Sunday, August 14, 2011

ప్రపంచ కాస్మోనట్ ల దినం, Cosmonaut Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఏప్రిల్ 12వ తేదీ) -ప్రపంచ కాస్మోనట్ ల దినం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


2011 సంవత్సరం ఏప్రిల్ నాటికి మానవుడు అంతరిక్షానికెగసి, అక్కడ అడుగెట్టి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయ్యింది. యూరీ గెగారిన్ అంతరిక్ష రహస్యాలను చేధించడానికని బయల్దేరి విజయుడైన తొలి వ్యక్తిగా చరిత్ర నమోదు చేసింది. డిక్షనరీలో ఒక కొత్త పదం జోడింపబడింది. అదే ‘కాస్మోనట్’ అనేది.
యూరి గెగారిన్ అనే సోవియట్ దేశపు వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళి, విజయవంతంగా తిరిగి రావడం అమెరికాకు కన్ను కుట్టినట్లైంది. సోవియట్ రష్యా రూపొందించిన స్ఫుత్నిక్ అన్న తొలి మానవ నిర్మితమైన
నౌక అంతరిక్షంలోకెళ్ళి వచ్చింది. దాంతో సోవియట్ రష్యా అన్ని దేశాల్లోకీ ఎంతోముందుకు ‘దూసుకెళ్ళిన’ దేశంగా పేరుపొందింది. అటు తర్వాత ప్రతి ఏడూ ఏప్రిల్ 12వ తేదీని ‘ప్రపంచ కాస్మోనట్’ల దినంగా అందరూ వేడుక జరుపుకోనారంభించారు.

అసలు ఈ విశ్వం ఎలా పుట్టిందీ? ఎపుడు పుట్టిందీ? అందులో ఏముంది? ఎలా ఉంది? ఎందుకుంది? ఎలా ఏర్పడింది?- ఇవీ నిరంతరం మానవుని మెదడులో మెదిలే జఠిలమైన ప్రశ్నల దొంతర. మానవుడి సహజ జిజ్ఞాసతో సాంకేతిక ప్రగతి చెట్టాపట్టాలేసుకొని, గతంలోలాగానే ఆలోచనా సరళిని గాఢంగా ప్రభావితం చేశాయి. భూమిలోన పుట్టు భూభారమెల్ల, తనువులోన పుట్టు తత్వమెల్ల- అని వేమన ఊరకనే అనలేదు. మనలోంచే కొత్తకొత్త ఆలోచనలూ, ప్రశ్నలూ పుట్టుకొస్తాయి. ఆ తర్వాత వాటిని శోధించి, పరిశోధిస్తే- చక్కని ఫలితాలొస్తాయి. భూమి ఎలా ఏర్పడిందీ, అదెలా ఉండేదీ- ఇలాటి విషయాలు తెల్సుకొన్న తర్వాత శాస్తజ్ఞ్రులు కొంతమేరకు సంతోషపడ్డా, దానితో తృప్తిచెందలేదు. ఆ తర్వాత అంతరిక్షం మీద దృష్టిని సారించారు. ఈ విషయంలో ప్రపంచంలోని దేశాలన్నిటికన్నా ఒక అడుగుముందే ఉండింది సోవియట్ రష్యా.

అది నాటి సోవియట్ రష్యాలోని ‘స్మెలోవ్‌కా’అనే మారుమూల గ్రామం. 1960 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ. పంట పొలాలు చూడచక్కని (‘లాండ్ స్కేపింగ్’) - ప్రకృతి దృశ్యం. ఆ పొలాల్లో పనిచేసుకొంటూన్నారు- అన్నా అకియోవ్‌నా తఖతరోవ్ అనే ఆవిడ, ఆవిడతోబాటు ఆమె మనవరాలు రీటా, ఇద్దరూ పొలం పనులు చేసుకొంటూంటే, ఉదయభానుడు సైతం ‘‘పోనీలే! కష్టపడేవారిని మరింత కష్టపెట్టడం ఎందుకులెమ్మ’’ని మత్తుగా ప్రకాశిస్తున్నాడు. అపుడు సమయం సరిగ్గా 11 గంటలు కావస్తోంది. రీటాకు, వాళ్ళ బామ్మకూ ఉన్నట్టుండి పెద్దపెట్టున శబ్దాలు వినపడ్డాయి. ఏమైందో ఇద్దరికీ బోధపడలా’ అన్నా ఏమీ ఎరగనట్టు తిరిగి పనిలో నిమగ్నం కాబోయింది. కానీ, మాటా పలుకూ లేకుండా రీటా, ఒక చేత్తో ఆవిడ చెయ్యి పట్టి లాగుతూ, ఆకాశంవేపు మరో చేయి చూపిస్తూ, నిశే్చష్టగా నిలిచిపోయింది. ఇదెక్కడి గొడవలెమ్మని పద పోదాం అనుకొంటూ ‘ఇంటికెళ్దాం’అని అటు తిరిగారో లేదో? ఒక మనిషి కాని మనిషి, మనిషిలాటి మనిషి దేహమంతా తెల్లని దుస్తులతో కప్పబడి ఆకాశంనుంచి పేరాచూట్ సాయంతో కిందకు దిగుతూ కనిపించాడు. ఇదేదో ‘‘గ్రహాంతర వాసి కాదుకదా!’’ అనుకొంటూండగానే, ఆ వ్యక్తి తన తలపై ఉన్న గాజు కవచాన్ని తొలగించి, ‘‘హేయ్! అలా పరిగెత్తకండి!’’ అంటూ మాట్లాడసాగాడు. సరీగ్గా అదే సమయంలో ఒక ట్రాక్టర్ రావడం, దాని వెనక సైనికులు రావడమూ చూశారు అన్నా, రీటా- ఇద్దరూ! ఆ ట్రాక్టర్ మీద ఉన్న మనిషి మాట్లాడ్తూ, ‘‘్భయపడకండి! నా పేరు మేజర్ అక్మెద్ గసియర్, అంటూ’’ శుభోదయం. ఈ పేరాచూట్‌తో దిగిన వ్యక్తి ఎవరో కాదు. ‘యూరీ గెగారిన్’. అంతరిక్షంలోకి వెళ్ళి విజయవంతంగా భువికి తిరిగి వచ్చిన తొలి వ్యక్తి. అతను దివినించి భువికి తిరిగి రావడం తొలిసారిగా చూసింది మీరిద్దరే! అంత చక్కని చారిత్రాత్మక దృశ్యానికి సాక్షీభూతులు మీరే కావడం- సోవియట్ రష్యా మొత్తం గర్వించదగ్గ విషయం’’ అన్నాడు.
ఒక మనిషేమిటి? అంతరిక్షంలోకి వెళ్ళి, తిరిగి సజీవంగా రావడమేమిటి? - నమ్మలేని విషయంగా వారిద్దరికే కాదు, ప్రపంచం మొత్తాన్నీ విస్మయపరిచింది. కానీ అదెంతో గర్వించదగ్గ విషయం. ఆనందించాల్సిన సమయం కావడం- అందరినీ ఆనందంతో ముంచెత్తింది. మరుసటి ఏటికి డిక్షనరీలో కొత్త పదం ‘కాస్మోనట్’ అనేది చేరింది. ఇదీ యూరీ గెగారిన్ భువినుంచి దివికెళ్ళి తిరిగి భువికి వచ్చిన కథ.

ఇక్కడ యూరీ గెగారిన్ గురించి కొంత చెప్పుకొని తీరాలి. గెగారిన్ 1934లో 9వ తేది మార్చినాడు ‘క్లుషినో’ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అది మాస్కో నగరానికి 100 కి.మీ. పశ్చిమంగా ఉండే కుగ్రామం. గెగారిన్ తండ్రి సైతం రైతే! తల్లి పాలు అమ్ముతూండేది. ‘అలెక్సై ఇవనోవిచ్’ తండ్రి పేరు. తల్లి ‘అన్నా తిమోఫెయానా’. వీరికి నలుగురు సంతానం- ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వీరిలో మూడో సంతానమే ‘యూరీ గెగారిన్.’ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సైన్యం వీరి గ్రామాన్ని ఆక్రమించింది. దాంతో వీరి కుటుంబానికి ఇల్లు లేకపోయింది. నాజీ సైన్యం క్యాంపుల్లో గెగారిన్ సోదరుడూ, సోదరీ చిక్కుకుపోతారు. ఐతే తల్లిదండ్రులకోసం ఎంతో కష్టపడి కాపాడుకొన్నాడు గెగారిన్. యుద్ధం అయిపోయాక చదువుకోగలిగాడు. సైన్యంనించి తన తల్లిదండ్రులను కాపాడుకొన్న స్ఫూర్తి, అతని కెపుడైనాసరే తాను ‘ఫైటర్ పైలట్’ కావాలి అనే ఆలోచనను రేకెత్తించింది. దానికన్నా ముందే ఒకసారి ఒక రష్యన్ ఫైటర్ విమానం తన కళ్ళముందే, తమ పంట పొలాల్లో కూలిపోవడం గమనించాడు గెగారిన్. యుద్ధంలో పోరాడి వెనక్కి వచ్చిన విమానం అది. కూలిపోయిన శకలాల్లోంచి ఇద్దరు పైలట్‌లు విజయగర్వంతో బైటకు రావడాన్ని, వారి ముఖాల్లోని ఆత్మవిశ్వాసాన్నీ చూసిన గెగారిన్, ఎప్పటికైనా తానూ ‘ఫైటర్ పైలట్’కావాల్సిందే అనుకొన్నాడు. చిన్నతనంలో జరిగే సంఘటనలు మన భావి జీవితంలో చెరగని ముద్రవేస్తాయంటే, అదే అందుకే కదా! మన మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాంగారు ‘కలలు కంటూనే ఉండండి! భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా పనిచేయండి’ అంటూ యువతను ఉద్దేశించి ఎపుడో చెప్పారు.
తన బాల్యంలో చదువుచెప్పిన టీచర్ ఒకాయన గెగారిన్‌లోని ఆసక్తిని గుర్తించాడు. ఎందుకంటే, ఆ టీచర్ కూడా ఒకనాటి ఏర్‌ఫోర్స్ పైలెట్ కావడమే. దాంతో చిన్నప్పటినించీ టీచర్ల ప్రోత్సాహమూ లభించిందాతనికి. పైలెట్ శిక్షణకు కావలసిన అర్హతలను సంపాదించడంలో గెగారిన్‌కు ఆతని ఉపాధ్యాయునితోడు, శిక్షణా ఎంతో తోడ్పడింది. పైలెట్ ట్రైనింగ్ ఎకాడమీలో చేరగలిగాడు గెగారిన్. అపుడే ఫ్లయింగ్ క్లబ్‌లో చేరే మహత్తర అవకాశం లభించిందాతనికి. విమానం ఎక్కడం, దాన్ని నడపడం నేర్చుకొన్న గెగారిన్ 1955లో తొలిసారిగా తానొక్కడే నిలిచి విమానాన్ని నడిపాడు. చాలా నెమ్మదిగా, సుతిమెత్తగా విమానాన్ని దింపడంలో అతని తీరే వేరుగా ఉండేది. దీనితోబాటు ‘ప్యారాచూటింగ్’లోనూ ప్రావీణ్యత సంపాదించాడు గెగారిన్. ‘‘ఏయ్! జాగ్రత్త! కింద అమ్మాయిలు నినే్న చూస్తున్నారు’’అంటూ అతని ఇన్‌స్ట్రక్టర్ ‘డిమిట్రీ పావ్లోవిచ్’ జోక్ చేయడంతో గెగారిన్ కళ్ళుమూసుకుని ఫ్లయిట్ నించి పారాచూటింగ్ చేశాట్ట. ఈ డిమిట్రీ అనే ఇన్‌స్ట్రక్టర్‌కే గెగారిన్ అంటే అదో రకమైన, ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానమే గెగారిన్‌ను మిలిటరీ ఏవియేషన్ స్కూల్‌లో చేరేలాగా చేర్చింది. ఓరెన్‌బర్గ్‌లోని ఆ ఏవియేషన్ స్కూల్‌లో మిగ్-15 విమానాలను నడిపే అవకాశం కల్గింది. 1957లో ‘టాప్’ మార్కులతో శిక్షణ పూర్తిచేసుకొన్నాడు గెగారిన్. ఆర్కిటిక్ సర్కిల్‌లో ఫైటర్ పైలట్‌గా పనిచేసే అవకాశం కలిగింది. విచిత్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా విమానాన్ని నడపగలిగాడు.
అదే సమయంలో సోవియట్ రష్యా అంతరిక్ష కార్యక్రమాలు హైలైటవడంతో (చంద్రుని ఫొటోలు తీయడంతో), అప్పటి అధినేత ఇక అంతరిక్షానికి మానవ సహిత నౌకను పంపాలనుకోవడం గురించి బాహాటంగా ప్రకటించారు. దాంతో అంతరిక్ష ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎందరో పైలట్లు ‘అప్లై’చేసుకొన్నారు. అదే సమయంలో గెగారిన్ కూడా అప్లై చేయడం జరిగింది. టాప్ సీక్రెట్‌గా ఇద్దరు మిలిటరీ
ప్రతినిధులు (ఈ యూనిట్‌కి కోడ్‌నేమ్ ‘26266’), గెగారిన్ ఇంటికి రావడం అంతరిక్ష యాత్ర గురించి చర్చించి వెళ్ళిపోయారు. ఇదే 26266 కోడ్‌నేమ్‌తో మార్చి 1960లో కాస్మోనట్స్ ట్రైనింగ్ సెంటర్ ఆరంభమైంది. దానికి కల్నల్ యెవ్‌గెన్లీ అనటోలైవిచ్ కార్పొవ్ దానికి ముఖ్య పర్యవేక్షకుడుగా, ఆ సెంటర్ బాధ్యతలు చేపట్టాడు. ఇతనికి ముఖ్య సహాయకునిగా, ‘డైరెక్టర్’ స్థాయిలో లెఫ్ట్‌నెంట్ జనరల్ నికొలై పెట్రోవిచ్ కమనిన్ నియమితులైనారు.
కాస్మోనట్ ఎంపిక కూడా ఎంతో రహస్యంగా జరిగింది. నిజానికి ఆ ఎంపిక ట్రైనింగ్ సెంటర్ ఆరంభం కావడానికన్నా ముందే జరిగిందంటే, ఆశ్చర్యం కల్గించక మానదు. అభ్యర్థులను గ్రూపులుగా సెంట్రల్ మిలిటరీ
సైంటిఫిక్ రిసెర్చి ఏవియేషన్ హాస్పిటల్‌కు తెచ్చి కఠిన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 3461 మంది అభ్యర్థులు హాజరైనా, వారిలో అన్ని పరీక్షలకూ తట్టుకొని నిలబడింది కేవలం 347 మంది. ఇంతకీ అది ప్రాథమిక వడబోతే. మనిషి ఎత్తు 172-174 సెం.మి. ఉండాలనీ, బరువు 70-75 కిలోలుండాలనీ నిబంధనలు విధించిందాకేంద్రం. గెగారిన్ ఎత్తు, బరువు, అర్హతలూ - ఇవన్నీ తొలి దశలో గెలిపించాయి. మరిన్ని కఠినమైన నిబంధనలు విధించడంతో రెండో వడబోతలో 206 మంది మిగిలారు. మలి వడబోతలో చివరికి మిగిలింది 20 మంది. ఈ 20 మందిలో అతి చిన్న వయస్కుడు 25 ఏళ్ళవాడైతే, పెద్ద వయస్కుడు 35 ఏళ్ళవాడు. గెగారిన్ వయస్సు అప్పటికి 26 ఏళ్ళు. వీళ్ళను ‘స్టార్ సిటీ’అనేచోట ఉండే శిక్షణా కేంద్రానికి తరలించారు. ఎముకలు కొరికే చలితో నీడలేని ప్రాంతం అది. అక్కడే కాస్మోడ్రోమ్ ఉండేది. దానిచుట్టూతా లాంచ్ ప్యాడ్‌లుండేవి. చెప్పాలంటే, ఈ 20 మంది ప్రయోగశాలల్లో వాడే ఎలుకల్లాగానే ఉండేవారు. ఎలాటి పరిస్థితులకైనా వీరు తట్టుకొనేలా చూడటమే ఆ శిక్షణలో ఉద్దేశం. ఏకాంతంగా ఉండే ఐసొలేషన్ ఛాంబర్, మితిమీరిన ఉష్ణోగ్రతలుండే హీట్ ఛాంబర్, పారాచూటింగ్- ఇలా పలు అంశాల్లో పలు స్థాయిల్లో శిక్షణనిచ్చారు. వీటన్నిటిలోనూ చివరిది పారాచూటింగ్. 4 కి.మీ. ఎత్తులోనుంచి పారాచూట్‌తో కిందికి దిగడం- అదీ పగలూ, రాత్రి తేడా లేకుండా. ఈ అన్నిరకాల పరీక్షలకూ, శిక్షణకూ తట్టుకొని నిలబడింది ఇద్దరే. ఒకరు గెగారిన్ అయితే, మరొకరు ఘెర్‌మన్ టిటోవ్. 20 మంది నించి 6 మందిని ఎంపికచేసినా మిగిలింది మాత్రం వీరిద్దరే. 1961 జనవరి నెల చివరికి ఈ ఇద్దరి ఎంపిక జరిగింది. ఈ ఆరుగురిలో ఐదుగురు రష్యన్లు, ఒకరు మాత్రం యుకోనియన్, అంతరిక్షంలోకి ఎగసి తిరిగి విజయవంతంగా రావల్సింది ‘రష్యనే’అన్నది డైరెక్టర్ నికొలాయ్ ఉద్దేశం. అదే చివరికి ‘యూరీ గెగారిన్’ ఎంపికకు దారితీసింది. ఘెర్‌మన్ టిటోవ్ కూడా యూరీ గెగారిన్‌కి ఏమాత్రం తీసిపోదు. కానీ, గెగారిన్ ముఖంలో చెరగని చిరునవ్వు, నీలినీలి కళ్ళు, ఆర్ద్రత- ఇవన్నీ గెగారిన్ ఎంపికవడానికి కారణాలయ్యాయి. గెగారిన్ పేరు విని ‘‘జర్మన్ పేరులా ఉందే! ఇతనెక్కడి రష్యన్! లాభం లేదు. వేరే ఎవర్నన్నా చూడండి!’’ అన్నాట్ట కృశే్చవ్. కానీ, అధికారులు ఆయన్ను ఒప్పించి, యూరీ గెగారిన్ పేరునే ఖరారుచేశారు. నిజానికి ఒక చక్కని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌నే తొలి అంతరిక్ష యాత్రికునిగా చూడాలన్నది కృశే్చవ్ ఆలోచన. అయినా సరే, గెగారిన్ అర్హతలు, దానికితోడు అతనికి ఉండిన నైపుణ్యం, అనుభవం- ఇవన్నీ అతనిని గెలిపించాయి. ఎంపిక కావడంతో సంతోషపడ్డమేకాదు. తాను చేయబోయే అంతరిక్ష ప్రయాణం ఎంత ప్రమాదమైందో, గెగారిన్‌కు తెలీందేమీ కాదు. 10వ తేది ఏప్రిల్ 1961నాడు అంతరిక్ష ప్రయాణానికి ముహూర్తం ఖరారుచేసారు. 12వ తేదీ ఏప్రిల్ 1961నాడు సరిగ్గా ఉదయం 5.30 నిమిషాలకు గెగారిన్‌నీ, అతనికి బ్యాకప్‌గా ఉంచిన టిటోవ్‌నీ వైద్యపరీక్షలు నిర్వహించి- వారిరువురిలో గెగారిన్ ఆరోగ్యమే సరిగ్గా అనుకూలిస్తుందని నిర్ణయించి, గెగారిన్‌నే రాకెట్ ‘పేలోడ్’లో పంపించారు. ఆ తర్వాత అంతరిక్షంలోకెళ్ళి, చుట్టి వచ్చి విజయవంతంగా భువిని చేరాడు. ఇప్పటికి తొలి అంతరిక్ష యాత్ర జరిగి
2011 ఏప్రిల్ 12నాటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తిఅయ్యింది. ఈ 50 ఏళ్ళ కాలంలో దాదాపు 500 మంది పైగానే అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్నా, యూరీ గెగారిన్ మాత్రం తొలి అంతరిక్ష యాత్రికుడిగా అజేయుడిగా నిలిచిపోయాడు.

source - Andhrabhumi Sundy magazine
=========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .