించి ఇంటి చుట్టూ తిప్పుతారు. ఇలా చేయడం వల్ల పాత సంవత్సరంలోని బాధలు, సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం. స్కాట్‌లాండ్ వాసులు కొత్త సంవత్సరాన్ని ఫైర్‌బాల్స్‌తో విన్యాసాలు చేస్తూ ఆహ్వానిస్తారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా చేసే ఈ సాహసం చూసి తీరాల్సిందే. తారు, కాగితం కలిపి చేసే ఈ బంతుల చివర రెండు మీటర్ల వైరు ఉంటుంది. బంతిని కాల్చి వైరు పట్టుకుని తమ చుట్టూ గుండ్రంగా తిప్పుకుంటూ వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తారు.

జనవరి 1 ప్రపంచాన్ని ఏకం చేసే ఒక సంబరం. అయితే ఆయా దేశాలు తమ సంప్రదాయ నూతన సంవత్సరాన్ని కూడా అంతే వేడుకగా జరుపుకుంటాయి. బౌద్ధం, ఇస్లాం, పార్శీ సాంప్రదాయల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారో చూడండి.

ఇస్లాం : ముస్లిం సంస్కృతిలో నూతన సంవత్సరం అంత ఉల్లాసభరితమైనదేం కాదు. మొహర్రం తొలి రోజు వారికి నూతన సంవత్సరం. సున్నీలు 'రోజా' (ఉపవాసం) చేస్తే, షియాలు 'మాతం' (పశ్చాత్తాపం వ్యక్తం చేయడం) చేస్తారు. మొహర్రం అంతా ప్రార్థనలతో గడుపుతారు.

బౌద్ధం : బౌద్ధాన్ని అనుసరించే దేశాలన్నిట్లో నూతనసంవత్సర వేడుకలు ఒకే రకంగా జరగవు. థాయ్‌లాండ్, బర్మా, శ్రీలంక, కంబోడియా, లావోస్‌లలో ఏప్రిల్ నెలలో వచ్చే మొదటి నెలపొడుపు నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. మహాయానాన్ని పాటించే దేశాల్లో అయితే జనవరిలో వచ్చే పౌర్ణమిలో కొత్త సంవత్సరం మొదలౌతుంది. చైనా, కొరియాల్లో జనవరి లేక ఫిబ్రవరి మొదటి వారాల్లో సంవత్సరాది ఉంటుంది. టిబెటియన్లు ఒక నెల తరువాత అంటే మార్చిలో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.

థాయ్‌లాండ్ : కొత్త సంవత్సరాన్ని Songkran అంటారు. నూతన సంవత్సరం రోజు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడం వీళ్ల ఆచారం. ఇలా చేస్తే ఆత్మలు పరిశుభ్రమవుతాయని నమ్ముతారు.

టిబెట్ : కొత్త సంవత్సరం రోజున కోతులకు ఆహారం పెడతారు. రంగుల దీపాలు వెలిగించి, టపాసులు పేలుస్తారు. ఇలా చేస్తే దుష్టశక్తులు దరి చేరవన్నది వారి నమ్మకం.

చైనా : చైనాలో వేడుకలు డిసెంబర్ మధ్య నుంచి మొదలై జనవరితో ముగుస్తాయి. ఈ కాలం వీరికి వసంత రుతువు. వేడుకల చివరి రోజును లాటరన్ ఫెస్టివల్ అని పిలుస్తారు. చైనీయుల కొత్త సంవత్సరం ఒక్కో ఏడాది ఒక్కో రోజున వస్తుంది. వీరి క్యాలెండర్ సౌర, చంద్రమానాల కలయికతో ఏర్పడింది. చలికాలం తర్వాత వచ్చే రెండవ నెలపొడుపు నుంచి కొత్త సంవత్సరం మొదలౌతుంది. మన సంవత్సరాలకు 60 పేర్లున్నట్టు వారికి 12 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం పేరూ ఒక్కో జంతువుదై ఉంటుంది. ఏ ఏడాది ఏ జంతువు పేరుతో సంవత్సరం వస్తే ఆ ఏడాదిలో పుట్టేవారికి ఆ జంతు లక్షణాలు ఉంటాయని నమ్ముతారు. ఉదాహరణకు 2006 కుక్క సంవత్సరం అయ్యింది. దాని ప్రకారం ఆ ఏడు పుట్టేవాళ్లంతా విశ్వాసపాత్రులుగా, నమ్మకస్తులుగా ఉంటారంటారన్నది వారి విశ్వాసం. 2012 వారికి డ్రాగన్ సంవత్సరం.

పార్శీ మతంలో : పార్శీలో నూతన సంవత్సరం పేరు జమ్‌షెడ్ నవరోజ్. ఇది సాధారణంగా మార్చి 21న వస్తుంది. పార్శీ క్యాలెండర్‌ను తయారు చేసిన రాజు జమ్‌షెడ్ అయితే, నవరోజ్ అంటే వసంత రుతువు అని అర్థం. రెండిటినీ కలిపి ఇలా పిలుస్తారు. ప్రకృతిమాత పెళ్లికూతురిగా ముస్తాబయ్యేరోజది. నవరోజ్ అందరికీ ఓ కొత్త లక్ష్యాన్ని ఇస్తుంది. అందరూ ఆ రోజున కుటుంబ పెద్దల్ని గౌరవిస్తారు. అద్దం, కొవ్వొత్తి, దీపపు సెమ్మె, పండ్లు, పూలు, గోల్డ్‌ఫిష్ ఉన్న బౌల్, చక్కెర, బ్రెడ్, నాణేలు.. వంటివాటిని టేబుల్‌పై ఉంచుతారు. ఇలా చేస్తే ఏడాది పొడవునా కుటుంబమంతా సంతోషంతో జీవిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇంటిని రంగులతో అలంకరించి, సాంబ్రాణి ధూపంతో సుగంధభరితం చేస్తారు.

గుడిలోని పవిత్ర అగ్ని గుండానికి చందనాన్ని సమర్పిస్తారు. ఇంటికి వచ్చే అతిథులకు ఆరోజు పన్నీరు చిలకరించి ఆహ్వానం పలుకుతారు. సేమ్యాతో చేసిన చల్లని పానీయం అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలు 13 రోజుల వరకూ కొనసాగుతాయి. కొత్తగా పండిన ధాన్యాన్ని నదిలోకి చల్లే సంప్రదాయం కూడా ఉంది వీళ్లకు. పెళ్లికాని అమ్మాయిలు ధాన్యం మొలకలను మూటకట్టుకుని మంచి భవిష్యత్తు కోసం భగవంతున్ని ప్రార్థిస్తారు. ఆ రోజును ఛలోక్తులతో సరదాగా గడుపుతారు. (ఇది ఏప్రిల్ ఫస్ట్ లాగా ఉంటుంది)

యూదు మతంలో : నూతన సంవత్సర వేడుకలు వీరికి సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో వస్తాయి. రోష్ హషనా మొదలై యోమ్ కిప్పుర్‌తో ముగుస్తాయి. దేవుడు తాను తయారుచేసిన సృష్టిలోని జీవుల రాతలను ప్రతి సంవత్సరం తిరగరాస్తాడని వీరి ప్రగాఢ విశ్వాసం. అందుకే గత సంవత్సరం చేసిన తప్పులేమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడతారు. తేనెలో ఊరబెట్టిన ఆపిల్స్, మెదడు ఆకారంలో ఉండే సంప్రదాయ రొట్టెలు, ద్రాక్షసారాయితో కుటుంబమంతా కలిసి విందు ఆరగిస్తారు. దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ బూరను ఊదుతారు. వేడుకల చివరి రోజైన 'కిప్పుర్' నాడు ఉపవాసం ఉంటారు. ఈ రోజుతో దేవుడు మనిషి తలరాతల పుస్తకంలో దిద్దుబాట్లు చేయడాన్ని ఆపేస్తాడని విశ్వసిస్తారు.

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .