Wednesday, May 12, 2010

నర్సుల దినోత్సవం(ప్రపంచ) , Nurses Day(world)

నేడు నర్సుల దినోత్సవం--12/మే/2010
నవజాత శిశువు భూమిమీద అడుగిడే సమయంలో పురిటి నొప్పులు పడుతున్న తల్లిని ఓదారుస్తూ బాసటగా ఉంటూ జన్మ, పునర్జన్మల వారథిగా నిలుస్తూ మనిషి పుట్టుక మొదలు , శారీరర, మానసిక రుగ్మతలతో, గాయాలతో వైద్యశాలలో ఆశ్రయం పొందినప్పుడు ఔదార్యంతో వేళకు ఔషదాలను అందిస్తూ, బాధ్యతతో జాగ్రత్తలు చెబుతూ,ఓర్పుతో పరిచర్యలు చేస్తూ మనసును కుదుట పరిచేమంచిమాటలతో రోగిలో స్పూర్తిని, నమ్మకాన్ని పెంపొందిస్తూ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే దిశగా డాక్టరుతోపాటు అంతకంటే ఎక్కువ పాళ్లే రోగికి ప్రత్యక్షంగా సేవలను అందించే ఉన్నతమైన, ఔదార్యమైనది, సేవా పూర్వకమైనది నర్సు వృత్తి.

సేవ వారి వృత్తి. సౌమనస్యం వారి ప్రవృత్తి. సహకారం వారి సహజ లక్షణం. మందహాసం జీవలక్షణం. ఓదార్పు వారి నైజం. చేయూత వారి స్వభావం. ఆర్తుల పాలిటి ఆత్మబంధువులు..అభాగ్యుల పాలిటి అమృత బిందువులు.

రోగులకు వారికి ఎలాంటి పేగు బంధం లేదు..అయినా కన్న వారికన్నా, కడుపున పుట్టిన వారి కన్నా మిన్నగా ఆదరించి సేవలందించే దయామయులు. దయామయుడైన దేవుడు తనకు మారుగా నర్సులనే భూమి మీదకు పంపి తన ఆపన్న హస్తాన్నందిస్తాడని పెద్దలు చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలు. తాము సేవ చేసే వ్యక్తి ఎవరో, వారి వ్యక్తిత్వమేమిటో, దొంగలో దొరలో, శత్రువులో మిత్రులో, ఈ దేశీయులో, పరదేశీయులో పట్టించుకోకుండా సేవలందించే ఉదాత్త చరితలు నర్సులు. ఒంట్లో ఏ కాస్త బాగోక పోయినా డాక్టర్‌ అని పరుగులు పెడతామే కాని అక్కడ మనకు నిజమైన సేవలందించేది నర్సులే!

డాక్టర్‌ ఏయే మందులు, ఏయే సమయాలలో ఇవ్వాలో మాత్రమే చెబుతాడు. ఆ మందులను ఆయా సమయాలలో క్రమం తప్పకుండా, సమయం దాటిపోకుండా రోగినిద్రపోతుంటే లేపి మరీ నోటికి మందు అందించేది నర్సమ్మ. పసిబిడ్డలకే కాదు కాటికి కాళ్ళు చాచిన ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి నర్సు సేవలు కావాలి. ఒంట్లో బాగున్నానని రోజులు మన్నూ మిన్నూ కానకుండా ఎగిరిపడే మనం ... రోగం రాగానే సాయం కోసం అంగలారుస్తాం. సామాన్యమైన జ్వరం వచ్చిన వారు మొదలు, ఎయిడ్స్‌, క్యాన్సర్‌, టిబి వంటి మహమ్మారి రోగాల బారిన పడిన వారి వరకు ప్రతీ ఒక్కరు నర్సు సేవకోసం మొహం వాచిపోతారు. ఒక్క క్షణం నర్సు కనబడకపోయినా కాలింగ్‌ బెల్‌ నొక్కేసి పిలుస్తుంటారు. సెలైన్‌ ఎక్కించమనో, పెట్టింది అయిపోయిందనో, మంచం పైకి ఎత్తమనో, కిందికి దించమనో పనులు పురమాయిస్తుంటారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎందరో వారిని పనుల పరంపరతో వారి ప్రాణాలను కొరికేస్తుంటారు. అయినా ఎవ్వరిమీద విసుక్కోకుండా అందరికీ చిరునవ్వుతో సమాధానాలు చెబుతూ అనునయవాక్యాలతో, ఉపశాంతి కలిగించే పరమ సహనపరురాలు నర్సు.

ఇంజక్షన్‌ ఇవ్వడం మొదలు సీరియస్‌గా ఉండి బెడ్‌రిడెన్‌ అయిపోయిన పేషెంట్‌కు స్పాంజ్‌బాత్‌ చేయించడం, బెడ్‌ ప్యాన్‌ అరేంజ్‌ చేయడం వంటి అత్యవసర పనుల వరకూ నర్సమ్మ చేసే సేవలు అగణ్యం..అద్వితీయం. ఇంట్లో సొంత మనుషులు కూడా వారి అంత అభిమానంగా, ఓపికగా సేవ చేయరంటే అతిశయోక్తి కాదు. డ్యూటీకి వచ్చింది మొదలు డ్యూటీ దిగి వెళ్ళే వరకు అలుపు ఆయాసం లేకుండా, విసుగూ విరామం లేకుండా, క్షణం విశ్రాంతి తీసుకోకుండా ప్రాణాలున్న మరబొమ్మల్లా పనిచేస్తారు. వారు చేసే సేవలు అమూల్యమైనవి. వారు మాట్లాడే మాటలు మహత్తరమైనవి. ఆ మాటలలో, వారి సహనవంతమైన మందహాసంలో ఏం మహత్తు ఉంటుందో కాని రోగులు సగం బాధను పోగొట్టుకుంటారంటే అతిశయోక్తికాదు. తెల్లటి గౌను వేసుకుని, తలకు ' బౌ ' పెట్టుకుని, మోకాళ్ళు దాటేలా స్టాక్స్‌ వేసుకుని తెల్లని మెత్తని చప్పుడుచేయని షూస్‌ వేసుకుని కనిపించే నర్సమ్మల జీవితాలు ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా ఉండవు. ఆస్పత్రిలో సందడిగా తిరిగే నర్సమ్మ జీవితంలో సమస్యలెన్నో సంగ్రామ భేరీలు మోగిస్తూ మనశ్శాంతిగా ఉండనివ్వవు. షిఫ్ట్‌లలో పనిచేస్తూ వేళకు తిండిలేక, సమయానికి నిద్రలేక, పరామర్శించే పరిస్థితిలేక, సమాజంలో చెప్పుకోదగ్గ గుర్తింపులేక, చాలీచాలని జీతాలతో జీవితాలను బొటాబొటిగా, కటాకటిగా నడిపించే అభిశప్త జీవనులు నర్సులు. వారి కళ్ళు నవ్వుతున్నా ఆ నవ్వుల మాటున ఎన్నో జాలి కథలూ వెతలూ దోబూచులాడుతుంటాయి... గుండెబరువులు, నిట్టూర్పులూ. అసంతృప్తులు, ఆందోళనలూ వారికి జీవన సహచారిణులు. అయినా ఆస్పత్రిలో ఉన్నంతసేపు బైటపడకుండా దాచిపెట్టి మానవసేవకు దిగే పరమకారుణికోత్తమలు నర్సులు.
ఎంతో సేవాతత్పరతతో కూడిన నర్సింగ్‌ వృత్తికి, ఆధునిక నర్సింగ్‌ విద్యకు లేడీ విత్‌ ద ల్యాంప్‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలు, మార్గదర్శకురాలు, స్ఫూర్తి ప్రధాత.1820 మే 12 ఇటలీలోని ఫ్లోరెన్స్‌ నగరంలో బ్రిటీష్‌ కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

లేడీ విత్‌ ద ల్యాంప్‌


తన 30ఏళ్ల ప్రాయంలో జర్మనీలోని కెయిసర్‌ వర్త్‌లో నర్సింగ్‌ విద్యాభ్యాసం చేసిన అనంతరం పారిస్‌లో విధి నిర్వహణ చేస్తున్న కాలంలో యూరప్‌లో జరిగన క్రిమియాన్‌ యుద్ధం గాయాలపాలై రక్తసిక్తమై అల్లాడుతున్న సైనికుల వ్యధాభరిత కథనాలను వార్తాపత్రికల్లో చదివి చలించిపోయింది. ఆ యుద్ధంలోని క్షతగాత్రులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని కొంతమంది నర్సుల బృందంతో టర్కిలో ఆ సైనికులున్న లుక్ట్రాయి హాస్పటల్‌కు చేరుకుంది. అక్కడ ప్రతీరోజూ వైద్య సేవలు చేస్తూ నిశిరాత్రిలో కూడా చిన్న లాంతరు పట్టుకుని ఆ వెలుగులో గాయాలపాలై బాధతో నిద్రపట్టక విలవిలలాడుతున్న సైనికులను ఓదార్చుతూ వారి కళ్ళలో వెలుగులు నింపేది. దాంతో అక్కడివాలందరూ నైటింగిల్‌ను లేడి విత్‌ ద ల్యాంప్‌ అని పిలవడంతో ఆమెకు ఆ పేరు సార్ధకమయింది.

క్రిమియన్‌ యుద్ధ క్షతగాత్రులకు సేవలందిస్తున్న సమయంలో అక్కడ వాతావరణానికి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆ నాటినుంచి 50ఏళ్లపాటు అనారోగ్యంతో బాధపడుతూనే నర్సింగ్‌ సేవలను కొనసాగించింది. ఆమె జీవితంలోని చివరి పదేళ్ళు కళ్లు కానరాకపోయినా వృత్తిని మాత్రం వీడలేదు. అంకిత భావంతో సేవలు చేస్తూనే 1910 ఆగస్టు 10న రోగుల కళ్ళలో వెలుగులు నింపిన లేడీ విత్‌ ద ల్యాంప్‌ పరమ పదించింది.


లండన్‌లోని ప్రఖ్యాత థామస్‌ ఆసుపత్రిలో నర్సింగ్‌ స్కూల్‌ను స్థాపించి అప్పట్లో ఆధునిక నర్సింగ్‌ విద్యకు బీజం వేసి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలైంది. ఈ రంగంలో పరిశోధనలు జరిపి గ్రంధాలు రచించి, యుద్ధభూమిలోని క్షతగాత్రుల వెతలను తీర్చి జీవితాంతం అంకిత భావంతో అణువణువునా సేనా తత్పరతను నిలుపుకున్న ఫ్లోరింగ్‌ నైటింగేల్‌ నేటికీ ఎన్నటికీ నర్సువత్తిలోని వారికి స్ఫూర్తిప్రధాత అని మార్గదర్శకంగా చిరస్మరణీయంగా నిలిచే ఆదర్శమూర్తి .

నర్సులు ఎదుర్కోనే ఇబ్బందులు :

  • నిత్యము అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులమధ్య ఉండాల్చిన పరిస్థితి . ఒక్కోసారి బ్యాక్టీరియా ఇన్క్ష్ ఫెక్షన్క్ష్ కు గురై జీవితం పై దాని ప్రభావం చూపిస్తొంది .
  • వైద్యులకు , రోగులకు మధ్య సంధాన కర్తలుగా ఉండే వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారుతోంది . ఎవరి నుంచి వత్తిడి ఎదురైనా ఆ ప్రభావము వీరిపైనే పడుతోంది .
  • ఆడది రాత్రి వేల గడప దాటకూడదనే అపోహ చాలామందిలో ఉంది . నర్సులు విధి నిర్వహణలో రాత్రివేళ బయటకు వెళ్ళాల్చిరావడం ఎన్నో అపోహలకు , అనర్ధాలకు దారితీస్తోంది .
  • సంసారపరమైన అపార్ధాలు , వ్యక్తిగత జీవితమ్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్చి వస్తోంది .
  • సమాజము లో నర్సులను చులకనగా చూస్తారు ... దానికి తోడు సినిమాల్లొ నర్సులను వ్యంగ్యం గాను , హాస్యసందిత సన్నివేశాలులలో చూపించడం బాధాకరం .


  • ///Dr.Seshagirirao-MBBS (Srikakulam)///
  • ==========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .