నాట్యము (ఆంగ్లం :Dance) (ఫ్రెంచి పదము డాన్సెర్ నుండి ఉద్భవించింది): సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు
నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. నాట్యం 4 విధాలైన అభినయాలతో కూడి ఉండును. నృత్తమందలి అంగ విన్యాసమును, నాట్యమందలి అభినయమును కలిపినచో 'నృత్యం' అగును. భరతుడే ఈ సమ్మేళనం చేసినట్లు అభిప్రాయమున్నది. నృత్తం మొదట జనించినది. తరువాతిది నాట్యం. ఈ రెండింటి సమ్మేళనమే నృత్యం. క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన అమరసింహుడు తాండవ-నటన-నాట్య-లాస్య-నర్తనములు పర్యాయ పదములని తెలిపినాడు. కావున క్రీ.శ.4వ శతాబ్ది నాటికే నృత్యము ప్రచారంలో ఉందని, నాట్య-నృత్యములు పర్యాయ పదాలని గ్రహించవచ్చు.
నృత్తమునందు తాండవ-లాస్యమనే భేదాలు కలవు. నృత్తము ఉద్ధతముగ ఉన్నచో తాండవమని, సుకుమారముగా ఉన్నచో లాస్యము అని అంటారు. నాట్యమునందు కనిపించని జ్ఞానముగానీ, శిల్పముగానీ, విద్యగానీ, కళగానీ, యోగముగానీ, కర్మగానీ లేనే లేదు. సర్వ శాస్త్రములు, సర్వ శిల్పములు, వివిధములైన కర్మలు ఈ నాట్యమందు కూడియున్నవి. ఇది హితమును, యశస్సును, ఆయువును, బుద్ధి వికాసమును కల్గించును. దీనులకు విశ్రాంతి కల్గించును. నాట్య వేదము, నాట్య శాస్త్రము అనునవి పర్యాయ పదములు. వేదమనగా జ్ఞానము. శాస్త్రమనగా శాసనోపాయము. నాలుగు వేదాల నుండి 4 నాట్యాంగాలను బ్రహ్మ గ్రహించి నాట్య వేదమును నిర్మించాడు. ఋగ్వేదం నుంది పాఠ్యాన్నీ, యజుర్వేదం నుండి అభినయాన్నీ, సామవేదం నుండి సంగీతాన్నీ, అధర్వ వేదం నుండి రసాన్నీ గ్రహించి ఈ నాట్య వేదాన్ని సృష్టించాడు. నాట్య వేదాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. ఆంగికం, వాచికం, ఆహార్యం మరియు సాత్వికం అను నాలుగు ఉపాంగాలు ఈ నాట్యానికి ప్రాణం.
భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం లేదా భారతీయ నృత్యం అంటారు. భారత్ లో అనేక నాట్యరీతులు కానవస్తాయి. శాస్త్రీయంగా చూస్తే, ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యములు వున్నవి. అలాగే బాలీవుడ్ లో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది.
భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు
1. సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు
2. జానపద, గిరిజన నృత్యాలు.
ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విదానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటిని "ఆధునిక నృత్యాలు" అనవచ్చును.
శాస్త్రీయ నాట్యరీతులు
- * కూచిపూడి (నృత్యము)
- * భరతనాట్యం
- * కథక్
- * కథకళి
- * మణిపురి (నృత్యం)
- * ఒడిస్సీ
- * మోహినీ ఆట్టం
- * సత్త్రియ నృత్యం
జానపద నాట్యరీతులు
- వీధి నాటకం,
- బుర్రకథ,
- గంటమర్ధాల,
- కోలాటం,
- పేరిణి,
- తోలుబొమ్మలాట,
- ధింసా నృత్యం,
- చిందు నృత్యం .
- ================================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .