Saturday, June 4, 2011

రేడియో ఆవిష్కరణ దినము , Radio broadcasting Dayగత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (June 02) -రేడియో ఆవిష్కరణ దినము (Radio broadcasting Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందామురేడియో ఆవిష్కరణ :  జూన్‌ 2, 1896వ సంవత్సరంలో ఇటలీకి చెందిన మార్కోని అనే శాస్తవ్రేత్త రేడియోను కనిపెట్టాడు. కానీ, మే 7, 1896న రష్యాకు చెందిన శాస్తవ్రేత్త అలెగ్జాం డర్‌ పోప్‌ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ పద్ధతిని కనుగొన్నాడని కొందరంటారు. ప్రపంచంలో రేడియో ప్రసారాలు 1921లో ప్రారంభమ య్యాయి. విద్యుత్‌ రేడియో తరంగాలు సెకండ్‌కు లక్షా 86 వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తాయి. ఎర్‌జ్టి అనే జర్మన్‌ శాస్తవ్రేత్త విద్యుత్‌ నుండి అయస్కాంత తరంగాలు.. వెలుతురు నుండి వచ్చే తరంగాల వలెనే అన్ని వైపులకూ ప్రసరిస్తాయని చెప్పాడు. ఈ సూత్రమే రేడియోను కనుగొనడానికి దారితీసింది. భారత్‌లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ 1924లోనే మద్రాసులో రేడియో క్లబ్‌ ఒకటి స్థాపించడంతో ప్రారంభమైంది. కొద్దికాలం లోనే ఇది మూతపడింది. తిరిగి 1932 నుం డి ప్రభుత్వమే రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ను నిర్వహిస్తోంది.

All India Radio,ఆకాశవాణి
  •  

  •  
ఈరోజుల్లో పత్రికలూ, టీవీలూ, ఇంటర్నెట్‌ మనల్ని 24 గంటలూ సమాచార ప్రవాహంలో ముంచి తేలుస్తున్నాయి. కానీ, మనదేశంలో అనేక దశాబ్దాలుగా వార్తల్ని కొండకోనల్లో ఉన్నవారికి సైతం చేర్చుతున్న మాధ్యమం ఆకాశవాణి. ఈ విజ్ఞానఖనిలో తెలుగు వార్తలు మొదలై 75 ఏళ్లు. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తే...
అద్దంకి మన్నార్‌, కందుకూరి సూర్యనారాయణ, ఏడిద గోపాలరావు, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ... ఈ పేర్లు ఎవరివో తెలుగువారికి పరిచయం చేయనవసరంలేదు. 'ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది...' అనగానే అక్కడ రేడియో స్టేషన్లో ఆ వార్తల్ని చదవబోయేది ఎవరో శ్రోతలు ఇట్టే పసిగట్టేసేవారు. గాంభీర్యం, స్పష్టత, మాధుర్యం... అన్నీ కలగలిసినట్టు ఉండే ఆ గొంతులోని మాటలు శ్రోతల్ని కట్టిపడేసేవి. స్వతంత్రం, మహాత్ముని హత్య, నెహ్రూ మరణం, ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ హత్య... ఇలాంటి ఎన్నో వార్తలు ప్రజలకు తెలిసింది రేడియో ద్వారానే.

తెలుగు వార్తలు...
ఎలక్ట్రానిక్‌ మీడియాలో తెలుగు వార్తలకు పుట్టినిల్లు ఆకాశవాణి. రేడియోలో వార్తలు వినడమంటే సమాచారం తెలుసుకోవడమే కాదు తెలుగు లోగిళ్లలో అదో సంప్రదాయం. 75 ఏళ్లలో దాదాపు అర్ధ శతాబ్దంపాటు తెలుగువారికి వార్తలు అందించడంలో రేడియోదే ఏకఛత్రాధిపత్యం. తెలుగులో రేడియో వార్తలు మొదలైంది 1939 అక్టోబరు ఒకటిన. ఈ జాతీయవార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. తెలుగుతోపాటే గుజరాత్‌, మరాఠీ, తమిళంలో కూడా అదే రోజున వార్తా ప్రసారాలు మొదలయ్యాయి. అంతకు ముందు ఇంగ్లిష్‌, హిందుస్తానీ, బెంగాల్‌ భాషల్లో మాత్రమే వార్తలు ఉండేవి. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం కావడంతో వార్తలు తెలుసుకోవడానికి చాలా మంది చెవులు రేడియోలకు అతుక్కుపోయేవి. వారణాసి సుబ్రహ్మణ్యం, కపిల కాశీపతి... తెలుగులో మొదటితరం న్యూస్‌రీడర్లు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య, సాహితీవేత్త శ్రీరంగం శ్రీనివాసరావు సైతం ఆకాశవాణిలో వార్తా పఠనానికి తమ గొంతుకను అందించినవారే. తెలుగులో తొలి మహిళా న్యూస్‌ రీడర్‌ జె.మంగమ్మ. 1954లో మద్రాసు నుంచి తెలుగులో తొలిసారిగా ప్రాంతీయ వార్తల ప్రసారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1956లో హైదరాబాద్‌ కేంద్రం నుంచీ, 1980లో విజయవాడ కేంద్రం నుంచీ ప్రాంతీయవార్తల ప్రసారాన్ని ప్రారంభించారు.

24 గంటల వార్తా ప్రసారం ఉన్న ఈరోజుల్లో ఆకాశవాణిలో వచ్చే వార్తలకు స్థానం ఎక్కడా... అంటే... 'విశ్వసనీయతలో' అని చెప్పాలి. ఆకాశవాణిలో వూహాగానాలకూ, సొంత అభిప్రాయాలకీ, వ్యాఖ్యానాలకీ తావులేదు. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు ఈ వార్తల్లో పెద్దపీట వేస్తారు. ఒకప్పుడు 'కమ్యూనిటీ లిజనింగ్‌ సెంటర్‌'లు ఉండేవి. అంతా అక్కడ కూర్చొని వార్తలు వినేవారు. అనంతరం చర్చలూ జరిపేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ సంప్రదాయం నడుస్తోంది. మావోయిస్టుల సానుభూతిపరులతో ప్రభుత్వం చర్చలు జరిపినపుడు ఆ సమాచారం అడవుల్లోని మావోయిస్టులకు చేర్చే మాధ్యమం రేడియోనే. ప్రభుత్వ సంస్థ అయినా కూడా ఆకాశవాణి మీదున్న విశ్వాసంతో వారు ఈ వార్తలపై ఆధారపడేవారు. ఉద్యోగార్ధులూ సమాచారానికి రేడియోనే ఆశ్రయించేవారు.

తుపాన్లూ-ఎన్నికలూ...
ఆకాశవాణిలో సాధారణ వార్తల ప్రసారం ఒక ఎత్త్తెతే ఎన్నికలూ, తుపానులూ, ఆందోళనల సమాచారం అందించడం మరో ఎత్తు. 'సాధారణ ఎన్నికలూ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఫలితాలు వచ్చేంత వరకూ ప్రతి గంటకీ బులెటిన్లు ఉండేవి. అత్యవసర పరిస్థితి విధించినపుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హిందీలో ఇచ్చిన ప్రసంగ పాఠం మాకు అర్ధరాత్రి తర్వాత అందింది. దాన్ని తెల్లవార్లూ కూర్చొని తెలుగులోకి అనువదించి ఉదయం మొదటి బులెటిన్లో అందించాం' అని చెబుతారు ప్రముఖ రచయిత, సీనియర్‌ రేడియో జర్నలిస్టు డి.వెంకట్రామయ్య. సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారూ, రైతులూ ఇప్పటికీ ఆకాశవాణి తాజా వాతావరణ సమాచారం మీదే ఆధారపడతారు. విద్యుత్తు లేనపుడు వార్తల్ని ట్రాన్సిస్టర్‌లో వినే పల్లెవాసులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. ట్రాన్సిస్టర్‌ వచ్చాక ప్రైవేటు టీవీ ఛానెళ్లు రాకమునుపు అంటే 1995 నాటికి ఆకాశవాణి అత్యున్నత ప్రజాదరణను పొందింది.

ఆన్‌లైన్లో ఆకాశవాణి...
కాలంతోపాటు ఆకాశవాణి కూడా మారుతోంది. ఈ సంస్థ వార్తా విభాగం వెబ్‌సైట్లో (newsonlineair.co.in) ఏపూటకాపూట వివిధ భాషల్లోని వార్తా బులెటిన్లూ, స్క్రిప్టులను పెడుతోంది. అక్కడ తెలుగు వార్తలు వినొచ్చు, చదవొచ్చు. ఫోన్‌, ఎస్సెమ్మెస్‌లద్వారా న్యూస్‌ అప్‌డేట్స్‌ అందించే సౌకర్యమూ ఉంది. 'ఈ వజ్రోత్సవాలు రేడియోని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడానికి ఓ అవకాశంగా తీసుకుంటున్నాం' అని చెబుతారు ఆకాశవాణి హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ఉప సంచాలకులు బాకెర్‌ మీర్జా. ప్రైవేటు రేడియో సంస్థలకు వార్తలు అందించే హక్కును ప్రభుత్వం ఇంకా కల్పించలేదు. ఎఫ్‌.ఎమ్‌. వాళ్లు ఆకాశవాణి వార్తల్ని యథాతథంగా ప్రసారం చేసే అవకాశం మాత్రం ఉంది.

ఇంతింతై అన్నట్టు ఎదిగి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఆకాశవాణి తెలుగు వార్తలతో ఇంకెన్ని మైలురాళ్లు దాటుతుందో చూడాలి! 
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .