Friday, August 5, 2011

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం , World Drug Addiction protest day


  •  
  • photo : courtesy google.com
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూన్ 26) అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


విజయాల మత్తులో ఊగిపోతున్న యువత ప్రాణాలను హరించే మహమ్మారిగా మాదకద్రవ్యాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వరూపాన్ని తమదైన వికృతరూపంలో ప్రదర్శిస్తున్నాయి. విజయాల భారం, కష్టించి సాధించిన వాటిని నిలుపుకోవడంలో ఎదురవుతున్న ఒత్తిడులను కరిగించేసి, మబ్బుల్లో తేలిపోయే అనుభూతిని అందించే ఒక నిర్వాణం కోసం నగరాలలోని మెరుపు తీగలు అంగలార్చుతున్నారు.

అయితే, ఆ నిర్వాణం కేవలం తాత్కాలికమైందే అని గ్రహించే లోపే మనిషిని జీవచ్ఛవంగా పీల్చి పిప్పి చేస్తున్న మాదకద్రవ్యాలు ఎన్ని నిషేధాలు విధించినా ఉరిశిక్షలు విధించినా వంగేదీ, తగ్గేదీ లేదని వికటాట్టహాసం చేస్తున్నాయి.

అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను అరికట్టేందుకు బహుళ ప్రయత్నాలు చేస్తోంది. దేశ దేశాల ప్రభుత్వాలను ఈ మహమ్మారి వ్యాప్తి గురించి హెచ్చరిస్తోంది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఏటా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది.

మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రపంచమంతటా కార్యక్రమాలు జరుపుకోడానికి గాను జూన్ 26వ తేదీని ఐరాస సర్వ ప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని అంతర్జాతీయ సమాజాన్ని సృష్టించేందుకు గాను ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ఐరాస ప్రకటించింది.ప్రతి ఏటా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలను స్వాధీనపర్చుకుని దేశ దేశాల్లో బహిరంగంగా వాటిని తగులబెట్టడం, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపర్చడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం వంటి చర్యలను పెద్ద ఎత్తున ఐరాస ప్రోత్సహిస్తోంది. గడచిన ఐదేళ్లలో భారత్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అమితంగా పెరిగిపోయింది. సంపన్న వర్గాల్లో తేరగా వచ్చే ఆదాయం పెరిగిపోవడం దీనికి ఒక ముఖ్య కారణం.

మాదక ద్రవ్యాల ముఠాలు 1980లలో విద్యార్థులను తమ ప్రధాన లక్ష్యాలుగా చేసుకునేవి. ఇప్పుడవి ఎగువ మధ్యతరగతి ప్రజలందర్నీ లక్ష్యంగా చేసుకున్నాయి.రసాయనిక పరమైన మందులతో భారతదేశానికి వచ్చి గంజాయి లాంటి వాటిని తిరిగి తీసుకువెళ్లే విదేశీ పర్యాటకుల నుంచి వీటికి ఎక్కువ గిరాకీ లభిస్తోంది. ప్రధానంగా కొకైన్ దక్షిణ అమెరికా నుంచి భారత్‌కు వివిధ మార్గాల ద్వారా తరలి వస్తోంది. భారతదేశపు రేవులలో ఆగివెళ్లే ఓడల ద్వారా, ప్రయాణీకుల సామాను ద్వారా అది సులభంగా దేశంలో ప్రవేశిస్తోంది.

కుటుంబ విలువలు విచ్ఛిన్నం కావడం, కుతూహలం, పిచ్చెక్కిస్తున్న పోటీ కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరగడానికి మరికొన్ని కారణాలు. భావోద్వేగ సమస్యలు, స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిడులు, చేతిలో డబ్బు బాగా ఆడడం యువకులలో, పెద్దలలో, వృత్తి నిపుణులలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడానికి మరికొన్ని కారణాలు.

ఈ కొత్త ధోరణికి మహిళలు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు కావడం ఆసక్తిగొలిపే పరిణామం. చాలామంది మోడల్స్ కోక్‌కు అలవాటు పడిపోతున్నారు. దానిని ఒకసారి వాసన చూస్తే ఆకలి నశిస్తుంది. చాలా గంటల పాటు శక్తివంతంగా వుండేటట్లుగా చేస్తుంది. అందుకే అది సన్నబడేందుకు సరికొత్త సాధనంగా అవతరిస్తోంది.ఆహారం ప్రమేయమే లేకుండా, లేదంటే ఆహార ప్రమేయాన్ని బాగా తగ్గించి, పార్టీలను ఎనర్జీ డ్రింకులకు, మాదక ద్రవ్యాలకు పరిమితం చేయడానికి కారణం ఇందులో వెల్లడవుతుంది. మహిళలు అనేక సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక మార్గంగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు.

అన్నింటినీ మించి మాదకద్రవ్యాల మీద ఆధారపడటం వల్ల జీవ రసాయనికంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతినడం, మందులలోని రసాయనిక పదార్ధాలు నాడీ వ్యవస్థ మీద దాడి చేయడం, తీవ్రమైన ప్రవర్తనలు, కాలక్రమంలో ఆత్మీయులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం జరుగుతాయి. భారతదేశంలో కొకైన్‌పై వ్యసనపడుతున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అధికారులు నిర్ధారిస్తున్నారు.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మాదకద్రవ్యాల బారినపడబోమని, మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రతిన చేద్దాం...

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .