Saturday, March 27, 2010

ప్రపంచ రంగస్థల దినోత్సవం , World Stage Drama Artists Day





బహుకళ సమాహారం 'నాటక రంగం' * నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ' - చిక్కోలు ఆణిముత్యాలు

నటుడి చలిని కప్పే దుప్పట్లు... చప్పట్లు! శభాష్‌ అంటూ రసజ్ఞుల ప్రశంసలు... రసానందంతో మైమరిచిపోయి వన్స్‌మోర్‌ టపటపమంటూ కరతాళధ్వనులతో ప్రేక్షకుల ఆదరణ.. ఇవే నాటక రంగానికి ఊపిరి, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇప్పటికీ పల్లెల్లో జరిగే జాతర్లకు, శ్రీరామోత్సవాలు, వివిధ శుభకార్యాల్లో నాటకాల ప్రదర్శనలతో రంగస్థలం ప్రత్యేకత చాటుకుంటోంది. వివిధ మాధ్యమాలు వస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శింపజేసి విభిన్న రుచులు కలిగిన జనావళికి ఏకపత్ర సమారాధన చేసే మహత్తర కళా ప్రక్రియ నాటక కళ. శతాబ్ది పైచిలుకు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాటకానికి ఎందరో రచయితలు, మరెందరో నటులు... ఇంకెందరో దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. నటరాజ కాలి అందెల్లో సిరిమువ్వలుగా నిలిచారు.
రంగస్థల చరిత్ర :
సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పట్లో లాగ అప్పట్లో దేశాల మధ్య రాకపోకల్లేవు. అసలు దేశం ఉనికే తెలీదు. అలాంటిది ఒకే ప్రక్రియ రెండూ వేర్వేరు చోట్ల ప్రాణం పోసుకోవడానికి ముఖ్య కారణం మానవ సంబంధాలూ, సమాజమూనూ. నాటకం వీటినుండే పుట్టింది. గడిచిపోయిన దాన్ని కళ్ళముందు జరిగుతోందన్న భ్రమని కలగజేయడమే నాటకం. ఆ భ్రమకి వాస్తవ రూపం ఇచ్చేది నాటక రచన అన్నది నిర్వివాదం. నాటకం సర్వజననీయం; సర్వకాలీనం. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ రూపం మారుతుంది తప్ప అంతర్లీనంగా నాటక మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే! అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియ. ప్రస్తుతమున్న నాటకం కాల క్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం పుట్టింది.

అంతర్జాతీయంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినంగా ప్రకటించారు. ఇది 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా శ్రీకారం చుట్టబడింది. ఈ రోజు పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రదర్శనలూ, సభలూ జరుగుతాయి. ఆ విషయాలందరూ పంచుకుంటారు. అర్వి కివిమా అనే హెలెన్‌స్కీ జాతీయుడు మొట్ట మొదటి సారిగా 1961లో వియన్నాలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చాడు. వియన్నా లో ప్రపంచ రంగస్థల సంస్థ యూక కార్యక్రమానికి అనేక దేశాలనుండీ నాటకప్రియులు విచ్చేసారు. కివిమా ప్రతిపాదన నచ్చి, అందరూ అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది. అప్పటినుండీ అప్రతిహతంగా ఈ రంగస్థల దినోత్సవం జరుపుతూనే ఉన్నారు. ప్రతీ ఏటా ప్రపంచవ్యాపతంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని ఆ ఏడాదికి సంచాలకుడిగా నియమిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రంపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాలని పంచుకుంటారు. నాటక రంగ కృషికి కొత్తొ కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రతీ దేశం నుండీ ఒక ప్రముఖ వ్యక్తిని ఆ సంస్థ సలహాదారుగా నియమిస్తారు. భారత దేశం నుండి ప్రముఖ నాటకకర్త గిరీష్ కర్నాడ్‌ని ఈ సంస్థ నాటక ప్రతినిధిగా నియమించారు.

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎందరో కళాకారులు నాటకరంగం వికాసానికి దోహదపడ్డారు. ప్రభుత్వపరంగా కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 686 మంది కళాకారులకు జీవన భృతిని అందిస్తుండడం, శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య లాంటి సాంస్కృతిక సంస్థలు పేద కళాకారులకు ప్రతినెలా ఆర్థిక చేయూతతో పాటు జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తుండడంతో చిక్కోలు నాటకరంగం చిగురిస్తోందని చెప్పొచ్చు. జిల్లా నుంచి నాటకరంగం రైలెక్కి, సినిమా రంగం విమానంలో విహరించిన ఆనాటి మేటి జె.వి.సోమయాజులు, రమణమూర్తి, శరత్‌బాబు లాంటి కళాకారులతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రస్థాయిలో 'నంది' కీర్తి పతాకం ఎగురవేసిన కళాకారులు ఉన్నారు. మీగడ రామలింగస్వామి, కేశిరెడ్డి రాజేశ్వరీ, ఎం.రామచంద్రరావు, మీగడ మల్లికార్జునరావు, బి.మోహనరావు, పి.చలపతిరావు లాంటి కళాకారులు నంది పురస్కారాలు అందుకున్నారు.

విశ్వమానవాళికి చైతన్యం.. విశ్వనాటకం
కళాత్మక వారసత్వ సంపద ఒక దేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా మానవీయ సంబంధాలు పెంపొందించాలనే సదుద్దేశంతో విశ్వమానవాళి చైతన్యం కోసం విశ్వనాటకం దోహదపడాలనే సదాశయంతో పారిస్‌ నగరంలో 1947 మార్చి 27న ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ థియేటర్‌ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఆ నాటి నుంచి ప్రపంచ నాటకరంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

చిక్కోలు ఆణిముత్యాలు
ఆనాటి నుంచి నేటి వరకు చిక్కోలు ప్రాభవ వైభవాన్ని చాటిన రంగస్థల కళాకారులెందరో ఉన్నారు. నాటి కళావారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేడు రాష్ట్ర నందులను చిక్కోలుకు తెచ్చిన కళాకారులు అభినందనీయులు. అపరశివాజీగా పేరొందిన చట్టి పూర్ణయ్యపంతులు, అభినవ కృష్ణులుగా స్వర్ణకంకణాలు పొందిన పీసపాటి, అమరావు సత్యం భక్త రామదాసుగా కన్నేపల్లి సుబ్రమణ్యం, కబీరుగా అంపోలు ఎర్రయ్య, కలగా లక్ష్మయ్య అందరికీ సుపరిచిత సుప్రసిద్ధులు కాగా, నేడు కురిటి సత్యంనాయుడు, చీకటి రామారావు, యడ్ల గోపాలరావు, కిలారి లక్ష్మి, ఉయ్యూరు దుర్గాప్రసాద్‌, బగ్గు అప్పారావు నాయుడు, రాజ్యలక్ష్మి, కొత్తూరు పార్వతీశం, కేశిరెడ్డి రాజేశ్వరీ, మోహినీ ఇలా ఎందరో జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు.

'నంది'వర్ధనాలు..
రాష్ట్రప్రభుత్వ నంది నాటక పురస్కారాలను అందుకొని రాష్ట్రంలో చిక్కోలు ఖ్యాతిని చాటిన రంగస్థల కళాకారులుగా.. మీగడ రామలింగస్వామి (రాజాం) ఉత్తమ నటుడు, దర్శకుడిగా రెండు బంగారు నంది అవార్డులను పొందడమే కాకుండా కళాబృందం తరపున 18 నందులను తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర పురస్కారం పొందారు. నత్కీర, నిగమశర్మ, కుంతీకర్ణ వంటి నాటకాలకు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సోదరుడైన మీగడ మల్లికార్డునరావుకి హార్మోనిస్టుగా సంగీతంలో నంది అవార్డు వచ్చింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కేశిరెడ్డి రాజేశ్వరీ 2006లో నంది పురస్కారం అందుకున్నారు.

* బోరివంకకు చెందిన రంగస్థల కళాకారులు బి.మోహనరావుకి 'కాటు' నాటికకు, పి.చలపతిరావు 'రేల' నాటికకు నంది అవార్డులు దక్కాయి. వీరిని శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య అప్పటి జిల్లా కలెక్టర్‌ వి.ఎన్‌.విష్ణు సత్కరించి అభినందించారు.

* జి.సిగడాం, ఎస్‌.పి.రామచంద్రాపురంనకు చెందిన ముళ్లపుడి రామచంద్రరావుకు అశ్వత్థామకి నంది అవార్డు లభించింది.

* జిల్లాలో సుమారు 250 వరకు పౌరాణిక సాంఘిక నాటక సమాజాలున్నాయి. పరిషత్‌ నాటక పోటీల్లో శ్రీశయన సంస్థ, టెక్కలి ప్రాంతానికి చెందిన మూల తాతయ్య, స్టాలిన్‌ల నిర్వహణలో ఎయిడ్స్‌ భూతంపై 'అంతం... అంతం' నాటకం జాతీయస్థాయి గుర్తింపు పొందింది.

కొందరి అభిప్రాయాలు
* నాటక ప్రదర్శనలు ప్రజల భావనాశక్తిని మెరుగుపరుస్తాయి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వినూత్న దృష్టితో అవలోకించేందుకు మనిషిని ప్రోత్సహిస్తాయి.
- బెర్నార్ట్‌ షా

* నటనకు రసానుభూతి లేదు. నవ్వినట్లుగా ఉండి నవ్వించడం, ఏడ్చినట్లు ఉండి ఏడ్పించాలి... అంతే! అయితే అది స్వభావసిద్ధంగా ఉండాలి.
- మాధవపెద్ది వెంకట్రామయ్య

* నలుగురు పొగిడినంతమాత్రాన నటీనటులు ఉబ్బితబ్బిబై సవాళ్లకు దిగరాదు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనే సంకల్పంతో ముందుకు సాగాలి.
- మిక్కిలినేని రాధాకృష్ణ

* ఎవరు ప్రదర్శించినా రక్తికట్టే నాటకాల కంటే, దేన్ని ప్రదర్శించినా రక్తి కట్టించే నటీనటులే Andhra దేశంలో ఎక్కువమంది ఉన్నారు.
- శ్రీశ్రీ


నాటక రంగం గూర్చి మరికొన్ని విషయాలు - >తెరమరుగవుతున్న తెలుగు నాటకం
- > ప్రపంచ రంగస్థల దినోత్సవం
  • ===============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .