1993లో ఐక్యరాజ్యసమితి ఈ మానవ హక్కుల ఉద్ఘోషణ చేసింది. అంతకు రెండేళ్ల ముందు 1991లో ఆఫ్రికన్ జర్నలిస్టులు ఏప్రిల్ 29 నుండి మే 3 వరకూ నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం జరిపి పత్రికాస్వేచ్ఛపై ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆఫ్రికాలోని అనేక దేశాలలో సెన్సార్‌షిప్ వుండేది. పత్రికాస్వేచ్చ మీద ఆంక్షలుండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు ప్రకటన చేసిన మే 3 నాడే ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం జరపాలని ఐరాస నిర్ణయించింది. అప్పటి నుండి (1993 నుండి) ఏటా మే 3న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేను జరుపుకుంటూ వస్తున్నాము. ఈ సందర్భంగా యునెస్కో 1997 నుండి ఏటా మే 3 నాడు గుల్లెర్మోకేనో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ప్రమాదం అంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికాస్వేచ్ఛకు ప్రతీకగా నిలచిన జర్నలిస్టులకు, ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద 25,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి ఉంటుంది. గుల్లెర్మోకేనో ఒక కొలంబియన్ న్యూస్ పేపర్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. అయితే కేనో తన వ్రాతలతో డ్రగ్ మాఫియా కన్నెర్రకు గురి అయ్యారు. 1986 డిసెంబర్ 17న ఆయన దారుణంగా తన న్యూస్ పేపర్ ఆఫీసు ఎదుటే హత్య చేయబడ్డాడు. ఆయన బలిదానం పత్రికాస్వేచ్ఛకు స్ఫూర్తి.
దేశాలన్నీ ఒకటిగా లేవు. కొన్ని దేశాలలో పత్రికాస్వేచ్ఛ అన్న మాటే వినబడకూడదు! జర్నలిస్టులు అనేకదేశాలలో నిప్పుల నడక సాగిస్తున్నారు. 2006 ఒక్క ఏడాదే 75 మంది జర్నలిస్టులు 32 మంది మీడియా ఉద్యోగులు హత్యలకు గురి అయ్యారు. 2005 లో 63 మంది జర్నలిస్టులు చంపబడ్డారు. గత దశాబ్దంలో ఐదు వందల మందికి పైగా జర్నలిస్టులు చంపబడ్డారు. నిజానికి ఒక జర్నలిస్టు విధినిర్వహణలో చంపబడ్డాడంటే, అది వ్యక్తిగతమైన దాడి కానే కాదు, అది భావప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడే!
ఇంతకీ ప్రపంచంలో పత్రికాస్వేచ్ఛకు సంబంధించి ఏ దేశం ఏ దశలో ఉంది?
స్వచ్ఛందసంస్థ లెక్కల ప్రకారం, మూడింట ఒక వంతు ప్రపంచజనాభా పత్రికాస్వేచ్ఛ లేని వ్యవస్థలలో జీవిస్తోంది. ప్రజాస్వామ్యదేశాలలో పరిస్థితి ఫర్వాలేదు.'' కొన్ని సూచికల ఆధారంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఒక పట్టిక తయారుచేసి పత్రికాస్వేచ్ఛ విషయంలో ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఆ పట్టికలో భారతదేశం 105వ స్థానంలో ఉంది. కాగా పాకిస్థాన్ 157 వ స్థానంలోనూ, చైనా 163వ స్థానంలోనూ, డిపిఆర్ కొరియా అట్టడుగున 168వ స్థానంలోనూ ఉన్నాయి. క్యూబా, మయన్మార్, ఎరిత్రియా, తుర్క్‌మెనిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలలో పత్రికాస్వేచ్ఛ పరిస్థితి దారుణం. ఫిన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పత్రికాస్వేచ్ఛలో మొదటి స్థానంలో ఉన్నాయి. జపాన్ 51వ స్థానంలోనూ, అమెరికా 53 వ స్థానంలోనూ, ఇంగ్లాండ్ 27వ స్థానంలోనూ ఉన్నాయి. ఇటలీది 40వ స్థానం. ఫ్రాన్స్‌ది 35వ స్థా నం. జర్మనీది 23వ స్థానం.
ఇరాక్‌లో నిరుడు 37 మంది జర్నలిస్టులు చంపబడ్డారు. 1992 జనవరి నుండి 2006 ఆగస్టు వరకూ ప్రపంచం మొత్తం మీద 580 మంది జర్నలిస్టులు చంపబడ్డారని ది కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (ఈఓ) తేల్చింది. ఇరాక్ యుద్ధం మొదలైనప్పటి నుండి 137 మంది జర్నలిస్టులు బలి అయ్యారు. మన రాష్ట్రంలో కూడా జర్నలిస్టులు అనేక బెదిరింపుల మధ్య పని చేస్తున్నారు. మన రాష్ట్రప్రభుత్వం ఈ మధ్య పత్రికాస్వేచ్ఛను కాల రాసే తాఖీదులు జారీ చేసి నిరసనకు జడిసి వెనకడుగు వేసింది. పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు, ప్రజలే కాపాడుకోవాలి.
- source : Andhra prabha News paper
- ==============================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .