- ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం
- పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబరు 20 న ) బాలల హక్కుల పరిరక్షణ గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
మంచీ చెడూ పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకోవచ్చు! కానీ సమాజంలో బలహీనులూ, దోపిడీకి గురయ్యే వారిలో పిల్లలూ వున్నారు. పిల్లలను దోచుకునే పెద్దలున్న చోట చిన్నారులకు హక్కులుండడం తప్పనిసరి. ఈ కారణంచేతే ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కులకోసం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ (సిఆర్‌సి)గా పేర్కొనే ఈ ఒప్పందం గురించి అందులో పేర్కొన్న హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి నవంబర్ 20వ తేదీని బాలల హక్కుల దినోత్సవంగా నిర్ణయించింది. ఆ హక్కులేంటంటే ...-జీవించడం, అభివృద్ధి చెందడం -సముచితమైన జీవన ప్రమాణాలు, ఉత్తమ ఆరోగ్య ప్రమాణాలు, సమర్థవంతమైన ఆరోగ్య సేవలు -అంగవికలురైన పక్షంలో ప్రత్యేక సంరక్షణ -వ్యక్తి గౌరవానికి భంగం కలగకుండా తమ పనులు తామే చేసుకునేలా సమాజంలో వారు క్రియాశీలురుగా వుండేలా తీర్చిదిద్దడం -సాంఘిక భద్రత-అపహరణల నుంచి రక్షణ -చక్కటి వాతావరణంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు -ఉచిత ప్రాథమిక విద్య -పిల్లల వ్యక్తిత్వ, ప్రతిభ, మానసిక శారీరక సామర్థ్యం పూర్తిస్థాయిలో వికసించేటటువంటి చదువు -యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలవంటి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి దూరమైనప్పుడు, చట్టంతో సంఘర్షణ చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక రక్షణ హక్కు -బాల కార్మిక సమస్య, మత్తు పదార్థాల దుర్వినియోగం, లైంగిక దోపిడీ, పిల్లలను అమ్మడం, అపహరించడం, వ్యభిచారంలోకి దింపడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రత్యేక రక్షణ ....కోరే హక్కు పిల్లలకుంది.
- బాలల హక్కులు చరిత్ర... తీర్మానాలు.
బాలల హక్కుల ను గుర్తించడం 1924లో నానాజాతి సమితి మానవహక్కుల ప్రకటనతో ప్రారంభమైందని భావించవచ్చు. పిల్లల బానిసత్వానికి, బాలకార్మిక వ్యవస్థకు, పిల్లల వ్యభిచారానికి, విక్రయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పిలుపు ఇవ్వడం బాలల హక్కులకు నాందిగా నాడు పలువురు అభిప్రాయపడ్డారు. తదుపరి ఐక్యరాజ్యసమితి బాలలహక్కుల పై 1959లో ప్రకటన చేసింది. 1979వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. 1989 నవంబరులో బాలల హక్కుల పరి రక్షణ పై సమావేశం నిర్వహించి ఆమోదించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం. 1990 సెప్టెంబరులో బాలల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్య సమితి ప్రపంచ సదస్సు నిర్వహించింది. 1992లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ పై భారత్ కూడా సంతకం చేసింది. దీనిని సంక్షిప్తంగా ''సి.ఆర్.సి'' అంటారు.
ప్రతిపాదనలు, హక్కులు
మానవ జాతి చరిత్రలో సి.ఆర్.సి ఒక మైలు రాయి వంటిది. పిల్లలకు ఇవ్వాల్సిన గౌరవం, కల్సించాల్సిన రక్షణ, అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు అన్నీ ఇందులో ఉన్నాయి. సి.అర్.సి లో ఉన్న 54 నిబంధనలను నాలుగు రకాలుగా విభజించారు. తొలివర్గం ''సర్వైవల్ రైట్స్'' ఇవివారి ఉనికికి సంబంధించిన హక్కులు. రెండోరకం హక్కులు అభివృద్ధికి చెందిన ''డెవలప్‌మెంట్ రైట్స్'' మూడో రకం హక్కులు పరిరక్షణ అంటే ''ప్రోటెక్షన్ రైట్స్'' ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ఈ హక్కుల పై 160 దేశాలు సంతకాలు చేశాయి. భారతదేశం 1992 డిసెంబరు 11న ఆమోదిస్తూ సంతకం చేసింది. మనదేశం ఆమోదించిన హక్కులు గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము.
బాలల హక్కులు
18 సంవత్సరాలలోపు బాలందరికీ ఈ హక్కులు వర్తిస్థాయి. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బాలల ప్రయోజనాలు బాలల హక్కుల కార్యా చరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. హక్కుల అమలుకై తీర్మానాలు, గుర్తించిన హక్కుల అమలుకి శాసన పరమైన, పాలనా పరమైన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి వుండటం, తల్లిదండ్రలతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తి లో దించడం, జీతాలకు పెట్టడం నేరం. బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని కలిగివుండవచ్చు, తమ వృద్ధికై సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
బాలలకు విజ్ఞానాన్ని అందిచడానికి ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆబాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా,దౌర్జన్యం చేసినా, వేధించినా నేరం. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్ధులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృద్థికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
బాలలు ఆరోగ్యంగా జీవించే హక్కు వుంది, సామాజిక భద్రత పోందే హక్కువుంది. ఉచిత నిర్బంధ విద్యను పొందడం బాలల హక్కు. బాలలకు విశ్రాంతిగా వుండే హక్కువుంది. ఆటలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కువుంది. ప్రమాదకరమైన పనులు గనుల్లో, పేలుడు పదార్ధాల తయారీలో, హోటళ్ళలో బాలల్ని పని చేయించరాదు. మాధక ద్రవ్యాల నుండి బాలలను దూరం చేయాలి. వారికి అందుబాటులో వుంచడం, వారి ద్వారా తెెప్పించు కోవడం నేరం.
బాలల్ని నిర్భంధించరాదు.లైంగిక ధూషణ చేయరాదు. బాలల సంక్షేమానికై దోపిడి ఏ రూపంలో వున్నా ప్రభుత్వాలు నిషేధించాలి. 18 సంవత్సరాలలోపు వయస్సు బాలల్ని విడుదల చేయటానికి వీలులేని నేరాలకు ఉరి శిక్షగాని, యావజ్జీవ శిక్షగాని విధించరాదు. దేశంలో గాని, అంతర్జాతీయంగా గాని బాలలకు ఇంత కంటే మెరుగైన హక్కులను అందించే చట్టాలు ఉంటే ఆ హక్కులను పొందటానికీ బాలలకు హక్కు ఉంది. ఇవి బాలల హక్కులపై ఐక్య రాజ్యసమితి ఒడంబడిక యొక్క సంక్షిప్త రూపం.
మన దేశంలో పిల్లల స్ధితిగతులు....
దేశంలో పుట్టిన 12 మిలియన్ల బాలికల్లో 3 మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజును, ఒకమిలియన్ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు, లింగ విచక్షణ వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావుకి గురవుతుంది. 50% బాలబాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలురలో 5 గురిలో ఒకరు, బాలికలలో ఇద్దరిలో ఒకరు పోషకాహారం పొందడం లేదు. ఇక 2 సం|| వయస్సు లోపు శిశువులలో 58% మందికి పూర్తిగా వాక్సి నేషన్ అందడం లేదు. 24% పిల్లలకి ఎలాంటి వాక్సినేషన్ ఇవ్వలేదు. దేశంలో 60% పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. దేశంలోని వ్యాపార లైంగిక వ్యక్తుల్లో 40% బాల బాలికలే. ''ఇంటర్ నేషనల్ సెంటర్ ఆన్ లేబర్'' నివేదిక ప్రకారం దేశంలో 25 మిలియన్లు నుంచి 30 మిలియన్ల వరకు బాల కార్మికులున్నారు. దేశంలో 50% బాలలు పాఠశాలలకే వెళ్ళడంలేదు. ఇలా చెప్పుకొంటూ పొతేే దేశంలో బాలల జీవితం కన్నీటిమయం.
అందరూ స్పందించాలి :
నేటి బాలలే రేపటి పౌరులు. నవభారత నిర్మాతలు. ఈ మాటలు వినడానికి వింపుగా వున్నాయి. కాని పైన వివరించిన స్థితిగతులు పరిశీలిస్తే రేపటి పౌరులకు మనం ఇస్తున్న ప్రోత్సాహం ఇదా? యని ఆలోచించక తప్పదు. ప్రపంచంలో మరే దేశంలో లేనంత పెద్ద సంఖ్యలో పిల్లలున్న దేశం మనదే. దేశంలో నేడు 18 సంవత్స రాలలోపు వున్న వారి సంఖ్య 45 కోట్లు. ఇటువంటి యవతరాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చి దిద్దాల్సిన భాధ్యత అందరిపై ఉన్నది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సకాలంలో వాక్సినేషన్ ఇప్పించాలి. విద్యను అందించాలి. ప్రభుత్వం ఆర్యోగ్య, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి. సమాజంలోని అందరూ బాలల సంక్షేమం తమ సంక్షేమంగా భావించి సంవత్సరంలో ఒక్కరోజు తమ సంపాదనను పిల్లల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. 'నేటి బాలలే రేపటి పౌరులు'' అనేది నినాదం కాకుండా విధానంగా మారితే దేశంలో బాలల జీవితం ఆనందదాయకం. మరి ఆరోజుకై అందరం స్పందిద్ధాం..... చేయూత నిద్ధాం....
- ====================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .