Wednesday, September 21, 2011

తొలి భారతీయ టాకీ విడుదల దినోత్సవం ,First Indian Talky film release day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (1931 మార్చి 14) -తొలి భారతీయ టాకీ విడుదల దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


(1931 మార్చి 14)
అనంత కాలగతిలో ఎనభై ఏళ్ళనేది ఓ చిన్న పరిమాణమే కావచ్చు. కానీ, కేవలం కొన్ని దశాబ్దాల క్రితమే కొత్తగా మొదలైనా, తరువాత కొన్నేళ్ళకే విస్తారంగా పెరిగి, సమాజంపై గణనీయమైన ప్రభావం చూపిన విజ్ఞాన ఆవిష్కరణకు మాత్రం ఎనిమిది దశాబ్దాలు పెద్ద కాల వ్యవధే! అందుకే, మన దేశంలో, మన భారతీయ భాషల్లో వెండితెర మీద బొమ్మలు మాట్లాడడం మొదలుపెట్టిన 1931 నుంచి ఇప్పటికి 80 ఏళ్ళు పూర్తి కావడం ఓ కీలకమైన మజిలీ. తొలి భారతీయ టాకీ 'ఆలమ్‌ ఆరా' (విడుదల 1931 మార్చి 14)కీ, తొలి బెంగాలీ టాకీ 'జమారు సష్ఠి' (1931 ఏప్రిల్‌ 11)కీ, తొలి దక్షిణ భారతీయ భాషా (తమిళ) టాకీ 'కాళిదాస్‌' (1931 అక్టోబర్‌ 31)కీ, తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' (చిత్ర నిర్మాణం - 1931)కీ 80 వసంతాలు జరుపుకొంటున్న వేళ అప్పటి చిత్ర నిర్మాణం, ప్రచారం, ప్రదర్శన పద్ధతులు, జనంలో కనబడిన ఉత్సాహ ఉద్వేగాల కథలు, కబుర్లు మీ కోసం...

మాట్లాడడం మాట దేవుడెరుగు, అసలు తెరపై బొమ్మలు కదలడమే ఓ వింత! ప్రపంచ దేశాలన్నిటి లాగానే మన దేశంలోనూ తొలి రోజుల్లో సినిమా ఓ పెద్ద వింత. అప్పటి దాకా కథా కాలక్షేపాలు, నాటకాల లాంటి వాటికే పరిమితమైన జన వినోదం, విరామ జీవితం కాస్తా తెర మీద బొమ్మల కదలికతో ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకూ జానపద కళారూపాలు, రంగస్థల నాటకాలు, నటీనటుల పాటలు, పద్యాల గ్రామ్‌ఫోన్‌ రికార్డులే జనానికి వినోద సాధనం. ఆ సమయంలో సినిమా ఆవిర్భావంతో, ఈ తెర మీద కదిలే బొమ్మల ప్రదర్శన కోసం సంచార సినిమా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సినిమా హాళ్ళ నిర్మాణం సాగింది.

ఆనాటి సినీ ప్రచార పద్ధతులు

నిజానికి, తొలి రోజుల్లో ప్రత్యేకంగా సినిమా హాళ్ళు నిర్మించడమంటూ లేదు. నాటకశాలలే సినిమా ప్రదర్శనలకు చోటిస్తూ, క్రమంగా శాశ్వత సినిమాహాళ్ళుగా మారాయి. అలా ఆంధ్రదేశంలో మొట్టమొదటి సినిమా థియేటర్‌ - బెజవాడ (ఇప్పటి విజయవాడ)లోని 'శ్రీమారుతీ' హాలు (ఇప్పుడిది వాణిజ్య భవన సముదాయంగా మారింది). 1921లో పోతిన శ్రీనివాసరావు దీన్ని నిర్మించారు. 1921 అక్టోబర్‌ 23న ఆ హాలు ఆరంభమైంది. ఆ మూకీ చిత్రాల నాటికి రవాణా సౌకర్యాలు ఇంతగా లేవు. అప్పటికి సినిమా పంపిణీ వ్యవస్థ కూడా ఇప్పటిలా ఉండేది కాదు. సినిమాలకు ఫలానా ప్రాంతానికి ఫలానావాళ్ళు హక్కుదారులు, ఫలానా వాళ్ళు పంపిణీదారులనే పద్ధతి లేదు. థియేటర్‌ యజమానే అన్నీ చూసుకొనేవాడు. సినిమాలను ప్రదర్శించాలంటే కలకత్తా, బొంబాయి లాంటి నగరాలకు వెళ్ళి, వాటిని కొనుక్కుని రావాల్సిందే! కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఆ భారమంతా హాలు యజమానిదే! అప్పటికి మన దేశంలో తయారయ్యే చిత్రాలు కూడా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువే. విదేశీ ఆంగ్ల మూకీలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అందుకే, అప్పట్లో 'శ్రీమారుతీ'తో సహా అన్ని హాళ్ళలో అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మూకీ సినిమాలు, లేదంటే అదే హాలులో నాటకాలు ప్రదర్శించేవారు. మాటలుండని ఈ మూగ సినిమాల గురించి హాల్లోని ప్రేక్షకులకు వివరంగా చెప్పడానికి మంచి వ్యాఖ్యాతను పెట్టేవాళ్ళు. వ్యాఖ్యాతతో పాటు హాలు లోపల మధ్యలో ఓ వేదిక లాంటిది ఏర్పాటు చేసుకొని, హార్మోనియమ్‌, తబలా పెట్టుకొని, తెర మీద వచ్చే దృశ్యాల్లోని భావోద్వేగాలకు తగ్గట్లుగా వాయించేవారు. సినిమాల పబ్లిసిటీ కూడా నాటకాల ఫక్కీలోనే ఉండేది. సినిమా గురించి, అందులోని విశేషాల గురించి రాసి, కరపత్రాలు అచ్చు వేయించి, నౌబత్‌ (ఢంకా) పెట్టుకొని, ఆ కరపత్రాలు పంచుకొంటూ ప్రచారం చేసేవారు. థియేటర్లలో మేళతాళాలు పెట్టేవారు. కొత్త చిత్రం విడుదలవుతున్న రోజున మనుషులతో చిత్రవిచిత్రమైన రకరకాల వేషాలు వేయించి, బళ్ళ మీద నిలుచోబెట్టి, బ్యాండు మేళాలతో ఊరేగించేవారు.

సినిమాకొస్తే సోడా.. కిళ్ళీ!

పోతిన శ్రీనివాసరావే స్వయంగా ఆనాటి సంగతులు ఒకసారి చెబుతూ, 'అప్పట్లో పోస్టర్లు రాలేదు. పబ్లిసిటీ కోసం కరపత్రాలు పంచిపెట్టేవాళ్ళం. 'సినిమాకు వచ్చేవాళ్ళకు ఇంటర్వెల్‌లో సోడా, కిళ్ళీ ఉచితంగా ఇస్తాం' అని ప్రకటించేవాళ్ళం. దానివల్ల కొన్ని టికెట్లు అమ్ముడయ్యేవి' అని వివరించారు. అలాగే, జనాన్ని హాలుకు రప్పించడం కోసం మూకీ చిత్రాల్లో నటించిన బొంబాయి తారలను పిలిపించి, సినిమా ఆడుతూ ఉండగా ఒక రీలు తరువాత మరొక రీలు మార్చుకొనేటప్పుడు మధ్యలో ఉండే వ్యవధిలో వాళ్ళతో డ్యాన్సులు చేయించేవారు. ఇలాంటి హంగులన్నీ ఉండి, కథ వివరించే వ్యాఖ్యాత చేసే వ్యాఖ్యానం సరదాగా ఉంటే జనం బాగా వచ్చేవారు. జి.వి.ఎస్‌. శాస్త్రి, తరువాతి రోజుల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న కస్తూరి శివరావు చక్కటి చమత్కారాలతో వ్యాఖ్యానం చెబుతూ, ప్రేక్షకుల్ని నవ్వించేవారు. ''తదనంతర కాలంలో ప్రముఖ నటుడిగా వెలిగిన ముదిగొండ లింగమూర్తి సైతం అప్పట్లో గుడివాడలోని 'మారుతీ మరీదు' (ఇప్పటి 'గౌరీశంకర్‌') హాలులో మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా, కథా కథకుడిగా పనిచేయడం కళ్ళారా చూశాను'' అని ఈ సెప్టెంబర్‌ 19తో 93వ ఏట అడుగు పెడుతున్న తొలి తరం సినీ పత్రికా రచయిత మద్దాలి సత్యనారాయణ శర్మ (ఎమ్మెస్‌ శర్మ) గుర్తు చేసుకున్నారు. ఇలా వ్యాఖ్యానం చెబుతూ, కథను వివరించే పద్ధతి మూగ చిత్రాలకే కాదు, తెర మీద బొమ్మలు మాట్లాడడం మొదలైన తరువాత ఆంధ్రదేశంలో విడుదలైన హిందీ, తమిళ తదితర పరభాషా టాకీలకూ కొనసాగింది.

అడుగడుక్కీ విశ్రాంతి అమావాస్య నాడు కొత్త సినిమా

మూకీ చిత్రాలు ఆడే రోజుల్లో ఆంధ్రదేశంలో చాలా చోట్ల కరెంటే లేదు. దాంతో, ఆయిల్‌ ఇంజన్ల ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసేవారు. ఆ ఇంజన్‌ నడపడానికి డ్రైవర్‌ కావాలి. అలాగే, అప్పట్లో ప్రొజెక్టర్‌లోని రీలును చేతితో తిప్పేవారు. అలా ప్రొజెక్టర్‌ను తిప్పడానికి ఆపరేటర్‌ కావాలి. ఇక, హాలులోని ప్రేక్షకులకు కథ చెప్పడానికి వ్యాఖ్యాత సరేసరి! ఈ ముగ్గురూ ఉంటేనే, సినిమా హాలు, అందులో చిత్ర ప్రదర్శన నడిచేది!! ప్రొజెక్టర్ల గురించి మరిన్ని వివరాలకు వస్తే, అప్పట్లో హాళ్ళలో ఇప్పటిలా రెండేసి ప్రొజెక్టర్లు ఉండేవి కావు. ఒకటే ప్రొజెక్టర్‌. స్పూల్‌లోని రీలు అయిపోగానే ఆపి, లైట్లు వేసి, రీలు మార్చేవారు. పైగా, రీళ్ళుండే గుండ్రటి స్పూల్స్‌ కూడా చిన్నవే. దాంతో దాదాపు ప్రతి పావుగంటకు ఒకసారి రీలు మారుస్తున్నప్పుడల్లా ఓ ఇంటర్వెల్లే! ఆ తరువాత కొన్నాళ్ళకు బవర్‌ ప్రొజెక్టర్‌ వచ్చేసరికి, రీళ్ళుండే స్పూల్స్‌ పెద్దవయ్యాయి. అప్పటి నుంచి అయిదారు రీళ్ళు కలిపి ప్రదర్శించేవారు. అంటే ఇంటర్వెల్స్‌ సంఖ్య కొంత తగ్గింది. ఆ తరువాతి రోజుల్లో ప్రతి హాలులో చిత్ర ప్రదర్శనకు రెండు ప్రొజెక్టర్లు వచ్చాయి. అప్పటి నుంచి సినిమా మధ్యలో ఒకే విశ్రాంతి సమయం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక, చలనచిత్రాలు వచ్చిన గత శతాబ్దపు తొలి దశకాల్లో ఇప్పటిలా ఆదివారం సెలవు ఉండేది కాదట! అమావాస్యకు మాత్రమే సెలవు. ఆ రోజున వ్యాపారస్థులందరూ తమ దుకాణాలు మూసివేసేవారు. ఆ సెలవు రోజున సినిమాకు జనం బాగా వచ్చేవారు. అందువల్ల అమావాస్య రోజున కొత్త చిత్రాలు విడుదలయ్యేవట! ఆ తరువాత క్రమంగా సెలవు ఆదివారానికి మారింది. దాంతో, సాధారణంగా సినిమాల విడుదలలన్నీ శనివారం నాడు జరిగేవి. ఆదివారం సెలవు కావడంతో, శనివారం కొత్త సినిమా వేస్తే, మొదటి ఆట మొదలయ్యే సాయంత్రం 6.30 గంటల సమయానికల్లా పనులు ముగించుకొని, జనం బాగా వస్తారని ఓ అంచనా. (శుక్రవారం నాడు కొత్త సినిమా విడుదలవడమనేది ఆ తరువాత రోజుల్లో వచ్చిన సంస్కృతి). అప్పట్లో ఇప్పటి లాగా రోజూ మూడేసి, నాలుగేసి ఆటలు ఉండేవి కావు. రోజూ రెండు ఆటలే! మొదటి ఆట (ఫస్ట్‌ షో) సాయంత్రం 6 - 6.30 గంటలకు! రెండో ఆట (సెకండ్‌ షో) రాత్రి 9 - 9.30 గంటలకు! అంతే! మధ్యాహ్నం ఆటలు (మ్యాట్నీలు) కానీ, ఉదయం ఆటలు (మార్నింగ్‌ షోలు) కానీ మొదట్లో లేవు. ఆ తరువాత క్రమంగా ఆదివారాల్లో, పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేకంగా మ్యాట్నీలు, ఉదయం ఆటలు వేసేవారు. టాకీలు వచ్చిన కొన్నాళ్ళ తరువాత రోజూ మ్యాట్నీ షోల ప్రదర్శన స్థిరపడింది. మూకీల నాళ్ళ మొదలు టాకీలు వచ్చాక కూడా చాలా కాలం సినిమా హాళ్ళలో మూడే తరగతులు - నేల, బెంచీ, కుర్చీ! ''కనీస టికెట్‌ అర్ధణా! (అంటే దాదాపు మూడు పైసలనుకోవచ్చు). ఆ టికెట్‌ కొంటే చాలు, అచ్చంగా నేల మీద, ఇసుకలో కూర్చొని సినిమా చూసేయచ్చు'' అని ఎమ్మెస్‌ శర్మ నవ్వేశారు. నగరాల్లో అయితే, మూకీల రోజుల్లో నేల టికెట్‌ - అణా, బెంచీ - రెండు అణాలు, కుర్చీ - నాలుగణాలు (అంటే పావలా)! టాకీలు వచ్చేటప్పటికి టికెట్‌ రేట్లు పెరిగాయి. బేడా, పావలా, అర్ధరూపాయి అయ్యాయని అప్పటి సంగతులు తెలిసినవారు చెబుతారు. ఆ రోజుల్లో టికెట్ల కోసం క్యూలో నిలబడే పద్ధతులు కూడా లేవు, తెలియవు. టికెట్లిస్తున్న కౌంటర్‌ దగ్గర గుమిగూడడం, బలం ఉన్న వాడిదే రాజ్యంగా టికెట్లు సంపాదించుకోవడమే! ''ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధం నాటికి కానీ, ఓ నిర్దిష్టమైన క్యూ పద్ధతి రాలేదు'' అని ఎమ్మెస్‌ శర్మ చెప్పుకొచ్చారు.

మూకీ చిత్రాల ముచ్చట్లు

'ఆంధ్రపత్రిక'లో దీర్ఘకాలం పనిచేసిన వయోధిక జర్నలిస్టు ఎమ్మెస్‌ శర్మకు తన చిన్ననాటి సంగతులూ, సినిమా ఇంకా మాటలు నేర్వని ఆ రోజుల్లో తాను చూసిన మూకీ చిత్రాలూ బాగా జ్ఞాపకమే! ''అప్పట్లో మా గుడివాడలో రెండే సినిమా హాళ్ళుండేవి. ఒకటి - 'మారుతీ మరీదు', రెండోది - శ్రీనివాస సినిమా హాలు. మొదటిది మా ఇంటికి దగ్గరలో, రెండోది కొంచెం దూరంలో ఉండేది. కృష్ణాజిల్లా బంటుమిల్లి దగ్గర నీలిపూడి గ్రామానికి కరణీకం చేసే మా మేనమామ ఎప్పుడొచ్చినా, సినిమాలకు తీసుకెళ్ళేవాడు. 'అక్కయ్యా! మొదట ఆ హాలుకు వెళ్ళి వచ్చి, రెండో ఆటకు ఇక్కడకు వెళతాం' అని మా అమ్మతో చెప్పేవాడు. 'రెండు సినిమాలకూ ఇవాళే ఎందుకు? రేపు వెళ్ళొచ్చుగా' అని మా అమ్మ అంటే, 'లేదులే! పొద్దున్నే ఊరెళ్ళిపోవాలి' అనేవాడు. అప్పట్లో జనంలో సినిమాలంటే అంత పిచ్చి ఉండేది. అలా ఆయనతో అక్కడ బోలెడన్ని మూకీ సినిమాలు చూశా'' అని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని కలవపాముల గ్రామంలో జన్మించిన ఎమ్మెస్‌ శర్మ చెప్పుకొచ్చారు. అప్పటికి సినిమాలకు ఇంకా మాటలు, పాటలు రాలేదు. మాస్టర్‌ విఠల్‌, గణపతి, ఈశ్వర్‌, ఈనాందార్‌, దీక్షిత్‌, మాధురి, సులోచన, గోహార్‌, రామ్‌ప్యారీ వగైరా నటించిన ఆ 'మూగ' సినిమాలు, వారి పేర్లు, కొన్ని సినిమాల పేర్లు కూడా ఇంకా శర్మ మనస్సులో నిలిచి ఉన్నాయి. మూకీల్లో ప్రముఖ తారలైన విఠల్‌, గణపతి చేసే కత్తి యుద్ధాలు, ముష్టి యుద్ధాలు, నటుడు ఈనాందార్‌ కర్రసాములు, రామాయణంలోని వివిధ ఘట్టాలతో వచ్చిన సినిమాలు, టార్జాన్‌ చిత్రాలు కూడా ఆయనకు జ్ఞాపకమే! ''ఆ సంవత్సరం అలా ఆ మామయ్యతో ఓ యాభై, అరవై సినిమాలు చూసి ఉంటాను. పృథ్వీరాజ్‌, ఎర్మిలైన్‌ నటించిన 'పాసింగ్‌ షో' చిత్రం వచ్చిన తరువాత, ఆ పేరుతోనే సిగరెట్‌ పెట్టెలు రావడం నాకు బాగా జ్ఞాపకం'' అని శర్మ చెప్పారు.

సామాన్య జనంలో సినిమా మోజు

అప్పట్లో జనానికి సినిమా మీద ఎంత క్రేజంటే, ''గుడివాడ లాంటి ప్రాంతంలో పిల్లలు మూకీ చిత్రాల నటుడు విఠల్‌ క్రాఫ్‌ అంటూ జుట్టు వెనక్కి దువ్వుకొనేవారు. మరో మూకీ నటుడైన గణపతి క్రాఫ్‌ అంటూ అతణ్ణి అనుకరిస్తూ జుట్టు విరబోసుకొనేవారు. పిల్లలు ఒకరితో ఒకరు 'నువ్వు విఠల్‌వి, నువ్వు గణపతివి' అని పిలుచుకుంటూ, సరదాగా ఫైటింగులు చేసుకొనేవారు. ఆ రోజుల్లో ఈనామ్‌దార్‌ అనే మూకీ నటుడు కర్రసాముకు ప్రసిద్ధి. పిల్లలం అతణ్ణి అనుకరిస్తూ, ఆడుకొనేవాళ్ళం. అలాగే, సీరియల్స్‌గా ఒక్కో భాగం వంతున ప్రదర్శించే 'టార్జాన్‌' సైలెంట్‌ ఫిల్ములు చూసి, ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళం'' అని శర్మ వివరించారు. నిజానికి, 1921 - 25 మధ్య కొన్ని సినిమాహాళ్ళు నిర్మాణమయ్యాయి. జనాకర్షణ చూసి, 1928 - 29 ప్రాంతంలో అనేక పట్టణాల్లో వడ్ల గోదాములు చిత్ర ప్రదర్శన శాలలు మారాయట! రెండేళ్ళు తిరగక ముందే దాదాపు 70 హాళ్ళు వెలిశాయి. బందరులో పి.వి. దాసు (1925లో 'మినర్వా' థియేటర్‌), ఏలూరులో మోతే కృష్ణారావు (పాండురంగ సినిమా), విశాఖపట్నంలో జి.కె. మంగరాజు (1930లో శ్రీకృష్ణా సినిమా'గా సి. పుల్లయ్య భాగస్వామ్యంలో మొదలై, తరువాత 'పూర్ణా' థియేటరైంది), బళ్లారిలో గోపాలరావు ('స్టార్‌ సినిమా'), రాజమండ్రిలో నిడమర్తి సోదరులు (1924లో 'శ్రీకృష్ణా పిక్చర్‌ ప్యాలెస్‌'గా మొదలై, ఇప్పటికీ 'శ్రీసాయికృష్ణా' ఏ.సి.గా నడుస్తోంది) సినిమా హాళ్ళు కట్టారు. విజయవాడలో రెండో హాలుగా, తమ 'శ్రీదుర్గాకళామందిరం'లో సినిమాలు ప్రదర్శించడం మొదలు పెట్టాక, 'ఆంధ్రపత్రిక' సినిమా ప్రకటనలు వేస్తూ వచ్చింది. క్రమంగా పత్రికల్లో సినిమాల వాణిజ్య ప్రకటనల ప్రచురణ, కొద్దిగా వాటి గురించి వార్తలు వేయడం మొదలైంది. మూకీ సినిమాల పట్ల ప్రజలు ఆదరణ చూపించారు. అయితే, తెర మీద ఏదో బొమ్మలు పరిగెడుతూ ఉన్నాయి తప్ప, మాటలు, పాటలు లేవనే అసంతృప్తి కొంత ఉండేది. దాంతో, మూకీ చిత్రాల పట్ల జనాదరణ క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది. ఆ సమయంలో 1931 మార్చి 14న భారతదేశపు మొదటి టాకీ చిత్రం 'ఆలమ్‌ ఆరా' విడుదలైంది.

భారతీయ సినీ చరిత్రలో టాకీల ఆవిర్భావానికి ఓ విశిష్టత ఉంది. ఎందుకంటే, వస్తు, శిల్పాలు - రెంటిలోనూ ఘన వారసత్వం ఉన్న నాటక రంగ సంప్రదాయాలను వెండితెర మీదకు తెచ్చి, ఉద్వేగభరితమైన సరికొత్త వినోద సాధనంగా టాకీ నిలిచింది. అదే సమయంలో అప్పటి వరకు మూకీ చిత్రాలతో నిశ్శబ్దంగా మిగిలిన సినీ మాధ్యమంలోకి శబ్దం, సంగీతం - రెంటినీ ప్రవేశపెట్టింది. ఆ రకంగా జనాన్ని బాగా ఆకర్షించింది. తొలి భారతీయ టాకీ అరేబియన్‌ నైట్స్‌ కథల తరహా నాటకీయత నిండిన 'ఆలమ్‌ ఆరా'. పార్శీ రంగస్థలం మీద ప్రసిద్ధమైన నాటకానికి ఇది వెండితెర రూపం. అసలు ఈ చిత్ర నిర్మాణానికి దర్శక - నిర్మాత అర్దేషిర్‌ ఎం. ఇరానీని ప్రేరేపించిందేమిటి? మూకీల రోజుల నుంచి చిత్రాలు నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ వచ్చిన అర్దేషిర్‌ ఇరానీ అప్పట్లో బొంబాయికి వచ్చిన ''40% సౌండ్‌'' హాలీవుడ్‌ చిత్రం 'షోబోట్‌' చూశారు. సినిమా మొత్తం కాకుండా, 40 శాతం మేరే శబ్దాలున్న అది చూశాక, భారతీయ వెండితెరకు 100% సౌండ్‌ తీసుకురావాలని ఆయన మనస్సులో పడింది. అప్పట్లో మూకీ సినిమా నిర్మాణం మహా అయితే ఓ నెల లోపలే పూర్తయ్యేది. ఆ సమయంలో, దృశ్యంతో పాటు శబ్దాన్ని కూడా రికార్డు చేయాల్సిన నవీన రూపమైన తొలి టాకీ చిత్ర నిర్మాణానికి 4 నెలలు పట్టింది. అనేక సమస్యల మధ్య, ఇతర సంస్థల నుంచి పోటీని అధిగమించి, ప్రత్యర్థి టాకీ నిర్మాతల కన్నా ఓ నెల రోజుల ముందరే 'ఆలమ్‌ ఆరా'ను ఇరానీ విడుదల చేయగలిగారు. హీరోగా మాస్టర్‌ విఠల్‌, హీరోయిన్‌గా జుబేదా, ఇంకా డబ్ల్యు.ఎం. ఖాన్‌ తదితరులు నటించిన ఆ చిత్రంలో మాటలతో పాటు 10 పాటలతో ప్రజల్లో పెను సంచలనమైంది. సినిమా విడుదలైన తొలి రోజు రాత్రి బ్లాక్‌మార్కెట్‌లో టికెట్‌ రేటు తారస్థాయిని చేరింది. అసలు ధర కన్నా 20 రెట్లు ఎక్కువకు బ్లాకులో టికెట్లు అమ్ముడయ్యాయి.

అపూర్వ స్వాగతం

ఒక్క బొంబాయిలోనే కాదు, ప్రతి చోటా టాకీలకు బ్రహ్మరథం పట్టారు. బెంగుళూరుకు చెందిన 'మెస్సర్స్‌ సెలెక్ట్ట్‌ పిక్చర్స్‌ సర్క్యూట్‌' వారు 'ఆలమ్‌ ఆరా'కు పంపిణీదారులుగా వ్యవహరించారు. ఆ సంస్థలో భాగస్వాములైన డాక్టర్‌ అంబాలాల్‌ పటేల్‌, చిమన్‌లాల్‌ దేశారులు టాకీల ప్రదర్శన కోసం తొలిసారిగా ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకువెళ్ళగలిగిన సామగ్రిని కొనుగోలు చేశారు. ఆ సాగ్రి వెంట నిపుణులైన ముగ్గురిని ఓ బృందంగా ఏర్పాటు చేసి, దక్షిణ భారతదేశంలోనూ, సిలోన్‌ (ఇప్పటి శ్రీలంక)లోనూ పెద్ద నగరాలన్నిటికీ వారిని పంపి, టాకీలను ప్రదర్శింపజేశారు. అదో అపూర్వ విన్యాసం. బెంగుళూరులోని సెలెక్ట్‌ పిక్చర్స్‌ కంపెనీకి చెందిన టి.ఎస్‌. మహాదేవ్‌ అప్పట్లో ఆ చిత్రం వెంట, దాని సౌండ్‌ ఆపరేటర్‌గా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆఫీసు సిబ్బందిలో ఆయనను ఆ పనికి ఎంచుకోవడానికి ఉన్న అర్హత అల్లా - బి.ఎస్సీలో ఎలక్ట్రిసిటీ గురించి చదవడమే! ''1931 తొలి రోజుల్లోని ఓ ఉదయం వేళ మేము ప్రయాణిస్తున్న ఆవిరి ఇంజన్‌ రైలు మద్రాసు సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌ మీదకు వచ్చినప్పుడు, అక్కడ ''టాకీస్‌, టాకీస్‌! మాట్లాడే చలనచిత్రాలు!'' అనే అరుపులు ప్రతిధ్వనించాయి. జనంతో క్రిక్కిరిసిన ఆ ప్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న 'కినిమా సెంట్రల్‌' సినిమా హాలు మేనేజర్‌ మా అరుపులు చెవినపడగానే, ''టాకీస్‌! టాకీస్‌!'' అని అరుస్తూ, మేమున్న రైలు బోగీనీ, మమ్మల్నీ గుర్తు పట్టారు'' అని ఆయన ఆ అనుభవాలను పేర్కొన్నారు. అప్పట్లో టాకీ చిత్రాల రీలు బాక్సులతో పాటు ముగ్గురు వ్యక్తులు, మూడు సామాన్లు వచ్చేవి. ప్రొజెక్టర్‌, యాంప్లిఫయర్‌, స్పీకర్‌ - ఈ మూడూ అతి భద్రంగా ప్రతి టాకీ ప్రదర్శనకూ తీసుకువెళ్ళే సామాన్లు. ఇక, ముగ్గురు మనుషులేమో - ఒకరు ఆపరేటర్‌ కమ్‌ ఇంజనీర్‌, మరొకరు మేనేజర్‌, మూడో వ్యక్తి సహాయకుడు! ఎక్కడకు వెళ్ళినా, ఈ ముగ్గురికీ, వారితో పాటు కీలకమైన ఆ మూడు సామాన్లకూ అపూర్వమైన రాచ మర్యాదలు లభించేవి! 'సెలెక్ట్‌ టూరింగ్‌ టాకీస్‌' అని అందరూ పిలిచే ఈ బృందానికి అప్పట్లో రైళ్ళలో దిగువ తరగతి రేట్లకే సెకండ్‌ క్లాస్‌లో ప్రయాణించే రాయితీ ఇచ్చారు. ఇక, లగేజీకీ డబ్బే కట్టనక్కర లేదన్నారు. ఆ తరువాత రోజుల్లో తొలి తమిళ టాకీ 'కాళిదాస్‌' రీళ్ళు రైల్లో వచ్చినప్పుడు, హారతులిస్తూ, పూలు జల్లుతూ, ఆ పెట్టెలను రైల్వే స్టేషన్‌ నుంచి హాలు దాకా ఊరేగించారు.

అఖండ సత్కారాలు

ఈ టాకీ చిత్ర ప్రదర్శకులు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి, మంచి థియేటర్లు ఎంచుకొని మరీ ప్రదర్శించేవారు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే యంత్రాలు వగైరా బిగించి, ప్రదర్శన సరిగా వస్తోందో లేదో పరీక్షించుకొని, ''క్షేమంగా చేరాం! యంత్రాన్ని అమర్చాం. పరీక్ష చేసి చూశాం. శబ్దం ఓ.కె'' అంటూ, తమ ప్రధాన కార్యాలయానికి టెలిగ్రామ్‌ ఇచ్చేవారు. అన్ని కేంద్రాల నుంచీ ఇదే సమాచారం! ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మలబార్‌, కర్ణాటక, సిలోన్‌ - ఇలా శరవేగంతో ఊళ్ళన్నీ చుట్టేశారు. ప్రతిచోటా ఈ తొలి టాకీ ప్రదర్శనలకు బ్రహ్మరథం పట్టి స్వాగతించేవారు. తిరుగు ప్రయాణమప్పుడు ఘనంగా వీడ్కోలు పలికేవారు. ఆ ప్రదర్శనలకు డబ్బులు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చేవి. టాకీ చిత్ర ప్రదర్శకులు తిరుచ్చి జంక్షన్‌ నుంచి మదురైకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రైల్వే స్టేషన్‌కు రావడం ఆలస్యమైంది. గార్డు బండిని ఆపేసి, వాళ్ళు వచ్చాక, ఆలస్యంగా బండిని బయలుదేరదీశాడు. ''బండి ఆలస్యమైతే ఫరవాలేదు... వాళ్ళు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికులని బండిని ఆపలేదు. వాళ్ళు 'టాకీ మనుషులు' కాబట్టి ఆపాను'' అంటూ ఆ గార్డు, మరో రైల్వే అధికారితో వాదించాడు. అదీ - అప్పట్లో టాకీకీ, టాకీ మనుషులకూ ఉన్న గౌరవం.

అప్పటి మైసూరు రాష్ట్రంలోని తుమ్కూరుకు వెళితే, వాళ్ళు ఏ కాఫీ హోటల్‌కు వెళ్ళినా, డబ్బులే తీసుకోలేదు. అక్కడి సినిమా హాలు యజమానే ఆ బిల్లు చెల్లించేలా అతిథి మర్యాదలు చేశారు. ఇక, బరంపురంలో ఈ బృందం ఎక్కడకు వెళ్ళినా, జనం 'టాకీ మనుషులు... టాకీ మనుషులు' అంటూ గుర్తు పట్టేవారు. మార్కెట్‌లో బుట్టల నిండా ఉచితంగా కూరగాయలిచ్చేవారు. కుంభకోణం పట్నంలో టాకీ ప్రదర్శనలో ఓ నృత్య సన్నివేశాన్ని జనం ఆస్వాదిస్తూ ఉండగా, హఠాత్తుగా శబ్దం ఆగిపోయింది. హడావిడిగా హెడ్డాఫీస్‌కు టెలిగ్రామ్‌ పంపారు. బొంబాయి నుంచి ఇంజనీర్‌ను రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. హాలు యజమాని స్వయంగా వేదిక మీదకు వెళ్ళి, జరిగిన సాంకేతిక వైఫల్యానికి క్షమాపణ చెప్పి, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానన్నారు. కానీ, ప్రేక్షకులు మాత్రం 'మేము సినిమా చూడడానికీ, మరీ ముఖ్యంగా 'వినడానికి' వచ్చాం. డబ్బులు వెనక్కిస్తే ఒప్పుకోం' అన్నారు. అదీ అప్పట్లో టాకీకి ఉన్న క్రేజు. నెల్లూరులో 'వినాయక సినిమా' హాలు యజమానికి బంధువైన ఎం.ఏ, ఎల్‌.ఎల్‌.బి. చదివిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి అయితే, టాకీ ప్రదర్శన వ్యక్తుల దగ్గరకు వచ్చి, శబ్దం ఎలా వస్తుందో అడిగి తెలుసుకున్నారు. 'మానవ ప్రతిభ ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇంత సులభంగా ఉపయోగించుకున్నప్పుడు, మీ టాకీ కేవలం హిందుస్థానీ భాషలోనే మాట్లాడుతూ, పాడుతోందేం? మరో అడుగు ముందుకేసి, ఏదో ఒక సర్దుబాటు చేసి, మా నెల్లూరులో ఉన్నంత వరకు తెలుగులో మాట్లాడేలా చేయవచ్చుగా!' అని ప్రశ్నించారు. ఆ కల కొన్ని నెలలకే నెరవేరింది. తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' తయారైంది.

బెజవాడలో ఫస్ట్‌ డే ఫస్ట్‌ రిలీజ్‌

బెజవాడ మొదటి నుంచీ సినిమాలకు కీలకమైన కేంద్రం. భారతదేశంలో మొట్టమొదటి టాకీ 'ఆలమ్‌ ఆరా' బొంబాయిలో విడుదలైన రోజునే బెజవాడలోని 'శ్రీమారుతీ' సినిమా టాకీస్‌లో కూడా విడుదలైంది. అలాగే, బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్‌లలో నిర్మించిన చిత్రాలు కూడా మొదటిసారిగా మారుతీ టాకీస్‌లోనే విడుదలయ్యేవి. మారుతీ టాకీస్‌ను నిర్మించిన పోతిన శ్రీనివాసరావు ఆ సంగతుల గురించి ఇలా వివరించారు: '' 'ఆలమ్‌ ఆరా' తరువాత వచ్చిన మొదటి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద'ను కూడా (ఇతర ప్రాంతాల్లో రిలీజైన తొలి రోజునే) మా థియేటర్‌లోనే ఆడించాను. ఆ సినిమా పెద్ద హిట్టు! అప్పట్లో తెలుగులో ఉన్న పత్రికలే తక్కువ. (ఇక ప్రత్యేకించి సినిమా పత్రికలు లేనే లేవు). పత్రికలలో సినిమా వార్తలు వేయాలన్న ఆలోచన కూడా లేదు. అయితే, బొంబాయి, కలకత్తాల నుంచి వచ్చే ఆంగ్ల పత్రికలలో మాత్రం సినిమా వార్తలు ఉండేవి. నిదానంగా మన పత్రికలలో కూడా అప్పుడప్పుడు సినిమా వార్తలు కనిపించేవి''.

తెలుగు నాట టాకీ యుగం ప్రారంభంతో, జనంలో సినిమా పట్ల ఆసక్తి, ఆకర్షణ బాగా పెరిగాయి. తెర మీద బొమ్మ కనబడడమే కాక, మాట్లాడుతూ, పాట పాడుతుందనే సరికి, జనమంతా ఎడ్ల బళ్ళు కట్టుకొని మరీ, దగ్గరలోని పట్టణానికి వెళ్ళి, సినిమాను చూసేవారు. 'ఆలమ్‌ ఆరా' ఘన విజయంతో దేశంలో ఇక వరుసగా ''మాటలు, పాటలు, నృత్యాల''తో కూడిన చిత్రాల నిర్మాణం పెరిగిపోయింది. మాట, పాట అత్యంత ప్రధానమైన అంశాలు కావడంతో, నిర్మాతలు సైతం రంగస్థల నటీనటుల్ని సినిమాల్లోకి ఆహ్వానించసాగారు. ఇవాళ్టి లాగా అప్పట్లో నేపథ్య గానం, డబ్బింగ్‌ లేనే లేవు. చిత్రీకరణ సమయంలోనే నేరుగా రికార్డింగ్‌ జరిపేవారు కాబట్టి, నటీనటులు తమ మాటలు తామే మాట్లాడాలి. తమ పాటలు తామే పాడాలి. దాంతో, మూకీల రోజుల్లో ఓ వెలుగు వెలిగిన పలువురు నటీనటులు సైతం భాష రాకపోవడం, పాడడం చేతకాకపోవడం లాంటి బలహీనతల వల్ల టాకీలకు అనువుగా తమను తాము మలుచుకోలేకపోయారు. కెమేరాకు దూరమయ్యారు. హిందీ, ఉర్దూ మాట్లాడలేని మూకీ తారలు బాగా దెబ్బతిన్నారు. రూబీ మేయర్స్‌ (భారతీయ మూకీల కోసం ఈ యూదు మహిళ సులోచన అని పేరు పెట్టుకున్నారు), మారియన్‌ హిల్‌ (మన మూకీల్లో పేరు విలోచన) లాంటి మూకీ చిత్రాల స్టార్స్‌ కనుమరుగయ్యారు. శబ్దచిత్రాల తయారీకి అనువుగా మారే ఆర్థిక సామర్థ్యం లేని పలు స్టూడియోలు మూతబడ్డాయి.

తిరుగులేని టాకీల ప్రస్థానం

తెలుగులో టాకీలు రావడంతో ఇక్కడా మాట, పాట అనుభవం ఉన్న రంగస్థల నటులు కావాల్సి వచ్చింది. 'భక్త ప్రహ్లాద' మొదలు తొలి ఆరేడేళ్ళలో వచ్చిన సినిమాలన్నిటికీ నాటకాలు, రంగస్థల నటులే ఆధారం. జనంలో టాకీలకు పెరిగిన ఆదరణ చూసి, 1930 చివరకొచ్చే సరికల్లా భారతదేశంలోని మొత్తం 370 థియేటర్లలో 30కి పైగా హాళ్ళు శబ్ద చలనచిత్రాలను ప్రదర్శించేందుకు వీలుగా సామగ్రిని శాశ్వతంగా సమకూర్చుకున్నాయి. అప్పటి దాకా మూగచిత్రాలైన 'మూకీ'లను ప్రదర్శించిన హాళ్ళన్నీ శబ్దాన్ని వినిపించే సామగ్రితో 'టాకీస్‌'గా అవతరించాయి. థియేటర్లుగా, సినిమా హాళ్ళుగా వ్యవహారంలో ఉన్నవి కాస్తా 'టాకీస్‌' అనే పదాన్ని పేరు చివర తోకగా తగిలించుకున్నాయి.

1932 చివరలో తెలుగులో రెండో టాకీ 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకము' విడుదలైనప్పుడు, ఆ చిత్రం వెంట మహాదేవ్‌ తదితరులు ''ఆంధ్ర, తమిళనాడుల్లో పర్యటించే నాటికే, పెద్ద నగరాల్లో'' టాకీ చిత్రాల ప్రదర్శనకు అనువుగా పర్మనెంట్‌ టాకీస్‌ వచ్చాయి.అయితే, టాకీ చిత్రాల నిర్మాణం ప్రారంభమైన తరువాత కూడా కొన్నేళ్ళ దాకా మూకీ చిత్రాల నిర్మాణం, అందులోనూ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కొనసాగింది. అందుకే, మూకీలకు భిన్నమైనవని చెప్పడం కోసం టాకీస్‌ అనే మాట మన దేశంలో ప్రచలితమైంది. పాశ్చాత్య దేశాల్లో ఆ మాట వ్యవహారంలో లేకపోయినా, మన దగ్గర మాత్రం స్థిరపడిపోయింది. చలనచిత్రాలు 1927లో ఇంగ్లీషులో మాట్లాడితే, మన భారతదేశంలో హిందుస్థానీ (హిందీ - ఉర్దూ మిశ్రమం), బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లో 1931లో, కన్నడంలో 1934లో, మలయాళంలో 1938లో మాటలు నేర్చాయి.

అలా ఎనభై ఏళ్ళ క్రితం గోదాముల్లో, నాటక శాలల్లో టూరింగ్‌ సినిమా ఎక్విప్‌మెంట్‌తో మొదలైన మన దక్షిణాది భాషల సినిమా ప్రస్థానం ఇవాళ మనిషి కళ్ళు చెదిరే ఐ-మ్యాక్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లు, 3డి ప్రదర్శనల దాకా సాగింది. మాటే లేని, ఉన్నా సరిగ్గా వినపడని రోజుల నుంచి చెవుల తుప్పు వదిలించే స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ల మీదుగా ఇవాళ్టి డి.టి.ఎస్‌, డాల్బీ డిజిటల్‌ సౌండ్‌ల దాకా పయనించింది. ఊరూరా ప్రొజెక్టర్‌ను వెంటేసుకొని తిప్పే రోజుల నుంచి ఉపగ్రహం ద్వారా ఎక్కడికైనా సరే క్షణాల్లో డిజిటల్‌ పద్ధతిలో సినిమాను ప్రసారం చేసి, ప్రదర్శించే స్థాయికి చేరాం. అందుకే, కళ, కథ, శిల్పం లాంటి వాటి మాట ఎలా ఉన్నా మన టాకీలు ఈ 80 ఏళ్ళలో సాంకేతికంగా ఊహించని ఎత్తులకు ఎదిగాయి. ఎన్ని వినోదాలు వచ్చినా, సినిమా సరికొత్త రూపంలో సామాన్యుడికి వినోదం పంచుతూనే ఉంటుంది. తెర మీది కదిలే బొమ్మల పట్ల ఆకర్షణను పెంచుతూనే ఉంటుంది. ఒక్క ఎనభయ్యే కాదు, మరెన్నో ఎనభైలు వచ్చినా, మన సినిమా మార్కండేయుడిలా నిత్య యౌవన చిరంజీవి!

- రెంటాల జూనియర్‌ (ప్రజాశక్తి ఆదివారం అనుబంధం Sat, 17 Sep 2011)
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .