Friday, May 7, 2010

ఆస్తమా దినోత్సవం , Asthma Day

మే నెల మొదటి మంగళవారం - ప్రపంచ ఆస్తమా దినోత్సవం


ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజలలో అవగాహన పెంచి ఆస్తమాను అదుపులోకి తీసుకురావడమే దీని ప్రధానోద్దేశం. ఇందుకోసం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా(జిఐఎన్ఏ) అనే సంస్థ "మీరు మీ ఆస్తమాని అదుపులో పెట్టుకోగలరు'' అనే నినాదంతో ప్రచారం చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఆస్తమా బారిన పడేవారి సంఖ్య సగానికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది.
ఆస్తమా జబ్బుతో బాధపడుతున్నవారకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తొలుత దగ్గు వస్తుంది. ఆ తర్వాత ఊపిరి తీసుకోవడం అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సివస్తుంది. దగ్గు వచ్చేదికూడా సాధారణమైన దగ్గు కాదు. గళ్ళతో కూడిన దగ్గు. ఈ జబ్బు ఏ వయసువారికైనాకూడా రావచ్చు. ఆస్తమాతో బాధపడేవారికి ముఖ్యంగా రాత్రి వేళల్లో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. రాత్రిపూట దగ్గుతూ శ్వాస తీసుకోవాల్సివస్తుంటుంది.

ఆస్తమాతో బాధపడుతుంటే దగ్గుకూడా విపరీతంగా వస్తుంది. అది కొన్ని గంటల వరకుకూడా అలాగే ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాలలో మృత్యువాతకూడా పడే సూచనులున్నాయి . ముఖ్యంగా ఈ జబ్బు బారినపడే వారు పురుషులే అధికము . మరి పిల్లల్లోనైతే ఈ జబ్బు త్వరగా వచ్చేస్తుంది .

మనిషి శరీరంలో ముఖ్యంగా శ్వాస వాహికలు రెండునుంచి మూడు సెంటీమీటర్ల వ్యాసంలో ఉంటుంది. ఇది రెండు బ్రోంకైలుగా విభజించబడి ఉంటుంది. ఇవి మనిషి ఊపిరితిత్తులకు సంబంధించింది. వీటిలో అతి చిన్నదైన నాళంయొక్క వ్యాసం కొన్ని మిల్లీమీటర్ల వరకుంటుంది. అందులోనున్న ఊపిరితిత్తులు కుచించుకుపోతే రోగికి శ్వాస తీసుకోవడం అతి కష్టంగా ఉంటుంది.

ఆస్తమా సర్వసాధారణంగా వచ్చే బబ్బులలో ఒకటి. శరీరానికి, ఊపిరితిత్తులకు సరిపడని సూక్ష్మపదార్థాలు గాలి ద్వారా లేక ఆహారం ద్వారా శ్వాసనాళాలలోకి ప్రవేశించినపుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందిస్తుంది. దీనివల్ల వివిధ రకాలైన రసాయనాలు శ్వాసవ్వవస్థలో విడుదలై శ్వాసనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది.

ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బిగువుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ముక్కు అలర్జీ ఎక్కువగా ఉంటుంది. దీనిని 'ఎలర్జిక్ రైనైటిస్' అంటారు. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కళ్లు, చర్మానికి సంబంధించిన అలర్జీలు కూడా ఉండవచ్చు. ఒక్కోసారి అన్ని రకాల అలర్జీలు కూడా కనిపిస్తాయి.

ఉబ్బసము చాలా మంది లో ఎలర్జీ వల్ల వస్తుంది . పెంపుడు జంతువులు, సుగంధ ద్రవ్యాలు, దూది, బిస్కెట్, కేక్, బ్యాకరీ ఉత్పత్తులు జామ్, ఊరగాయ, సాస్ ఇంకా మూతపెట్టిన పదార్థాలనుంచి ఆస్తమాతో బాధపడేవారు దూరంగా ఉండాలి .

ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారికి చలికాలంలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఎందుకంటే ...చలికాలంలో నైట్రోజెన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఓజోన్ వాయువులు కాలుష్యాన్ని పెంచేస్తాయి. కర్మాగారాలనుంచి వచ్చే పొగలో ఎన్నో హానికారకమైన పదార్థాలుంటాయి. ఇది ఆస్తమాను మరింత పెంపొదిస్తుంది.

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతోపాటు మారుతున్న జీవనశైలి యువతను ముప్పు తిప్పలు పెడుతోంది. నగరాలు, పట్టణాల్లో ఆటస్థలాలకు కొదవ ఏర్పడుతుండటంతో ఇండోర్ గేమ్స్‌పై ఎక్కువ శ్రద్ధ కనబరచాల్సి వస్తోంది. ఇండోర్ గేమ్స్ ఆడటంతో ఆస్తమా బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆస్తమా బారిన పడే వారిసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చివరికి చిన్నారులు సైతం ఆస్తమా బారిన పడుతున్నారు. కారణం కాలుష్యం.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆటస్థలాల కొదవ ఏర్పడటంతోపాటు పిల్లలు అపార్ట్‌మెంట్లపైన టెర్రస్‌పై ఆడుకోవడం లేదా ఇండోర్ గేమ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో యువత ఆస్తమాబారినపడుతున్నట్లు పరిశోధనలో తేలిందని విశ్లేషకులు తెలిపారు. ఇండోర్ గేమ్స్ ద్వారా ఇండ్లలోని కర్టెన్లు, కార్పెట్లలో చేరుకున్న దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. దీంతో వారిలో అలర్జీ, ఆస్తమా తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతే కాకుండా ఎప్పుడూ ఇండ్లలోని నాలుగు గోడల మధ్య ఉండటంచేత వారిలో సమతుల్యమైన జీవనశైలిని అలవరచుకోలేకపోతున్నారు. ఈ సమస్య నానాటికీ పెరిగిపోతోంది.

వాతావరణం మారడంతోటే సమస్య మరింత జఠిలమౌతోంది :

వాతావరణం మారినప్పుడు పిల్లల్లో అలర్జీ, ఆస్తమా లక్షణాలు బయటపడతాయి. మధ్యవయస్కుల్లో దాదాపు ఐదు నుంచి పది శాతం మేరకు అలర్జీ, ఆస్తమా బారిన పడినవారుంటున్నారు. అదే కిశోరావస్థ, యువకుల్లో ఎనిమిది నుంచి పదిహేను శాతం మేరకు ఈ వ్యాధి బారిన పడిన వారున్నట్లు పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు.

వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రారంభమౌతుంది :

వైరల్ ఇన్ఫెక్షన్ నుంచే ఆస్తమా ప్రారంభమౌతుంది. యువకులు తరచూ జలుబు, జ్వరంతో బాధపడుతుంటే అది అలర్జీకి సంకేతంగా అభివర్ణించవచ్చు. దీంతో సరైన సమయంలో అలర్జీకి చికిత్స తీసుకుంటే ఆస్తమా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్న వారమౌతామంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలర్జీకి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మెలమెల్లగా ఆస్తమాకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రధాన కారణాలు :

ఇండోర్ గేమ్స్‌ను ప్రోత్సహించడం
వాతావరణం అనుకూలించకపోవడం
వంశపారంపర్యం
కాలుష్యం
ధూమపానం

మందులు
కొన్ని రకాల మందుల వల్ల కూడా కొందరిలో ఆస్తమా పెరిగిపోతుంది. ఆస్పిరిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు కొందరిలో ఆస్తమాను కలగచేస్తాయి. కొన్ని జబ్బులు ఆస్తమా మాదిరిగా ఉంటాయి. వాటినా ఆస్తమాగా పరిగణించకూడదు. బ్రాంకైటిస్, సిఓపిడి, పోస్ట్ నాసల్ డిశ్చార్జ్, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసిసీ, స్వరపేటికలో ఓకల్‌కార్డ్ సరిగా పనిచేయకపోవడం, ఆస్పిరేషన్, దీర్ఘకాలిక మైక్రోప్లాస్మా ఇన్‌ఫెక్షన్, శ్వాసనాళాలు తిత్తులలాగా సాగిపోవడం మొదలైనవి ఆస్తమాగా కనిపిస్తాయి. సరియైన పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆస్తమానా కాదా గుర్తించవచ్చు.

పరీక్షలు
స్పైరోమెట్రీ, ఫియఫ్‌టి, పిఈఎఫ్ఆర్, స్కిన్ అలర్జిన్ టెస్టింగ్, బ్రాంకియల్ ప్రొవొకేషన్ టెస్టింగ్ లాంటి పరీక్షల ద్వారా ఆస్తమాను గుర్తించవచ్చు. స్పైరోమెట్రీ, పీఈఎఫ్ఆర్ ద్వారా చాలా వరకు ఆస్తమాను గుర్తించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
-ధూమపానంకు దూరంగా ఉండటం.
-దుప్పట్లు, పిల్లో కవర్లను వేడి నీటిలో శుభ్రంగా ఉతకడం. తివాచీలు వాడకుండా ఉండటం.
-దుమ్ము, ధూళి ఉన్న చోటుకి వెళ్లకుండా ఉండటం. పాతపుస్తకాలు, పేపర్లజోలికి వెళ్లకపోవడం.
- ఇల్లు ఊడవడానికి బదులుగా తడిగుడ్డతో తుడవడం.
-పెంపుడు జంతువులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం.
-పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉండే కాలంలో ఇంట్లోనే గడపడం.
-శీతలపానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్ వాటర్‌ను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

చికిత్స :

ఆస్తమా రోగులు వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోవాలి. నియమానుసారం మందులను వాడుతుండాలి.

ముఖ్యంగా వీరు ఊపిరితిత్తులను పరీక్షించుకోవాలి. ఇంకా అలర్జీకారణంగాకూడా ఇలా జరగవచ్చను .

ప్రస్తుతం చాలామంది ఆస్తమా రోగులు ఇన్‌హేలర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో రోగికి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమానుంచి ఉపశమనం కలగాలంటే ధూమపానం చేయకండి. ఎవరైనా ధూమపానం చేస్తుంటే వారినుంచి తమరు దూరంగా ఉండండి. చల్లటి ద్రవ పదార్థాలను వాడకండి. చలికాలంలో జాగ్రత్తగా ఉండండి. త్వరగా అలసిపోయే పనులేవీ చేయకండి.

ఆస్తమాను వ్యాయామంతోకూడా తొలగించవచ్చును . పరిశుభ్రమైన వాతావరణంలో ఊపిరి తీసుకుని వ్యాయామం చేయమంటున్నారు వైద్యులు. ఏది ఏమైనప్పటికి వైద్యుల సలహాలు పాటించనిదే మందులు వాడకూడదు


  • ============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .