Sunday, September 26, 2010

ప్రపంచ వయోధికుల దినోత్సవం , World Old age people Day



అక్టోబరు 1 ప్రపంచ వయోధికుల దినోత్సవస్.


కుటుంబం కోసం జీవితాన్ని ధారపోశారు, సమాజం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. దశాబ్దాల పరుగులో అలసిసొలసిపోయారు. ఆ వయోధికులకు విశ్రాంతినివ్వండి. కాసింత ప్రేమనివ్వండి. ఒంటరితనాన్ని దూరంచేయండి. జీవితమంటే మమకారం నింపండి. ఎందుకు బతికున్నామా అన్న భావనమాత్రం రానివ్వకండి. అంతకుమించి ఆ పెద్దలేం కోరుకుంటారు పాపం!

బాల్యంలో... ఎన్నిసార్లు పడ్డారో. ఎన్ని గాయాలు వేధించాయో. అయినా కుంగిపోలేదు.
కౌమారంలో... ఎన్ని వైఫల్యాలు భరించారో. ఎన్ని ఎదురుదెబ్బలు రుచిచూశారో. అయినా కూలిపోలేదు.
యవ్వనంలో... ఎన్ని ఎత్తుపల్లాలు ప్రయాణించారో. ఎన్ని అవమానాలు తట్టుకున్నారో. అయినా ఓడిపోలేదు.
జీవితాన్ని కాచివడపోసిన అనుభవ సంపన్నులు, మిన్ను మీదపడినా చలించని ధైర్యవంతులు, ప్రపంచాన్ని చదివిన బుద్ధిజీవులు, అరవైడెబ్భై ఏళ్ల మేరుపర్వతాలు... ఇప్పుడు, వేరు తెగిన వృక్షాల్లా కూలిపోతున్నారు. జీవితంలో చిత్తుగా ఓడిపోతున్నారు. నిస్సహాయులై కన్నీళ్లు పెడుతున్నారు. కళ్లు తుడవండి. గుండెలకు హత్తుకోండి. ఊరడించండి. ఉత్సాహం నింపండి. మేమున్నామని ధైర్యం చెప్పండి.

* * *

ప్రావిడెంట్‌ఫండు డబ్బుతో ముచ్చటపడి కొనుక్కున్న పన్నెండువందల చదరపు అడుగుల ఫ్లాటులో అతని ఉనికే ప్రశ్నార్థకమైపోయింది. కొడుకూకోడళ్లది కెరీర్‌ పరుగు. మనవళ్లది చదువుల పరుగు. బంధువులు, పొరుగువారు, చివరికి పనివాళ్లు కూడా క్షణమైనా తీరికలేనట్టు కనిపిస్తుంటే... నిబిడాశ్చర్యంతో చూడటం తప్పించి మరేం చేయలేని నిస్సహాయత .... అందులోనూ అపార్ట్‌మెంట్‌ బతుకులాయెు. మాట్లాడేవారు లేరు. మాట్లాడితే వినేవారు లేరు. ఒక పలకరింపులేదు. ఒక కుశలప్రశ్నలేదు. ఓదార్పులేదు. జీవితంలో ఏ మార్పూ లేదు. పింఛను డబ్బులు ఆగిపోకుండా... ఏడాదికోసారి ప్రభుత్వానికి సమర్పించే 'సర్వైవల్‌ సర్టిఫికెట్‌' మాత్రమే బతికున్నందుకు ఏకైక సాక్ష్యం. ఆరేడుదశాబ్దాల జీవితం, బోలెడన్ని అనుభవాలు, జ్ఞాపకాలు, సవాళ్లు, సగర్వ విజయాలు... ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు మాత్రం వింటారు? ఎవరికంత తీరికుంది? కొన్నిసార్లు గోడలే శ్రోతలవుతాయి. శూన్యమే సభాప్రాంగణం అవుతుంది. తమలో తాము మాట్లాడుకుంటారు. తమను తాము ఓదార్చుకుంటారు. ఆ ఒంటరితనం, నిర్లక్ష్యం, భావోద్వేగాల్ని పంచుకోడానికి ఓ మనిషంటూ లేని ఏకాకితనం... మానసిక రుగ్మతలకు దారితీస్తోంది. బలవన్మరణాలకు కారణం అవుతోంది. ఆమధ్య తిరుపతి పట్టణంలో ఒకేసారి ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఒకటే... భరించలేనంత ఒంటరితనం! ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ బయటికి రావు. బతికున్నప్పుడు పట్టించుకునే తీరికలేనివారికి, చచ్చాక మాత్రం అంత సమయం ఎక్కడుంటుంది? పిండం పెట్టి, చేతులు దులిపేసుకుంటారు.

నరకమంటే సలసలా కాగే నూనెలో ముంచడవో, ముళ్లకంచె మీద నడిపించడవో కాదు. నిన్నవెున్నటిదాకా ప్రేమించినవాళ్లు, గౌరవించినవాళ్లు... ఇప్పుడు మన ఉనికినే గుర్తించకపోవడం, మనం ఎదురుగా ఉన్నా లేనట్టే ప్రవర్తించడం. ఆ నిర్లక్ష్యమే పెద్దలను కుంగదీస్తోంది. వృద్ధులను మరింత వృద్ధులను చేస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు బీటలు వెుదలైన నాటి నుంచే వృద్ధాప్యానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా వయసుకు గౌరవం ఉండేది. అనుభవానికి గుర్తింపు ఉండేది. సలహాల కోసం సూచనల కోసం చేతులుకట్టుకుని నిలబడేవారు. కాళ్లకు దండంపెట్టి ఆశీస్సులు అందుకునేవారు. అత్తమామలంటే కన్నవారితో సమానం. గౌరవించాలి, ప్రేమించాలి, సేవించాలి. కోడలుపిల్ల ఆ బాధ్యతని వినయంగా స్వీకరించేది. ఇష్టమున్నా లేకపోయినా ఆదరించేది. ఎందుకంటే ఆ భర్తకు భార్యగా, ఆ ఇంటికి కోడలిగా ఏరికోరి తెచ్చుకున్న పుణ్యదంపతులు వాళ్లు. అంతకుమించి, తాళాలగుత్తి కూడా వాళ్లచేతుల్లోనే ఉంది. ఇప్పుడలా కాదే. చాలావరకు ప్రేమపెళ్లిళ్లే. అమ్మానాన్నలైనా, అత్తామామలైనా అతిథుల్లా వచ్చి అక్షింతలు వేయాల్సిందే. దీంతో, కొత్తకోడలికి ఆ వయోధికులు బొత్తిగా సంబంధంలేనివారైపోతున్నారు. వాళ్ల కారణంగానే ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ ఇరుకైపోతుంది. వాళ్ల ఆసుపత్రి బిల్లు దండుగ ఖర్చులా అనిపిస్తుంది. వాళ్ల పెద్దరికం చాదస్తంగా తోస్తుంది. వాళ్ల ఉనికి ఏకాంతానికి అడ్డంకి అవుతుంది. కనీసం భర్తయినా కన్నవారి పట్ల ప్రేమగా ఉంటే, గౌరవం చూపిస్తే ఆమె మనసూ ఎంతోకొంత మారేదేవో. ఆ ఆశా లేదు. అతని జీవితం అతనిది. అతని వ్యూహాలు అతనివి. ఇద్దరూ అలా ఉంటే, ముద్దుల మనవడో మనవరాలో మాత్రం వేరుగా ఎందుకుంటారు? పట్టణాల్లో అయితే మరీఘోరం. కుటుంబాలతోపాటు బుద్ధులూ చిన్నవైపోతున్నాయి. హెల్పేజ్‌ ఇండియా సంస్థ హైదరాబాద్‌ సహా అనేక నగరాల్లో వృద్ధుల పరిస్థితుల మీద సర్వే జరిపింది. ఎనభైశాతం వయోధికులు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. ఏదో ఓ రూపంలో వేధింపులకూ దోపిడీకీ గురవుతున్నారు. చిత్రవధ అనుభవిస్తున్నారు.


దేశ జనాభాలో పదిశాతం ఉన్నా, ప్రత్యేకమైన వసతుల్లేవు. బస్సులో సీట్లుంటాయి. కానీ, కూర్చోడానికి ఖాళీ ఉండదు. లేచి సీటివ్వాలన్న ఇంగితం ఎవరికీ ఉండదు. బ్యాంకులు, రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు... ఎక్కడికెళ్లినా పెద్దపెద్ద వరుసలు. 'బాబాయ్‌, పర్లేదు మీరెళ్లండి' అనడానికి ఏ ఒక్కరికీ నోరు రాదు. కాళ్లు పీకుతున్నా, కళ్లు బైర్లుగమ్ముతున్నా ఓపిగ్గా నిలబడాల్సిందే. హైదరాబాద్‌, వైజాగ్‌ తదితర నగరాల్లో రోడ్డు దాటడమంటే ఓ గండమే. మంత్రులకోసం, ముఖ్యమంత్రుల కోసం గంటలతరబడి వాహనాల్ని ఆపే ట్రాఫిక్‌ సిబ్బంది... పెద్దల విషయంలో మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తారు. చేయిపట్టుకుని దాటించాలన్న ఆలోచనే రాదు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు...ఎక్కడా వృద్ధులు నడవడానికీ, కూర్చోడానికీ అనువైన పరిస్థితుల్లేవు. అవున్లే, ఆ పెద్దలేం ఓటుబ్యాంకు కాదుగా! పాలకులు ప్రేమ కురిపించడానికి, రాజకీయపార్టీలు ధర్నాలు చేయడానికి. నోరెత్తలేని బలహీనులు. ప్రశ్నించలేని పరమ సాత్వికులు. ఇప్పటికీ మనదేశంలో వృద్ధులకు అనువైన ఆరోగ్యబీమా పాలసీ లేదు. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కూడా ఆరుపదులు దాటినవారిని ఎలాగోలా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. లేదంటే, ప్రీమియం పెంచేసి బెంబేలెత్తిస్తున్నాయి. ముప్ఫైరెండు పళ్లూ రాలిపోయినా, పన్నుపోటు మాత్రం తప్పడం లేదు. ప్రత్యేక మినహాయింపులు తూతూమంత్రమే. అయినా, దేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ జీవనప్రమాణాలు పెరిగిపోయాయనీ గొప్పలు చెప్పుకునే పాలకులు... ఉద్యోగుల పదవీవిరమణ వయసును మాత్రం పెంచడంలేదు. పనిచేయగల సామర్థ్యం ఉన్నా యాభైఎనిమిది, అరవై ఏళ్లకే ఇంటిదారిపట్టాల్సివస్తోంది. ఆ అపార అనుభవం, కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన సామర్థ్యం వృథాగా పోతున్నాయి. 'తల్లిదండ్రులు, వయోధికుల నిర్వహణ చట్టం' ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. డెబ్భై ఎనిమిదేళ్ల ప్రధాని పాలిస్తున్న దేశంలో, డెబ్భై ఏడేళ్ల ముఖ్యమంత్రి పాలనబాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్రంలో వయోధికులకు ఓ సామాజిక భద్రత వ్యవస్థంటూ లేకపోవడం ఎంత దురదృష్టకరం.

బంధు రాబందులు...
సమాజం చేసే మోసాల్ని పసిగట్టవచ్చు. జాగ్రత్తపడి తప్పించుకోవచ్చు. చట్టాలున్నాయి. పోలీసులున్నారు. కానీ, బిడ్డలే బరితెగిస్తే. ఆత్మీయులే రాక్షసులైతే. అడ్డేముంది, అదుపేముంది. ఏ చట్టం ఆదుకుంటుంది. 'నాన్నా! ఇక్కడ సంతకంపెట్టు' అని కన్నకొడుకే అడిగితే, ఏ తండ్రయినా కాదంటాడా. ఏ పింఛను కాయితాలో అనుకుంటాడు. ఫలితం... నాలుగు రోజుల్లో బుల్‌డోజరు రూపంలో కనిపిస్తుంది. ఇటుకా ఇటుగా పేర్చి కట్టుకున్న ఇల్లు రాకాసి యంత్రాల పిడిగుద్దులకు కుప్పకూలిపోతుంది, వెనువెంటనే ఆ వృద్ధుడి శరీరమూ. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసవో, నగల మూటల కోసవో...కన్నవారిని చంపే కసాయి కొడుకులు ఎంతోమంది. ఏ వారసులూలేని వారి విషయంలో... ఆస్తుల కోసం, వాటాల కోసం సమీప బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. అన్నీ ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే, మలిసంధ్యకోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేని నిరుపేదలకు దిక్కెవరు? ఏ చౌరస్తా దగ్గరో అడుక్కుని బతకాలి. ఏ అనాథ శరణాలయంలోనో జీవితాన్ని వెళ్లబుచ్చాలి.

ముడతల్ని అసహ్యించుకునే మనవళ్లు, చాదస్తపు మనిషంటూ దూరంగా ఉంచే కోడలు, పాతిల్లు 'డెవలప్‌మెంట్‌'కు ఇవ్వడంలేదనో, 'బిజినెస్‌' చేసుకుంటానంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసివ్వలేదనో అలిగి మాటలు మానేసిన కొడుకు, బెదిరించో భయపెట్టో ఉన్నదంతా దోచుకుందామనుకునే దుర్మార్గపు సమాజం... ఒక్క శత్రువునే భరించలేని దుర్బలులు, ఒక్క దెబ్బకే కూలిపోయే పండుటాకులు, ఒక్కగానొక్క గుండె నీరసంగా పనిచేస్తున్న బలహీనులు... ఇన్ని దాడులు ఎలా తట్టుకుంటారు? రక్తపోటుకుతోడు ఈ గునపపుపోట్లా? రక్తంలో తప్ప, బతుకులో తీపి తెలియని మనుషులకు ఇన్నిన్ని చేదు అనుభవాలా? జ్ఞాపకాల్ని మింగేసే అల్జీమర్స్‌ వ్యాధి మమకారాల్నీ మరిపిస్తే ఎంత బావుండు? అలాంటి కొడుకు పుట్టాడనో, అలాంటి కోడలు వచ్చిందనో, ఇలాంటి సమాజంలో బతకాల్సి వస్తోందనో బాధపడాల్సిన పనే ఉండదు.

చాలుచాలు. పడ్డ కష్టాలు చాలు. చేసిన త్యాగాలు చాలు. అనుభవించిన గుండెకోత చాలు. ఇప్పుడైనా, కనీసం ఈ దశలో అయినా వాళ్లని ప్రశాంతంగా ఉండనిద్దాం. పొత్తిళ్లలోని పాపాయిలా... హాయిగా, నిశ్చింతగా బతకనిద్దాం. ముదిమిలోని మాధుర్యాన్ని అనుభవించనిద్దాం. అందమైన బాల్యంలా, చికాకుల్లేని వృద్ధాప్యమూ ఓ హక్కే!

ప్రేమిద్దాం... గౌరవిద్దాం!
వాళ్లేం రాచమర్యాదలు అడగడం లేదు. విలాసాలూ వైభోగాలూ కోరుకోవడం లేదు. మనిషిగా గుర్తిస్తే చాలంటున్నారు. ప్రేమగా పలకరిస్తే అదే భాగ్యమంటున్నారు. పొద్దున్నే చిరునవ్వుల 'గుడ్‌మార్నింగ్‌'. మధ్యాహ్నం 'భోంచేశారా?' అన్న పలకరింపు. నీరసంగా కనిపిస్తే 'ఆరోగ్యం ఎలా ఉంది' అన్న పరామర్శ. రాత్రి కాసేపు లోకాభిరామాయణం. ఆదివారాలు ఓ అరగంట పాతజ్ఞాపకాల కార్యక్రమం. ఏ అమెరికాలోనో ఉంటే, టెలిఫోనో ఇంటర్నెట్టో ఉండనే ఉన్నాయి. నిజానికి వాళ్లను బాధపెడుతున్నది భౌతికమైన దూరాలు కాదు, గుండెల మధ్య వెలుస్తున్న కాంక్రీట్‌గోడలు, ప్రేమరాహిత్యపు ఇనుప కంచెలు. ఆ గోడల్ని కూల్చేద్దాం. ఆ కంచెల్ని పీకేద్దాం. వాళ్ల ఒంటరితనాన్ని దూరంచేద్దాం. మనకు జీవితాన్నిచ్చినవారికి, మనల్ని తీర్చిదిద్దడానికి జీవితాన్ని ధారపోసినవారికి... ఆమాత్రం తిరిగివ్వలేమా?

ప్రేమ, ఆత్మీయత మంచిచేసే అంటువ్యాధులు. ఒకరినుంచి ఒకరికి త్వరగా సంక్రమిస్తాయి. భర్త తన తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తుంటే, భార్యకూడా చచ్చినట్టు గౌరవిస్తుంది. పిల్లలూ అభిమానిస్తారు. ఆ సంస్కారం కుటుంబపెద్ద నుంచే వెుదలుకావాలి. సమాజమంటే వ్యక్తుల సమూహమేగా! వ్యక్తి సంస్కారమే సమాజంలోనూ ప్రతిబింబిస్తుంది.

పెద్దలకు విన్నపం!
బాల్యంలా, కౌమారంలా, యవ్వనంలా వృద్ధాప్యమూ ఓ దశ. ఆనందంగా ఆస్వాదించండి. మనసారా జీవించండి. ఇంతకాలం పరుగెత్తిపరుగెత్తి అలసిపోయారు. విశ్రాంతి తీసుకోండి. ఒకటో అధ్యాయమంతా అమ్మానాన్నల సంరక్షణలో గడిచింది. రెండో అధ్యాయమంతా లక్ష్యాల చుట్టూ తిరిగింది. మూడో అధ్యాయమంతా పిల్లల చుట్టే పరిభ్రమించింది. ఈ అధ్యాయం వెుత్తం... మీదే. మీకోసమే!

'స్నేహితుల కోసం గాలిస్తే... ఒక్కరు కూడా కనిపించలేదు. నేనే స్నేహితుడినైపోయాక... ఎటు చూసినా ఆత్మీయులే!'... అంటాడో తాత్వికుడు. ఆ మాట అక్షరాలా నిజం. మిమ్మల్ని ఎవరో పలకరించడం లేదని చిన్నబుచ్చుకోకండి. మీరు పలకరించాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించడం లేదని బాధపడకండి. మీరు ప్రేమించాల్సినవాళ్లు సమాజం నిండా ఉన్నారు. ముందు మీ పాత కళ్లజోడు మార్చేయండి. దాంతోపాటు... కుటుంబాన్నీ సమాజాన్నీ చూసే దృక్కోణాన్నీ మార్చుకోండి. ఈతరం ఆలోచనల్నీ విలువల్నీ జీవనశైలినీ అర్థంచేసుకోండి. ఒకతరంలో పంచెకట్టు ఫ్యాషన్‌. ఒక తరంలో బెల్‌బాటమ్‌ ఫ్యాషన్‌. ఈతరానికి వచ్చేసరికి ఇంకేదో ఫ్యాషనై కూర్చుంది. నలభై ఏళ్లక్రితం యువతరం ప్రతినిధిగా మీరు బెల్‌బాటమ్‌ వేసుకుని ఫ్యాషన్‌ ఓషన్‌ ఈదేసినట్టే, మీ మనవడు చిరుగుల జీన్స్‌ ట్రెండ్‌లో కొట్టుకుపోతున్నాడు. అంతే తేడా! ఆ తరాన్ని కోరమీసం వూపేసినట్టు, ఈ తరాన్ని పిల్లిగెడ్డం ఏలేస్తోంది. ఆ సూక్ష్మాన్ని అర్థంచేసుకుంటే చాలు. మురికిజీన్స్‌ మనవణ్ని చికాగ్గా చూడకండి. 'డ్రెస్‌ బావుంది. యు ఆర్‌ లుకింగ్‌ హ్యాండ్సమ్‌' అని అభినందించండి. ఒళ్లంతా టాటూలు వేయించుకొని వచ్చిన మనవరాల్ని సంప్రదాయాల పేరుతో బెదరగొట్టకండి. 'బావుందమ్మా! ఇది లేటెస్టా?' అని ముద్దుగా ఆశ్చర్యపోండి. కోడలు కాఫీ ఇవ్వడం లేదని చిన్నబుచ్చుకోవడం ఎందుకు, ఆఫీసు నుంచి అలసి వచ్చిన కోడలికి మీరే ఓ కప్పు వేడివేడి ఛాయ్‌ ఇవ్వండి? ఒకట్రెండు తరాల క్రితం 'ఒత్తిడి' అన్న మాట వినిపించేది కాదు. రేపటి గురించి భయపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇప్పుడలా కాదే. ఉద్యోగాల్లో అభద్రత, ఎడతెరిపిలేని పోటీ, వెంటాడే టార్గెట్లు... భార్యాభర్తలిద్దరూ పోటీపడి పరుగెత్తాల్సిన పరిస్థితి. ఆ పరుగులో తమనుతామే మరచిపోతున్నారు. జీవితభాగస్వామినీ పట్టించుకోవడం లేదు. అలాంటిది, మిమ్మల్ని మాత్రమే ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎందుకనుకోవాలి? కుటుంబ పరిస్థితుల కారణంగా వృద్ధాశ్రమాల్లో గడపాల్సి వస్తే, అంతకుమించిన శిక్ష లేదన్నట్టు కుంగిపోకండి. సంతోషంగా చేరిపోండి. కొత్త స్నేహితుల్నీ కొత్త వాతావరణాన్నీ ఆస్వాదించండి. సవాలక్ష మజిలీల్లో ఇదీ ఒకటనుకోండి. ఆశావాదం జీవితం మీద సరికొత్త ఆశలను కల్పిస్తుంది.

ఖాళీబుర్ర దయ్యాల కార్ఖానా అన్న సంగతి మీకెవరూ చెప్పాల్సిన పన్లేదు. వయసునూ అభిరుచుల్నీ ఆరోగ్యం విధించిన పరిమితుల్నీ దృష్టిలో పెట్టుకుని... ఏదో ఓ వ్యాపకాన్ని ఎంచుకోండి. అందులోని ఆనందాన్ని అనుభవించండి. చదవాల్సిన పుస్తకాలుంటే చదవండి. వినాల్సిన సంగీతం ఉంటే వినండి. చేయాల్సిన కోర్సులేమైనా ఉంటే చేయండి. చూడాల్సిన ప్రదేశాలేమైనా ఉంటే చూడండి. సరిగ్గా మనలాంటి వారితో, మనలా ఆలోచించే వారితో, మనలాంటి సమస్యలే ఎదుర్కొంటున్న వారితో మాట్లాడితే... మనసు తేలికపడుతుంది. వయోధికుల సంఘాలూ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్ల ఉద్దేశమూ అదే. అలాంటి సంఘం ఏదైనా ఉంటే సభ్యత్వం తీసుకోవచ్చు. లేకపోతే, నలుగుర్నీ కలుపుకుని మీరే ప్రారంభించవచ్చు. ముంబయిలోని ఓ వయోధికుల సంఘం సభ్యులు వారానికోసారి కలుసుకుంటారు. తమ దగ్గరున్న పుస్తకాలూ సినిమా సీడీలూ ఇచ్చిపుచ్చుకుంటారు. ఆలోచనలు పంచుకుంటారు. 'తిరిగి ఇంటికో వృద్ధాశ్రమానికో వెళ్తున్నప్పుడు... గుండెల్లోని బరువంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది' అంటారా సీనియర్లు. కోల్‌కతా శివార్లలోని కొన్ని కాలనీల్లో పెద్దలంతా కలిసి ఓ నిర్ణయానికొచ్చారు. ఒంటరి వృద్ధుల మీద పెరుగుతున్న నేరాల్ని అదుపు చేయడానికి ఓ ఉపాయం ఆలోచించారు. అలాంటివారి దగ్గర పనిచేసే వాచ్‌మన్లు, పనిమనుషులు, పాలకుర్రాడు, పేపర్‌బాయ్‌... తదితరుల వివరాలన్నీ సేకరించి ఓ రికార్డు నిర్వహిస్తున్నారు. అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఆ సమాచారం పోలీసులకు చాలా ఉపయోగపడుతుంది.

దశాబ్దాల అనుభవాన్నీ, అపారమైన నైపుణ్యాన్నీ ఏ స్వచ్ఛంద సంస్థ కోసవో వినియోగించవచ్చు. రోజూ కాసేపు, లేదంటే వారానికి ఒక రోజో రెండు రోజులో ఆ పనులకు కేటాయించవచ్చు. ఆరోగ్యం సహకరిస్తే, చేయగలిగే ఓపికుంటే ఉద్యోగ ప్రయత్నమూ చేయవచ్చు. చాలా కార్పొరేట్‌ సంస్థలు 'సెకెండ్‌ కెరీర్‌'ను ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది. మెదడు చురుగ్గా ఉండటం వల్ల అల్జీమర్స్‌ వంటి సమస్యలు దగ్గరికి కూడా రావు.

ఢిల్లీ వయోధికుల ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌' వాళ్లు ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులకోసం 'టెలిఫోన్‌ ద్వారా దత్తత' పథకాన్ని ప్రవేశపెట్టారు. దత్తత తీసుకున్న వ్యక్తులు... తమకు కేటాయించిన వృద్ధులతో తరచూ ఫోన్లో మాట్లాడతారు. వాళ్లు చెప్పేదంతా ప్రేమగా వింటారు. ఈ సంస్థలో పన్నెండువందల మంది వాలంటీర్లు ఉన్నారు. 'మాకు తాతయ్యలు దొరికారు!' అని యువతీయువకులు మురిసిపోతుంటే, 'బోలెడంత మంది మనవళ్లు' అని బోసినవ్వులు నవ్వుతున్నారు తాతాజీలు. ప్రపంచం విశాలమైనకొద్దీ మనసూ విశాలమైపోతుంది. అసలు వయసు కనిపించకుండా ఎక్కడో నక్కినక్కి దాక్కుంటుంది. వచ్చే వయోధికుల దినోత్సవం నాటికి మీ వయసు ఇంకాస్త పెరగదు. ఓ ఏడాది తగ్గుతుంది!

మీకు మీరే రక్ష!
డబ్బు: వృద్ధాప్యంలో ఆర్థిక స్వేచ్ఛ ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. చేతిలో ఉన్న సొమ్మును సురక్షితమైన, లాభదాయకమైన మార్గాల్లో మదుపు చేయాలి. గణనీయమైన వెుత్తానికి ఆరోగ్యబీమా పాలసీ తీసుకోవాలి. అగ్రిమెంట్లు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ, చెక్కుల జారీ... తదితర ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం: వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు వేరు. అలవాట్ల కారణంగానో జీవనశైలి కారణంగానో కొనితెచ్చుకునే సమస్యలు వేరు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. మితాహారం, పౌష్ఠికాహారం చాలా ముఖ్యం.

జాగ్రత్త: దోపిడీ దొంగలు ప్రధానంగా ఒంటరి వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంట్లో నగదు, విలువైన వస్తువులూ వద్దు. అపరిచితుల్ని గేటుదాటి రానివ్వకండి. నమ్మకం కుదిరాకే ఎవరినైనా పన్లో పెట్టుకోండి. సమీప పోలీసుస్టేషన్‌ నంబరు అందుబాటులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే, ఆధునిక భద్రత వ్యవస్థను ఏర్పాటుచేసుకోవచ్చు.

టెక్నాలజీ: టెక్నాలజీ భూతమేం కాదు. కాస్త ప్రయత్నిస్తే లోతుపాతులు తెలిసిపోతాయి. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఆన్‌లైన్‌లోనే బిల్లులు కట్టుకోవచ్చు. బ్యాంకు పనులు చేసుకోవచ్చు. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. మెయిల్స్‌, బ్లాగింగ్‌ ద్వారా ఆలోచనలు పంచుకోవచ్చు.

చట్టం: కుటుంబంలో, సమాజంలో ఏ రూపంలో వివక్ష ఎదురవుతున్నా... అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాల సహాయం తీసుకోవచ్చు. సీఆర్‌పీసీలోని (సెక్షన్‌ 125) మెయింటెనెన్స్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం... కన్నవారికి జీవనభృతి ఇవ్వమని పిల్లల్ని ఆదేశించే అధికారం మేజిస్ట్రేటుకు ఉంది.



  • ====================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .