2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121 కోట్లు. అందులో పురుషులు 62 కోట్లు, స్త్రీలు 59 కోట్లు. అక్షరాస్యత 74 శాతం. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ... మనదేశంలో ఎన్ని భాషలున్నాయి? ఎన్ని అంతరించిపోయాయి? ఎన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి? వీటి గురించి ఎంతమందికి తెలుసు? అందుకే... తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు 'ఆయన'.
'మనసు పలికే మౌనగీతం...' అన్నాడో కవి. ఎందుకంటే... మనసు మాట్లాడలేదు. మనమే మాట్లాడాలి. మన మెదడు ఆలోచనల అమ్ములపొది. ఆ ఆలోచనల బాణాలను ప్రయోగించేది భాష. అందుకే భాషకు అమ్మ హోదానిచ్చి 'మాతృభాష' అంటున్నాం. బిడ్డల మనసు తెలుసుకుని తల్లి ఎలా పెంచుతుందో మాతృభాష కూడా అంతే. పిల్లలు ఆ భాషలో చదువుకుంటేనే చదువుల్లోని సారాన్ని అర్థం చేసుకోగలుగుతారని అధ్యయనాలూ చెబుతున్నాయి.
భాష ఉంటే ఒక సంస్కృతి ఉన్నట్టు. భాష ఉంటే ఒక నాగరికత ఉన్నట్టు. అందుకే భాష గొప్పది. ప్రపంచంలోకెల్లా అత్యంత వైవిధ్యమైన దేశం మనది. ఎన్నో మతాలూ... మరెన్నో భాషలూ ఉన్నాయిక్కడ. మతాల పేర్లు అడిగితే అందరూ చెబుతారు. కానీ, మనదేశంలోని భాషల గురించి ఎంతమందికి తెలుసు? అందుకే 'భాషల లెక్కలు' చేపడుతోంది 'భాషా ట్రస్టు'. ఈ సర్వే పేరు... 'పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా'.
1923 తరవాత ఇదే...
జనాభా లెక్కలు ప్రతి పదేళ్లకోసారి జరుగుతుంటాయి. కానీ, భాషల లెక్కలు అలా జరగడంలేదు. మనదేశంలో చివరిసారిగా భాషల లెక్కలు జరిగింది 1923లో. అప్పట్లో ఐర్లండుకు చెందిన భాషా నిపుణుడు సర్ జార్జ్ అబ్రహాం గ్రియర్సన్ మనదేశంలో ఈస్టిండియా కంపెనీకి బీహార్ రాష్ట్ర ఓపియం ఏజెంటుగా ఉండేవారు. ఆయన 1894లో మనదేశంలో భాషలమీద సర్వే ప్రారంభించారు. దాని ప్రకారం.. మనదేశంలో వెుత్తం 179 భాషలూ, 544 మాండలికాలూ ఉన్నాయి. అంతేకాదు... ఇందులో పంజాబీ, కొంకణి భాషల్ని హిందీ మాండలికాలుగా గుర్తించారు. ఆ సర్వే సంపూర్ణం కాదని ఆ తరవాత తెలిసింది. ఎందుకంటే... ఆ సర్వే చేసిన చాలామందికి కనీస శిక్షణ కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నిజాం ప్రభువులు సర్వేకు అంగీకరించలేదు. సర్వే చేసేవాళ్లను అడుగుపెట్టనివ్వలేదు. అందుకే ఇప్పుడు భాషల సర్వేకు పూనుకున్నారు గణేష్ దేవీ.
అతడే ఒక సైన్యం
ప్రొఫెసర్ గణేష్ దేవీ.... గుజరాత్‌కు చెందిన గొప్ప రచయిత, భాషా నిపుణుడు. సాహిత్య అకాడెమీ అవార్డునూ అందుకున్నారు. 61 ఏళ్ల దేవీ భాషల అభివృద్ధికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా యునెస్కో ఈ ఏడాది 'అంతర్జాతీయ లింగ్వాపాక్స్' అవార్డుతో సత్కరించింది.
భాషలమీద ఉన్న అభిమానంతో ఆయన 'భాషా ట్రస్టు' ఏర్పాటుచేశారు. బరోడాలోని ఈ ట్రస్టు... గిరిజనుల సంక్షేమం, భాషల పరిరక్షణకు పాటుపడుతుంది. అన్ని భాషలనూ ఎప్పుడూ వినాలనే ఉద్దేశంతో ఇందులో 'భాషా వనం' ఏర్పాటుచేశారు. ఈ వనంలో 300 చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టులోనూ ఒక సెన్సార్ అమర్చారు. ఎవరైనా ఆ చెట్ల ముందు నుంచి వెళ్తే అవి పలకరిస్తాయి... ఒక్కో చెట్టూ ఒక్కో భాషలో. అంటే 300 భాషలు వినొచ్చన్నమాట.
భాషలను ఎంతో ప్రేమించే దేవీ... ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా భాషలమీద సర్వే వెుదలుపెట్టారు. ఆయన ఆలోచన తెలిసి రైతులూ, విద్యార్థులూ, రచయితలూ, ప్రొఫెసర్లూ... ఇలా ఎన్నో రంగాలకు చెందిన రెండువేలమందికిపైగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
'మధ్యప్రదేశ్‌లో అయిదు భాషలున్నాయంటారు. కానీ, మా సర్వేలో 20కిపైగా భాషలున్నాయని తెలుసుకున్నాం' అంటారు అక్కడ లెక్కలు చేపడుతున్న దావోదర్‌జైన్. 49 ఏళ్ల జైన్ భోపాల్‌లోని జాతీయ సాంకేతిక ఉపాధ్యాయుల శిక్షణ, పరిశోధన కేంద్రంలో లెక్చరర్.
'గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో తిరిగే మడారీలు, గరుడీలు; ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో తిరిగే కైకడీలు లాంటి సంచార జాతులు మాట్లాడే భాషలను ఎవరూ గుర్తించలేదు. రాజస్థాన్‌లోని కంజర్లు 'భంటూ' అనే భాష మాట్లాడతారు. కానీ, వాళ్లు ఆపదలో ఉన్నప్పుడు మరో భాష వాడతారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పహాడీ భాష మాట్లాడతారని చెబుతారు. కానీ అది తప్పు. అక్కడ సుమారు 28 భాషలున్నాయి. పరిపాలనా సౌలభ్యంకోసమే పహాడీని ఉపయోగిస్తారు. ఇక, మాండలికాల సంగతి సరేసరి. అందుకే మేం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సర్వే చేస్తున్నాం' అంటారు దేవీ.
900కి పైగా భాషలు
మనదేశంలో నాలుగు శాతం ప్రజలు 96 శాతం భాషలు మాట్లాడతారు. 96 శాతం ప్రజలు నాలుగుశాతం భాషలు మాట్లాడతారు. మనదేశంలోని వైవిధ్యానికి ఇదే నిదర్శనం. అందుకే భాషలను గుర్తించేందుకు ఈ సర్వేలో కొన్ని పద్ధతులు పాటిస్తారు. దూరాలూ, సమయమూ, బంధుత్వాలూ, రంగులూ, చెట్లూ, కూరగాయలూ, క్రియలూ... వీటన్నింటికీ నిర్దిష్టమైన పదాలుంటేనే దాన్ని భాషగా పరిగణిస్తారు. 'మనదేశంలో 900కిపైగా భాషలున్నాయని అంచనా. గుజరాత్‌లో ప్రతి ఐదేళ్లకూ ఒక భాష అంతరించిపోతోంది. మిగతా రాష్ట్రాల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. అందుకే ఈ సర్వే చేపట్టాం. డిసెంబరు నాటికి గుజరాత్‌లోని భాషల నివేదిక ఇస్తాం. 2015 నాటికి వెుత్తం సర్వే పూర్తయిపోతుంది' అంటున్నారు దేవీ.
'భాషల గురించి ఇంత ప్రయాస ఎందుకు... ఉండగలిగేవి ఉంటాయి, పోయేవి పోతాయి' అనేవాళ్లకు ఆయన ఒక్కటే చెబుతారు.
'వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు ఏదో ఒక రోజు పోతారని సేవలు చేయడం మానేస్తామా... మాతృభాష కూడా అలాంటిదే'- ఇదీ ఆయన సమాధానం.
--పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా'.
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .