Thursday, September 23, 2010

ప్రపంచ హృదయ దినోత్సవం , World Heart Day,హృద్రోగ నివారణా దినోత్సవంప్రపంచ హృదయ దినోత్సవం - సెప్టెంబర్ 26 . మొట్టమొదటి గా 1999 లో అప్పటి ప్రసిడెంట్ ఆఫ్ 'వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌ (WHF) ' అయిన Antonio Bayes de Luna దీన్ని సెప్టెంబర్ 24 న సెలెబ్రేట్ చేసారు . . . అప్పటినుండి ప్రతిసంవత్సరము సెప్టెంబర్ నెల చివరి ఆదివారము జరుపుతూ ఉన్నారు . గుండె జబ్బుల గురించి ప్రపంచ ప్రజలందరికి తెలియజేస్తూ ... అవి రాకుండా తీసుకోవలసిన ముందుజాగ్రత్తలను తెలియజేయుటే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము .

హృదయ సంబంధ వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ గా పేర్కొంటారు .కాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్ధముచేసుకోవచ్చు . మిగతా వ్యాధులలో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కబడినా... అవగాహనా లొపము వల్ల వాటిని హృదయసంబంధ సంస్యలుగా గుర్తించడం లేదు . గుండె జబ్బు' అంటే మనకు గుండె పోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. గుండెపోటు అతి పెద్ద సమస్యేగానీ గానీ వాస్తవానికి గుండెకు సంబంధించి అదొక్కటే కాదు, మరికొన్ని కీలక సమస్యలూ ఉన్నాయి.

* గుండెకు ఆపరేషన్‌ అంటే మనకు ఛాతీ మొత్తం తెరచి చేసే బైపాస్‌ ఆపరేషన్‌ ఒక్కటే జ్ఞప్తికొస్తుంది. కానీ వాస్తవానికి అత్యాధునిక విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఛాతీ తెరవాల్సిన అవసరం లేకుండానే బైపాస్‌ సర్జరీని ముగించే విధానాలూ మన ముందుకొస్తున్నాయి.


గుండెలో విద్యుత్తు!
మన గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేస్తుంటుంది. మామూలు పంపులు పని చేయటానికి విద్యుత్తు అవసరమైనట్టే మన గుండె నిరంతరం కొట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఇందుకు గుండె పైగదుల్లో కుడి వైపున సైనో ఏట్రియల్‌ నోడ్‌ (ఎస్‌ఏ నోడ్‌), ఏట్రియో వెంట్రిక్యులార్‌ నోడ్‌ (ఏవీ నోడ్‌) అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి నిరంతరం విద్యుత్‌ ప్రేరేపణలు వెలువడుతుంటాయి. 'ఎస్‌ఏ నోడ్‌' నుంచి వెలవడే విద్యుత్‌ ప్రేరణలు గుండె పైగదులైన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుకొని.. అవి రెండూ మూసుకునేలా చేస్తాయి. దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి వస్తుంది. అప్పుడు 'ఏవీ నోడ్‌' నుంచి వెలువడే విద్యుత్‌ ప్రేరణలు జఠరికలు మూసుకునేలా చేస్తాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో, లయాత్మకంగా, నిరంతరాయంగా జరుగుతుండటం వల్ల రక్తం ధమనుల్లోకి పంప్‌ అవుతుంది. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్‌ ప్రేరణలు గతితప్పి, గుండె లయ దెబ్బతినొచ్చు. దీన్నే 'అరిత్మియాసిస్‌' అంటారు. దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం(బ్రాడీకార్డియా), అనూహ్యంగా పెరగటం (టెకీకార్డియా) వంటి పరిస్థితులు తలెత్తవచ్చు.

వేగం తగ్గితే?
* రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం అందదు.
* శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది.
* అలసట, నిస్సత్తువగా అనిపిస్తుంది.
* నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.

వేగం పెరిగితే?
* గుండె దడ వస్తుంది.
* పూర్తి సామర్థ్యంతో గుండె కొట్టుకోలేకపోవటం వల్ల రక్తం అన్ని అవయవాలకు చేరదు. ఫలితంగా విపరీతమైన ఆయాసం వస్తుంది.
* కొన్నిసార్లు గుండెలో కొద్దిపాటి నొప్పిగా కూడా ఉండొచ్చు.
* తల చాలా తేలికగా ఉన్నట్టు, తిరిగినట్టు అనిపిస్తుంది.
* స్పృహ తప్పటం వంటివీ జరగొచ్చు.

నిర్ధారణ పరీక్షలు
* ఈసీజీ
* టూడీ ఎకో
* హోల్టర్‌ పరీక్ష (24 గంటల పాటు గుండె పనితీరుని తెలుసుకోవటానికి చేసే ప్రత్యేక ఈసీజీ పరీక్ష)
* అవసరమైతే 'ఎలక్ట్రో ఫిజియాలజీ' పరీక్షనూ చేయాల్సి ఉంటుంది.

చికిత్స
గుండె వేగం తగ్గినపుడు ఛాతీ పైభాగంలో చర్మం కింద 'పేస్‌ మేకర్‌' అమర్చి సరిదిద్దుతారు. వీటిల్లో సింగిల్‌ ఛాంబర్‌, డబుల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్లతో పాటు అత్యాధునికమైన ట్రిపుల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌, గుండె లయను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు.

ఐసీడీ: గుండె చాలా వేగంగా కొట్టుకోవటం అనేది ఒకోసారి గుండె ఆగిపోవటానికి దారితీయొచ్చు. ఇలాంటి సమయాల్లో గుండెకు చిన్నగా విద్యుత్‌ షాక్‌ ఇచ్చి దాన్ని గాడిలో పెడతారు. ఇది ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఆసుపత్రిలో లేని సమయాల్లో అలాంటి పరిస్థితి వస్తే ఉపయోగపడేందుకు 'ఇంప్లాంటేబుల్‌ కార్డియోవెర్టర్‌ డిఫిబ్రిలేటర్‌ (ఐసీడీ)'ని అమరుస్తారు. ఇది గుండె ఆగిపోవటానికి దారితీసే ప్రమాదకరమైన స్పందనని ముందే గుర్తించి ఒకసారి షాక్‌ను వెలువరిస్తుంది. దీంతో గుండె లయ మళ్లీ గాడిలో పడుతుంది.

* గుండెకు విద్యుత్‌ను సరఫరా చేసే మార్గాల్లో అడ్డంకులు ఏర్పడితే 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌' చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో రక్తనాళం ద్వారా సన్నటి తీగలను గుండెలోకి పంపించి తరంగాల సాయంతో... గుండె లయ తప్పటానికి కారణమయ్యే సంకేతాలను ధ్వంసం చేస్తారు.
.
చిన్నకోత!


హృదయం చాలా సున్నితమైనది. పైగా అది నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది! అందుకే గుండెకు ఆపరేషన్లు చెయ్యటమన్నది చరిత్రలో కాస్త ఆలస్యంగానే మొదలైంది. ఆపరేషన్‌ సమయంలో గుండెను ఆపితే... ఆ సమయంలో రక్తసరఫరా ఎలా? 1953లో గుండె పనిని కృత్రిమంగా బయటి నుంచి చేస్తుండే 'హార్ట్‌-లంగ్‌ మెషీన్‌'ను రూపొందించారు. దీంతో 'ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ' అన్నది సురక్షితంగా తయారైంది. అయితే ఇలా ఆపరేషన్‌ చేస్తే- ఎదరొమ్ము ఎముకల్ని కట్‌చేసి, ఛాతీ మీద 10-12 అంగుళాల కోత పెట్టక తప్పదు. ఈ ఛాతీ ఎముక తిరిగి అతుక్కోవటానికి, ఆ గాయం మానటానికి ఎక్కువ సమయమే పడుతుంది. వారంపది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి, ఆ తర్వాత 3 నెలల పాటు ఇంట్లో పూర్తి విశ్రాంతి తప్పదు. పైగా ఛాతీని తెరచి ఆపరేషన్‌ చేసేటప్పుడు చాలామందికి కృత్రిమంగా 'హార్ట్‌-లంగ్‌ మెషీన్‌' వాడటం వల్ల రక్తస్రావం, రక్తం ఎక్కువగా ఎక్కించాల్సి రావటం వంటి ఇబ్బందులూ ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, పక్షవాతం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చిన్నకోతతో గుండె ఆపరేషన్‌ పూర్తిచేసే 'కీ హోల్‌ సర్జరీ' ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఛాతీ ఎముకలను కట్‌చేసి తెరవాల్సిన పనిలేకుండా చిన్న రంధ్రాన్ని మాత్రమే చేసి.. థొరాకోస్కోపీ సాయంతో బైపాస్‌ సర్జరీ, కవాట మార్పిడి వంటివి చేయొచ్చు. పెద్దకోత ఉండదు కాబట్టి చాలా త్వరగా కోలుకుంటారు!

లాభాలేమిటి?
గుండె కొట్టుకోవటాన్ని ఆపాల్సిన పని లేదు కాబట్టి కృత్రిమమైన 'హార్ట్‌-లంగ్‌ మెషీన్‌'కు సంబంధించిన దుష్ప్రభావాలుండవు. కీహోల్‌ సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం ఎక్కించాల్సిన అవసరం రాకపోవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినటం, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ. కోత చిన్నగా ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. ఆసుపత్రిలో మూడు, నాలుగు రోజులుంటే సరిపోతుంది. అనంతరం రెండు, మూడు వారాలకే పనులకు వెళ్లిపోవచ్చు. పైగా నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు అంతగా ఉండదు. ఛాతీ మీద పెద్ద మచ్చా ఉండదు.

** గుండెలోని రక్తనాళాల్లో రెండు, మూడు చోట్ల పూడికలు ఏర్పడినా బైపాస్‌ సర్జరీ చేయటానికీ ఈ 'కీ హోల్‌ సర్జరీ' ఉపయోగపడుతుంది.

** కవాటాల మార్పిడి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలను సవరించటానికీ తోడ్పడుతుంది.

రక్తనాళానికీ కొత్త పద్ధతి
మామూలుగా బైపాస్‌ సర్జరీలో అతికేందుకు తొడ దగ్గర నుంచి రక్తనాళాన్ని తీసుకుంటారు. సాధారణంగా ఎంత పొడుగు రక్తనాళం అవసరమైతే అంత పొడుగు కోత పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండోస్కోపిక్‌ విధానంలో చిన్న రంధ్రం ద్వారానే మొత్తం రక్తనాళాన్ని తీసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 'ఎండోస్కోపిక్‌ వీన్‌ హార్వెస్టింగ్‌' అనే ఈ పద్ధతిలో పెద్ద గాయం అనేది ఉండదు. రక్తస్రావం, నొప్పి కూడా తక్కువే. ముఖ్యంగా ఇది వూబకాయలు, మధుమేహులు, స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుంది.
నివారణ మార్గాలు
గుండెలయ తప్పే ముప్పు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించటం అత్యవసరం.

** పొగ తాగటం మానెయ్యాలి
** ఒకేచోట కదలకుండా కూచోవటం తగదు
** సమతులాహారం తీసుకోవాలి
** కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి
** రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
** బరువు పెరగకుండా చూసుకోవాలి
** క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
** మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి
** తగినంత నిద్ర పోవాలి
** ఒత్తిడిని దరిజేరనీయరాదు
* ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే!
* మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 ల్లోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు.
భయపెట్టే రంధ్రాలు


బిడ్డకు గుండెలో రంధ్రం ఉందంటే తల్లిదండ్రులు అనుభవించే వేదనకు అంతుండదు. అయితే అన్ని రంధ్రాలూ భయపడాల్సినవి కావు. కొన్నింటికే చికిత్స అవసరమవుతుంది. అందుకే వీటి గురించి అవగాహన పెంచుకోవటం అవసరం.

ప్రతి 1,000 మంది శిశువుల్లో సుమారు 8 మందిలో పుట్టుకతో గుండె లోపాలు కనబడుతుంటాయి. చాలాసార్లు ఎందుకొచ్చిందో చెప్పటం కష్టం. గర్భిణికి రుబెల్లా వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకటం, లేదా జన్యుపరమైన కారణాల వల్ల శిశువుల్లో ఈ సమస్య రావచ్చు.

సహజం!
పిల్లలందరికీ పుట్టుకతో గుండెలో పైగదుల మధ్య ఒక రంధ్రంలాంటి మార్గం ఉంటుంది. ఇది సహజం. తల్లికడుపులో పెరుగుతున్నప్పుడు బిడ్డ వూపిరితిత్తులు పనిచేయవు. కాబట్టి అప్పుడు గుండెలోని ఈ మార్గమే (ఫొరామెన్‌ ఒవేల్‌) రక్తం బిడ్డ వూపిరితిత్తుల్లోకి వెళ్లకుండా గుండె ద్వారానే ప్రసరణ జరిగేలా చూస్తుంది. శిశువు పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవటం మొదలెట్టగానే ఈ ఖాళీ మూసుకుపోవటం ప్రారంభిస్తుంది. కొంతమందిలో కొంత ఆలస్యంగా మూసుకోవచ్చు. మొత్తానికి ఈ రంధ్రం గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదు. ఒకవేళ ఈ రంధ్రం మూసుకోకుండా అలాగే ఉండిపోయినా, లేక కింది గదుల మధ్య గోడకు రంధ్రం ఉన్నా, కర్ణికకూ-జఠరికకూ మధ్య రంధ్రాలున్నా 'గుండెలో రంధ్రం' సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది.

ఏఎస్‌డీ
గుండెలో పైగదులైన కర్ణికల మధ్య రంధ్రం ఉంటే దాన్ని ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (ఏఎస్‌డీ) అంటారు. పుట్టుకతో సహజంగానే ఉండే రంధ్రం పూడకపోవటం ఒకటైతే ఇదే గోడకు వేర్వేరు రంధ్రాలు కూడా ఉండొచ్చు. ఎడమ భాగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంధ్రం గుండా రక్తం ఎడమ నుంచి కుడి వైపు నెట్టుకొస్తుంది. ఫలితంగా కుడి కర్ణిక పెద్దగా మారుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, గుండె దడ, ఎదుగుదల లోపించటం వంటి లక్షణాలు మొదలవుతాయి. పుట్టుకతోనే రంధ్రం ఉన్నప్పటికీ ఈ లక్షణాలు చిన్నతనం నుంచే కనిపించాలనేం లేదు. కుడి కర్ణిక పెద్దగా అవుతుండటం వల్ల వయసు పెరుగుతున్నకొద్దీ ఇబ్బందులు మొదలవుతాయి. సాధారణంగా సుమారు 40 శాతం మందికి ఈ రంధ్రాలు రెండేళ్ల వయసు వచ్చేసరికి వాటికవే మూసుకుపోతాయి. కానీ రంధ్రం మూసుకుపోకుండా కుడి పైగది పెద్దగా అవుతూ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడితే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో దీనికి ఛాతీని తెరచి ఆపరేషన్‌ చేసేవారు. ఇప్పుడు రక్తనాళాల ద్వారా సన్నటి గొట్టం పంపి, రంధ్రాన్ని మూసేసే చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. వీటిని చిన్నవయసులోనే చేస్తే పెద్దగా అయిన గుండె 4-6 నెలల్లోనే తిరిగి మామూలు సైజుకు వచ్చేస్తుంది.

వీఎస్‌డీ
గుండె కింది గదులైన జఠరికల మధ్య గోడలో రంధ్రం ఏర్పడటాన్ని వెంట్రిక్యులర్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (వీఎస్‌డీ) అంటారు. సాధారణంగా ఎడమ జఠరిక మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంప్‌ చేస్తుంటుంది. కానీ జఠరికల మధ్య రంధ్రం ఉన్నప్పుడు ఆ రక్తం కుడి జఠరికలోకి, అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి తోసుకొస్తుంటుంది. దీంతో వూపిరితిత్తుల్లోని రక్త నాళాలు దెబ్బతింటాయి. ఈ రంధ్రం కారణంగా జఠరికలు బలంగా పనిచేస్తూ.. క్రమేపీ గుండె పెద్దగా అవటం ప్రారంభిస్తుంది. దీనివల్ల: ఎగశ్వాస, చర్మం పాలిపోవటం, నాడి వేగంగాకొట్టుకోవటం, తరచూ వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఎదుగుదల సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. చాలామందిలో ఈ రంధ్రాలు 7 ఏళ్లు వచ్చేసరికి వాటికవే మూసుకుపోతాయి. కొందరిలో ఇవి పూర్తిగా మూసుకుపోకపోయినా పెద్దగా ప్రమాదం కలిగించని చిన్న రంధ్రాలుగా మారుతాయి. ఒకవేళ రంధ్రం పెద్దగా ఉంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం కోసం వూపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనికి బ్యాండ్‌ బిగిస్తారు. దీంతో వూపిరితిత్తుల్లోకి రక్త సరఫరా తగ్గి, వాటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఆ బ్యాండ్‌ని తొలగించి, ఛాతీని తెరచి రంధ్రాన్ని మూసేస్తారు.

** కొన్నిసార్లు గుండె గోడల మధ్య రకరకాలుగా పెద్ద రంధ్రాలూ కూడా పడుతుంటాయి. వీటినే 'కెనాల్‌ డిఫెక్ట్స్‌' అంటారు. ఇటువంటి రంధ్రాలున్న పిల్లలు శ్వాస సరిగా తీసుకోలేరు. ఎదుగుదల కూడా లోపిస్తుంది. దీనిని పిల్లలు పుట్టిన తొలి నెలల్లో ఆపరేషన్‌ చేసి సరిచేస్తారు.

డా|| వి.రాజశేఖర్‌,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,యశోదా హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌, సికింద్రాబాద్‌,-
డా|| ఎ.జి.కె.గోఖలే ,కార్డియోథొరాసిక్‌ సర్జన్‌,గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌,
డా|| పి.ఎన్‌.రావు,కార్డియో థొరాసిక్‌ సర్జన్‌,కామినేని హాస్పిటల్స్‌, హైదరాబాద్‌,

ప్రపంచ హృదయ దినం-September 26. న ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ దేవి శెట్టి- మన ప్రశ్నలకు జవాబులిస్తున్నారు .

అలవాట్లే మనల్ని జబ్బలకు గురిచేస్తున్నాయి. నిరంతరాయంగా పనిచేసే గుండెకు మనమే హాని తలపెడుతున్నాం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేని జీవనశైలి, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్నాం. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 26న ప్రపంచ హృదయ దినం జరుగుతుంది. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యం గురించి సామన్యుల్లో ఉండే ప్రశ్నలకు జవాబులిస్తున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ దేవి శెట్టి. ఆ వివరాలు..

ప్రశ్న : మాములు మనిషి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి సూత్రాలున్నాయా?

జవాబు : ఉన్నాయి. అవి..ఆహారం అంటే, తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు తక్కువ నూనె తీసుకోవాలి. వ్యాయామం అంటే అరగంట నడవడం. వారానికి కనీసం ఐదు రోజులు. బరువులెత్తడం, ఎక్కువసేపు ఒకే చోటు కూర్చోవడం మానాలి. పొగతాడం మానండి.బరువు నియంత్రించుకోవాలి. రక్తంలో షుగర్‌, రక్తపోటు నియంత్రించండి.

ప్ర : మాంసాహారం గుండెకు మంచిదా?

జ : కాదు.

ప్ర : ఆరోగ్యకరంగా ఉండే మనిషికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చిందని చెప్పినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

జ : దీన్ని నిశ్శబ్ధ గుండెపోటు అంటారు. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కళ్లు రొటీన్‌ హెల్త్‌చెకప్స్‌ చేసుకోవాలి.

ప్ర : గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయా?

జ : అవును.

ప్ర : గుండెమీద ఒత్తిడి ఎన్ని విధాలుగా ఉండొచ్చు. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి?

జ : జీవితంలో వచ్చే మార్పుల పట్ల ఆందోళనపడటం మానండి. జీవితం పట్ల మీ దృక్పథాన్ని అవసరమైతే మార్చుకోండి. జీవితంలోని ఏ అంశంలో కూడా కచ్చితత్వం కోసం పాకులాడొద్దు.

ప్ర : నడక మంచిదా ? పరుగు మంచిదా ? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తీవ్రంగా ఉండాలా?

జ : పరుగు కంటే నడక మంచిది. పరుగు వల్ల త్వరగా అలసిపోతాం. కీళ్లు దెబ్బతింటాయి.

ప్ర : రక్తపోటు తక్కువుంటే గుండె జబ్బులొస్తాయా?

జ : చాలా అరుదు.

ప్ర : కొలెస్ట్రాల్‌ బాల్యంలో ఉంటుందా? లేదా 30 ఏళ్ల తర్వాతే కొలెస్ట్రాల్‌ గురించి పట్టించుకుంటే సరిపోతుందా?

జ : కొలెస్ట్రాల్‌ బాల్యం నుంచే పెరుగుతుంది.

ప్ర : ఏవి పడితే అవి తినే అలవాటు వల్ల ఏమి జరుగుతుంది?

జ : శరీరంలో జీర్ణవ్యవస్థ తికమకపడుతుంది. ఎంజైముల విడుదల సక్రమంగా ఉండదు.

ప్ర : మందుల్లేకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చా?

జ : నియంత్రిత ఆహారం, నడక, దాంతో పాటు వాల్‌నట్‌ తినాలి.

ప్ర : యోగ గుండె సమస్య లను నిరోధిస్తుందా?

జ : యోగ ఉపయోగపడొచ్చు.

ప్ర : గుండెకు ఏ ఆహారం మంచిది? ఏ ఆహారం చెడ్డది?

జ : పళ్లు, ఆకు కూరలు మంచివి. నూనెలు చెడ్డవి.

ప్ర : ఏ నూనె మంచిది? వేరుశనగ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనె, ఆలివ్‌ నూనె ?

జ : అన్ని నూనెలు చెడ్డవే.

ప్ర : మామూలుగా ఏ, ఏ హెల్త్‌చెకప్స్‌ చేయించుకోవాలి. ప్రత్యేకమైన పరీక్షలున్నాయా?

జ : షుగర్‌, కొలెస్ట్రాల్‌ చూపించుకోండి. రక్తపోటు చూపించుకోండి. 'ఎకొ' పరీక్ష తర్వాత ట్రెడ్‌మిల్‌ పరీక్ష చేయించుకోండి.

ప్ర : గుండెపోటు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఏమిటి?

జ : మనిషిని పడుకోబెట్టండి. ఒక ఆస్ప్రిన్‌ మాత్ర, సార్బిట్రేట్‌ మాత్ర దొరికితే నాలుక కింద పెట్టండి. గుండెపోటు వచ్చిన ఒక గంటలోపే సాధారణంగా ప్రాణాపాయం జరుగుతుంది. కాబట్టి అత్యవసరంగా మంచి ఆసుపత్రికి తరలించాలి.

ప్ర : గుండెపోటుకు, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌కు తేడా తెలుసుకోవడం ఎలా?

జ : ఇసిజి లేకుండా చాలా కష్టం.

ప్ర : యువకుల్లో కూడా గుండె సమస్యలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి? 30, 40 సంవత్సరాల వారిలో కూడా గుండెపోటు చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమిటి?

జ : గుండె జబ్బుల గురించి అవగాహన పెరగడం కూడా దీనికి ఒక కారణం. శారీరక శ్రమలేని జీవన శైలి, పొగతాగడం, జంక్‌ఫుడ్‌, వ్యాయామం లేకపోవడం కారణాలు. యూరోపియన్స్‌ కంటే, అమెరికన్ల కంటే మనకు జన్యుపరంగానే గుండెపోటు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.

ప్ర : రక్తపోటు సాధారణ స్థాయి (120/80) కంటే ఎక్కువున్నా, ఆరోగ్యకరంగా ఉండొచ్చా?

జ : ఉండొచ్చు.

ప్ర : దగ్గరి బంధువుల్లో పెళ్లీలు చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు గుండె సమస్యలు వస్తాయంటారు. నిజమేనా?

జ : అవును. ఇటువంటి పెళ్లీలు జన్యుదోషాలకు దారితీయొచ్చు.

ప్ర : చాలా మంది జీవనశైలి ఓ పద్ధతి, పాడు లేకుండా ఉంటుంది. పనిచేసే చోటి నుండి రాత్రిళ్లు ఆలస్యంగా రావాల్సి ఉంటుంది. ఇది గుండె మీద ప్రభావం చూపుతుందా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెబుతారు?

జ : మీరు యువకులుగా ఉన్నంత వరకు ప్రకృతే మిమ్మల్ని ఇటువంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ జీవన క్రమాలను అనుసరించడం నేర్చుకోవాలి.

ప్ర : రక్తపోటు మందులు వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా?

జ : అవును. చాలా బిపి మందులకు సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి. కానీ సురక్షితమైన మందులు కూడా ఈ మధ్య వస్తున్నాయి.

ప్ర : కాఫీ, టీ ఎక్కువ తాగడం వల్ల గుండెపోటు వస్తుందా?

జ : రాదు.

ప్ర : ఆస్తమా రోగులకు గుండె జబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయా?

జ : పెరగవు.

ప్ర : మీ దృష్టిలో జంక్‌ ఫుడ్‌ అంటే ఏమిటి?

జ : కింటుకె, మాక్‌డొనాల్డ్‌ అంగళ్లల్లో దొరికే వేపుళ్లు, అలాగే సమోస, మసాల దోశ కూడా.

ప్ర : భారతీయులకు మూడు రెట్లు గుండె జబ్బు ప్రమాదం ఉందన్నారు. దీనికి కారణం ఏమిటి? యూరొపియన్లు, అమెరికన్లు మన కన్నా ఎక్కువ జంక్‌ఫుడ్‌ తింటారు కదా?

జ : ప్రతి జాతికి ఏవో కొన్ని జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. దురదృష్టవశాత్తు భారతీయులకు చాలా ఖరీదైన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి.

ప్ర : అరటిపళ్లు తింటే బిపి తగ్గుతుందా?

జ : తగ్గదు.

ప్ర : అనుకోకుండా ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే అతనేం చేయాలి?

జ : వెంటనే విశ్రాంతిగా పడుకోవాలి. ఏదైనా ఆస్ప్రిన్‌ మాత్ర నాలుక కింద పెట్టుకోవాలి. దగ్గర ఉన్న వాళ్లను పిలిచి మంచి ఆసుపత్రికి ఆలస్యం చేయకుండా తీసుకెళ్లాలని కోరాలి. అంబులెన్స్‌ కోసం సమయం వృధా చేయొద్దు.

ప్ర : తెల్ల రక్తకణాలు, హిమోగ్లోబిన్‌ తక్కువ ఉంటే గుండె సమస్యలు వస్తాయా?

జ : రావు. కానీ హిమోగ్లోబిన్‌ నార్మల్‌గా ఉంటే నీకు వ్యాయామం చేసే శక్తి పెరుగుతుంది.

ప్ర : కొన్నిసార్లు తీరికలేని పని ఒత్తిళ్లలో ఉండి వ్యాయామం చేయడం కుదరదు. ఇంట్లో పనులు చేసుకుంటూ నడవడం, మెట్లెక్కడంలాంటివి చేస్తుంటే అది వ్యాయామానికి ప్రత్యామ్నాయం కదా?

జ : తప్పకుండా అవుతుంది. అరగంట కంటే ఎక్కువ నిరంతరాయంగా కూర్చోవద్దు. మీరు కుర్చీలోంచి లేచి మరో కుర్చీకి కూర్చోవడం కూడా సహాయపడుతుంది.

ప్ర : గుండె సమస్యలకు రక్తంలో షుగర్‌కు సంబంధం ఉందా?

జ : చాలా బలమైన సంబంధం ఉంది. మధుమేహం ఉన్న వారికి లేనివారికంటే గుండెపోటు ఎక్కువ.

ప్ర : గుండె ఆపరేషన్‌ తర్వాత ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి.

జ : ఆహారం, వ్యాయామం, సక్రమంగా మందులు, కొలెస్ట్రాల్‌, బిపి, బరువును నియంత్రించుకోవడం.

ప్ర : రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవాళ్లకు గుండె జబ్బలు ఎక్కువ వస్తాయా?

జ : రావు.

ప్ర : కొత్తగా వస్తున్న బిపి మందులేమిటి?

జ : వందలాది మందులు ఉన్నాయి. కానీ మీ డాక్టరు మీ సమస్యకు సరైన కాంబినేషను ఏదీ అనేది చెప్పగలడు. అయితే నా సూచన ఏమిటంటే నడక, ఆహారం, బరువు నియంత్రణ, జీవనశైలి మార్పులతో వీలైనంత వరకు మందులకు దూరంగా ఉండొచ్చు.

ప్ర : డిస్ప్రిన్‌లాంటి తలనొప్పి మందులు గుండెపోటు రిస్క్‌ను ఎక్కువ చేస్తాయా?

జ : చేయవు.

ప్ర : ఆడవారిలో కంటే మగవారిలో గుండెపోటు ఎక్కువ ఎందుకనీ?

జ : 45 ఏళ్ల వయసు వరకు ప్రకృతే ఆడవాళ్లను రక్షిస్తుంది.

ప్ర : గుండెను మంచి స్థితిలో ఉంచుకోవాలంటే ఏం చేయాలి?

జ : ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. జంక్‌ ఫుడ్‌ వద్దు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. పొగతాగొద్దు. 30 ఏళ్ల తర్వాత ఆర్నెళ్లకోసారి వైద్య పరీక్షలు చేసుకోవాలి.

పది చిన్న సూత్రాలు ...

ఆరోగ్యకరమైన ఆహారం తినడం : ఆహారంలో ఎక్కువగా పళ్లు, కూరగాయలు ఉండేట్టు చూసుకుంటే అది ఆరోగ్యకరమైన ఆహారం కిందే లెక్క. అయితే శాచురేటెడ్‌ నూనెలు వాడకూడదు. ఎక్కువ ఉప్పు ఉండే ప్రాసెస్‌ఫుడ్స్‌ను బాగా తగ్గించాలి.

చురుగ్గా ఉండండి : అంటే కదులుతూ ఉండడమే. రోజూ 30 నిమిషాలు నడకో, మరో శ్రమో చేస్తే గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధించొచ్చని మీకు తెలుసా?

పొగతాగొద్దు : ఒక సంవత్సరం పాటు పొగతాడం మానేస్తే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది. కొన్నేళ్లు పొగతాగకుండా ఉంటే ఆ రిస్క్‌ పూర్తిగా పోతుంది కూడా.

ఆరోగ్యకరమైన బరువు : అధిక బరువు తగ్గితే, దాంతోపాటు ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటే. సగం గుండెపోటు, పక్షవాతాలకు కారణం అధిక రక్తపోటు.

మీ ఆరోగ్య సంఖ్యలు తెలుసుకోండి : అంటే ఎంత రక్తపోటు, ఎంత కొలెస్ట్రాల్‌, ఎంత షుగర్‌ ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నడుం-పిరుదల చుట్టుకొలత, బాడీమాస్‌ ఇండెక్స్‌ కూడా అందరూ తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోవడం కోసం మీ డాక్టరును సంప్రదించండి. అదేవిధంగా మీ గుండె ఆరోగ్యం మెరుగుపరిచేందుకై ఒక ప్రణాళికను పెట్టుకోండి.

ఆల్కహాలు హానికరం : ఎక్కువగా తాగేవాళ్లకు స్థూలకాయం వచ్చే అవకాశముంది. అలాగే వారి రక్తపోటు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కావాలంటే తాగడం మానేయండి.

ధూమపానం : నీ పని స్థలంలో సిగరెట్‌ తాగొద్దని చెప్పండి. వారు తాగితే మీరు ఎంతో కొంత తాగినట్లవుతుంది.

ఎక్కడున్నా కదులుతూ ఉండండి : మీ పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోండి. అంటే సైకిల్‌ తొక్కడం, మెట్లు ఎక్కడం, వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు రెండుసార్లు స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు ఐదు నిమిషాలపాటు చేయొచ్చు. ఈ చిన్న చిన్న శ్రమలన్నీ మీ ఆరోగ్య ఖాతాలో పడతాయి.

బయటి ఆహారం : బయట తినేప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి. క్యాంటీన్‌లో, హౌటళ్లలో ఏదంటే అది తినొద్దు.

మానసిక ఒత్తిడి : గుండెపోటుకు గానీ, పక్షవాతానికి గానీ మానసిక ఒత్తిడి ప్రత్యక్ష కారణం కాదు. కానీ మానసిక ఒత్తిళ్ల వల్ల పొగతాగడం, ఆల్కహాలు తీసుకోవడం, ఏవంటే అవితినడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి.

=================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .