గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (October 15th) -గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
Every year Oct. 15th --ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది... 100 దేశాల్లో... 20 కోట్ల మంది... ఓ పని చేస్తారు! అదేంటో తెలుసా? చేతులు కడుక్కోవడం!
మీరు వెంటనే వెళ్లి సబ్బు తీసుకుని రెండు చేతులూ శుభ్రంగా కడుక్కోండి. తర్వాత 'ప్రపంచంలో కోట్లాది మందితో కలసి నేనొక గొప్ప పని చేశానోచ్' అని అమ్మతో చెప్పండి. అమ్మ ఆశ్చర్యపోతే అప్పుడు చెప్పండి. 'ఇవాళ గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే తెలుసా?' అని. అమ్మకి చెప్పినట్టు మీరు చేసింది నిజంగా గొప్ప పనే. ఎందుకో ఏమిటో తెలుసుకోవాలంటే చదవండి మరి!
ఓసారి మీ అరచేతుల కేసి చూసుకోండి. అవి శుభ్రంగానే కనిపించవచ్చు. కానీ వాటి మీద కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని ఊహించగలరా? నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి పోవు. సబ్బుతోకానీ, హ్యాండ్‌వాష్ ద్రావకంతో కానీ దాదాపు 20 సెకన్లు కడుక్కుంటేనే మీ చేతులు శుభ్రంగా ఉన్నట్టు. ప్రతి రోజూ భోజనం చేయడానికి ముందు, మలవిసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత ఇలా చేతుల్ని శుభ్రపరుచుకోవడం మనల్ని ఎన్నో అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తుంది.
చేతులు కడుక్కోకుండా ఉండడం వల్ల ఎన్ని రోగాలు దాడి చేసే అవకాశం ఉందో తెలుసా? రెండు వందలకు పైనే! ఆ రోగాల్ని కలిగించే సూక్ష్మజీవులు ఉండేది అరచేతుల్లోనే మరి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షల మంది చిన్నారులు డయేరియా, నిమోనియా లాంటి రోగాల వల్ల మరణిస్తున్నారు. వీటిని నివారించడానికే ఈ కార్యక్రమం. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో కేవలం 44 శాతం మంది మాత్రమే చేతుల శుభ్రత పాటిస్తున్నారని తేలింది.
ఈ రోజు దేశదేశాల్లో ఎన్ని కార్యక్రమాలో! ఆస్ట్రేలియాలో చేతుల శుభ్రతపై రాసిన పాటని పిల్లలందరూ ఆలపిస్తారు. తజికిస్తాన్‌లో పిల్లలు బొమ్మలు, పోస్టర్‌లతో ప్రచారం చేస్తారు. మడగాస్కర్‌లో సుమారు 35 లక్షల మంది బాలలు కలిసి ఒకేసారి సబ్బుతో చేతులు కడుక్కుంటారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. దక్షిణాఫ్రికాలో సుమారు 90 లక్షల మంది ఎసెమ్మెస్‌లను బట్వాడా చేస్తారు.
ప్రపంచబ్యాంకు, యునిసెఫ్ ఆధ్వర్యంలో 'గ్లోబల్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ ఫర్ హ్యాండ్‌వాషింగ్' సంస్థ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని 2008లో ప్రారంభించింది. అప్పుడు మన దేశం తరుఫున క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు వేలాది మంది పిల్లల మధ్య సబ్బుతో చేతులు కడుక్కుని ప్రచారం చేశారు.
=========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .