Monday, December 27, 2010

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం,International Human Rights Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Dec 10 న ) International Human Rights Day గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.

మానవ హక్కులను రక్షించేందుకు, మరిన్ని సౌకర్యాలు కలిగించేందుకు అమెరికా 1945 నుండి ప్రయత్నిస్తోంది. ఆ దేశ జనరల్‌ అసెంబ్లి అధికార ప్రకటనలను గౌరవించే ఉద్దేశంతో 1948వ సంవత్సరంలో డిసెంబర్‌ 10వ తేదీని డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా (యు.డి.హెచ్‌.ఆర్‌) నిర్ణయించారు. మరి రెండేళ్ళ తర్వాత 1950 డిసెంబర్‌ 4వ తేదీన జరిగిన 317వ జనరల్‌ అసెంబ్లి ప్రత్యేక సమావేశంలో మానవ హక్కుల దినోత్సవానికి సాధారణ ప్రణాళిక రచించి అమలు జరిపారు. ఆరోజున అన్ని రాష్ట్రాల అధికార ప్రతినిధులనూ ఆహ్వానించడమే కాకుండా ఆసక్తి ఉన్న సంస్థలు ఈరోజున మానవ హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని జనరల్‌ అసెంబ్లి సూచించింది.

ప్రతీ మనిషికి దక్కవలసిన హక్కులు దక్కుతున్నాయా? హక్కులు పరిరక్షించేందుకు మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా? మన హక్కులను కాపాడుకోగల్గుతున్నామా? అంతా అనుకున్నట్టే జరిగితే అనుకోవాల్సిందింకేముంది? భయపడాల్సింది, బాధపడాల్సిందీ ఏముంటుంది? అలా జరగడం లేదు కనుకనే, కోట్లాదిమంది అశాంతితో, అభద్రతాభావంతో తల్లడిల్లిపోతున్నారు కనుకనే మానవ హక్కుల దినోత్సవం అనేది పుట్టుకొచ్చింది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో ఈరోజుకు చాలా ప్రాధాన్యత వుంది. న్యూయార్క్‌ సిటీ హెడ్‌ క్వార్టర్స్‌ క్యాలండర్‌లో డిసెంబర్‌ 10వ తేదీ హైలైట్‌ చేసి కనిపిస్తుంది. పై స్థాయి రాజకీయ సభలు, సమావేశాలు అలాగే సాంస్కృతిక సంస్థలకు సంబంధించిన ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు మొదలైనవన్నీ ఈ ప్రత్యేకదినాన ఏర్పాటు చేస్తారు.

ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చిస్తాయి.

2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో ఉపయుక్తమైన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబర్‌ 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ''ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌'' అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్‌-టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దివులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న సైబర్‌ డిసిడెంట్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహించింది. అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చిలీ మాజీ ప్రెసిడెంటు, డిక్టేటర్‌ ఆగస్టో పినోచెట్‌ ఎంత విధ్వంసం సృష్టించాడో, మానవ హక్కులకు భంగం కలిగించాడో విదితమే.

ఆ చండశాసనుడు 91 ఏళ్ళ వయసులో 2006 డిసెంబర్‌ 10న గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియాలోని గే హక్కుల (హోమో సెక్సువల్స్‌, ఇంకా వారిని సమర్థించేవాళ్ళు) కార్యకర్తలు ''కాలింగ్‌ ఇన్‌ 'గే''' పేరుతో సమాన హక్కులకోసం పోరాడుతూ ప్రజలను సహాయం అర్థించారు. గే పెళ్ళిళ్ళపై నిషేధం విధించినందుకు ఈవిధంగా నిరసన తెలియజేశారు. పారిస్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 60వ మానవ హక్కుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆ ఏడాది కాంబోడియా, తదితర దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. 5వేలకు పైగా ప్రజలు ఈ సందర్భంగా మార్చింగ్‌ జరిపారు. వెయ్యిమందికి పైగా పెద్ద బెలూన్లను విడుదల చేశారు. రష్యా, భారత్‌ల్లోనూ మానవ హక్కుల దినోత్సవాలను గొప్పగా జరిపారు. గత సంవత్సరం కూడా ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాయి. ఈరోజు కూడా మనదేశంతో సహా అనేక దేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతా మన బాధ్యతలను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిద్దాం. మన కనీస హక్కులకోసం నిస్సంశయంగా పోరాడుదాం. ''బ్రతుకు, బ్రతకనివ్వు'' అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం, ఆచరిద్దాం.

source : wikipedia.org
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .