Monday, October 3, 2011

ప్రపంచ బాలల దినోత్సవం , International childrens day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 20) -ప్రపంచ బాలల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1): 1948వ సంవత్సరంలో ప్రపంచ మహి ళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

  • బాల్యమా.. ఏదీ నీ చిరునామా ....?!
-బాల్యం ఓ అద్భుత వరం. బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు. ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. వారికోసం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాలలంటే బడి పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో... భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే ఏకైక ఆలోచనకు బలవంతంగా బద్ధులై బ్రతికే సగటు బాలుడు బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు? దీనికి అనేక కారణాలున్నాయి. బాలల హక్కులను కాలరాస్తున్న మన పాలకుల నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో బాలల హక్కులు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిల్డ్రన్స్‌ డే ప్రత్యేక వ్యాసం...


మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం... విషయం తెలిసిందే. అయితే పిల్లల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొం దించే మరో శుభదినమే ఐక్యరాజ్య సమితి పాటించే ప్రపంచ బాలల దినోత్సవం. ప్రతి ఏడాది నవంబరు 20వ తేదీని ప్రపం చ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. యూనిసెఫ్‌ (యునై టెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌) బాలల దినం కార్యక్రమాలను సమన్వయం చేసి నిర్వహిస్తున్నది. పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది. ఇదే వారంలో (నవంబర్‌ 19) బాలల అత్యాచార నిర్మూలన దినోత్సవం (చైల్డ్‌ అబ్యూస్‌ ప్రివెన్షన్‌ డే) కూడా జరుపుకోవడంతో ఈ వారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ ఉత్సవాల సంగతి ఎలా ఉన్నా మనదేశంలో బాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి? విద్యా, వైద్య సేవలు చిన్నారులకు అందుతున్నాయా? అని పరిశీలించుకుంటే ఎన్నో భయంకర వాస్తవాలు వెలుగుచూస్తాయి.


భారతదేశంలో సుమారు 30 కోట్ల చిన్నారుల్లో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు. ఆర్థిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన నవభారతాన్ని నిర్మించాలంటే... నేటి బాలల అవసరాలను తీర్చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అందుకు సమయమాసన్నమైనది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఈ ఆరు దశాబ్దాల కాలంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ, చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యా చరణ విధానాలను, కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించేవిధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పిల్లల హక్కులను సంరక్షిం చే ఫలాలు ఇప్పటికీ అందరికీ అందడంలేదు.

- దేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ఇతర రంగాల వారు కలసికట్టుగా పనిచేయ డంతో అసాధారణ సమస్యలున్న పిల్లలపై బాలలపై ప్రముఖంగా దృష్టిని కేంద్రికరించడం. బాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం, లింగ వివక్షను రూపుమాపడం, వీధి బాలలను ఉద్దరించడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు కావలసిన అవసరా లను తీర్చడం. అంతేగాకుండా పిల్లలు చదువు కోవడం వారి ప్రాధమిక హక్కు కావునా దానిని కాపాడడం వంటి అంశాలపై దృష్టిపెట్టి కొంతవరకు సఫలీకృత మైనా ఈ సేవలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. 1959 ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల ప్రకటనకు మన దేశం భాగస్వామి. అలాగే ఇండియా 1974లో పిల్లలపై జాతీయ విధానం ఆమోదించింది. పుట్టుకకు ముందు పుట్టిన తర్వాత పిల్లలకు తగిన సేవలందిస్తా మని హామీ ఇచ్చిన రాజ్యాంగ నిబంధనలు ఈ విధానం పునరుద్ఘాటించింది. పిల్లల భౌతిక, మాన సిక సామాజిక పెరుగుదలకు పూర్తిగా హామీ పలికింది.

పిల్లలు జీవనం, వారి సంరక్షణ, అభివృద్ధి పై ప్రపంచ ప్రకటనపై ఇండియా సంతకం చేసింది. ప్రపంచ సదస్సులో చేసిన వాగ్దానానికి అను గుణంగా మానవవనురుల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని మహిళా శిశుసంక్షేమ విభా గం పిల్లల కోసం జాతీయ కార్యాచరణ పథ కాన్ని రూపొందించింది. దేశంలోని సుమా రు 30 కోట్లమంది పిల్లల ఆకాంక్షలు, హక్కులు అవసరాల దృష్ట్యా ప్రపంచ సదస్సు కార్యాచరణ పథకం సిఫార్సుల ను మన జాతీయ కార్యాచరణ పథకంలో పొందుపరిచింది. ఆరోగ్యం, పోషకాహా రం, విద్యాభ్యాసం, మంచినీరు, పారిశుద్యము , పర్యావరణం-అంశాలను పథకం లో ప్రాధాన్యతా రంగాలుగా పేర్కొన్నా రు. కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లల పట్ల పథకం ప్రత్యేక శ్రద్ధచూపి, దేశ పరిస్థితులను బట్టి ఒప్పందం లక్ష్యాలని ఒక నిర్ణీత కాలవ్యవధిలో సాధించాలని సంక ల్పించింది. అయితే ఇవన్నీ పకడ్భందీ అమలకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ దేశంలో బాలల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

భారత్‌లో పిల్లల స్థితిగతులు...
-మనదేశంలోని మిలియన్ల కొద్ది పిల్లలు... జీవనం, ఆరోగ్యం, పోషకాహారం, చదువు, రక్షిత తాగునీరు హక్కులను కోల్పోతున్నారని, 63 శాతం పిల్లలు రాత్రి ఆకలి కడుపుతో నిద్రపోతు న్నారని, 53 శాతం పిల్లలు తీవ్రమైన పోషకాహా రలోపం వల్ల బాధపడుతున్నారీ యూనిసెఫ్‌ 2005 నివేదికలో వెల్లడించింది. మనదేశంలో 147 మిలియన్ల పిల్లలు పూరిళ్ళల్లో నివసిస్తున్నా రు. 77 మిలియన్ల పిల్లలు కొళాయిల తాగునీరు వాడడం లేదు. 85 మిలియన్ల పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందడం లేదు. 27 మిలియన్ల పిల్లలు బరువుతక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక భయంకర చేదు వాస్తవాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది. నివేదిక ప్రకారం 33 మిలియన్ల మంది బడి ముఖం చూడలేదు.

5-14ఏళ్ళ లోపు 72 మిలియన్ల పిల్లలకు ప్రాథమిక విద్య అందుబాటులో లేదు. మగపిల్లలకే ప్రా దాన్యం ఇస్తున్నందువల్ల ఆడపిల్లలు అశ్రద్ధకు, తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. ఈ సమస్యల నివారణ కోసం భారత్‌ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తవరూపం దాల్చడంలేదని నిర్వివాదాంశం. వీటి నివారణలో భాగంగా బా లల హక్కుల పరిరక్షణకై కేంద్రప్రభుత్వం ఓ జాతీయ సంఘాన్ని కూడా ఏర్పా టు చేసింది. అయితే లక్ష్యసాధనలో అది అనుకున్న మేర సఫలీకృతం కాలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. దీనికి నానాటికీ పెరిగిపోతున్న బాలకార్మిక వ్యవస్థ, బాలలపై అత్యాచారాలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

బాల కార్మిక వ్యవస్థ - నిర్మూలన...
-జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇప్పటికీ కొనసాగుతూనేవుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే వుంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్ల... దారిద్య్రం, నిరక్షరాస్యతతో కూడినది కాబట్టి ఇంకా సమాజంలోని అన్ని వర్గా ల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ ప్రభుత్వం ముందుంచింది. దారిద్య్రం కొనసాగుతున్నంతవరకూ, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం అసాధ్యమన్నారు. కాగా దాన్ని చట్టపరంగా నిర్మూలించడ మనేది ఆచరణ సాధ్యం కాదన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే బాలకా ర్మిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కొనసాగుతున్నదో ఆయా ప్రాంతాలలో దానిని నిర్మూలించే ప్రయత్నం చేయడమే కర్తవ్యమని అంటూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టాలన్నారు. పనిచేసే పిల్లల సమస్యల్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేయాలన్నారు. గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ (నిషేధం- నియంత్రణ) అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తిం చి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధిం చింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడా నికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితి ని ఏర్పాటు చేసి ప్రమాదకర మైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింపచేశారు. ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987 లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరా వాస సదుపాయం కల్పించారు.

బ్రిడ్జి కోర్సులు...
-ఎమ్‌.వి. ఫౌండే షన్‌ ఆధ్వర్యంలో చదువు విష యంలో కొన్ని ఏర్పాట్లు చేశా రు. బడిమానేసిన పిల్లలకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి వారిని పాఠశాలల్లో చేర్పించే ఏర్పాటు చేశా రు. అలాగే బాల కార్మికులు వయసుకు తగిన తరగతుల్లో ప్రవేశించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. బాల కార్మికులు సజావుగా మామూలు పాఠశాలల్లో చేరడంలో ఈ విధానం చాల జయప్రదమైంది. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రధమ్‌, సినీ- ఆశ, లోక్‌ జుంబుష్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు చేపట్టి కొనసాగించడం గమనార్హం.

  • బాలకార్మిక వ్యవస్థ- కారణాలు...
జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాల లు పనుల్లోకి నెట్టబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పిల్లలు సులువుగా దోపిడికి గురవ్వడమే. పిల్లలు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయడానికి ప్రధాన కారణం పేద రికం. జనాభా పెరుగుదల, చట్టాలను అమలు పరచనందు వల్ల తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి ఇష్టపడకపోవడం (పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో), గ్రామీణ ప్రాం తాల్లోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్థకు కారణాలు.

  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఏంచేయాలి?
- బాలకార్మికవ్యవస్ధ నిర్మూలనకోసం 76 బాల కార్మిక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,05,000 పిల్లలను ప్రత్యేక బడులలో చేర్పించారు. 57 అతి ప్రమాదకర పరిశ్రమ ల్లో పనిచేస్తున్న బాలలు, హొటళ్ళు, ఇళ్ళల్లో పనిచేస్తున్న (9-14 సంవత్సరాల మధ్య వయస్సున్న) పిల్లలు ఈ పథకంలో చేర్పిం చబడ్డారు. ప్రభుత్వ పథకాలైన అందరికీ విద్యావిధానం (సర్వశిక్షాభియాన్‌) అమలు చేయబడుచున్నది. ఇలాంటి పథకాలు మరిన్ని ప్రవేశపెట్టి ఈ విధానాలు మరింత పటిష్టంగా అమలు చేసినప్పుడే బాలకార్మిక వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగుతుంది.


  • పిల్లల హక్కుల పరిరక్షణలో జాతీయ సంఘం ఏం చేస్తోంది...
-పిల్లల హక్కుల పద్ధతులను అమలుచేయడం కోసం, 2005 యునిసెఫ్‌ నివేదికలోని అంశా లను దృష్టిలో ఉంచుకొని వాటి లక్ష్యం సాధన కోసం, భారత ప్రభుత్వం అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఒక జాతీయ సంఘాన్ని భారత ప్రభుత్వం నెలకొల్పింది. 2006 డిసెంబరు 29 పార్లమెం టు చేసిన చట్టం ప్రకారం చట్టబద్ధమై ఈ సంఘాన్ని నెలకొల్పారు. అధ్యక్షుడితోపాటు, పిల్లల ఆరోగ్యం, విద్య, పిల్లల సంరక్షణ అభి వృద్ధి, పిల్లలకు న్యాయం, వైకల్యానికి గురైన పిల్లలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల మనస్తత్వ శాస్త్ర, సామాజిక శాస్త్రం పిల్లలకు సంబంధించిన చట్టాలు- తదితర రంగాల నుంచి ఆరుగురు సభ్యులుంటారు. ఫిర్యాదులను విచారించడం, పిల్లల హక్కుల ను కాలరాయడం, పిల్లల సంరక్షణ అభివృద్ధికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన వంటి విష యాలను తనంతటతానే విచారణకు చేపట్టే అధికారం సంఘానికి ఉంది.

పిల్లల హక్కుల ను కాపాడడం కోసం చట్టం కల్పించిన రక్షణ లను పరిశీలించి సమీక్షించడంకోసం ఆవిర్భ వించిన ఈ సంఘం చట్టాలు శక్తిమంతంగా అమలు అవడంకోసం చర్యలు సిఫార్సు చేస్తుంది. ఒక వేళ అవసరమైతే సవరణలు సూచించి ఫిర్యాదులను విచారిస్తుంది. పిల్లల చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన కేసులను సంఘం తనంతటతానే పరిశీలిస్తుంది. ఇవన్నీ పటిష్టంగా అమలు జరి గితే బాలల హక్కులు ఆశించనంతస్థాయిలో మెరుగవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పేపర్‌పైన ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న జాతీయం సంఘం లక్ష్యాలు ఆచ రణలోకి వచ్చేటప్పటికీ కార్యరూపం దాల్చ టంలేదు. అంతేకాకుండా ఇప్పటికీ మిలియన్ల కొద్ది బాలల పాఠశాల విద్యకు దూరమవుతూ నే ఉన్నారు. మెరుగైన వైద్యం అందడం లేదు. బాలలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నా యి. పిల్లలకు ఉచిత నిర్భంద విద్యనందించా ల్సిన ప్రభుత్వం ఈ దిశగా ఎన్నో చట్టాలను రూపొందించింది. అందులో భాగంగా వచ్చినదే... ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం ఈ చట్టం ఏం చెబుతోందో ఒకసారి పరిశీలిద్దాం...

  • ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం...
2009 ఆగస్టు 4న భారత పార్లమెంటు పిల్ల ల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం చేసింది. భారత రాజ్యాంగంలోని 21-అ నిబంధన ప్రకారం చేసిన ఈ చట్టం 2010 ఏప్రిల్‌ 1 అమల్లోకి రావడంతో ఇండియా విద్యను పిల్ల ల ప్రాథమిక హక్కును చేసిన దేశాల జాబితా లో చరింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్ళలో భారతరాజ్యాంగ రచనలో ఈ చట్టం చరిత్ర మూలాలున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే విద్యను ప్రాథమిక హక్కును చేస్తూ రాజ్యాంగానికి చేసిన సవరణ నిబంధన 21-అ లో ఉంది. కానీ ఈ రాజ్యాంగ సవరణ హక్కు అమలుచేయడానికి ఒక చట్టం చేయా లని సూచించడంతో ప్రత్యేకించి విద్యా బిల్లు తీసుకురావల్సిన అవసరం తెలెత్తింది. ఈ బిల్లు ముడి ముసాయిదా 2005లో తయార య్యింది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ప్రై వేటు బడుల్లో 25శాతం రిజర్వేషన్‌ కల్పించా లన్న అంశం తప్పనిసరి చేయడంతో బిల్లుపై వ్యతిరేకత పెల్లుబికింది. ముసాయిదా బిల్లు తయారుచేసిన సెంట్రల్‌ అడె్వైసరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉప సంఘం ప్రజాస్వామి, సమ సమాజ నిర్మాణానికి ఈ నిబంధన ప్రధానమై న షరతుగా పరిగణించింది. మొదట్లో భారత లా సంఘం ప్రయివేటు బడుల్లో వెనుకబడిన విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించా లని ప్రతిపాదించింది.

ఈ బిల్లును కేంద్ర క్యాబినెట్‌ 2009 జూలై 2 ఆమోదించింది. 2009 జూలై 20న రాజ్య సభ, 2009 ఆగస్టు 4న లోక్‌ సభ ఆమోదిం చాయి. 2009 సెప్టెంబరు 3న రాష్టప్రతి ఆమో ద ముద్ర పొంది ఉచిత, నిర్బంధ విద్యకు పిల్ల ల హక్కు చట్టమయ్యింది. భారత దేశ చరిత్ర లో ప్రధాని ప్రసంగం ద్వారా అమలులోకి వచ్చిన మొట్టమొదటి చట్టం ఇదే. లింగ వివ క్ష, సామాజిక వర్గం అన్న తారతమ్యాలు లేకుండా పిల్లలందరికీ విద్యనందించడానికి మేము కట్టుబడివున్నాం. పిల్లలకు నైపుణ్యాలు, విజ్ఞానం, విలువలు, బాధ్యతనెరిగిన క్రియాశీ ల పౌరులవడానికి అవసమైన దృక్పథాన్నిచ్చే విద్యనందివ్వడానికి కట్టుబడి వున్నాం అని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ తన ప్రసం గంలో పేర్కొన్నారు.
విద్యను 6-14 ఏళ్ళ వయసు పిల్లల ప్రాథమిక హక్కును చేసిం ది ఈ చట్టం.

ప్రాథమిక స్కూళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన కనీస నిబంధనలను నిర్ధారించిం ది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రయివేటు బడులు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. (ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వా మ్యం పథకంలో భాగంగా ఫీజులు ప్రభుత్వం వాపసు చేస్తుంది) గుర్తింపులేని స్కూళ్ళపై నిషే ధం విధిస్తుంది. డోనేషన్లు కాపిటేషన్‌ ఫీజులు తీసుకోకూడదని తేల్చి చెప్పింది. బడిలో చేర డానికి పిల్లల్ని కానీ తల్లిదండ్రుల్ని కానీ ఇంట ర్వ్యూ చేయకూడదు. ప్రాథమిక విద్య పూర్త య్యేంత వరకూ ఏ విద్యార్థినీ ఒకే తరగతిలో ఉంచకూడదు. బహిష్కరించకూడదు. బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సిన అవసరం లేదు. అదే వయసు పిల్లలతో సమత్వం సాధించడం కోసం మధ్యలో చదువు మానుకున్నవారి కోసం ప్రత్యేక శిక్షణనివ్వాలి. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశీలించి పిల్లల్ని బడుల్లో చేర్పించాలి. అందుకు తగిన చర్యలు తీసు కోవాలి. భారత్‌కు సంబంధించిన ప్రపంచ బ్యాంకు విద్యారంగం నిపుణుడు సామ్‌ కార్ల్‌ సన్‌ ఇలా అన్నాడు. బడిలో చేర్చడం, పిల్లలు బడికి హాజరు కావడం, చదువు పూర్తి చేయ డం అన్నీ ప్రభుత్వం బాధ్యతగా ప్రకటిస్తున్న ప్రపంచంలో మొట్టమొదటి చట్టం ఇదే. అమెరికా ఇతర దేశాల్లో పిల్లల్ని బడికి పంపిం చవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.

అంగవైకల్యం ఉన్నవారికి 18 ఏళ్ళ వరకు చదువుకునే ప్రాథమిక హక్కు కల్పించింది ఈ చట్టం. బడిలో మౌలిక సదుపాయాలు, ఉపా ధ్యాయుడు-విద్యార్థుల మధ్య నిష్పత్తి, గురిం చి ఎన్నో నిబంధనలున్నాయి. ఈ చట్టం ప్రకా రం పిల్లల హక్కుల పరిరక్షణకోసం జాతీయ సంఘం అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పారు. 2007లో ఆవిర్భవించిన ఈ సంస్థ చట్టం అమలును రాష్ట్రాల్లో స్థాపించవలసిన సంఘా లను పర్యవేక్షిస్తుంది.

  • అమలు-ఆర్థిక వనరులు...
భారత రాజ్యాంగం ప్రకారం విద్య రాష్ట్రాల పరిధిలో ఉంది. చట్టం అమలుకు రాష్ట్రం, స్థానిక సంస్థలు జవాబుదారీ వహించాలని చట్టం పేర్కొన్నది. కనుక కేంద్ర ప్రభుత్వం (అధికశాతం రెవెన్యూ వసూలు చేస్తుంది) రాష్ట్రాలకు సబ్సిడీలు ఇవ్వాల్సివుంటుంది. ఈ చట్టం అమలుకోసం రాబోయే ఐదేళ్ళకుగా రూ.1,71,000 కోట్లు అవసరమవుతాయ ని... నిధుల అంచనా కోసం వేసిన సంఘం తెలిపింది. 65-35 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రా లు, ఈశాన్య రాష్ట్రాల విషయంలో 90-10 నిష్పత్తిలో వ్యయం భరించడానికి కేంద్ర ప్రభు త్వం అంగీకరించింది. కానీ 2010 సం సగం పూర్తయ్యేసరికి అంచనా 2,31,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కేంద్రం తన వాటాను 68 శాతానికి పెంచడానికి అంగీక రించింది. ఈ విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కనుక చాలా రాష్ట్రాలు తమ విద్యా బడ్జట్‌ను పెద్దగా పెంచనవసరంలేదు.

ఈ చట్టం కొత్తదేమీ కాదని కొందరంటున్నా రు. ప్రజల్లో అధిక సంఖ్యాకు లు నిరక్షరాస్యు లు కనుక వయోజన ఓటు హక్కును వ్యతిరే కించారు. మధ్యే మార్గంగా రాజ్యాంగంలో 45 వ నిబంధన చేర్చారు. గ్రామీ ణ ప్రాంతాల్లో పేద పిల్లలకు సులువుగా చదు వు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో స్కూళ్ళు నెలకొల్పడం కోసం 1990ల్లో ప్రపంచ బ్యాం కు అనేక ప్రభుత్వపరమైన చర్యలకు నిధులు కేటాయించింది. పిల్లల విద్యా హక్కు ఈ క్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. పిల్ల ల్ని బడుల్లో చేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై పెట్టింది. అయితే ఈ బాధ్యతలను అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ పటిష్టంగా అమలైనప్పుడే బాలల హక్కులు పరిరక్షించబడతాయి. లేదంటే ఇప్ప టికే చితికిపోతున్న బాల్యం మరింత కకావిక లం అవుతుందనేది నిర్వివాదాంశం. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల స్థితిగతులను పరిశీలించిన ట్లయితే చాలా దేశాలు పరిణితిని సాధించా యి. అంతేకాకుండా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తున్నాయి.

  • ప్రపంచవ్యాప్తంగా.. బాలల స్థితిగతులు..
అభివృద్ధి చెందిన దేశాలలో అసంఖ్యాకమైన పాఠశాలలు, విద్యాసంస్థలు... తమ హక్కుల గురించి, పిల్లల హక్కుల ప్రకటన గురించి, పిల్లల హక్కుల ఒప్పందాల గురించి, పిల్లల్లో చైతన్యం రేకెత్తించడం కోసం విశేష కృషి చేస్తాయి. పిల్లలకు, ఇతరులకు మధ్య ఉండే వ్యత్యాసాల గురించి తమ విద్యార్థుల్లో ఉపా ధ్యాయులు ఆలోచనలు రేకెత్తిస్తారు. హక్కు లు భావన గురించి పిల్లలకు వివరిస్తారు. పిల్లల హక్కులు నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భాల వైపు ఉపాధ్యాయులు శ్రద్ధ వహిస్తా రు. కొన్ని ప్రాంతాల్లో పిల్లల హక్కుల పై దృష్టి ఆకర్షించడం కోసం యూనిసె్‌ఫ్‌ సదస్సులు నిర్వహిస్తుంది. టీకాలు వేయిం చడం, తల్లిపాల ఆవశ్యకత వంటి అంశాల పై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం, మీడియాలో ఆసక్తి కలి గించడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తారు. కెనడా, న్యూజిల్యాండ్‌, యునై టెడ్‌ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు నవం బరు 20న ప్రపంచ బాలల దినోత్సవ వేడుకులు నిర్వహించి పిల్లల హక్కుల ప్రకటన, పిల్లల హక్కుల కన్వెన్షన్‌ వార్షి కోత్సవాలు జరుపుతాయి. కానీ ఇతర దేశాలు ఈ వేడుకను వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తాయి. ఆస్ట్రేలియా అక్టోబరు మాసంలో నాల్గవ బుధవారం నాడు, ఇండియా నవంబరు 14న బాలల దినో త్సవ వేడుకులు జరుపుకుంటాయి. అమెరికాలో ప్రపంచ బాలల దినోత్సవం పాటించరు. కానీ జూన్‌ మొదటి ఆదివా రం జాతీయ బాలల దినంగా పాటిస్తారు.

  • ప్రపంచ బాలల దినోత్సం ఎందుకు?
ప్రపంచ బాలల దినోత్సవం పాటించవ లసిన సందర్భమే కానీ సెలవుదినం కాదు. 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఒక వేడు కను నిర్వహించాలని 1954 డిసెంబరు 14న ఐరాస జనరల్‌ అసెంబ్లీ అన్ని దేశా లకూ సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల మధ్య సోదర భావం, అవగాహన పెంపొందించాలని పిల్లల సంక్షేమం కోసం పాటుపడాలనీ సూచించింది. ప్రతి దేశం ఈ సందర్భం కోసం ఒక తేదీని ఖరారు చేయాలని సూ చించింది. అదే సమయంలో బాలల దినో త్సవం కోసం ఒక సబబైన తేదీని నిర్ణయిం చాలని ఐరాస జనరల్‌ అసెంబ్లీ సిఫార్సు చేసిం ది. చాలా దేశాలు ఈ సిఫార్సును గౌరవించి నవంబరు 20ని ప్రపంచ బాలల దినంగా పాటిస్తున్నారు. 1959 నవంబరు 20న ఐరా స జనరల్‌ అసెంబ్లీ బాలల హక్కుల ప్రకటన ను ఆమోదించింది. 1989 నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్‌ ఆమోదించింది.

  • అందరికీ విద్య - ప్రాముఖ్యం...
1948లో మానవ హక్కుల ప్రకటన ఆమో దించినప్పటినుంచి విద్యను మౌలికమైన మానవహక్కుగా గుర్తించారు. అప్పటి నుంచి ఎన్నో మానవ హక్కుల ఒప్పందాలు ఈ హక్కును బలపరిచాయి. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యాభ్యాసం అంది వాలన్న ప్రతిపాదనకు మద్దతు నిచ్చాయి. 1990లో అందరికీ విద్య (ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌) ను ప్రారంభించారు. 2015 నాటికి పిల్లలందరికీ, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న, అల్పసంఖ్యా కుల వర్గాలకు చెందిన బాలికల కు ఉచితంగా నాణ్యమైన నిర్బంధ విద్యాభ్యాసం అంది వ్వాలన్నది లక్ష్యం. అందరికీ విద్య (ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌) లక్ష్యం సాధించే ముందు చేయవలసిన కృషి ఎంతో ఉంది. యునెస్కో అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బడికివెళ్ళని పిల్లలు 75 మిలియన్ల మంది (7 కోట్ల 50 లక్షలు) ఉన్నా రు. 2005-2006 నాటికి 90 మిలియన్ల మంది (9 కోట్లు) పిల్లలకు చదువుకునే అవ కాశం దొరక లేదు.

  • ఇలా చేస్తే... బాల్యం సురక్షితం...
- 2007లో యునెస్కో, యునిసెఫ్‌ సంయు క్తంగా రూపొందించిన నివేదిక... విద్యను హక్కుల దృష్టితో పరిశీలించింది. అందరికీ విద్యనందివ్వాలంటే పరస్పరం ముడిపడున్న 3 హక్కుల కోసం సమన్వయంతో కృషి చేయాలి.
- చదువు అందరికీ అందుబాటులోకి రావాలి.
- నాణ్యమైన విద్యా హక్కు: పిల్లలను దృష్టి లో వుంచుకొని విద్యను వారికి ఉపయోగప డేదిగా తీర్చిదిద్దాలి. వారి పాఠ్యప్రణాళిక సమ గ్రమైందిగా ఉండాలి. పాఠ్యప్రణాళికను ఎప్ప టిప్పుడు పర్యవేక్షిస్తూ సవరిస్తూ ఉండాలి.
- మానవ హక్కులకు అనుగుణంగా విద్యా భ్యాసం అందివ్వాలి: అన్నిరకాల హింసలకు దూరంగా ఉంటూ సంస్కృతికి, మతానికి, భాషకు గౌరవమిచ్చే విధంగా ఉండాలి.
2008లో అందరికీ విద్య పై యునిసెఫ్‌ విడు దల చేసిన ప్రపంచ పర్యవేక్షణ నివేదిక బాల కార్మిక వ్యవస్థకు పిల్లల నిరక్షరాస్యతకు మధ్య వున్న సంబంధంపై నొక్కిచెప్పింది. 100 మిలి యన్ల పిల్లలు అంటే 70 శాతం బాలకార్మికు లు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరం గంలో పనిచేస్తున్నారని అక్కడ పాఠశా లలు గానీ, సుశిక్షితులైన టీచర్లుగానీ, విద్యాపరమైన వనరులుగానీ లేవనీ వెల్లడిస్తోంది. నిరక్షరాస్యత గ్రామీణ- పట్టణ వైషమ్యంకంటే తీవ్రమైంది. ఖర్చు, కులం, సంస్కృతి మూలంగా పట్ట ణ ప్రాంతాల్లో కూడా నిరుపేద పిల్లలు స్కూళ్ళు ఉండి కూడా చదువుకోలేకపో తున్నారు. ఉచిత విద్య అందుబాటులో లేకపోవడంతో పిల్లలు లైంగిక దోపిడీ, దౌర్జన్యాలకు లోనవుతున్నారు. కొందరు అనాథ పిల్లలు స్కూలు ఫీజు కట్టడంకో సం పడుపువృత్తికి ఒడికడుతున్నారు. పర్యవసానంగా హెచ్‌ఐవి- ఏయిడ్స్‌కు గురవుతున్నారు. హెచ్‌ఐవి -ఎయిడ్స్‌కు లోనైన తల్లిదండ్రులు తాము చనిపోయి న తరువాత తమ పిల్లల స్కూలు ఫీజు, యూనిఫాంలు, ఎలా సమకూరుతాయా అని మదన పడుతున్నారు. తల్లిదండ్రు లు లేక ఒక బిడ్డ ఇలాంటి క్షోభకు గురి కాకూడదు. చదువుకు ప్రజారోగ్యానికి బలీయమైన సంబంధం ఉంది.

అందరికీ చదువు అందుబాటులోకి వస్తే హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ సోకడం, పిల్లల ఆయుర్దాయం, తల్లుల ఆరోగ్యం విషయంలో చెప్పుకో దగ్గ మార్పు వస్తుంది. అందరికీ విద్య పై ప్రపంచవ్యాప్త ప్రచారం (గ్లోబల్‌ క్యాంపేన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం పిల్లలందిరికీ పూర్తిస్థా యిలో ప్రాథమిక విద్య అందిచినట్లయితే ప్రతి సంవత్సరం 0.7 మిలియన్ల (7 లక్షలు) హెచ్‌ఐవి కేసులు నివారించవచ్చు. చదువుకు ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంది. ఆడపిల్లలకు చదువు చెప్పడం ఎంతో ప్రాధా న్యమున్న విషయం. బాలికలు బడికి వెళ్ళి చదువుకున్నట్ల యితే 20 శాతం అధికంగా వేతనాలందుతాయి. పిల్లల మరణాలు 10 శా తం తగ్గుతాయి. కొంతమేరకు లాంఛనంగా చదువుకున్న మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించే అవకాశం ఉంది. వారి పిల్ల లకు అంటువ్యాధులు రాకుండా టీకాలు వేయిస్తారు. వారిపిల్లలకు అందించవలసిన పోషకాహారం విషయంలో, పారిశుద్ధ్యంలో మరింత మెరుగ్గా వ్యవహరిస్తారు. ఫలితంగా పిల్లలు పెద్దలవుతారు. వారి ఆయుర్దాయం పెరుగుతుంది. చదువుకున్న మహిళల సంఖ్య పెరిగే కొద్దీ బడికి వెళ్ళే బాలికల సంఖ్య పెరుగుతుంది.

  • పిల్లల హక్కులు...
పిల్లలకు సం బంధించిన మానవ హక్కులే పిల్లల హక్కులు. పిల్లల కందించే ప్రత్యేక సంరక్షణ, పెంపకం, వారి సాంఘిక హక్కులు, తల్లిదండ్రు లతో కలిసి జీవిం చే హక్కు, ఆహా రం, సార్వజనీన ఉచిత ప్రభుత్వ చదువు, వైద్య సంరక్షణ పిల్లల పెరుగుదల వయసుకు సంబంధించిన సబబైన నేర చట్టాలు వంటి పిల్లల మౌలికావసరాలకు సంబంధించిన హక్కులు. పిల్లలు స్వతంత్రులై తమంతట తామే కార్యకలాపాల్లో పాల్గొనడం మొద లుకుని భౌతికంగా, మానసికంగా, భావో ద్రేకపరంగా అత్యాచారానికి గురికాకుండా ఉండేవిధంగా పలువిధాలుగా పిల్లల హక్కు లను వివరించారు. �అత్యాచారం� అన్న మాట మాత్రం వివాదాస్పదమైంది. మానవ హక్కుల సార్వజనీన ప్రకటనను పిల్లల హక్కులకు అంతర్జాతీయ చటబద్ధమైన ప్రమాణాలకు ప్రా తిపదికగా పరిగణిస్తున్నారు. హక్కులను ప్రభా వితం చేసే ఎన్నో సమకాలీన, చారిత్రక పత్రా లు, 1923 నాటి పిల్లల హక్కుల ప్రకటనను 1919 లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఆమోదించింది. దాన్నే 1946లో ఐక్యరాజ్యసమితి కూడా ఆ మోదించింది. తదనంతరం పిల్లల హక్కులపై తయారైన కన్వెన్షన్‌కు పునాదయ్యింది.

  • పిల్లల హక్కులపై ఒప్పందం...
1989లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ఒప్పందం (సిఆర్‌సి) అన్ని తరహాల మానవ హక్కులతో కూడుకున్న చట్టబద్ధమైన అంతర్జా తీయ ఒడంబడిక. ఈ ఒడంబడికలో పౌర, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులున్నాయి. ఈ ఒప్పందం, ఇంటర్నేషన ల్‌ క్రిమినల్‌ కోర్టు, యుగొస్లావియా ట్రిబ్యున ల్‌ ర్వాండా ట్రిబ్యునల్‌, స్పెషల్‌ కోర్టు ఫర్‌ సియారా లియోన్‌ ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల ప్రమాణాన్ని పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వం, ప్రభు త్వేతర సంస్థలు పిల్లల హక్కులకు ప్రాతిని ధ్యం వహిస్తూ వాటి అమలు తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నాయి. అనేక దేశాల్లో పిల్లల హ క్కుల కాపలాదారులు లేక పిల్లల కమీషనర్లు పిల్లల హక్కుల కోసం పాటుపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఆర్థికంగ ఎన్ని విధాలుగా దోపిడీకి గురవుతున్నారో, భౌతి కంగా హింసకు గురవుతున్నారో వర్ణించలేం. భారీ సంఖ్యలో పిల్లలు కడగండ్లపాలవుతు న్నారు. పిల్లలు అన్యాయానికి, పేదరికానికి లోనవుతున్నారు. మానవ జీవితంలో పిల్లల కంటే ఎక్కువగా బాధలకు గురైన వారు లేరని చరిత్ర వెల్లడిస్తోంది. బాలకార్మికులుగా లేక సెక్స్‌వర్కర్లుగా దోపిడీకి గురైనా, యువకులు గా ఉన్నపుడే సైనికదళాల్లో చేర్చుకున్నా, బల వంతంగా ఇళ్ళల్లో పనివాళ్ళుగా ఒంటరిజీవి తం గడుపుతున్నా, చదువుకు దూరమై పొలం పనులు చేస్తున్నా, తగినంత ఆహారానికి ఆరో గ్య సంరక్షణకు నోచుకోకపోయినా పెద్దలబారి నుండి పిల్లలకు రక్షణ కావాలి. పిల్లలపై అత్యా చారానికి ఒడిగడుతున్నది పెద్దలే అన్నది కాద నలేని సత్యం. పిల్లలకు భౌతికంగా కీడు కలి గించడం, వారిని అవమానపరిచి, సిగ్గు కలి గించి భయపెట్టే విధంగా చేసే ఏ చర్య అయి నా పిల్లలపై అత్యాచారంగా పరిగణించాలి.

  • బాలల హక్కులు - బాధ్యతలు...
బాలల హక్కులు - బాధ్యతలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవహక్కు లు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరి త్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం. నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమా నులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగు తోంది, ఇది ఘోరమైన నేరం.

జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవ హక్కుల దృక్పథం అనేక కోణాల్లో సమాజం లోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కు ల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. కన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహ క్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్య్రం, నిరు ద్యోగం, వివక్ష వంటి పరిస్ధితుల్ని మూలకార ణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్థిస్త్తున్నారు.

అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్‌ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్ల ల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నా లు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబ డిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమై నది. ఇది పిల్లల పౌర, రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లో ను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వజనీన ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభు త్వాలు కూడా పిల్లల హక్కు లు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరా జ్యసమితి సభ్యదేశాలన్నీ ఈ ఒడంబడికను ఆమోదించా యి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.

పిల్లలే ఏ కాలంలో అయినా భవిష్యత్తుకు పునాది వంటి వారు. నేటి బాలలే రేపటి పౌరులన్నది ఒక ఊహ కాదు. తరతరాలుగా ప్రపంచమంతా ఋజువవుతున్న యథార్ధం. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితేనే... దేశ భవిష్య త్తు పదిలంగా ఉంటుందని సమకాలీన సామా జిక స్థితిగతులు వెల్లడిస్తున్నాయి. ప్రపంచస్థా యిలో దేశస్థాయిలో అనేక దశాబ్దాలుగా పిల్ల ల కోసం రూపొందించిన పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు వాస్తవరూపం దాల్చితేనే... మన పిల్లల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. వారి హక్కులు పదిలంగా ఉంటాయనేది కాదన లేని సత్యం.‚ ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం...

  • ఆశించదగ్గ పరిణామం...
- ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్ళలోపు పిల్లల శిశుమరణాలు 1990లో 12.4 మిలియన్లు ఉండగా... 2009 నాటికి 8.1 మిలియన్లకు తగ్గింది.
- ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఆసియా దేశాల్లో (5 ఏళ్ళ లోపు పిల్లల్లో) శిశుమరణాలు కొంతవకు తగ్గుముఖం పట్టాయి.
- అయితే మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్‌-4ను ప్రోగ్రాం అంచనాలను అందుకోవాల్సివుంది. శిశుమరణాలని నివారించడంలో సహారా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు ఇంకా వెనకబడి ఉన్నాయి.
- 5 ఏళ్ళలోపు శిశుమరణాల విషయంలో సబ్‌-సహారా ఆఫ్రికా ముందువరుసలో ఉంది. ఇక్కడ ప్రతి 8 మంది పిల్లల్లో 1 మరణం సంభవిస్తోంది. ఇక 14 మందిలో 1 మరణంతో దక్షిణాసియా రెండవస్థానంలో ఉంది.

  • శిశుమరణాలు - భారత్‌ ర్యాంక్‌
ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు - 49
ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు రేటు, 1990 - 116
ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు రేటు, 2008 - 69
శిశుమరణాలు (సంవత్సరం లోపు), 1990 - 83
శిశుమరణాలు (సంవత్సరం లోపు), 2008 - 52
పుట్టగానే మరణం (నియోనేటల్‌ మోర్టాలిటీ రేటు)- 39
బరువు తక్కుగా పుడుతున్న శిశువుల విషయంలో- 28

  • భారత్‌ - భయంకరమైన నిజాలు
గడిచిన ఐదేళ్ళలో భారత్‌ మానవవనరులు, ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రశంసనీయమైన గణాంకాలు నమోదు చేసినప్పటికీ... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలల విషయంలో మాత్రం పూర్తిగా విఫలం చెందింది. క్రింద పొందుపరిచిన గణాంకాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
- ప్రతి 1000 జననాల్లో 63 శిశుమరణాలు సంభవిస్తున్నాయి.
- వ్యాధినిరోధక టీకాలు అందుబాటులో లేక ఇప్పటికీ దేశవ్యాప్తంగా పిల్లలు మరణిస్తున్నారు. తట్టు, ఆటలమ్మ, ధనుర్వాతం వంటివి పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి.
- మూడేళ్ళలోపు పిల్లల్లో 46% మంది వయస్సు తగ్గట్టు ఎదగడం లేదు.
- మూడేళ్ళలోపు పిల్లల్లో 74% ఎనీమియాతో బాధపడుతున్నారు.
- ఇప్పటికీ డయేరియా... దేశంలో శిశుమరణాలకు కారణం అవుతున్న రెండవ అతిపెద్ద వ్యాధిగా కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్ర తాగునీరు.
- ఇప్పటివరకు 2 లక్షలకు పైగా పిల్లల్లో హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 55 నుండి 60 వేల మందికి పుట్టుకతోనే తల్లి నుండి హెచ్‌.ఐ.వి సోకుతుంది.

  • Courtesy with surya Telugu Newspaper.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .