పద్మశ్రీ(Padma Shri) భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. జనవరి 26న పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందేవారి పేర్లు వెల్లడించడం ఆనవాయితీగా వస్తున్నది . ఈ అవార్డులు,ఎంతో గౌరవం, ప్రతిష్ట ఇమిడివున్నది . వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాధమికంగా ఇచ్చే పౌరపురస్కారం. పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం క్రింద ఒక పతకం వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ" లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు. ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336
మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.
Award Rank : 1.భారతరత్న ← 2.పద్మ విభూషణ్ ← 3.పద్మ భూషణ్ ← 4.పద్మశ్రీ → లేదు
అసలు ఈ పద్మ అవార్డులు ఎవరికిస్తారు? ఎవరిస్తారు? ఎలా ఇస్తారు?
ఎవరికిస్తారు?
ఏదైనా ఒక రంగంలో ‘ప్రత్యేకమైన సేవ’ చేసినవారిని ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వం గౌరవిస్తుంది. ‘అత్యున్నత స్థాయిగల ప్రత్యేక సేవ’చేసినవారిని ‘పద్మభూషణ్’తో సత్కరిస్తుంది. ‘అసామాన్యమైన ప్రత్యేక సేవ’ చేసిన వారిని ‘పద్మవిభూషణ్’తో సన్మానిస్తుంది. జాతి,వృత్తి, స్థాయి, లింగభేదాలు లేకుండా ‘అందరూ’ దీనికి అర్హులే! నిజానికి ఈ అవార్డులను భారతీయులకే ఇస్తారనే భావన ఉన్నా, వాళ్లకే సాధారణంగా ఇస్తూనే ఉన్నా అదేమీ నియమం కాదు. భారతీయేతరులకు కూడా ఇవ్వవచ్చు.
కళ(సంగీతం, శిల్పం, చిత్రం, సినిమా, రంగస్థలం, ఫొటోగ్రఫీ); సమాజ సేవ(దాతృత్వం, సేవ); ప్రజా సంబంధాలు(ప్రజాజీవితం, మానవ హక్కులు, రాజకీయాలు); సైన్స్ అండ్ ఇంజినీరింగ్(పరిశోధన, ఐటీ, న్యూక్లియర్ సైన్స్, స్పేస్); వాణిజ్యం, పరిశ్రమలు(బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారం, టూరిజం); వైద్యం(ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, ఆల్లోపతి, నాచురోపతి); విద్య, సాహిత్యం(జర్నలిజం, బోధన, పుస్తక రచన, అక్షరాస్యతా కృషి, విద్యా సంస్కరణలు); పౌర సేవ(కార్యనిర్వహణ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు); క్రీడలు(అథ్లెటిక్స్, సాహసం, పర్వతారోహణ, క్రీడాభివృద్ధి, యోగా); వన్యప్రాణి సంరక్షణ, భారత సంస్కృతి పరిరక్షణ, ప్రచారంలాంటి ఏ రంగంలోనైనా అసామాన్యమైన కృషి చేసినవారికి ఈ పద్మ అవార్డులు ప్రదానం చేయడం ద్వారా వాళ్లను గౌరవించుకోవడం, తద్వారా వాళ్ల స్ఫూర్తి యావజ్జాతికీ అందుతుందనేది ఇందులోని అంతరార్థంగా చెప్పుకోవచ్చు.
కీ.శే. మినహాయింపు
సర్వసాధారణంగా మరణించిన వారికి ఈ పురస్కారాలు ప్రదానం చేయరు. కానీ, ‘అత్యధిక అర్హత’ కలిగిన వ్యక్తుల విషయంలో దీనికి సడలింపు ఉంది. అదీ, అవార్డులు ప్రకటించేనాటికి ఏడాది లోపున మరణించివుంటేనే! గతేడాది సంగీతస్రష్ట భూపేన్ హజారికాకు ఇలాగే పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. మొన్న జూలైలో మరణించిన నటుడు రాజేశ్ ఖన్నాకు కూడా అలాగే ప్రకటిస్తారేమోనని ఒక అంచనా!
అలాగే, మరో సడలింపు ఏమిటంటే, సాధారణంగా ఒక పద్మ పురస్కారాన్ని ప్రకటించిన ఐదేళ్లకుగానీ మరో మెట్టున ఉండే అవార్డును ఇవ్వరు. అంటే ఈ ఏడాది పద్మశ్రీ గెలుచుకున్నవారికి పద్మభూషణ్ ఇవ్వాలన్నా, పద్మభూషణ్ అందుకున్నవారికి పద్మవిభూషణ్ ఇవ్వాలన్నా ఐదేళ్లు ఆగాల్సిందే! అయినప్పటికీ అత్యధిక అర్హత కలిగిన వ్యక్తుల విషయంలో అవార్డుల కమిటీ ఈ నిబంధనను సడలించవచ్చు. అలాగే ఈ క్రమంతో నిమిత్తం లేకుండా నేరుగానే అత్యున్నత అవార్డు(పద్మవిభూషణ్)ను కూడా ఇవ్వొచ్చు.
ఎవరిస్తారు?
ప్రతి ఏడాదీ ప్రధానమంత్రి ‘పద్మ అవార్డుల కమిటీ’ని ఏర్పాటుచేస్తారు. ఇందులో క్యాబినెట్ సెక్రెటరీ (xx), హోమ్ సెక్రెటరీ (xx), ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి xx), రాష్ట్రపతి కార్యదర్శి (xx) సభ్యులుగా ఉంటారు. వీళ్లు కాకుండా ఇతర రంగాల ప్రముఖులు కూడా భాగస్వాములవుతారు. ఈ యేడు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్, సినీనటి రత్నా పాఠక్ షా కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ... రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు; అందరినీ, అన్నింటినీ నిర్దేశిత ఫారం, తగిన పత్రాలతో ‘ప్రతిపాదనలు’ పంపమని ఆహ్వానాలు పంపుతుంది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాలు కూడా జిల్లాలకు ఇలాంటి ఆహ్వానాలు పంపి ప్రతిపాదనలు తీసుకుంటాయి. భారతరత్న, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు కూడా ఎవరి పేరైనా సూచించవచ్చు. అంతేకాదు, వ్యక్తిగత స్థాయిలో ఎవరైనా తమ పేరును తామే ‘రెకమెండ్’ చేసుకోవచ్చు.
ఎలా ఇస్తారు?
సుమారు 1000 నుంచి 1200 ప్రతిపాదనలు ప్రతి సంవత్సరమూ వస్తాయని అంచనా. ఇందులోంచి 120కి మించకుండా కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. మరణానంతర పురస్కారాలు, విదేశీయులకు ఇచ్చేవి అదనం. ఆ కమిటీ జాబితాను ముందుగా ప్రధాని ముందు ఉంచుతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో తుది జాబితా రూపుదిద్దుకుంటుంది. అవార్డు కమిటీ ప్రతిపాదన లేకుండా ఏ అవార్డునూ ప్రకటించరు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో జరిపే మరో వేడుకలో ‘ప్రథమ పౌరుడు’ ప్రదానం చేస్తారు. ఈ ఉత్సవం మార్చ్, ఏప్రిల్ నెలల్లో జరుగుతుంటుంది.
ఇది గౌరవమేగానీ బిరుదు కాదు. కాబట్టి పేరుకుముందుగానీ వెనకగానీ దీన్ని లెటర్‌హెడ్స్, విజిటింగ్ కార్డ్స్, పోస్టర్లు, పుస్తకాల్లో ముద్రించుకోవడం కుదరదు. పురస్కార గ్రహీత అని వేసుకోవచ్చు. పద్మభూషణ్ ఫలానా అనడానికీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అనడానికీ మధ్య ఉన్న తేడా బహుశా, ‘ఒకరు, అందరిలో ఒకరు’ అన్న ధ్వని! ఉల్లంఘించినవారి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
ఈ పురస్కారాలకు నగదు బహుమానం ఉండదు. రైలు, విమాన ఛార్జీల్లో రాయితీ లభించదు. అయితే, ఈ అవార్డులకున్న ఉత్కృష్టత, వాటిని అంటివున్న ప్రతిష్ట రీత్యా విశిష్ట సేవలందించినవారు దీన్ని ఆశించడం సహజం. మనిషి గుర్తింపు జరుగుతుంది. లేదూ, వాళ్లు కోరుకోవడంకన్నా వాళ్లను గౌరవించడం ద్వారా జాతి తనను తాను గౌరవించుకున్నట్టు అవుతుంది. అయితే ఈ అవార్డులు వచ్చినవాళ్లందరూ గొప్పవాళ్లు, రానివాళ్లు కాదు అని అనుకోకూడదు.
వచ్చినవాళ్లకు వందనం... రానివాళ్లకు అభివందనం
ఆశాభోంస్లే అద్భుత గాయనే! ఆమె పద్మవిభూషణ్ అవడం సంపూర్ణంగా సమంజసమే! అయితే, అంతేస్థాయి మధుర గాయని ఎస్.జానకి రాలేదు. గీత రచయిత జావేద్ అఖ్తర్ మహానుభావుడే. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ రెండూకాగలిగినప్పుడు, పాటల శిల్పి వేటూరి సుందర్రామ్మూర్తికి రాలేదు. మరణానంతరమైనా ఆయన్ని గౌరవించుకోలేదు. ఎం.జి.రామచంద్రన్ భారతరత్న , ఎన్టీ రామారావు పద్మశ్రీ ఇచ్చారు .
- - 1954లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ పద్మ అవార్డులను ప్రవేశపెట్టారు.
- - {పతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన వీటిని ప్రకటిస్తారు.
- - భారతదేశం తన ముద్దుబిడ్డలను గౌరవించుకోవడానికి ఏర్పాటుచేసుకున్న పురస్కారాల్లో భారతరత్న అత్యున్నతమైనది.
- పద్మవిభూషణ్ ద్వితీయ, పద్మభూషణ్ తృతీయ, పద్మశ్రీ చతుర్థ స్థానాల్లో ఉంటాయి.
- - ఇంతవరకూ 41 మందికి భారతరత్న, 288 మందికి పద్మవిభూషణ్, 1169 మందికి పద్మభూషణ్, 2497 మందికి పద్మశ్రీ పురస్కారాలుదక్కాయి.
- - భారతరత్న అవార్డుకు ప్రతిపాదనలు స్వీకరించడం జరగదు. వాటిని నేరుగా ప్రధానమంత్రే రాష్ట్రపతికి రెకమెండ్ చేస్తారు. సంవత్సరానికి మూడుకు మించకుండా ఇస్తారు. అయితే 2008 నుంచి ఒక్క భారతరత్న కూడా ప్రకటించలేదు.
- - కేంద్ర తొలి విద్యాశాఖా మంత్రి అబుల్ కలామ్ అజాద్ తనకు భారతరత్న ఇవ్వడాన్ని సున్నితంగా తిరస్కరించారు, తానూ సెలక్షన్ కమిటీలో ఉన్నానన్న కారణంగా. ఆయనకు మరణానంతరం 1992లో ప్రదానం చేశారు.
- - నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు ప్రకటించిన(1992) భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కారణం? ఆయన మరణించినట్టుగా ధ్రువీకరణ ఏమిటన్న ప్రజాహిత వ్యాజ్యానికి జవాబు ఇవ్వలేకపోవడం వల్ల. పురస్కారాల చరిత్రలో ఒక అవార్డును వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి.
- - విదేశీసంతతి వాళ్లలో భారతరత్న స్వీకరించినవాళ్లు: భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసా(1980), అఫ్గానిస్తాన్ యోధుడు ఖాన్
- అబ్దుల్ గఫార్ ఖాన్(1987), దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా(1990)
- - 2011లోనే క్రీడాకారులకు భారతరత్న కూడా ఇవ్వవచ్చునన్న సవరణ చేశారు.
- - సీనియర్ నటి రేఖకూ నటుడు సైఫ్ అలీఖాన్‌కు పద్మశ్రీ అవార్డు ఒకేసారి వచ్చింది(2010).
గాంధీజీకి భారతరత్న ఎందుకివ్వలేదు?
అవార్డుల్ని నెలకొల్పినప్పుడు ‘మరణానంతరం’ కూడా ఇచ్చే వెసులుబాటు లేదు. 1966లోనే మరణానంతరం కూడా ప్రదానం చేయొచ్చని సడలింపు చేశారు. మొదట్లో ఈ నిబంధన ఉండటంవల్లే మహాత్మాగాంధీకి ఈ పురస్కారం ప్రకటించలేదు. ఒకవేళ తర్వాత ఇద్దామని యోచించినా, ‘జాతిపిత’ స్థాయికి ‘భారతరత్న’ సరిపోయేది కాదని మిన్నకుండివుంటారు.
ఈసారి తెలుగు పద్మాలు?
మన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను ఈసారి భారతరత్న అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. అలాగే, ‘జ్ఞానపీఠ్’ గ్రహీత సి.నారాయణరెడ్డి పేరు పద్మవిభూషణ్ కోసమూ; సుప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు, ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు పేర్లు పద్మభూషణ్ విభాగంలోనూ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. సుప్రసిద్ధ గాయని ఎస్.జానకిని పద్మశ్రీ పురస్కారం కోసం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
మొన్న జూలైలో మరణించిన హిందీ సూపర్‌స్టార్ రాజేశ్‌ఖన్నాకు ఈసారి పద్మవిభూషణ్ ప్రకటిస్తారేమోనని ఊహాగానాలు వెలువడుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేశారాయన. చిత్రంగా సినీరంగంలో తన సమకాలీనులైన దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, వహీదా రెహమాన్, హేమామాలిని వంటి హేమాహేమీలకు పద్మ అవార్డులు దక్కాయి. రాజేశ్‌ఖన్నా పేరు పరిగణనలోకి రాకపోవడమంటే... తోచడం, తోచకపోవడమనే మానవ పరిమితిగా చూడాల్సిందేనా? ‘షోలే’ లాంటి చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ సిప్పీ పేరు పద్మశ్రీకి వినబడుతోంది. ఊహలు నిజమైతే గాయకుడు కైలాష్ ఖేర్ కూడా పద్మశ్రీ అందుకోవచ్చు!
sources:-- http://www.sakshi.com/main/Weeklydetails.
http://en.wikipedia.org/wiki/Padma_Shri_Awards.
http://te.wikipedia.org/wiki/
- ===============================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .