Wednesday, September 21, 2011

మూగ సినిమాల(మూకీ )చలనచిత్ర ప్రదర్శన దినము, Muky film exbition dayగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (07-July-1896) -మూగ సినిమాల(మూకీ )చలనచిత్ర ప్రదర్శన దినము- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


మన దేశంలో మూగ సినిమాల చలనచిత్ర ప్రదర్శన తొలిసారిగా 1896 జూలై 7న, బొంబాయిలో జరిగినట్లు సినిమా చరిత్ర చెబుతోంది. మొదట్లో విదేశాల నుంచి ఈ మూకీ చిత్రాలను తెచ్చి, ఇక్కడ ప్రదర్శించేవారు. 1910వ దశకంలో భారతదేశంలో మన దేశీయులే పూర్తిస్థాయి మూకీ కథా చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. ఆర్‌.జి. టోర్నీ, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి తొలితరం సినీ రూపకర్తలతో భారతదేశంలో సినిమా పరిశ్రమకు బీజం పడింది. మరి, ఆ తరువాత మూకీల నుంచి టాకీలకు ఎదగడం వెనుక పెద్ద కథే జరిగింది. ఆర్థిక మాంద్యం తెచ్చిన అనూహ్యమైన మార్పు తెరపై కదిలే బొమ్మల ప్రదర్శనగా మొదట్లో మూకీలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. భారతదేశంలోనూ అదే పరిస్థితి. అంతా బాగా జరుగుతోందని అనుకుంటున్న సమయంలో 1920ల చివరలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల లాగానే భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. చలనచిత్ర పరిశ్రమ మీద ఆ దెబ్బ గట్టిగా పడింది. ప్రజలకు కదిలే చిత్రాల మీద ఆసక్తి క్రమంగా క్షీణించింది. ప్రజల్లో మారుతున్న వైఖరిని గమనించకుండా గబగబా సొమ్ములు చేసుకోవాలన్న నిర్మాతల వైఖరి, చలనచిత్ర కళలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దర్శక - నిర్మాతలు మారకపోవడం వల్ల బాక్సాఫీస్‌ వసూళ్ళు క్రమంగా క్షీణించాయి. దాంతో, మనదేశంలో చాలా భాగం సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు బిచాణా ఎత్తేశాయి.

శబ్ద శకానికి శ్రీకారం

అయితే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్లే 'శబ్ద సహిత చిత్రాలు' (సౌండ్‌ ఫిల్మ్‌) ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. అప్పటి దాకా శబ్దం లేని మూగ చిత్రా (సైలెంట్‌ ఫిల్మ్‌)లే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ 'సౌండ్‌ ఫిల్మ్‌'లు ఒక కొత్త వింతగా మారాయి. అలా 'సౌండ్‌ ఫిల్మ్‌'ల ఆవిర్భావంతో అమెరికాలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాక్సాఫీస్‌ వసూళ్ళకు మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. 'డాన్‌ జువాన్‌' అనే సైలెంట్‌ ఫిల్మ్‌లోని దృశ్యాలకు తగ్గట్లుగా సంగీతాన్నీ, సౌండ్‌ ఎఫెక్ట్‌లనూ జత చేసి, వార్నర్‌ బ్రదర్స్‌ వాణిజ్యపరంగా సినిమాల్లో శబ్ద శకానికి శ్రీకారం చుట్టారు. 1926 ఆగస్టు 6న ఇది జరిగింది.

ఆ తరువాత ఓ సంవత్సరానికి 'ది జాజ్‌ సింగర్‌' చిత్రంలో తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి, వార్నర్‌ బ్రదర్సే ఓ సంచలనాత్మక విజయం సాధించారు. ఆ చిత్రంలో ''ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఆగండి! ఇప్పటి వరకు మీరింకా ఏమీ వినలేదు...'' అంటూ ఓ సహజమైన స్వరం వినిపించినప్పుడు జనం ముగ్ధులైపోయారు. 'ది జాజ్‌ సింగర్‌' విజయం తరువాత 1928లో వార్నర్‌ బ్రదర్స్‌ తొలిసారిగా 'అన్ని పాత్రలూ మాట్లాడే' చలనచిత్రం 'ది లైట్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌'ను విడుదల చేశారు. నిజానికి, తెర మీద కదిలే బొమ్మలకూ, రికార్డు చేసిన శబ్దానికీ జత కట్టాలన్న ఆలోచన చాలా పాత కాలం నుంచీ ఉన్నదే! అయితే, అవి చాలాకాలం ప్రయోగదశలోనే మిగిలాయి. తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను డాక్టర్‌ లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. ఆ ప్రక్రియను తొలిసారిగా భారతదేశంలో 1927 మే నెలలో బొంబాయిలోని రాయల్‌ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు.

భారతదేశంలో తొలి శబ్దచిత్ర ప్రయత్నాలు

వీటన్నిటి తరువాత భారతదేశంలో సైతం బొమ్మలకు తగ్గట్లు శబ్దాన్ని జోడించి, చలనచిత్రాన్ని రూపొందించేందుకు మదన్‌ థియేటర్స్‌ సంస్థ అందరి కన్నా ముందుగా ప్రయత్నాలు చేసింది. 1929లో మదన్‌ థియేటర్స్‌ సంస్థ భారతదేశంలోనే తొలిసారిగా కలకత్తాలోని ఎల్ఫిన్‌స్టన్‌ పిక్చర్‌ ప్యాలెస్‌లో యూనివర్సల్‌ వారి 'మెలొడీ ఆఫ్‌ లవ్‌' అనే టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. నిజానికి, భారతదేశ తూర్పు ప్రాంతంలో అలా శాశ్వత ప్రాతిపదికన శబ్ద యంత్రాలను సమకూర్చుకున్న మొట్టమొదటి హాలు కలకత్తాలోని ఆ ఎల్ఫిన్‌స్టనే! విదేశాల నుంచి టాకీ చిత్రాలు వస్తుండేసరికి 1930 చివరి నాటికల్లా భారతదేశంలోని మొత్తం 370 థియేటర్లలో 30కి పైగా థియేటర్లు (అంటే దాదాపు 10 శాతం హాళ్ళన్న మాట!) శబ్ద సహిత చిత్రాలను ప్రదర్శించేందుకు వీలుగా తగిన సామగ్రిని సమకూర్చుకున్నాయి.

తరచూ విదేశాల్లో పర్యటించే మదన్‌ థియేటర్స్‌ సంస్థ యజమాని జె.జె. మదన్‌ న్యూయార్క్‌లో 'ది జాజ్‌ సింగర్‌'ను చూశారు. దానికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను గమనించారు. ఇక, సినిమా భవిష్యత్తు అంతా శబ్దంతో కూడిన చిత్రాల్లోనే ఉందని గ్రహించారు. సరికొత్త పరిణామాలను లోతుగా పరిశీలించడం కోసం హాలీవుడ్‌ను

సందర్శించి, భారత్‌లోని

తన స్టూడియోకు శబ్ద సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆర్డరు పెట్టారు. అదే సమయంలో కలకత్తా శివార్లలోని టాలీగంజ్‌ ప్రాంతంలో ఓ సౌండ్‌-ప్రూఫ్‌ స్టూడియో నిర్మాణం మొదలైంది. ఆ టాలీగంజ్‌ ప్రాంతం పేరిటే అక్కడి చిత్ర పరిశ్రమ ఆ తరువాత 'టాలీవుడ్‌'గా ప్రసిద్ధమైంది. (అలా బెంగాలీ పరిశ్రమకు ప్రసిద్ధమైన పేరును అజ్ఞానంతో అరువు తెచ్చుకొని, దానికి సంబంధమే లేని తెలుగు చిత్ర పరిశ్రమను 'టాలీవుడ్‌' అని తప్పుడు పేరుతో పిలవడం గడచిన పదేళ్ళ పైచిలుకుగా తప్పుగా ప్రచారంలోకి వచ్చింది!)

పోటాపోటీలో ముందు వచ్చిన 'ఆలమ్‌ ఆరా'

మరి, కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ ఇంత కృషి చేస్తుంటే, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలో ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ వారి 'ఆలమ్‌ ఆరా' తొలి భారతీయ టాకీ ఎలా అయింది? దీని వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. నిజానికి, పూర్తిస్థాయి భారతీయ టాకీ చిత్రాల రూపకల్పన కోసం అప్పట్లో కనీసం మూడు సిండికేట్‌ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నించాయి. పూర్తి స్థాయిలో మాట్లాడే చలనచిత్రాన్ని రూపొందించాలన్న పోటాపోటీలో ఎట్టకేలకు అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలోని 'ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ'యే ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. ఎనభై ఏళ్ళ క్రితం 1931 మార్చి 14న తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ 'ఆలమ్‌ ఆరా'ను బొంబాయిలోని 'మెజెస్టిక్‌ సినిమా' హాలులో విడుదల చేసింది.

నాటకం నుంచి సినిమాగా 'ఆలమ్‌ ఆరా'

ఈ చిత్ర కథ కూడా రంగస్థలం మీద నుంచి వెండితెరకు నడిచి వచ్చినదే! పార్శీ ఇంపీరియల్‌ థియేటరికల్‌ కంపెనీకు చెందిన నాటక రచయిత జోసెఫ్‌ డేవిడ్‌ రాసిన 'ఆలమ్‌ ఆరా' నాటకం అప్పట్లో రంగస్థలంపై విజయవంతమైంది. అందులో కథ ఏమిటంటే - కుమార్‌పూర్‌ రాజు గారికి ఇద్దరు భార్యలు. ఆ రాణులిద్దరికీ పిల్లలు లేరు. ఓ ఫకీరు చెప్పిన జోస్యం ప్రకారం వారిద్దరిలో సుగుణశీలి అయిన రాణి నవ్‌బహార్‌కు ఓ కొడుకు పుడతాడు. దాంతో, దుష్ట రాణి దిల్‌బహార్‌కు విపరీతమైన అసూయ కలుగుతుంది. మరోపక్క, సైన్యాధ్యక్షుడైన అదిల్‌ మీద దిల్‌బహార్‌ మనసు పడుతుంది. కానీ, అతనేమో ఆమె కోరికను తోసిపుచ్చుతాడు. ప్రతీకారంతో ఆమె అతణ్ణి ఖైదు చేయిస్తుంది. అదిల్‌ భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ ఆడపిల్లే - ఆలమ్‌ ఆరా (నటి జుబేదా). కోయగూడెంలో ఆ అమ్మాయి పెరుగుతుంది. ఖైదులో ఉన్న తండ్రిని చూడడం కోసం ఒకసారి ఆ అమ్మాయి రాజప్రాసాదానికి వస్తుంది. మెడలోని హారం వల్ల ఆమె ఎవరన్నదీ తెలుస్తుంది. అక్కడ ఆమె, యువరాజు (నటుడు మాస్టర్‌ విఠల్‌)ను కలుస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. చివరకొచ్చేసరికి - అదిల్‌ ఖైదు నుంచి విడుదలవుతాడు. దుష్టరాణి దిల్‌బహార్‌కు శిక్ష పడుతుంది. యువరాజు, ఆలమ్‌ ఆరాల పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

సంచలనాత్మక ఆదరణ

అనేకానేక పాటలు, నృత్యాలను గుదిగుచ్చి అందించడానికి ఈ సాదాసీదా ఇతివృత్తం తోడ్పడింది. అయితేనేం, కథ ఏమిటని కాక, తెర మీద కదిలే బొమ్మలను చూడడమే కాక మాటలూ వినవచ్చని జనం వేలంవెర్రిగా థియేటర్లకు తరలివచ్చారు. 'ఆలమ్‌ ఆరా' విడుదల రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని మెజెస్టిక్‌ సినిమా దగ్గరకు గుంపులు గుంపులుగా చేరడం మొదలైంది. ''ఎంతో కష్టం మీద గానీ మేము కూడా థియేటర్‌లోకి ప్రవేశించలేకపోయాం'' అని అర్దేషిర్‌ ఇరానీ భాగస్వామి అబ్దులాలీ యూసూఫాలీ తెలిపారు. ''అప్పట్లో 'వరుస'లో నిల్చొని, టికెట్లు తీసుకొనే పద్ధతి కూడా ప్రేక్షకులకు తెలియదు. దాంతో, జనం టికెట్‌ బుకింగ్‌ ఆఫీసు మీదకు గుంపుగా వచ్చి పడ్డారు. తమకు అర్ధమైన భాషలో మాట్లాడే సినిమాను చూడడానికి, ఎలాగోలా టికెట్‌ సంపాదించాలని తాపత్రయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చివరకు జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది... వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి. ఎక్కువ రేటుకు బ్లాకులో టికెట్లు అమ్మేవాళ్ళు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు'' అని ఆనాటి అనుభవాలను ఆయన గతంలో వెల్లడించారు.

సినిమా కష్టాలు

'ఆలమ్‌ ఆరా' తీయడానికి పడ్డ కష్టాలను ఆయన వివరిస్తూ, ''అప్పట్లో సౌండ్‌-ప్రూఫ్‌ స్టేజీలు లేవు. దాంతో మేము స్టూడియో లోపల, అదీ రాత్రి వేళ చిత్రీకరణ జరపడానికి మొగ్గు చూపేవాళ్ళం. మా స్టూడియో పక్కనే రైలు మార్గం ఉండేది. ఫలితంగా, ఆ శబ్దం రికార్డు కాకుండా ఉండడం కోసం, రైళ్ళు రాకపోకలు లేని సమయంలోనే షూటింగ్‌ జరపాల్సి వచ్చేది. పైగా, ఒకే సిస్టమ్‌తో కూడిన టానర్‌ రికార్డింగ్‌ సామగ్రితోనే శబ్దగ్రహణం చేయాల్సి వచ్చింది... అలాగే, నటీనటులు నటిస్తూ పలికే మాటలు, పాటలు రికార్డింగ్‌ చేయడానికి బూమ్‌లు (దూరంగా ఉంచి రికార్డు చేసే మైకులు) కూడా లేవు. కెమేరా కన్నులో పడకుండా మైక్రోఫోన్లను ఎక్కడెక్కడో రహస్యంగా ఉంచి, మాట, పాట రికార్డు చేయాల్సి వచ్చింది'' అని ఇరానీ చెప్పారు. కఠినమైన రికార్డింగ్‌ పరిస్థితుల కారణంగా 'ఆలమ్‌ ఆరా' రూపకల్పనకు నెలలకొద్దీ సమయం పట్టింది. పైగా, ప్రత్యర్థి సినిమా సంస్థల నుంచి పోటీని నివారించడం కోసం అంతా గుట్టుచప్పుడు కాకుండా చేయాల్సి వచ్చింది.
భారతీయ తొలి టాకీ 'ఆలమ్‌ ఆరా'లో సాంకేతిక, కళాత్మక విలువలు స్వల్పమే! అయినప్పటికీ, తొలి ప్రయత్నంగా అందరూ దాన్ని ఆదరించారు. 'ఆలమ్‌ ఆరా' అఖండ విజయంతో 'పాత్రలన్నీ మాట్లాడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేసే' చిత్రాలు చకచకా తయారయ్యాయి. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. 'ఆలమ్‌ ఆరా' విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ 'జమారు సష్టి'ని మదన్‌ థియేటర్స్‌ విడుదల చేసింది. ఆ వెంటనే 'షిరీన్‌ ఫర్హాద్‌' అనే మరో భారతీయ టాకీని రూపొందించింది. 'షిరీన్‌ ఫర్హాద్‌' చిత్రాన్ని 22 సార్లు చూడడం కోసం లాహోర్‌లో టాంగా తోలే ఓ పంజాబీ ఏకంగా తన గుర్రాన్నే కుదవపెట్టాడట! ఆ ఊపులో ఒక్క 1931లోనే 8 టాకీ చిత్రాలనూ, 1932లో 16 టాకీలనూ మదన్‌ థియేటర్స్‌ రూపొందించింది.

భారతీయ టాకీలు తెచ్చిన మార్పులు

టాకీల ప్రవేశంతో సౌండ్‌ ప్రక్రియకు మారే స్థోమత లేక చాలా స్టూడియోలు మూతపడ్డాయి. అలాగే, అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్‌ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక, తెర మరుగయ్యారు. పాటలు పాడుకోవడం రాని వారు కూడా నటనకు దూరం కావాల్సి వచ్చింది. శబ్దగ్రహణంలోని ఇబ్బందుల రీత్యా నటీనటులంతా మైకును దృష్టిలో పెట్టుకొని, దాని మీద ధ్యాసతో నటించాల్సి వచ్చేది. పాటలన్నీ ఒకే షాట్‌లో చిత్రీకరించేవారు. ఎవరికీ నైపుణ్యం లేదు గనక, ప్రయోగాలు చేస్తూ చిత్రీకరణ జరపడంతో బోలెడంత ముడి ఫిల్ము వృథా అయ్యేది. అయితేనేం, కొత్త ఒక వింతగా జనం విపరీతంగా వచ్చి, ఈ చిత్రాలు చూసేవారు. ఈ బాక్సాఫీస్‌ వసూళ్ళతో చాలా సినిమా హాళ్ళు, సంస్థలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా మూతబడ్డ హాళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. దాదాపు 16 ప్రధాన భాషలు, కొన్ని వందల మాండలికాలకు నెలవైన భారతదేశంలో వివిధ భాషల్లో టాకీ చిత్రాలు తయారవడం మొదలైంది. మొదట్లో అన్ని ప్రాంతాల వారికీ అర్ధమయ్యేలా, హిందీ, ఉర్దూ కలగలిసిన హిందుస్థానీలో తొలి భారతీయ శబ్ద చిత్రాలు తయారయ్యేవి. ఆ తరువాత బెంగాలీలో 'జమారు సష్టి' (1931), తమిళంలో 'కాళిదాస్‌' (1931- ఇందులో తెలుగు డైలాగులు, త్యాగరాజ కీర్తనలు ఉండడంతో, దీన్ని తొలి తమిళ, తెలుగు టాకీ అనేవారూ ఉన్నారు), తెలుగులో 'భక్త ప్రహ్లాద', మరాఠీలో 'అయోధ్యా చే రాజా' (1932), గుజరాతీలో 'నరసింహ మెహతా' (1932), కన్నడంలో 'సతీ సులోచన' (1934) చిత్రాలు ఆ యా భాషల్లో తొలి టాకీలుగా విడుదలయ్యాయి. 1931లో హిందీ, బెంగాలీ, తమిళ, తెలుగు టాకీలు తయారు కావడంతో, ఈ ఏడాది ఈ చిత్ర పరిశ్రమలన్నీ ఎనభై వసంతాలు జరుపుకొంటున్నాయి.

- రెంటాల జూనియర్‌(prajasakti Newspaper sunday magazine)

  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .