Sunday, December 12, 2010

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం , National Fuel Conservation Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్‌ 14) "జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం" గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (డిసెంబర్‌ 14): ఆర్థికపరమైన పెరుగుదల, పునర్నిర్మాణ రంగం ముఖ్యంగా ఇంధన రంగంపైనే ఆధారపడి ఉంది. ఈ రం గానికి ప్రత్యేకత కల్పిస్తూ... మొత్తం ప్రణాళిక లో 30 శాతం ఈ రంగానికే కేటాయించబ డింది. ఆర్థికరంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్‌ అధికమైంది. డి మాండ్‌, సప్లై ల మధ్య సమన్వయం కోసం తీసుకున్న వివిధ రకాల వ్యూహాలతో ఇంధ నాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా మారింది.
ఇంధన వృథా-జాతికి వ్యథ--మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్లేక పోతే బండి, బస్సూ ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటరు, మైక్రోవేవ్‌ - ఏవీ పనిచేయవు. ఫ్యూయల్‌ నిల్లయితే(Nil)విమానం నేలమీద కూడా నడవదు. సిలిండర్‌లో గ్యాస్‌ నిండుకుంటే అన్నం, కూరలు కాదు గదా గుక్కెడు కాఫీ కూడా వెచ్చబడవు. పత్రహరితం కరువైతే మొక్కలు వాడిపోతాయి. వాటికదే ఇంధనం లాంటిది. మొత్తానికి ఇంధనం లేకపోతే ''జగమే మాయ, బ్రతుకే లోయ..'' అని పాడుకోవాల్సివస్తుంది. ఇవాళ ''జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం'' కనుక ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను ఒకసారి గుర్తుచేసు కుందాం.

ఇంధనాలను సంరక్షించుకోవాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత మనందరిమీదా వుంది. అసలు వ్యర్థమైన ఖర్చులను ఎవరూ, ఎప్పుడూ ప్రోత్సహించరు. అందుకే ''అడవి కాచిన వెన్నెల'', ''బూడిదలో పోసిన పన్నీరు'' లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఈ సామెతలు వృథా అయిపోవడాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. ఇంధనాలను కనుక దుబారా చేస్తే డబ్బు దండగే కాకుండా అవి ఇంకెందరికో దొరక్కుండాపోయే అవకాశం వుంది. ఇవి అమూల్యమైనవి. ఇంధన వనరులు తక్కువ కనుక ఆచితూచి, ఆలోచించి ఉపయోగించడం విజ్ఞత అనిపించు కుంటుంది. చిన్నతనంలో ''డబ్బును దుబారా చేయొద్దు, నీళ్ళలా ఖర్చుపెట్టొద్దంటూ'' పెద్దలు జాగ్రత్తలు నేర్పిస్తారు. పొదుపుకు సంబంధించి మర్యాద రామన్నతో సహా అసంఖ్యాకమైన నీతి కథలు పుట్టుకొచ్చాయి. డబ్బే కాదు, నీళ్ళయినా జాగ్రత్తగానే వాడాలి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వాడుకోడానికి, తాగడానికి నీళ్ళు లేక అవస్త పడ్తున్నవాళ్ళెందరో! కనుక, పొదుపు చేయడం అనే కళ తెలిస్తే మనకూ మంచిది, తోటివారికీ మంచిది.

ఇంధనాన్ని పొదుపు చేయమని చాటి చెప్పడానికే డిసెంబర్‌ 14వ తేదీని జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా గుర్తించి, ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎనర్జీ కన్‌సర్వేషన్‌ అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి. ఇలా చేయడంవల్ల ఇంధనం దుబారా కాదు, సంస్థలూ నష్టపోవు.

ఇంతకీ ఇంధన పొదుపు అంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే! ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయొచ్చని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. ఎక్కువమందితో తక్కువ పని రాబట్టడం కంటే తక్కువమందితో ఎక్కువ పని రాబట్టడం ఉత్తమ పద్ధతి. పది వేల చొప్పున జీతం చెల్లిస్తూ పదిమందిని తీసుకోవడం కంటే రెట్టింపు జీతంతో ఇద్దరు పనిమంతులను నియమించుకోవడం తెలివైన పని. అవసరమైనచోట మ్యాన్‌పవర్‌ ముఖ్యమే. చేతినిండా పని లేకపోతే మొత్తం వాతావరణమే కాలుష్యం అవుతుంది. జీతం తక్కువ అనే అసంతృప్తితో నానా రాజకీయాలూ, అరాచకమూ సృష్టించే అవకాశం వుంది. నిజాయితీగా చెప్పుకుంటే అంతమందికి ఫాన్లు, లైట్లు, ఎకామిడేషనూ, గట్రా అంతా దండగే అంటున్నాయి అనేక సంస్థలు. ఎక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఎక్కువ పని చేయడానికి ఉద్యోగులు రొష్టుపడరు. వాళ్ళకు అనవసరమైన న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసేంత తీరిక, ఓపిక వుండవు. మరి, ''కొందరికి పని దొరకదు, నిరుద్యోగులుగా మిగుల్తారు'' అనే మాట హాస్యాస్పదం. ఇవాళ ఒక కొత్త సంస్థ వెలిసి, అందులో వందమందికి ఉద్యోగావకాశం వచ్చిందనుకుందాం. ఆ సంస్థ లేకముందు వాళ్ళకి ఉద్యోగమే లేదా? ఒకవేళ ఆ కొత్తగా వచ్చిన సంస్థ మూతపడితే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం వుండదా?! కనుక, పని చేయాలనే తపన, చేసే నైపుణ్యం వుంటే ఎక్కడో ఒకచోట దొరికితీరుతుంది.

సరే, అసలు విషయానికొస్తే, ఫాక్టరీల్లో వీలైనంతగా ఇంధనాన్ని పొదుపుచేస్తూ, ఉత్పాదన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అనేక సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే, ఏకంగా మూత పడ్తున్నాయంటే ఇంధన దుర్వినియోగం, ఎక్కువైన సిబ్బం దే ప్రధాన కారణం. ఖర్చు విష యంలో సరైన ప్రణాళిక లేకపో వడం, ఇంధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్‌. ఒక్క ఫాక్టరీలనే కాదు, మనచుట్టూ ఎందరో పెట్రోల్‌ వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తుంటారు. ముఖ్యంగా ప్రభు త్వ రంగ సంస్థల్లో ఈ దుబారా మరీ ఎక్కువ. ప్రభుత్వ కార్యాలయాల్లో వందమంది చేసే పనిని ప్రైవేట్‌ ఆఫీసుల్లో పదిమంది ఇట్టే పూర్తిచేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇది ఇంధనానికీ వర్తిస్తుంది. దూర ప్రయాణం వెళ్ళే ఆర్టీసీ బస్సులు కొన్నిసార్లు సగం సీట్లు కూడా నిండకుండానే ప్రయాణిస్తుం టాయి. ఎంత డీజిల్‌ దండగ? పావుగంట, పది నిమిషాలు, అర్ధగంట సమయం తేడాతో బస్సులు వెళ్తుంటాయి కదా! బస్సు నిండని పక్షంలో ఇటువారిని అటు సర్దితే ఎంత ఇంధనం సేవ్‌ అవుతుంది?! ఎటూ ట్రాఫిక్‌ జామ్‌ లేదా సాంకేతిక కారణాలతో ఎన్నోసార్లు బస్సులు రెండు మూడు గంటలు ఆలస్యంగానే వెళ్తాయి. అలాంటప్పుడు ఈపాటి ఎడ్జస్ట్‌మెంట్‌ అంత కష్టమైన విషయమా? ఇక నిత్యం రోడ్లమీద బస్సులు, ఇతర వాహనాలు సిగ్నల్‌ పాయింట్ల వద్ద, ఇతరత్రా ఆగినప్పుడు కూడా ఇంజన్‌ ఆఫ్‌ చేయకపోవడం చూస్తుంటాం. దానివల్ల ఎంత డీజిల్‌ లేదా పెట్రోల్‌ దండగ? పైగా అదనపు పొల్యూషన్‌. ఇళ్ళల్లోనూ ఎంతో గ్యాస్‌ వేస్టవుతుంటుంది. మనం గదిలో లేకున్నా ఫాన్లు, లైట్లు, ఏసీ ఆన్‌లో వుంటుంది.

ఇంధనం వృథా అవడానికి మరో ముఖ్య కారణం చవకబారు యంత్రాలు, నైపుణ్యం లేని ఉద్యోగులు. కొంత ఖరీదు ఎక్కువైనప్పటికీ మంచి మెషినరీ అమర్చుకోవడంవల్ల తక్కువ ఇంధనంతో పని పూర్తవుతుంది. అలాగే స్కిల్స్‌ లేని ఉద్యోగులవల్ల లేదా పనిధ్యాస లేనివారి కారణంగా అనేకసార్లు ఇంధనం వ్యర్థమౌతుంది. కనుక తాడు చాల్లేదని నుయ్యి పూడ్చుకున్న చందంగా తక్కువ ఖర్చుతో పనైపోతుంది కదాని కక్కుర్తి పడినట్లయితే ఆనక తడిసి మోపెడు ఖర్చవుతుంది.

ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. వృథా చేసినందువల్ల అటు డబ్బు దండగ, ఇటు ఇంధనానికే షార్టేజ్‌ వచ్చే ప్రమాదం. ఈ రెండింటిని మించిన మరో జటిల సమస్య పొంచి వుంది. అదే వాతావరణ కాలుష్యం. ఇంధనాలను అతిగా ఖర్చుపెట్టడంవల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి. చెట్లు, జంతువులే లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. నదీనదాలు ఎండిపోవడం, ఓజోన్‌ పొరకు మరింత చిల్లులు పడటం లాంటి అనర్థాలతో కష్టాల ఊబిలో కూరుకుపోయి నట్లవుతుంది మన పని. వాతావరణ కాలుష్యం అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, మితిమీరిన ఎండలు లాంటి ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణమౌతుంది. కనుక, ఎలా చూసినా ఇంధనాన్ని పొదుపు చేయడం మన కనీస కర్తవ్యం.

1991 డిసెంబర్‌ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ఏటా పుర స్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తిం పును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. ఆయా ఆర్గనైజేషన్లు తమ లాభం పొందుతూనే, సమాజానికి సేవలు అందిస్తూనే, ఇంధనాన్ని ఎంత వరకూ పొదుపు చేస్తున్నాయి, వాతారణాన్ని ఎలా సంరక్షిస్తున్నాయి అనే అంశాలను దృష్టిలో వుంచుకుని బహుమతులను నిర్ణయిస్తారు. ఈ ప్రత్యేక దినాన ఇంధ నాన్ని పొదుపు చేయడానికి మనమూ సంసిద్దమౌదాం
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .