రిమంబరెన్స్ డే
1918 సంవత్సరం పదకొండో నెల, పదకొండో రోజు ఉదయం పదకొండుకి యూరప్‌లోని సైనికుల తుపాకులన్నీ నిశ్శబ్దమయ్యాయి. నాలుగేళ్ళ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లోని ఫారెస్ట్ ఆఫ్ కంపాగ్నిలోని ఓ రైలు పెట్టెలో ఉదయం అయిదుకి శాంతి ఒప్పందంమీద సంతకాలు జరిగాయి. ఆరు గంటల తర్వాత ఉదయం పదకొండుకి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ సందర్భంగా 1919లో మొదటి రిమెంబరెన్స్ డేని బ్రిటన్‌లో మరికొన్ని కామనె్వల్త్ దేశాల్లో జరుపుకున్నారు. దీన్ని ఆరోజు ఆర్మీ స్టైస్ డేగా, (శాంతి ఒప్పంద దినం) యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం జరిపారు.లండన్ ఈవెనింగ్ న్యూస్‌లో ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఎడ్విర్డ్ జార్జిహనీ, మే ఎనిమిది 1919న సైనికుల గౌరవార్థం ఓరోజు నిశ్శబ్దాన్ని పాటించాలని సూచిస్తూనే ఉత్తరాన్ని రాసాడు. దీన్ని కింగ్‌జార్జిదృష్టికి నంబర్ ఏడు, 1919న ఎవరో తీసుకువచ్చారు. దాంతో ఆయన రెండు నిముషాల నిశ్శబ్దాన్ని ఓరోజు పాటించాలని ఆజ్ఞని జారీచేసాడు. వాహనాలన్నీ ఆ సమయంలో ఆగిపోయాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక, ‘ఆర్మీ స్టైస్ డే’ని రిమెంబరెన్స్ డేగా మార్చి, రెండు ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి గౌరవార్థం ప్రతి నవంబర్ నెలలోని రెండో ఆదివారం ఉదయం పదకొండుకి రెండు నిముషాల వౌనం పాటించాలని నిర్ణయించారు. ఆరోజు బ్రిటిష్ రాజ కుటుంబం లండన్‌లో వైట్‌హాల్‌లో ‘దిసెనోటాప్’ అనే చోటకి చేరుతారు. సివిలియన్, మిలిటరీ సర్వీసెస్‌లోని ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరవుతారు. అక్కడ చర్చ్ ఫాదర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసాక, అంతా రెండు నిముషాల వౌనాన్ని పాటిస్తారు. కొందరు ఈరోజుని ‘పాపీడే’ అని, అమెరికాలో వెటరన్స్‌డే అని కూడా పిలుస్తారు. ఆరోజు కామనె్వల్త్ దేశాలన్నిట్లో సెలవు.
రిమెంబరెన్స్‌డే జరుపుకునే మరికొన్ని దేశాలు బార్బిడోస్, బెర్ముడా, కెనడా, హాంకాంగ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, నార్త్ ఐర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్. అయితే ఇంగ్లండ్‌లోలాకాక ఆరోజు కొన్ని దేశాల్లో సెలవు ఉండదు.
అమెరికన్స్ 1954లో జరిగిన కొరియన్‌వార్, 1960లలో జరిగిన వియత్నాం వార్‌లో పాల్గొని మరణించిన సైనికులని ఆరోజు గుర్తుచేసుకుంటారు. పాపీ అనే రక్తవర్ణంగల పువ్వులని సమాధుల మీద ఉంచుతారు. ఇవి దొరకని ప్రాంతాల్లో అదే రంగు కృత్రిమ పాపీ పువ్వులని ఉంచుతారు. అందుకనే ఈరోజుని పాపీడే అని కూడా పిలుస్తారు.
ఆరోజు కొందరు తెల్ల రంగు పాపీలని ధరిస్తారు. జరిగిపోయిన రక్తపాతాన్ని గుర్తుచేసుకునే బదులు, జరగబోయే రోజుల్లో శాంతిని కాంక్షించేందుకు చిహ్నంగా ఈ తెల్లపాపీలని ధరిస్తారు.
1933నుంచి తెల్ల పాపీలని ధరించడం ఇంగ్లండ్‌లో మొదలై మిగిలిన దేశాలన్నిటికీ పాకింది. ఆరోజు ఆ దేశాల్లో లక్షలకొద్దీ పాపీ పువ్వులు అమ్ముడవుతాయి. కృత్రిమ పూలని ప్లాస్టిక్ లేదా కాగితాలతో చేస్తారు. వాటినే వాడతారు.
రిమెంబరెన్స్‌డే రోజే ఆంగ్లికన్స్, రోమన్ కేథలిక్స్ జరుపుకునే ‘సెయింట్ మార్టిన్ ఆఫ్ టూర్స్’ విందు కూడా వస్తుంది. రోమన్ కాలానికి చెందిన ఈయన ముందు సైనికుడిగా పనిచేసి, తర్వాత సన్న్యాసిగా మారి శాంతియుతమైన జీవితాన్ని గడిపాడు. ఆ క్రిస్టియన్ తెగలకి చెందినవారు ఆ రోజు సెయింట్ మార్టిన్ విగ్రహాలు లేదా ఫొడోలని దివంగత సైనికుల సమాధుల మీద వుంచుతారు.
ఈరోజుకీ చాలా ఏళ్ళ క్రితం యుద్ధంలో మరణించిన తమ బంధుమిత్రులని తలచుకుని చాలామంది యూరోపియన్స్ దుఃఖించడంజరుగుతూంటుంది.
ఆంధ్రప్రభ దిన పత్రిక -- పద్మజ-October 10th, 2010
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .