మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని, పరిసరాలను కబళించి కలుషితం చేస్తూ జీవిస్తాడు. జంతువులు, పక్షులు తమ కోసం కాక, ప్రకృతిలో భాగంగా జీవిస్తూ, మనుషుల దౌష్ట్యానికి బలైపోతూ మనుగడ సాగిస్తున్నాయి. మనిషి తన ఉనికి కోసం, ఆహారం, వినోదం కోసం వెంపర్లాడుతూ జంతుజాలాన్ని బంధించి, బానిసలుగా మార్చి వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. జంతువులు, పక్షుల నుంచి మనిషి పొందుతున్న ప్రతిఫలానికి కనీస కృతజ్ఞత కూడా లేకుండా వాటి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, హద్దులు మీరిన హింస క్షమించరాని నేరంగానే మిగిలిపోతోంది.
మనుషులకు ఏ చిన్న కష్టం తెలెత్తినా వెంటనే ధర్నాలు, ఆందోళనలు, న్యాయ పోరాటాలు చేస్తారు. హక్కులు హరించుకు పోతున్నాయంటూ వార్తా పత్రికలు పతాక శీర్షికలుగా మారుస్తాయి. జంతువులకు, పక్షులకు కూడా కొన్ని హక్కులుంటాయని మనుషులు ఎందుకు గుర్తించరన్నది అందరూ ఆలోచించాలి. సృష్టిలోని ప్రతిప్రాణీ జీవించడానికి సమాన హక్కులు ఉండాలి. ఒక జీవి ప్రాణాలను హరించే హక్కు మరో జీవికి లేదు, ఉండకూడదు.
మనిషికి రక్షణ, ఆహారం, ఆరోగ్యాలను ప్రసాదిస్తున్న జంతుజాలంపై కృతజ్ఞతాభావంతో మెలగాల్సిందిపోయి, క్రూరంగా హింసించడం అమానుషం. దాన్ని గుర్తించి జంతువులు, పక్షుల సంక్షేమం కోసం ఎంతో కృషి సాగించిన ‘సాధు టీఎల్ వాస్వాని’ పుట్టిన రోజైన నవంబర్ 25ను ప్రతి సంవత్సరం జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ఇండియాలో‘జంతువుల హక్కుల దినం’గా పాటిస్తున్నాయి. ఆ రోజును ‘నో మీట్ డే’గా పాటించాలని ఆ సంస్థలు కోరడం అందరూ ఆహ్వానించదగ్గ అంశం. అలాగే, జంతువులు, పక్షులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నది బాధ్యత గల ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి రక్షణకు కృషి చేయాలి. పురాణాల కాలం నుంచీ మనుషులకు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. నేటికీ వాటి ద్వారానే మనుషులు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతున్నారు. బిడ్డకు తల్లిపాలు చాలకపోతే ఆవు పాలు పడతారు. మనిషి ఆహారంలో సగ భాగం వాటి మాంసాన్ని వాడటం బాధాకరం.
ఇంటి కాపలాకు, నేర పరిశోధనకూ కుక్కలను గణనీయంగా వినియోగిస్తారు. వ్యవసాయానికి, మంచు కొండల్లో, ఎడారుల్లో మనుషులను గమ్యానికి చేరవేయడానికి జంతువులను ఉపయోగిస్తారు. సర్కస్ వంటి ప్రదర్శనల్లో ఎన్నో జంతువులు, పక్షులతో విన్యాసాలు చేయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి జంతువులపై ఆధారపడి జీవిస్తున్నాడు తప్ప, జంతువులు కేవలం ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా, మనుషులు వాటిని వెంటాడి, వేటాడి హరించడం క్షంతవ్యం కాదు. మనుషుల నుంచి తప్పించుకోవడానికి జంతువులకు ఉన్న ఆవాసం అడవి. దాన్ని కూడా వదలకుండా నేడు మనిషి హరిస్తుండటం తెలిసిందే. మాంసం కోసం, చర్మాల కోసం జంతువులను వేటాడే వాళ్లు కొందరైతే, కేవలం వినోద క్రీడగా కాలక్షేపానికి క్రూరంగా వేటాడతారు. దీని ప్రభావంతోనే, 1972లో ‘వన్యప్రాణుల సంరక్షణా చట్టం’ రూపొందింది. దీని ప్రకారం వన్యప్రాణులను వేటాడటమే కాదు, పట్టుకుని బంధించడం కూడా నేరమే. ఇక పెంపుడు జంతువుల పేరుతో కూడా అనేక హింసలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు, నోరు లేని మూగ జీవాలకు స్వేచ్ఛ, సంరక్షణ కల్పించడానికి అనేక సంస్థలు నడుం బిగించడం మంచి పరిణామం. పీపుల్స్ ఫర్ ఏనిమల్స్, జీవ రక్షా సమితి, జీవ బంధు, బ్లూ క్రాస్ వంటి సంస్థలు జంతువుల రక్షణకు ఎన్నో కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించడం మూలంగా కొంతైనా ఉపశమనం లభిస్తోందన్నది కాదనలేని వాస్తవం. దీనికి అందరూ సహకరించడం కనీస కర్తవ్యంగా భావించాలని మనవి.
హక్కులు కేవలం మనిషికే కాదు జంతువులకూ ఉండాలన్న ఉద్దేశ్యంతో యూనివర్సల్ డిక్లరేషన్ యానిమల్ రైట్స్‌ని ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌ని 1998లో ప్రపంచ దేశాలు ఆమోదించాయి.మానవ హక్కుల దినమైన డిసెంబర్ 10న జంతువుల హక్కుల దినంగా చేయడంద్వారా మనుషులు, జంతువులు ఒకటేనన్న సందేశం అందరికీ అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
Source : Wikipedia.org/
- =========================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .