Sunday, May 2, 2010

ప్రపంచ నవ్వుల దినోత్సవం , world Laughter Day



నవ్వుల రోజు
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి .

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు. దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు. మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు. ఈ ఉత్సవ విశేషాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదయ్యాయి. 2004 మే 2వ తేదీన స్విట్జర్లాండ్‌ రాజధాని నగరంలో ఈ ఉత్సవం జరిగింది. ఆ దేశపు పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో విశేషం. నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రపపంచశాంతి ఈ దినోత్సవ నిర్వహణ పరమార్థమని నిర్వాహకుల అభిప్రాయం వచ్చిన సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ 'డే' మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!

ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలా మంది తంటాలుపడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా). ఆడాళ్ల నోళ్లలో నువ్వులు నానతాయో లేవో గానీ, అందరి నోళ్లల్లోనూ నవ్వులు నానలేవు. అందరి ముందూ నవ్వడానికి మొహమాటపడే మహామహులు కూడా పక్కకి వెళ్లి నవ్వును కక్కేయవలసిందే.

పుట్టుకతో వచ్చిందే...

సకల జీవరాశిలో మానవుడికో - మానవుడికి మాత్రమేనో- నవ్వుకునే, నవ్వే గుణమూ, లక్షణమూ .. అబ్బాయనుకోవడం మన అజ్ఞానం. చాలా గుణాలలాగే, నవ్వు కూడా మనకు మన పూర్వీకులైన మహా వానరాల నుండి వారసత్వంగా వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్నాం, నవ్వుకున్నాం. చింపాంజీలను, గొరిల్లాలను చక్కిలిగిలి పెడితే (పెట్టగలిగితే), అవీ ఎంచక్కా నవ్వుతాయి. కానీ మనలా 'హ హ హ' అనే టైపులో మాత్రం కాదు. వాటి నవ్వు శబ్దాలు వాటివి. ఆ శబ్దాలే మానవ నవ్వు మూలాలు, అయితే నవ్వు నేర్చుకున్న విద్య కాదు. జన్మత: లభించిన లక్షణం. పుట్టు అంధులు, బధిర శిశువులు కూడా ఎంచక్కా నవ్వుతారు.

ఒక మనిషి ఎంత సంతోషంగా వున్నాడో తెల్సుకోడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుంది. ఒంటరిగా వున్నప్పటికంటే జనంలో వున్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతాం. తోడెవరూ లేకుండా సినిమాల్లో కామెడీ సన్నివేశాలు చూసినా, మంచి జోక్‌ చదివినా మనసుకు ఆహ్లాదకరంగా వుంటుందే తప్ప నవ్వు ముంచుకురాదు. నిజజీవితంలో మనకు నవ్వు తెప్పించే సందర్భాలు సినిమాల్లో కామెడీ సన్నివేశాలంత పదునుగా వుండవు. ఎదుటివారి ముఖకవళికలు, కామెంట్లు, చేష్టలు చాలు మనం పగలబడినవ్వేందుకు. మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్లు నానా తంటాలూ పడితే తమకు నచ్చిన వాడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. కలిసి వున్న సమయంలో 62 శాతాన్ని హాస్యరసంలో ముంచెత్తే మగవాళ్లను అమ్మాయిలు ఇష్టపడితే, తమ హాస్యంలో కనీసం 65 శాతానికి స్పందించే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అడల్ట్‌ జోకులు పురుషులకు చక్కిలిగింతలు పెడితే, మహిళలు మాత్రం మంచి హాస్యరసం పలికే జోకులకే ఓటేస్తారట. తమ మీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్లకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో వుంటుంది. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్లు ఆత్మన్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా వున్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలుగుతారని మరో అధ్యయనం తేల్చి చెప్తోంది.


అసలు మన దేశంలో హాస్యానికి మొదటి నుంచి ప్రముఖ స్థానం వుంది. రాజుల ఆస్థానాలలో విదూషకులు అందుకే వుండేవారు. బీర్బల్‌, తెనాలి రామకృష్ణ వంటి వారి కథలు గిలిగింతలు పెడతాయి. జానపద గీతాల్లోనూ, హాస్యరసం పుష్కలం. అప్పటిదాకా ఎందుకు! నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని నేటి డాక్టర్లు సైతం చెబుతున్నారు. హాస్యం హాయిగా వున్నామనే భావన కలిగిస్తుంది. క్రమంగా ప్రపంచమంతటా హాస్యాన్ని, నవ్వును చికిత్స సాధనంగా గుర్తిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ ఇతర పాశ్చాత్య దేశాలలో ఆస్పత్రులకు అనుబంధంగా నవ్వుల ఆస్పత్రులు ఏర్పడ్డాయి. వీటిలో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. పెద్ద కారణం లేకుండా నవ్వడం పిచ్చి అనుకుంటే మీరు పొరబడినట్టే. కడుపుబ్బ నవ్వేవారు ఒత్తిడి తగ్గించుకుని ప్రపంచంలో హాయిగా సర్దుకోగలరన్నమాట. తమ సమస్యలను, సంకోచాలను పక్కనబెట్టి హాయిగా నవ్వడం ద్వారా మెరుగైన జీవనానికి సాగిపోతారన్నమాట.

హాస్య ప్రియత్వం తగ్గుతోందా!

నవరసాల్లో ఒకటి హాస్యం. కానీ ఒక రకంగా అది మన జీవితాల్లో తగ్గిపోతోందనిపిస్తోంది. కోపం..ముభావం...ఆవేశం...అసంతృప్తి...ఎప్పుడూ మన వెన్నంటి వుండేవే. సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా వీటినుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు. దానికి ఒకటి రెండూ కాదు. ఎన్నో కారణాలు. జీవితంలో పెరిగే వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు ... ఇంకా ఎన్నెన్నో. ఇవే మనషిని నవ్వుకు దూరం చేస్తున్నాయి. అసలు నవ్వడమే మర్చిపోయేలా చేస్తున్నాయి. చార్లీచాప్లిన్‌ నుంచి బ్రహ్మానందం వరకు హాస్యనటులు నవ్వులు పండిస్తున్నా జీవితంలో నవ్వులు కరువవుతున్నాయి. ఆరోగ్యకమైన హాస్యం ఇవాళ్టి జీవితంలో లోపిస్తోంది. అవసరాలు తీర్చుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు చేసే పరుగుపందెంలో ఏళ్లు గడిచిపోతున్నాయి.

కాసేపు నింపాదిగా, హాయిగా గడిపే తీరిక వుండడంలేదు. ఇలా గడిపితేనే కదా, మనుషుల మధ్యన మాటా ముచ్చట వుండేది, సంభాషణ కొనసాగేది. అప్పుడే హాస్యం పుడుతుంది. సంభాషణలో చతురోక్తులకీ, ఛలోక్తులకీ చోటు వుంటుంది. కానీ అలాంటి అవకాశం, తీరిక ఇప్పుడు లేదు మరి. ఇంతేకాక ఎప్పుడూ ఏవో చికాకులతో, చింతలతో, అర్థం లేని లక్ష్యాల సాధనకోసం పరుగులాటలో ఒత్తిడిలో కాలం గడిపేస్తుంటారు. ఇలా నిరంతరం ఒత్తిడికీ, దిగుళ్లకీ లోనై మనుషుల్లో హాస్య ప్రియత్వం తగ్గిపోతోంది. హాయిగా స్వేచ్ఛగా, నవ్వే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. మగవాళ్లలోనూ నవ్వు ఎక్కడ వుంది? ఏదో సీరియస్‌గా ముఖమంతా గంటు పెట్టుకొని కూచుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా వుండే తత్వం కూడా అరుదే. అందుకే నవ్వు భాగ్యమైపోయింది. అందుకే ఇప్పుడు నవ్వడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమొచ్చింది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో లాఫింగ్‌ క్లబ్బులు ఏర్పడ్డాయి. నవ్వులను మరిచిపోయిన వాళ్లకు నవ్వడం నేర్పిస్తున్నాయి. నవ్వడాన్ని ప్రాక్టీస్‌ చేయిస్తున్నాయి. నవ్వును చంపేసిన మనమే నవ్వడం నేర్చుకుంటున్నాం. ఏది ఏమైనా ఎరుపెక్కిన ముఖం, వంకరతిరిగిన మూతి, బరువెక్కిన హృదయం... అన్నిటికీ విరుగుడు నవ్వే. హాస్య చిత్రాలు, నాటకాలు, రచనలు, కార్టూన్లు వగైరాల వల్ల గుండె బరువెక్కే ప్రమాదమే వుండదు.

నవ్వుతో జబ్బులకు చెక్‌

జబ్బులలో 70 శాతం ఏదో ఒక విధమైన ఒత్తిడికి సంబంధం వున్నవే. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రిన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్‌... వగైరాలు ఆ కోవకు చెందినవే. నవ్వుల మందు తీసుకుంటే ఆవి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు కేవలం నవ్వు మందుతోనే తగ్గుతాయని చెప్పలేం. పైగా ఒత్తిడికి గురవడం వల్ల అడ్రినాలిన్‌ ఎక్కువగా విడుదలౌతుంది. నవ్వితే అది బాగా తగ్గుతుంది. తమలో తాము ముడుచుకుపోయే వారితో పోలిస్తే తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.

టెన్షన్‌ తగ్గించే సేఫ్టీ వాల్వులాంటి నవ్వు వల్ల ఒత్తిడికి కారణమైన హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఉపశమనం కలుగుతుంది. 10 నిమిషాలు నవ్వగలిగితే 10-20 మి.మీ రక్తపోటు తగ్గుతుంది. రోజువారీ నవ్వులు రోగనిరోధక వ్యవస్థను వృద్ధి చేస్తాయి. అందుకు అవసరమైన లింపాసైట్స్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే ముక్కు, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన పొరలలో నవ్వుల వల్ల మెరుగుదల వుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌(Arthritis), స్పాండులైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి. కనుక ఆస్తమా రోగులకూ మేలు కలుగుతుంది.

జీవితంలో ఆశ, విశ్వాసం అవసరం. హాస్యం ఆ రెంటినీ ఇస్తుంది. సజీవమైన నవ్వులు తొణికిసలాడేవారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు. పసిపిల్లల బోసి నవ్వులు గుర్తు చేసుకుంటే మీ విచారం క్షణంలో మాయమౌతుంది. అందుకనే ఎవరైనా హాయిగా నవ్వుతుంటే చూసి విసుక్కోకుండా, ఎగతాళిగా నవ్వుకోకుండా... మీరూ ఆ నవ్వులలో పాలు పంచుకోండి మరి.మీ నవ్వే మీకు టానిక్‌.


  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .