అమెరికా లో ఫాదర్స్ డే ని జూన్ 3 వ ఆదివారము , మదర్స్ డే ని -మే 2 వ ఆదివారము - జరుపుకునే ఆచారము ఉంది . పేరెంట్స్ డే ని ప్రతి సంవత్సరము జూలై 4 వ ఆదివారము జరుపుతున్నారు . 1994 లో నాటి అమెరికా ప్రసిడెంట్ " బిల్ క్లింటన్ " సంతకము చేసి శాసనము చేసారు . అమెరికా సుప్రీం కోర్టు కూడా మదర్స్ డే , ఫాదర్స్ డే లను రద్దుచేసి తల్లిదండ్రుల విషయము లో లింగభేదము ఉండ కుండా చూడాలని తీర్మాణానికి అంగీకరించినది . అప్పటినుండే పేరెంట్స్ డే ని జరుపుకోవడం ప్రపంచమంతటా వ్యాపించినది .
కొరియా లో పేరెంట్స్ డే ని ' మే 08 ' న జరుపుకుంటారు . ఇండియా లో జూలై 4 వ ఆదివారమే ... ఇప్పుడిప్పుడే జరుపుకోవడం మొదలైనది .
------------------------------------------------------------------------------------------------------
పిల్లలు పెద్దవుతున్నకొద్దీ... పెద్దలు పసివాళ్లయిపోతారు. బిడ్డల్ని వదిలి ఉండలేరు. ఉన్నా ప్రశాంతంగా బతకలేరు. ఒంటరితనం వేయివైపుల నుంచి దాడిచేస్తుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు, వేరుకాపురాలు కన్నమమకారానికి కఠిన పరీక్ష పెడతాయి. 'ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్' నడివయసు జీవితాలను సంక్షోభంలో ముంచెత్తుతుంది.
కాలింగ్‌బెల్ వోగుతుంది. 'వాడే, కాలేజీ నుంచి వచ్చుంటాడు'... తనలో తానే మాట్లాడుకుంటూ తలుపు తీస్తారామె.
ప్చ్... ఎదురుగా పోస్టుమాన్.
మళ్లీ బెల్లు వోగినా అంతే ఆశగా తీస్తారు.
అది పిచ్చి కాదు. పిచ్చి ప్రేమ.
''అయినా, వారం రోజుల క్రితం అమెరికా విమానం ఎక్కిన కొడుకు అప్పుడే ఎలా తిరిగొస్తాడమ్మా!''
* * *
మహానగరం. చిమ్మచికటి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఓ యువకుడు పరుగులు తీస్తున్నాడు. ఎవరో వెంటాడి తరుముతున్నారు. పరుగెత్తిపరుగెత్తి అలసిపోయాడు. నిస్త్రాణంగా నడిరోడ్డుమీదే కూలబడిపోయాడు. అంతలోనే ఓ లారీ రివ్వున దూసుకొచ్చింది.
ఆ యువకుడు ఎవరో కాదు, తన బిడ్డ. ఒక్కగానొక్క... 'కెవ్వు'మంటూ కేక.
కల. పీడకల. ఒళ్లంతా చెమటలు. గుండెల్లో దడ.
మంచినీళ్లు తాగి, దేవుడికి దండం
పెట్టుకుని పడుకుందామె.
''ముంబయిలో లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ మీద అంత దిగులెందుకమ్మా? కలలంటే మన ఆలోచనలే. మంచి జరగాలన్న ఆకాంక్ష కంటే, చెడు జరుగుతుందేవో అన్న భయం ఎక్కువైనప్పుడే ఇలాంటి కలలొస్తాయి''
* * *
'పెళ్లి పందిరి విప్పనేలేదు. చుట్టాల సందడి తగ్గనేలేదు. పెళ్లికూతురి తండ్రి అంత దిగులుగా కనిపిస్తున్నాడేమిటి?'
'ఏం చేస్తాడు పాపం! నిన్నవెున్నటిదాకా అన్నీ తానైన కూతురు... ఓ అయ్యచేయి పట్టుకుని వెళ్లిపోయింది. పిచ్చి నాన్న!
ఆ మార్పును జీర్ణించుకోలేకపోతున్నాడు'
''నిన్నటిదాకా మీ కూతురు. ఈరోజు మరొకరి ఇల్లాలు. ఏ ఆడపిల్లకైనా పెళ్లితో ప్రాధాన్యాలు మారిపోతాయి. భర్త, అత్తమామలు, పిల్లలు..తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోడానికి వెళ్లిపోయింది మీ చిట్టితల్లి- మీ ఆవిడ అత్తింటికి వచ్చినట్టు. అన్నీ తెలిసినవారు, ఇలా బెంగపెట్టుకుంటే ఎలా సార్!''
* * *
పక్షి గూడు కడుతుంది. గుడ్లు పెడుతుంది. వెచ్చగా పొదుగుతుంది. పిల్లల్ని గూట్లో వదిలేసి ఆహారానికి బయల్దేరుతుంది. దొరికినంతా నోటికి కరచుకుని, గబగబా గూటికొచ్చేస్తుంది. ఒక్కో ముక్కా పిల్లల నోట్లో పెడుతుంది. ఎలా తినాలో చెబుతుంది. ఎలా కూయాలో నేర్పుతుంది. ఎలా గాల్లో ఎగరాలో బోధిస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పాక, నేర్పించాల్సినవన్నీ నేర్పించాక... తల్లి జీవితం తల్లిది. బిడ్డ జీవితం బిడ్డది. పిట్ట ఎగిరిపోతుంది. తనకో తోడు వెతుక్కుంటుంది. మళ్లీ ఆ పక్షుల జంటకు పిల్లలు. అవీ పెరిగిపెద్దవుతాయి. రివ్వున ఎగిరి ఎక్కడికో వెళ్లిపోతాయి. ఇదో చక్రం. నిరంతరం. తరంతరం. వెళ్తున్నప్పుడు బరువైన వీడుకోళ్లు ఉండవు. వెళ్లొద్దంటూ వేడుకోళ్లూ ఉండవు. పక్షులే కాదు, ఏ జీవుల్లోనూ ఆ మితిమీరిన మమకారం కనిపించదు.
మరి, మనం? మనుషులం?
వెళ్లారని బాధపడుతూ, ఎలా ఉన్నారో అని బెంగపడుతూ, ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ, తీరా వచ్చాక అప్పుడే వెళ్లిపోతున్నారని మధనపడుతూ... ప్రతి నిమిషం, ప్రతిరోజూ, బతుకంతా కుమిలిపోతూనే గడిపేస్తాం.
పక్షికి ఎగరడం అవసరం.
మనిషికి ఎదగడం అవసరం.
ఎదగాలంటే ఎగరాల్సిందే!
ఈ ఎడబాటు-మన తల్లిదండ్రులకు తప్పలేదు. మనకు తప్పదు. మన పిల్లలూ తప్పించుకోలేరు. కాస్త ముందో వెనకో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంక్షోభమే ఇది. ఎంత హుందాగా, ఎంత నిబ్బరంగా ఆ దశను అధిగమిస్తే... అంత ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది.
పిల్లలే ప్రపంచం...
వాణ్ని నిద్రలేపాలి. బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తోసెయ్యాలి. పాలు కలిపి ఇవ్వాలి. ఇష్టమైన టిఫిను చేసిపెట్టాలి. బీరువాలోంచి బట్టలు తీసివ్వాలి. బాక్సు సర్దాలి. బయల్దేరుతున్నప్పుడు బాబా విభూతి రాయాలి. సాయంత్రం వచ్చేసరికి చిరుతిళ్లు సిద్ధం చేయాలి. రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు, వాడు చెప్పే కాలేజీ కబుర్లు వినాలి. చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకుంటే దుప్పటి కప్పి, ట్యూబులైటు కట్టెయ్యాలి.
ఆడపిల్ల విషయంలో ఆ అనుబంధం మరింత ప్రగాఢం. ఆ ముగ్గు, ఆ సిగ్గు, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ చొరవ, ఆ సందడి... ప్రతీదీ అపురూపమే! ఏ దేవతో శాపవశాత్తూ మనింట్లో పుట్టిందేవో అనిపిస్తుంది. కాఫీ కలిపితే తనే కలపాలి. పాయసం వండితే తనే వండాలి. షాపింగ్‌కి వెళ్లాలంటే తనుండాల్సిందే. బంగారు తల్లి మనసూ బంగారమే! అమ్మ కష్టాన్ని చూడలేదు. నాన్న బాధపడితే తట్టుకోలేదు. తోబుట్టువులంటే ప్రాణమిస్తుంది. అందరి అభిరుచులూ తనకే తెలుసు.
అందరి అవసరాలూ తనకే తెలుసు.
అబ్బాయి పైచదువులకు వెళ్లిపోతాడు. లేదంటే, పెళ్లిచేసుకుని వేరుకాపురం పెడతాడు. అమ్మాయి అత్తారింటికి బయల్దేరుతుంది. లేదంటే, అమెరికా చదువులకెళ్తుంది. కారణం ఏదైనా కావచ్చు. ప్రభావం మాత్రం ఒకేలా ఉంటుంది. పిల్లల చుట్టూ అల్లుకున్న తల్లిదండ్రుల జీవితాల్లో ఒక్కసారిగా శూన్యం. భరించలేనంత ఒంటరితనం. తట్టుకోలేనంత నిశ్శబ్దం.
అంతా బావుంటుంది. అబ్బాయి అక్కడ బుద్ధిగా చదువుకుంటూ ఉంటాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అమ్మాయి కాపురం హాయిగా సాగిపోతూ ఉంటుంది. అల్లుడు యోగ్యుడు. అత్తమామలు మంచివారు. ఆ పిల్లల గురించి అంతగా ఆలోచించి, బుర్ర పాడుచేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అయినా ఏదో వెలితి. చింత, చికాకు, ఒత్తిడి, అర్థంలేని భయం, లేనిపోని భ్రమలు, పిచ్చిపిచ్చి వూహలు, అపోహలు, అనుమానాలు, నిస్పృహ, పరధ్యానం...
మనసునిండా బోలెడంత కల్లోలం. మానసిక శాస్త్రవేత్తలు ఈ సంక్షోభానికి పెట్టినపేరు 'ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్'. గూడు ఖాళీ అయిపోయి, గుండె బరువెక్కిపోవడం.
కొన్నిసార్లు ఈ సిండ్రోమ్ ప్రభావాలు... కన్నవారికీ పిల్లలకూ మధ్య అగాథాన్ని సృష్టిస్తాయి. తండ్రి అంతదూరం పంపనని భీష్మించుకు కూర్చుంటాడు. కొడుకు వెళ్లితీరాల్సిందేనని పట్టుపడతాడు. 'ప్రాణంపోయినా సరే...' అంటూ ఇద్దరూ శపథాలు చేసుకుంటారు. ఇష్టమైన కోర్సులో చేరలేకపోతున్నందుకు బిడ్డ ఏ అఘాయిత్యానికో పూనుకోవచ్చు. డిప్రెషన్‌లో కూరుకుపోవచ్చు. కొడుకు ఎడబాటును భరించలేక తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. హింసాత్మకంగా వ్యవహరించవచ్చు. ఇలాంటి కారణంతోనే, ఆమధ్య అహ్మదాబాద్‌లో రిటైర్డ్ ప్రిన్సిపల్ దత్తాత్రి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నిస్పృహలోంచి బయటపడి, ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే... ఎవరూ ఇలాంటి చర్యలకు ఒడిగట్టరు. అసలు, చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కొందర్లో 'ప్రీ ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్' లక్షణాలూ కనబడుతుంటాయి.
బిడ్డ పదోతరగతి పరీక్షలు రాస్తున్నప్పుడే... భవిష్యత్‌లో తాము అనుభవించబోయే ఒంటరితనాన్ని తలుచుకుని కుమిలిపోతుంటారు. పొరుగింటి అమ్మాయి పెళ్లి జరిగినా, తమ కూతురు అత్తింటికి వెళ్లే ఘట్టాన్ని వూహించుకుని కన్నీళ్లుపెడుతుంటారు.
పిల్లలూ తెలుసుకోండి
''ఎవరి కలలు వారికుంటాయి. వాటిని నిజం చేసుకోవాలనుకోవడం తప్పుకాదు. ఇల్లొదిలి వెళ్లవచ్చు. అవసరమైతే, దేశం వదిలి కూడా వెళ్లవచ్చు. ఎంతదూరం వెళ్లినా..బిడ్డ దూరమైపోతున్నాడన్న భావన మాత్రం కలిగించకూడదు. చదువుల్లో ఉద్యోగాల్లో ఎంత తీరికలేకపోయినా... రోజుకు ఒకసారి, ఒక్క నిమిషం పలకరించినా... కన్నవారు సంతోషిస్తారు ''
''అప్పుడప్పుడూ అమ్మానాన్నలకు ఎంపీత్రీ ప్లేయర్, కెమెరా, కంప్యూటర్... వంటి కానుకలు ఇవ్వండి. వాటి మీద ఆసక్తి లేకపోయినా, బిడ్డ ప్రేమగా ఇచ్చాడన్న మమకారంతో అయినా... ఉపయోగించడం నేర్చుకుంటారు. దీనివల్ల వారికో వ్యాపకం ఏర్పడుతుంది. మనసు పక్కదారి పట్టకుండా ఉంటుంది''
''పండగలకూ పబ్బాలకూ కలుసుకున్నప్పుడు మీ వ్యక్తిగత వృత్తి జీవితాల్లో సంతోషాన్నిచ్చే విషయాలు మాత్రమే చెప్పండి. కష్టాలూ సవాళ్లూ ఏకరవు పెట్టడం వల్ల... ఆ పెద్దల బుర్రలో మరిన్ని సమస్యలు జొప్పించినవారు అవుతారు''
''కన్నవారి జీవితంలో ఇది చాలా సంక్లిష్టమైన దశ. ఒకవైపు బిడ్డ దూరంగా వెళ్లిపోతున్నాడన్న బాధ వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఆండ్రోపాజ్, మెనోపాజ్ చుట్టుముట్టే సమయమూ ఇదే. వీటన్నిటివల్ల మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడైనా, కోపంగానో చికాకుతోనో మాట్లాడితే భరించండి. పెద్దరికాన్ని గౌరవించండి''
''నాన్న పరిస్థితి వేరు. ఉద్యోగం, వ్యాపారం, స్నేహితులు... అతని ప్రపంచం అతనికుంటుంది. అమ్మకు మాత్రం ఇల్లే లోకం. పిల్లలే సర్వస్వం. ఆమెకు ఎంత ధైర్యాన్నిస్తే అంత మంచిది. సెల్‌ఫోన్ కబుర్లలో మెయిల్స్ విషయంలో అమ్మకే కాస్త ఎక్కువ సమయం కేటాయించండి''
.
పెద్దలూ జాగ్రత్త!
''పిల్లలు దూరమైపోగానే... ప్రపంచం చిన్నదైపోకూడదు. మరింత విస్తరించాలి. గతంలో పిల్లల పెంపకానికి కేటాయించిన సమయాన్ని సామాజిక జీవితానికి మళ్లించవచ్చు. అపార్ట్‌మెంట్ సంఘాల్లో స్వచ్ఛంద సంస్థల్లో చురుకైన పాత్ర పోషించవచ్చు. సోషల్ రా పరిచయాల్ని పెంచుకోవచ్చు''
''హాబీతో ఒంటరితనాన్ని వరంగా మార్చుకోవచ్చు. వెుక్కల పెంపకం, పుస్తక పఠనం, సంగీతం... అది ఏమైనా కావచ్చు. కొత్త ప్రదేశాల సందర్శనం జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఓపిక ఉంటే, పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయవచ్చు. కొత్త పట్టాలకు ప్రయత్నించవచ్చు''
''గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోవాల్సిన బిడ్డలు మాత్రం దూరంగా ఉన్నారనేగా మీ దిగులు. అనాథ శరణాలయాల్లోని పిల్లల్ని ప్రేమించండి. వారానికోరోజు వారితో గడపండి. నలుగురికీ చేతనైన సాయం చేయండి. ఇరుగుపొరుగువారికి తల్లో నాలుకలా మెలగండి''
''ఆలయ దర్శనం, ధ్యానం, ప్రార్థన, ప్రాణాయామం, పురాణపఠనం కొండంత వూరటనిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. భవబంధాల్ని గెలవడానికి ఆధ్యాత్మిక సాధన ఉపయోగపడుతుంది''
''పిల్లల మీద దిగులుపెట్టుకుని నాలుగు గోడలకే పరిమితం కావడం అంత మంచిది కాదు. నడక, వ్యాయామం జీవితంలో భాగం కావాలి. ఆరు నెలలకు ఓసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. నిరాశ, నిస్పృహ దీర్ఘకాలం కొనసాగితే... మానసిక నిపుణుడిని సంప్రదించడం మంచిది''
ఎందుకంత విషాదం...
ఎందుకంటే, కన్నవారి జీవితం అప్పటిదాకా... కూతురిచుట్టో కొడుకుచుట్టో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఉంటే... రెండు కళ్లే! దినచర్య, జీవనశైలి, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, కలలు, లక్ష్యాలు... ప్రతీదీ పిల్లలతో ముడిపెట్టుకోవడం అలవాటై ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా... కళ్లముందు పిల్లలు లేకపోయేసరికి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. భోజనం సయించదు. నిద్రపట్టదు. ఎవరికోసం బతకాలన్న నిర్లిప్తత. గృహిణుల విషయంలో, ఒంటరి తల్లిదండ్రుల విషయంలో ఆ ప్రభావం మరీ ఎక్కువ.
''అమ్మానాన్నలూ ఒక్కసారి ఆలోచించండి! ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? ఆరోగ్యం దెబ్బతింటుంది. హైపర్‌టెన్షన్ లాంటి సమస్యలు దాడిచేస్తాయి. అనేకానేక రోగాలకు అదే తొలి అడుగు. మనసు తీవ్రంగా గాయపడుతుంది. డిప్రెషన్ వంటి జాడ్యాలు రావచ్చు. ఆత్మహత్య ఆలోచనలూ కలగవచ్చు. మీరు ప్రేమించే బిడ్డ దూరమైపోయాడన్న బాధలో, మిమ్మల్ని ప్రేమించే జీవితభాగస్వామినీ ఇతర కుటుంబ సభ్యుల్నీ నిర్లక్ష్యం చేయడం భావ్యమా?
మీరిలా కుంగిపోతున్నారని తెలిస్తే... చదువుల కోసవో ఉద్యోగం కోసవో అంతదూరం వెళ్లిన బిడ్డ, ప్రశాంతంగా ఉండగలడా? అనుకున్న లక్ష్యాల్ని సాధించగలడా? అనుకోనిది జరిగితే, అతని కల భగ్నమైతే ఆ బాధ్యత మీదే.
పచ్చగా కాపురం చేసుకోవాల్సిన అమ్మాయి... తన కోసం నాన్న బెంగపెట్టుకున్నాడనో, అమ్మ అన్నం మానేసిందనో తెలిస్తే ఎంత ఇబ్బందిపడుతుంది? కళకళలాడుతూ తిరగాల్సిన ఇల్లాలు అన్యమనస్కంగా కనిపిస్తే భర్తేం అనుకోవాలి? అత్తమామలెలా అర్థంచేసుకోవాలి? ఆ కాపురంలో కలతలు రావా?''
నిజానికి, ఇలాంటి సందర్భాల్లో కన్నవారి బాధ్యత రెట్టింపు అవుతుంది. ముందుగా తాము, ఆ ఆలోచనల నుంచి బయటపడాలి. 'ఏం ఫర్వాలేదు. మేం సంతోషంగా ఉంటాం. మీరూ సంతోషంగా ఉండండి. మా గురించి ఎలాంటి దిగులూ వద్దు. నిశ్చింతగా వెళ్లిరండి' అని పిల్లలకు ధైర్యం చెప్పాలి. వాళ్లను చిరునవ్వుతో సాగనంపాలి. ఆమాత్రం భరోసా చాలు... పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. చొరవా ధైర్యం రెట్టింపు అవుతాయి.
తొలి నుంచే...
చదువుల కారణంగానో, ఉద్యోగాల పేరుతోనో పిల్లలు దూరంగా వెళ్లిపోడాన్ని, కన్నవారు తట్టుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు తీవ్రంగా స్పందిస్తున్నారు కూడా. మితిమీరిన మమకారమే ఈ సమస్యకు కారణం. గతంలో పరిస్థితులు వేరు. గంపెడు సంతానం. ఒకరి పెళ్లయిపోతే, మరొకరు సిద్ధంగా ఉండేవారు. లోటు తెలిసేది కాదు. ఒకరు పైచదువులకు వెళ్తే మరొకరు ఆ స్థానాన్ని భర్తీచేసేవారు. వెలితి అనిపించేది కాదు. ఇప్పుడలా కాదే. ఇద్దరు లేదా ఒకరు. మనసంతా వారిమీదే. ఆలోచనలన్నీ వారిచుట్టే. ఇరవై ఏళ్లు వచ్చేదాకా ఆ పిల్లలు ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా కన్నవారికి దూరంగా ఉన్న దాఖలాలుండవు. సెలవుల్లో ఏ తాతయ్య ఇంటికో వెళ్లడం... ఈతరానికి తెలియని అనుభవం. నీళ్లు పడవనో, సమ్మర్ క్లాసులు ఉంటాయనో... వేయి సాకులు చెప్పినా పిల్లల్ని వదిలి ఉండలేని బలహీనతే అసలు కారణం. చదువుల కోసవో ఉద్యోగాల కోసవో ఇల్లొదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య ఓపట్టాన సర్దుకోలేరు.
కాకపోతే, లక్ష్యాలూ బాధ్యతలూ ఆ సమస్యను వీలైనంత తొందరగా అధిగమించే శక్తినిస్తాయి. కొత్త స్నేహాలు, కావలసినంత స్వేచ్ఛ... ఇంటి దిగులును మరిపిస్తాయి. ఇక్కడ... కన్నవారిని మాత్రం, పిల్లల ఆలోచనలే వెంటాడుతుంటాయి. అప్పటిదాకా కష్టమంటూ తెలియకుండా పెరిగిన బిడ్డలు, ప్రపంచాన్ని చూడని అమాయకులు, ఇటుపుల్ల అటుపెట్టని అతి సుకుమారులు, కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటేనే ముడుచుకుపోయే మృదుస్వభావులు... బయటికెళ్లి ఎలా బతుకుతారన్న భయం. లైంగిక వేధింపులు, హత్యలు, ఆత్మహత్యల గురించి మీడియా కథనాలొకటి. ఆలోచనలన్నీ బిడ్డచుట్టే. భయాలన్నీ బిడ్డ క్షేమం గురించే.
''బాబోపాపో పుట్టగానే... పెద్ద చదువుల కోసం, బంగారు భవిష్యత్ కోసం పొదుపు చేయడం వెుదలుపెడతారే! చక్కని 'చైల్డ్ ప్లాన్' గురించి పదిమందినీ వాకబు చేస్తారే! అమ్మాయి పెళ్లికి నగోనట్రో చేయించిపెడతారే. ఘనంగా పెళ్లిచేయడానికి ఎంతోకొంత వెనకేసుకుంటారే! ఆర్థిక విషయాల్లో ఉన్న ముందుచూపు... భావోద్వేగాల దగ్గరికి వచ్చేసరికి రవ్వంత కూడా కనిపించదెందుకు! 'ఏదో ఒక రోజు పెద్ద చదువులకో ఉద్యోగాలకో ఇల్లొదిలి వెళ్లాల్సినవారే' అన్న మానసిక సంసిద్ధత ఉంటే... రెక్కలొచ్చి ఎగిరిపోతున్న పిల్లల్ని చూసి ఎవరూ ఇంత విలవిల్లాడిపోరు.
'ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్ ప్రభావాన్ని తప్పించుకోడానికి ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లలు ఎదుగుతున్న వయసులోనే ఆ ప్రయత్నం వెుదలుకావాలి. ఏడాదికి ఓ వారంరోజులు పిల్లల బాధ్యతల్ని ఆత్మీయులకు అప్పగించి తల్లిదండ్రులు ఏ విహార యాత్రలకో వెళ్లిరావచ్చు. వాళ్లు పెరిగి పెద్దయి... గడపదాటుతున్నప్పుడు బిక్కుబిక్కుమనకుండా ఈ అనుభవం పనికొస్తుంది. విజ్ఞానయాత్రలనో, వేసవి శిబిరాలనో... ఇంటికి దూరంగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి. దీనివల్ల అమ్మానాన్నల మీద అతిగా ఆధారపడటం తగ్గిపోతుంది' అని సలహా ఇస్తారు సైకాలజిస్టు హర్ష. ఏ తల్లిదండ్రులైనా 'మా పిల్లలకు ఏమీ తెలియదు. అన్ని పనులూ మేమే చేసిపెట్టాలి...' అని చెప్పుకుంటే, అది గొప్ప కాదు. పెంపకంలో లోపం. పట్టు సడలిస్తే పిల్లలెక్కడ దారితప్పుతారో అన్న అపనమ్మకమూ కావచ్చు. ఆ పరాధీనత పిల్లల వ్యక్తిత్వవికాసాన్ని దెబ్బతీస్తుంది. ఓ వయసు వచ్చాక..కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛనివ్వాలి. మరికొన్ని విషయాల్లో మనం మార్గదర్శనం చేసి, వాళ్లే నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి.
కొత్తజీవితం...
అమ్మాయి పెళ్లిచేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంది. అబ్బాయి దూరదేశాలకు ప్రయాణమవుతాడు. ఓ పాతికేళ్లు ఆ దంపతులు పిల్లల కోసమే బతికారు. పిల్లల గురించే ఆలోచించారు. పిల్లల ఇష్టాలకే విలువనిచ్చారు. ఇన్నేళ్ల జీవితం పిల్లల చుట్టే తిరిగింది. తమ జీవితాన్ని తాము అనుభవించే అవకాశం వచ్చిందిప్పుడు. ఇలాంటి సందర్భాల్లో భర్త లేదా భార్య పాత్ర చాలా కీలకం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ఒకరి ఆవేదన ఒకరు అర్థంచేసుకోవాలి. జీవితభాగస్వామికి మరింత సమయం కేటాయించాల్సిన సమయం ఇది.
''పాతికేళ్లక్రితం పెళ్లయిన కొత్తలో ఏకాంతం కోసం ఎంత తహతహలాడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ అవకాశం ఇప్పుడు కోరకుండానే దక్కింది. మనసారా మాట్లాడుకోండి. తీపి జ్ఞాపకాలు నెమరేసుకోండి. పాత ఆల్బమ్‌లు ముందేసుకోండి. చిన్ననాటి స్నేహితులకు ఫోన్లు చేయండి. పాత నేస్తాల్ని పలకరించండి. చూడాలనుకున్న ప్రదేశాలు చూసి రండి. వాతావరణంలో మార్పు, మనసుకు తగిలిన గాయాలకు మలాములా పనిచేస్తుంది. అప్పట్లో ఇద్దరూ కలిసి చూసిన... తెలుగు, హిందీ క్లాసిక్స్‌ను మరొక్కసారి డీవీడీలో చూడండి. ఆలూమగలు దగ్గరైనకొద్దీ 'ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్' దూరంగా పారిపోతుంది.
కాలం మారింది. టెక్నాలజీ మారింది. ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. చిన్న మీట చాలు. వందలమైళ్ల దూరంలో ఉన్న కొడుకుతో మాట్లాడవచ్చు. చిన్న పరికరం చాలు. సప్తసముద్రాలకు అవతల ఉన్న కూతుర్ని కళ్లారా చూసుకోవచ్చు. 'వర్చువల్' డ్రాయింగ్‌రూమ్‌ను సృష్టించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ పక్కన వాళ్లు..ఈ పక్కన మీరు... తింటూ మాట్లాడుకోవచ్చు. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్‌తో పరిచయం పెంచుకుంటే, సగం సమస్య పరిష్కారం అయిపోయినట్టే. మెయిల్స్ ఇవ్వడం చాలా తేలిక. వారంరోజులు చాలు... కీబోర్డు మీద పట్టు తెచ్చుకోవచ్చు. తగిన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుంటే, తెలుగులోనూ ఇ-మెయిల్స్ పంపుకోవచ్చు. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు మీలాంటివారికోసమే 'సకుటుంబ' ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. పైసాఖర్చు లేకుండా ఆత్మీయుల నంబర్లుకు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. పిల్లలు దూరదేశాల్లో ఉంటే, ఏడాదికోసారి మీరు వెళ్లవచ్చు. ఏడాదికోసారి వాళ్లను రమ్మని చెప్పవచ్చు. అలా వెుత్తం రెండుసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. మరీ చూడాలనుకుంటే, విమానాలున్నాయి. దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కొన్ని గంటల్లో వెళ్లిరావచ్చు. విదేశీ ప్రయాణాలూ మునుపటికంటే తేలికైపోయాయి. టెక్నాలజీ దూరాల్ని ఎప్పుడో గెలిచేసింది. పొడులు, పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు... అమ్మప్రేమ కమ్మదనాన్ని రోజూ పిల్లలకు గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫొటో ఆల్బమ్‌లూ చిన్నప్పటి ఆటబొమ్మలు, ఆ అల్లరీ ఆ జోకులూ... బిడ్డల్ని కన్నవారి కళ్లముందు నిలుపుతూనే ఉంటాయి. ఎన్ని సముద్రాలు దాటైనా చదువుకోనివ్వండి. ఎన్ని ఖండాలు దాటైనా ఉద్యోగాలు చేసుకోనివ్వండి.
మనోవాంఛాఫల సిద్ధిరస్తు... అని మనసారా ఆశీర్వదించండి''.
* * *
రాముడిని యాగసంరక్షణకు పంపమని విశ్వామిత్రుడు కోరతాడు. పసివాడిని అంతంతదూరం పంపేదిలేదని మహర్షి ఆదేశాన్ని ధిక్కరిస్తాడు దశరథుడు. అంతలోనే ఆ కోపిష్టి విశ్వామిత్రుడు తన బిడ్డకు ఎక్కడ శాపం పెడతాడో అని భయం. కావాలంటే, సర్వసైన్యాన్నీ పంపి యాగసంరక్షణ చేస్తానని విన్నవించుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాళ్లమీద పడతాడు. ఇవన్నీ 'ప్రీ-ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్' లక్షణాలు. వశిష్టాది రుషులు ధైర్యం చెప్పాకే దశరథుడి మనసు కుదుటపడుతుంది. రామలక్ష్మణుల ప్రయాణానికి ఆవోదం తెలుపుతాడు.
దశరథుడు భయాల్ని గెలవకపోతే, భ్రమల్ని తొలగించుకోకపోతే రాముడు ఎన్నో అమూల్యమైన అవకాశాల్ని కోల్పోయేవాడు. అహల్యకు శాపవివోచనం కలిగించేవాడు కాదు. విశ్వామిత్రుడి నుంచి దివ్యాస్త్రాలు పొందగలిగేవాడు కాదు. భవిష్యత్‌లో అరణ్యవాసం చేయడానికి సరిపడా అనుభవమూ దక్కేదికాదు. అన్నిటికీ మించి, స్వయంవరానికి వెళ్లగలిగేవాడు కాదు. సీతమ్మను మనువాడేవాడు కాదు. సీతారాముడు అయ్యేవాడు కాదు. ఆదర్శపురుషుడిగా ప్రపంచానికి తెలిసేవాడే కాదు.
కన్నమమకారం... నిచ్చెనలా తోడ్పడాలి. ముళ్లకంచెలా అడ్డుపడకూడదు. ఈ సత్యం అర్థమైతే- గూడు ఖాళీ అయిందని కుమిలిపోతూ కూర్చోం. నిన్నవెున్న నడక నేర్చిన మన బిడ్డలు ఎంత అందంగా ఎంత పొందికగా మరెంత సమర్థంగా కొత్త గూడును కడుతున్నారో ఆశ్చర్యంగా ఆనందంగా ఒకింత గర్వంగా చూస్తూ ఉంటాం. అప్పుడిక, ఈ ఎమ్టీనెస్ట్ సిండ్రోమే కాదు మరే దిగులూ ఆందోళనా కూడా మన దరిదాపులకైనా రాలేవు
soruce : Eenadu sunday magazine(24/07/2011)
శ్రీకాకుళం : శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలకు బయల్దేరాడు. దురదృష్టవశాత్తు అడవిలో దశరథమహారాజు బాణం దెబ్బకు గురయ్యాడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆ మహారాజుతో తన తల్లిదండ్రుల గురించే చెబుతాడు. వారిని బాగా చూసుకోమని చెబుతూ ప్రాణాలు విడుస్తాడు....
ఇది పురాణగాథే కావచ్చు.. మన తల్లిదండ్రులపట్ల మనం ఎలా ప్రవర్తించాలో చెప్పిన కథ. మన బాధ్యతను గుర్తు చేసే కథ. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు జన్మనిచ్చి.. నిలబడడానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి మంచి జీవితాన్నిచ్చి.. ఓ స్థాయికి చేర్చిన అమ్మానాన్నలను మనం ఎలా చూస్తున్నాం..? ఆసరాగా ఉండాల్సిన సమయంలో అన్నం పెడుతున్నామా..? కాస్తంత ఆప్యాయతానురాగాలను చూపుతున్నామా..?
సృష్టిలో ప్రతి జీవికీ అమ్మే ఆది గురువు! విద్యాబుద్ధులు నేర్చేటప్పుడు, జీవిత పాఠశాలలో అడుగిడినప్పుడు అనుభవ సారాన్ని పాఠంగా బోధించే తొలి ఉపాధ్యాయుడు నాన్నే! తొలి నమస్సుల్ని అమ్మా నాన్నలకే సమర్పించాలని నేర్పే సంస్కృతి మనది. పురాణ పురుషులైన పరశురాముడు, శ్రీరాముడు మొదలు శ్రవణుడి వంటి ముని బాలకులు, ప్రవరుడు, పుండరీకుడు వంటి కావ్య నాయకులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవంగా భావించి సేవించినవారే. తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తానని 'భీష్మ' ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. సంస్కృతాంధ్రల్లో మహాకవి భారవి... తండ్రి తనను చిన్నచూపు చూస్తున్నాడన్న భావనతో విపరీతమైన ద్వేషం పెంచుకుని, ఒక దశలో తండ్రినే హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. చివరి నిమిషంలో తండ్రి ఎందుకు తన పట్ల అలా ప్రవర్తిస్తున్నాడో తెలిసి, పశ్చాతాపంతో దహించుకుపోయాడు. అది మొదలు తల్లిదండ్రులే పరమ దైవంగా పూజించి, వారి సేవలో తరించాడు.
నవ భారత నిర్మాత జవహర్‌లాల్‌నెహ్రూ - తన ప్రియ పుత్రిక ఇందిరా(గాంధీ) ప్రియదర్శినిపై చూపిన అవ్యాజ ప్రేమానురాగాలు, జైలు నుంచి సైతం కూతురికి ప్రపంచ చరిత్ర మొత్తాన్ని లేఖల రూపంలో బోధించిన విధానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. 'తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు - పుట్టనేమి వాడు గిట్టనేమి - పుట్టలోని చెదలు పుట్టవా.. గిట్టవా..' అంటూ అమ్మా నాన్నల్ని దయతో, ప్రేమతో ఆదరించలేని బిడ్డలు.. ఎవరికీ ప్రయోజనం లేకుండా పుట్టల్లో పుట్టి చనిపోయే చెద పురుగులతో సమానమని ఈసడించాడు మన వేమన.
బిడ్డల కోసం తపించి, పుణ్యక్షేత్రాలెన్నో తిరిగి, పూజలు, వ్రతాలు చేసే తల్లిదండ్రులు, ఆపై ఆ బిడ్డల ఆలనాపాలనా, అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకొంటారు. పుస్తెలు తాకట్టుపెట్టి బిడ్డల ఫీజులు కట్టిన తల్లులు, రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని పెద్దవారిగా చేసిన నాన్నలు ఎందరో! మరి ఆ పిల్లలే పెద్దవాళ్త్లె.. పెళ్లాం మోజులోనో, ఇంకే కారణంతోనో.. 'ఛీ ఈ ముసలి పీడ ఎప్పుడొదులుతుందో..?నని విసుక్కొంటూ, చివరకు ఇళ్ల నుంచి గెంటేసినా, 'పోన్లే బాబూ.. వాళ్లనేమీ అనకండి'.. అంటూ విశ్వమంత ప్రేమను పంచుతూనే ఉన్నారు! పంచుతూనే ఉంటారు!!
'పున్నామ నరకం నుంచి తప్పిస్తారో లేదో కానీ, బతికుండగానే అమ్మానాన్నలకు నరకం చూపకుండా వుంటే అంతే చాలు' అనే స్థాయిలో నేటి తరం ఉంది. అందుకే.. ఇకపై ఏ అమ్మా నాన్నా నిరాశ్రయులుగా, అనాథలుగా బతికే దుస్థితి కలగనీయమని నేటి 'తల్లిదండ్రుల దినం' సందర్భంగా ప్రతిన బూనుదాం రండి. రోజూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టకపోయినా.. సకల సౌఖ్యాలు ఇవ్వలేకపోయినా.. ఫరవాలేదు. కొద్దిసేపు వాళ్ల దగ్గర కూర్చొని, అప్యాయంగా మాట్లాడేందుకైనా వీలవదా? 'నేటి తాత స్థితే.. రేపటి కొడుకు గతి' అన్న సత్యాన్ని గుర్తెరిగి, పెద్దల్ని ప్రేమగా గౌరవించేలా
యువతను చైతన్యపరుద్దాం.. కదలండి..!
అమ్మా.. నాన్నకు చేద్దాం..ప్రేమాభిషేకం
న్యూస్‌టుడే - పాతశ్రీకాకుళం, కలెక్టరేట్ : 'కేవలం మూడు, నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొనుకున్న కారుపైన చిన్న మరక పడితే అల్లాల్లాడిపోయే వ్యక్తులు... తమను మూడు దశాబ్దాలు పాటు వ్యయప్రయాసలు కోర్చి పెంచి ఓ స్థాయికి చేర్చి.. మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుండటం దురదృష్టకరం'.
- వైష్ణవి ఇంజినీరింగు కళాశాల విద్యార్థిని సంతోషి చెప్పిన మాట ఇది. ప్రస్తుత సమాజ ధోరణిని చక్కటి ఉదాహరణతో చెప్పినా... ఆ మాట అక్షర సత్యమన్నది అందరికీ ఎరుకే. పిల్లలు ఓ స్థాయికి వచ్చిన తరువాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎంత చెప్పుకున్నా తక్కువే.
వృత్తిపరంగా కావచ్చు... సామాజికంగా కావచ్చు.. ఆర్థికంగా కావచ్చు.. మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం.. ఎన్నో సందర్భాల్లో.. ఇంకెన్నో విషయాల్లో రాజీ పడుతున్నాం.. ఒక్క విషయంలో తప్ప..!!
వృద్ధాప్యంలో ఓ తోడో కోసం... ఓ తీయనైన మాట కోసం.. అల్లాడిపోతున్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం సహనం చూపటం లేదు.. రాజీ పడడం లేదు. భార్య చెప్పిందనో... ఆమె బాధపడుతుందనో... తన తల్లిదండ్రులు తన వద్ద ఉంటే స్థాయి తగ్గిపోతుందనో.. ఇంకా ఏదో.. కారణం చూపుతున్నాం.. మనసు ఉన్నా.. దాని చంపుకుంటున్నాం.. దయనీయ స్థితిలో ఉన్న అమ్మానాన్నలపై దయ చూపలేకపోతున్నాం.. కుమారులు.. కోడళ్లు.. కూతర్లు.. మనుమలు... ఇలా అందరి ఆప్యాయతలకూ దూరం చేస్తున్నాం.. నా అనుకున్నవారి మధ్య ఆనందంగా గడపాల్సిన వారిని నా అనేవారికి దూరంగా గడిపే పరిస్థితి తీసుకొస్తున్నాం..
మరి ఈ దుస్థితికి మూలాలు ఎక్కడ? ఎవరిది తప్పు?? సామాజిక పరిస్థితుల ప్రభావం ఎంత??? ఈ దుర్భత స్థితి నుంచి అమ్మా నాన్నలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యత ఎంత?
తల్లిదండ్రుల సందర్భంగా 'ఈనాడు' శ్రీకాకుళం పట్టణంలోని ప్రశాంతి వృద్ధ జనాశ్రమం ఆవరణలో ఓ చర్చా వేదికను నిర్వహించింది. నాటి తరంతో... నేటి తరం భేటీని నిర్వహించింది. నాటి తరం ఆవేదనకు... నేటి తరం ప్రతిస్పందనను రాబట్టింది. ఈ చర్చలో వృద్ధాశ్రమానికి చెందిన ఆశ్రితులు, నిర్వాహకులతో పాటు వైష్ణవి ఇంజినీరింగు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వృద్ధుల అంతరంగం విన్న ఆ విద్యార్థులు చలించిపోయారు. ఇంత అన్యాయంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నవారున్నారా..? అంటూ మనోవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా తల్లిదండ్రులను దూరం చేసుకోమని ప్రతిన బూనారు. ఆ చర్చ సారాంశమేమిటో వారి మాటల్లోనే మీరూ చదవండి...
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
విశ్రాంత ప్రధానాచార్యులు రోణంకి ఆనందరావు
* సహజంగా పిల్లల వయసు పెరిగిన కొద్దీ తల్లిదండ్రులకు పెంపకంపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఎవరి కర్తవ్యాన్ని వారు చూసుకుంటుండాలి. విద్యతోనే నైతిక విలువలు కూడా అలవడతాయి. అందుకే తల్లిదండ్రులు కూడా ఎదుగుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చదువుతున్న అన్ని దశల్లోనూ వారిపై పూర్తి పర్యవేక్షణ ఉండాలి.
- వృద్ధజనాశ్రమం అధ్యక్షుడు ఎ.శంకరనారాయణ
* తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తారో అర్థం చేసుకోవాలి. ఇంట్లో పెద్దలుంటే సంప్రదాయాలు, క్రమశిక్షణ అలవడతాయి. ప్రస్తుతం పెద్దలను వద్దనుకునే స్థితికి వస్తున్నారు. పెద్దలను గౌరవిస్తూ వారితోనే ఉండాలి. ఆలోచనలో మార్పులు రావాలి. పెద్దల సమక్షంలో పెరగకపోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు మధ్య అంతరం పెరుగుతోంది.
- వృద్ధ జనాశ్రమ ఆశ్రితురాలు సుందరీభాయి
* ప్రస్తుతం అంతా యంత్రాలతోనే పనిచేస్తున్నారు. దీంతో పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతోంది. ఇంట్లో ఇద్దరూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుండడంతో పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో పిల్లలను తాత, మామ్మల వద్ద ఉంచేందుకు ఇష్టపడడంలేదు. ఈ విధానాలను తల్లిదండ్రులు మార్చుకుంటే కుటుంబ వ్యవస్థ కూడా ఆనందోత్సాహాలతో ఉంటుంది.
- వృద్ధ జనాశ్రమ ఆశ్రితుడు శంకరరావు
పెద్దవారిని బాధపెట్టవద్దు
వృద్ధ జనాశ్రమం లేకపోతే నా జీవితం పోయేది. అమ్మమ్మలు, తాతలు, నాన్నమ్మలను బాధ పెట్టవద్దు. పెద్దవారి నుంచి చాలా నేర్చుకోవాలి. అందుకే వారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమశిక్షణతో ముందుకు నడవాలంటే, తల్లిదండ్రుల సూచనలు పాటించాలి. వారిని గౌరవించాలి. ప్రస్తుత సమాజంలో ఇవన్ని కొరవడ్డాయి.
- ఆశ్రితుడు జగన్నాథరావు.
*పిల్లలు, పెద్దలు కలిసి ఉంటే వారి ఆలోచనల మధ్య దూరం తగ్గుతుంది. దీంట్లో సంఘానికి కూడా బాధ్యత ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు పొరపాటున కూడా తప్పు చెప్పరు. పెద్దలు ఏమి సూచనలు చేసినా బాధ్యతగా తీసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది. క్రమశిక్షణగల వ్యక్తిగా ఆ పిల్లలు ఎదుగుతారు.
- ఆశ్రమ నిర్వాహకులు, విశ్రాంత ఎంపిడిఓ పి.దుర్గాప్రసాద్‌లాల్
నాడు భయం... నేడు వదిలేశారు
మాకు నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఒకప్పుడు నేనంటే అందరికీ విపరీతమైన భయం. అటువంటిది నా దగ్గర ఆస్తి లేదని బయటకు పంపేశారు. రెండో అబ్బాయి అప్పుడప్పుడు వస్తుంటాడు. మిగిలిన వారు అసలు పట్టించుకోరు.
- కన్నీళ్లపర్యంతమైన బి.ఆదినారాయణ
* నాకు ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి. అబ్బాయిలు వ్యాపారం చేస్తుంటారు. చిన్న కుమారుడికి పెళ్లయిన తరువాత నన్ను ఇంటి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఎవ్వరూ చూడడం లేదు. కనీసం మనుమలు కూడా దూరం నుంచి చూసి వెళ్లిపోతుండడం బాధగా ఉంది...
- ఇదీ రమణమూర్తి ఆవేదన
పాఠశాల విద్యలో మార్పు రావాలి
ప్రస్తుత విద్యావ్యవస్థలో విలువల బోధన లేదు. ఉరుకుల పరుగులతో ర్యాంకుల కోసమే చదువు సాగుతోంది. పాఠశాల విద్యలో మార్పు రావాలి. ఆనాడు చిన్నప్పుడే విద్యలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవని విలువలతో కూడిన విద్య నేర్పేవారు. ప్రస్తుత పాఠ్యాంశాల్లో ఇవి ఎక్కడ? పాశ్చ్యాత్య సంస్కృతిపై మోజు పెంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల పెద్దలంటే గౌరవ మర్యాదలు లేకుండాపోతున్నాయి.
- వైష్ణవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి శరత్‌చంద్రప్రసాద్
* ప్రతిఒక్కరూ తమలోని అహంకారాన్ని పక్కన పెట్టాలి. చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. తప్పెవరిదైనా పిల్లలు అర్థం చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. టెలివిజన్లలోని సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. సీరియల్‌లోని పగ, ప్రతీకారాలు నిజజీవితంలో కూడా జరుగుతాయని భావిస్తుంటారు. వాస్తవ పరిస్థితులు అలా ఉండవని పెద్దలు, పిల్లలు అర్థం చేసుకోవాలి
- ====================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .