Sunday, June 19, 2011

ప్రపంచ ఉపవాస దినోత్సవం, World no diet day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) ప్రపంచ ఉపవాస దినోత్సవం( World no diet day ) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


భారతీయులేకాదు పాశ్చాత్య దేశాలు కూడా ఉపవాసాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అధికంగా ఆహారం తీసుకుంటే ఊబకాయంతో బాధపడటమే కాకుండా వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉండటంతో ఉపవాసం ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మన వారు వారానికి ఒకసారి ఉపవాసం ఉండటంతో ఆరోగ్యంగా ఉంటారని మన భారతీయులు ఎప్పుడో ప్రపంచానికి చాటి చెప్పారు. కాని ప్రస్తుతం ప్రజలందరూ పాశ్చాత్యపు మోజులో పడి వారి ఆహారపు అలవాట్లను పాటిస్తూ, వారి ఆరోగ్యనియమాలను పాటిస్తున్నారు.

పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నవారి జీవితం ఉరుకులు పరుగులమయం అవుతుంటుంది. దీంతో వారి ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చాలా ఉంటాయి. సుఖానికి మరగిన జీవితంలో మనిషి శరీరానికి తగిన శ్రమ కల్పించడంలేదు. అందునా ప్రస్తుతం పుట్టిన ప్రతి పిల్లవాడినుంచి పెద్దలవరకు డబ్బా తిండికే అలవాటు పడిపోయినారు. అలాగే కార్యాలయాలలో పనిచేసేవారు ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడి ఇంటినుంచి ఆహారాన్ని తీసుకురాకుండా పార్శిల్స్ తెప్పించుకు తింటుంటారు. అందునా బయటి ఆహార పదార్థాలలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉంటాయి.

దీంతో మనిషి అనేక రకాల జబ్బులను కొని తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. కాబట్టి అక్కడి వారు "నో డైట్ డే" ని పాటించడానికి అలవాటు పడ్డారు.

గతంలో భారతదేశంలోనే ఇలా ఉపవాసాలను పాటించేవారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతిలో ఉపవాస దీక్ష అనేది ఓ మహత్తర కార్యక్రమమని, దీనిని వారు ఆరోగ్య పరంగానే కాకుండా ధార్మిక పరంగాకూడా వారికి మంచి లాభాన్ని తెచ్చి పెడుతుందని, ఇలా చేస్తే వారు చేసిన తప్పులేవైనా ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఇదో మార్గమని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మనిషి ప్రతిరోజూ తీసుకునే ఆహారంతో అతని దినచర్య ముడిపడి ఉంటుందని డైటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. మనిషి తన రోజువారీ కార్యక్రమంలో శరీరానికి సరైన వ్యాయామం ఇవ్వలేకపోతే తగిన క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే దానికి తగిన శ్రమ అవసరం అని వారు తెలిపారు. ప్రస్తుతం చాలావరకు వ్యాయామం తక్కువగా చేసి భోజనం ఎక్కువగా తింటున్నారని డైటీషియన్లు తెలిపారు.

అత్యధికంగా ఆహారం తీసుకునేవారు కనీసం వారానికి ఒకసారైనా ఆహారం తీసుకోకుండా నిలిపివేస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కాని ఉపవాసం ఉండాలని నిర్ణయించుకునే ముందు వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యనిపుణలు సూచిస్తున్నారు.

మనిషికి వచ్చే వివిధ రకాల జబ్బులకు కారణం మనిషి శరీరంలోని ఉదరభాగమేనని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రోగిని ఆకలితో చంపండి అని ఓ నానుడి మన దేశంలో ఉంది. దీనిబట్టి అర్థం అయ్యిందేంటంటే వైద్యులు ప్రాచీన కాలంలో రోగికి ఉపవాసం ఉండమని సలహాలనిచ్చేవారు.

ఉపవాసం ఉండటం మూలాన శరీరంలోని పేగులకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. దీంతో జీర్ణశక్తి మరింత మెరుగవుతుందంటున్నారు వైద్యులు. ఉపవాసం ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలను ఆహారంగా తీసుకుంటుండాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .