Saturday, February 16, 2013

World Radio day,ప్రపంచ రేడియో దినోత్సవం

  •  

  •  

  •  గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 13.) -World Radio day,ప్రపంచ రేడియో దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


ఫిబ్రవరి 13న జరగనున్న ప్రపంచ రేడియో దినోత్స వంతో సమానంగా యునెస్కో చొరవతో అదే రోజున 1946లో రేడియో యునైటెడ్‌ నేషన్స్‌ వ్యవస్థాపక దినోత్సవం కూడా జరగడం హర్షదాయకం. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిం చేందుకు యునెస్కో సిద్ధమవుతున్నది. బిబిసి, రేడియో ఫ్రాన్స్‌ ఇంటర్నేషనల్‌, రేడియో ఎక్సిటిరియర్‌ డి ఎస్పనా, ది వాయిస్‌ ఆఫ్‌ రష్యా, రేడియో చైనా ఇంటర్నేషనల్‌ తదితర రేడియో కేంద్రాలన్నీ కూడా ఫిబ్రవరి 13న యునెస్కో ప్రధాన కార్యాలయం నుండి ప్రసారం కానున్నాయి. ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా రేడియోలు తమ కార్యక్రమాలను అక్కడ నుండి ప్రసారం చేయ నున్నాయి. ప్రపంచ రేడియో ఉత్సవాల సందర్భంగా ప్రస్తుత రేడియో జర్నలిజం, రేడియో చరిత్రలపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా ఎనౌన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, షార్ట్‌వేవ్‌, యువతకు సంబంధించిన రేడియో కార్య క్రమాలు తదితర అంశాలపై విస్తృతస్థాయిలో చర్చా కార్య క్రమాలు జరగనున్నాయి. ఈ రోజుల్లో రేడియో ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంది. ఏ సమయం లోనైనా సరే సుదూర ప్రాంత వార్తలను అందించడం లోనూ, పేదలు, మైనార్టీలు, మహిళలకు సంబం ధించిన సమస్యలపై తమ గొంతుకను వినిపించ డంలోనూ రేడియో ముందంజలో ఉందని యునెస్కో జనరల్‌ డైరెక్టర్‌ ఇరినాబొకొవా తెలిపారు. నేటి కాలంలో రేడియో అత్యంత సమాచార వనరుగా మారింది. ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారు.

సమాచార తరంగిణి ఆకాశవాణి

    భారతదేశంలో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌లో రేడియో క్లబ్‌ ఆఫ్‌ బొంబారుూ ద్వారా ప్రసారమయ్యేవి.  తరువాత బ్రాడ్‌ కాష్టింగ్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రసారాలు చేసింది.  ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది.  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి) మాత్రమే ఉన్నాయి.

ఇప్పుడు 215 కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 ఎంవివి కేంద్రాలు, 54ఎస్‌వివి కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.  1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్‌ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను రేడియో భానుమతి అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా రిటైర్‌ అయ్యింది.  తెలుగులో మొదటి రేడియో నాటకం ‘అనార్కలి’ మద్రాసు కేంద్రం ద్వారా 1938 జూన్‌లో ప్రసారమైంది. శ్రీయుత విశ్వనాథ సత్యనారాయణ, వింజమూరి నరసింహరావు, ముద్దు కృష్ణ సమర్పించి నటించారు.  నటుడు కొంగర జగ్గయ్య, ఉష శ్రీ, ప్రయాగ రామకృష్ణ లాంటి ఎందరో మహానుభావులు ఆకాశవాణిలో పనిచేశారు.   మన రాష్టంలో అదిలాబాద్‌, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాద్‌, తిరుపతి, వరంగల్‌లో ఆకాశవాణి ప్రసార కేంద్రాలు ఉన్నాయి.


ఆదరణ పెరిగింది
-ఈ మధ్య కాలంలో రేడియో ప్రసారాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆల్‌ఇండియా రేడియో తోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియోలు రావడం వల్ల శ్రోతలు ఆయా ప్రసారాలను వినడానికి పోటీ పడుతున్నారు. టివిల రాకతో రేడియో ప్రసారాలకు ఆదరణ తగ్గలేదు. టివి అనేది ఒకే దగ్గర కూర్చొని వీక్షించే అవకాశం ఉంది. కాని రేడియో మాత్రం ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుంది. వెస్ట్రన్‌ నుంచి ఈ కాన్సెప్ట్‌ను తీసకున్నారు. ముఖ్యంగా రేడియోలో ప్రయోజిత కార్యక్రమాలు, ఫోన్‌ఇన్‌ ప్రోగ్రామ్స్‌, ప్రత్యక్ష కార్యక్రమాలు, ఫిలిమ్‌ మ్యూజిక్‌ వంటి వారికి మంచి ఆదరణ ఉంటోంది. ప్రజలతో మమేకం అవ్వడం ఎక్కువైంది. దీంతో శ్రోతల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించే వీలు ఎక్కువైంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు రేడియోను వింటూ తమ పనులు చేస్తున్నారు.----- సి.జయపాల్‌రెడ్డి, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌,-ఆకాశవాణి కేంద్రం, వరంగల్‌

మనబాణి ఆకాశవాణి

పెన్నులోనూ... మెుబైల్‌ ఫోన్‌లోనూ... కారులోనూ... ఇతర వాహనాల్లోనూ రేడియోలు అమరిపోతున్నాయి . కాలక్షేపానికి, విజ్ఞాన సముపార్జనకు మంచి మాధ్యమంగా మారింది. రేడియో ఆకాశవాణిలో పనిచేసి.. తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతలను కట్టిపడేసి... ఓ వెలుగువెలిగిన పండితులు ఎందరో ఉన్నారు. ఉషశ్రీ రామాయణ వ్యాఖ్యానం రేడియోకు ఎంత పేరు తెచ్చిందో... ఆయనకూ..  రామాయణానికి అంతే ప్రఖ్యాతి తెచ్చింది. సినీ ప్రముఖులు, సాహితీ శ్రేష్ఠలు.. నాటకరంగ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులూ ఒకరేమిటి ఎందరో మహానుభావులకు ‘స్వరం గా'' మారింది మన రేడియో.ఎడ్ల బండికి రేడియో పెట్టండి... పసిడి పంటలకు పట్టం కట్టండి , స్వాతంత్య్ర సమర సమయంలో అది బలమైన ప్రచారం సాధనం. కొత్తగా ఎన్ని మాధ్యమాలు పుట్టుకొస్తున్నా చెరగని ఆదరణ దీని సొంతం. గాంధీలాంటి వారితో సైతం కీర్తించబడిన ఘనత దీనిది. ఏం పెద్దయ్యా... అంటూ శ్రోతలు విన్నారంటే టక్కున చెప్పేస్తారు అది పాడిపంటలు కార్యక్రమమని. బాలవినోదం, బాలానందం లాంటి ప్రసారాలను అందిస్తూ చిన్నారులకు దగ్గరయింది. స్ర్తీలకు, కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాలను ఇవ్వడంలో విన్నూత శైలి. ఇప్పటికీ చాలామంది విద్యకు సంబంధించిన ప్రసారాలను ఈ మాధ్యమంలోనే వింటారట.. ఎందుకంటే పూర్తి దృష్టి చేప్పేదానిపైనే ఉంటుంది కాబట్టి. దీన్ని ఎక్కడికంటే అక్కడికి తేలికగా తీసుకుపోవచ్చు... ఖర్చుకూ బయపడాల్సిన అవసరం లేదు. అందుకే రేడియో అందరి ఆదరణ పొందింది... ఎఫ్‌.ఎం.ల రాకతో జనాదరణ విపరీతంగా పెరిగింది. అయితే ఆకాశవాణి సంప్రదాయ రీతిలో హుందాగా కార్యక్రమాలను  నిర్వహిస్తుండగా.. ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం.లు మారుతున్నపోకడలకు అనుగుణంగా రెచ్చిపోతున్నాయి.

ఎలా పనిచేస్తుంది...
- కాంతి వేగ పౌనపున్యాలతో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌తో గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసేదే దూర శ్రవణ ప్రక్రియ అని అంటారు. ఇలాంటి శబ్దాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అని అంటారు. మొదటి రోజులలో వాల్‌‌వలను ఉపయోగించి తయారు చేసేవారు. వీటికి ఎక్కువ విద్యుత్‌ వినియోగంతో పాటు పరిమాణంలోనూ చాలా పెద్దవిగా ఉండేవి. ప్రస్తుత టెలివిజన్‌లా ఒక చోట ఉంచి మాత్రమే వినాల్సి వచ్చేది. 1960 వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టర్లు వచ్చాయి. వీటితో తయారైన రేడియో అందుబాటులోకి వచ్చింది. ఇవి తక్కువ విద్యుత్‌తో పాటు బ్యాటరీల  ద్వారా కూడా పనిచేసేవి. రానురాను సాంకేతిక అభివృద్ధి చెందడంతో ఈ రేడియోలు అతి చిన్న పరిమాణంలోకి మారాయి. ప్రసుత్తం ప్రతీ మొబైల్‌లో రేడియో అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు.

రకాలు...
ప్రజలు వినే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. మధ్య తరహా(మీడియం వేవ్), అతి చిన్న తరంగాలు(షార్ట్ వేవ్), ఎఫ్‌.ఎమ్‌(ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌) . 
 మధ్య తరహా తరంగాలు : ఈ ఫ్రీక్వెన్సీని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. మనం వింటున్న హైదరాబాద్‌, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు
చేస్తున్నాయి.‚

అతి చిన్న తరంగాలు : ఈ ప్రీక్వెన్సీని సుదూర ప్రాంతాలకు ప్రసారానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ కోణాన్ని బట్టి  ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్లను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. ట్రాన్స్‌మిటరు ఏరియల్‌ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు.. తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరెగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి, వి.వొ.ఎ అనే అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేశాయి.. చేస్తున్నాయి.

ఎఫ్‌.ఎమ్‌. : ఈ ప్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు అందిస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రైవేట్‌ ఛానల్స్‌ ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్‌ ఎఫ్‌.ఎమ్‌., (93.5) ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఈ ధ్వని తరంగాలు ప్రసారమయ్యే మధ్యలో ఎతైన భవంతులు, కొండలు వస్తే అక్కడితో ఆగిపోతాయి. వచ్చినంత వరకైనా ఈ పద్ధతిలోని ప్రసారాలు నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. ఇవి కాక, సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి.

రెయిన్‌బో : కొత్తగా వస్తున్న ఎఫ్‌.ఎం.లకు ధీటుగా ఆకాశవాణి తింటే గారెలే తినాలి... వింటే రెయిన్‌బో వినాలి అంటూ దాని అనుబంధ ఎఫ్‌.ఎం. ‘రెయిన్‌బో’
ప్రచారం చేపట్టింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆకాశవాణి...
-ఆలిండియా రేడియో(ఎ.ఐ.ఆర్‌) ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ అధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి విభాగం. దూరదర్శన్‌ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెంట్‌ వీధిలో భారత పార్లమెంట్‌ పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌లో ఉంది. ఆకాశవాణి భవన్‌లో నాటక విభాగం, ఎఫ్‌.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే స్టేషన్‌ కూడా ఉంది. ఈ స్టేషన్‌లో 24 గంటలు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి.

నాటి గొంతులు వినోచ్చు...
23 భాషల్లో విభిన్న మతాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలను అందించడంలో ఆకాశవాణి ఎప్పుకప్పుడు ముందుం టోంది. దాదాపు 100 నుంచి 80 ఏళ్ల క్రితం నాటి ప్రముఖుల ఇంటర్వ్యూలు ఇక్కడి లైబ్రరీలో నిక్షిప్తమయి ఉన్నాయి. గ్రామ్‌ ఫోన్‌ రికార్డుల నుంచి ఇప్పటి డీవీడీల వరకు లభ్యమవుతాయి. గాంధీ, నెహ్రూ లాంటి ప్రముఖులు సొంత గొంతు వినాలన్నా మా వద్ద రికార్డు అయి ఉంటుంది. ఇందిరాగాంధీ లాంటి వారు రేడియోలో మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ముందస్తు సిద్ధమై మాట్లాడేవారు. ప్రస్తుతం ఆరు స్టేషన్లపై ప్రసారాలు అందిస్తున్నాము.- - - -- శ్రీలక్ష్మి, ఆకాశవాణి, హైదరాబాద్‌


సభ్యతతో ఆదరణ
ఇతర ఎఫ్‌.ఎంల్లోలాగా ఆకాశవాణి కార్యక్రమాల్లో ఎక్కడా అసభ్య పదజాలంగాని, ద్వంద్వ అర్థాలు వచ్చే ఉచ్చరణగాని ఉండదు. శ్రోతలకు నమస్కారం అంటూ కార్యక్రమాలను ప్రారంభిస్తాం. అందుకే రేడియో ప్రసారాల్లో ఆకాశవాణికి ఆదరణ ఎక్కువగా ఉంది. పాత తరం నుంచి కొత్త తరం వివిధ సంగీత పరికరాల కచేరీలను అందిస్తున్నాం. మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ కార్యక్రమాలను ప్రసారం చేస్తాం.. విద్య, సమాచారం, వినోదం ఈ మూడు రంగాలను సమ తూకంతో ఆకాశవాణి ప్రసారాలు ఉంటాయి. ప్రస్తుతం మూడు పద్దతుల్లో ప్రసారాలు అందిస్తున్నాం.. ప్రయిమరీ (150కి.మీ.), సెకండరీ(300 కి.మీ.), తర్డ్‌(450 కి.మీ.) వీటిలో ఉన్నాయి.- - -- ఎస్‌.రమేష్‌, ట్రాన్సిమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆకాశవాణి, హైదరాబాద్‌


అందరి హృదయవాణి...
-మారుతున్న కాలనుగుణంగా ఎప్పుటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు అందించడంలో ఆకాశవాణి ముందుంటోంది. కళలు, సాహిత్యం గురించి ఎంతగానో ప్రసారం చేస్తున్నాం... పాతతరం ప్రముఖులు జీవిత విశేషాలపై మూడు గంటలు ‘నా జీవన యానం’ పేర పలు విషయాలను అందిస్తున్నాం. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయి పడగలు’ నవలను నాటక రూపంలో అందించడానికి ఏర్పాట్లు చేశాము. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, నాటి కవులు, కళాకారులు, కళల గురించి, నాటి సుమధుర గీతాలు, విద్య, సామాజిక అంశాలు, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి ఎన్నో బృహత్తర ప్రసారాలను శ్రోతలకు అందిస్తున్నాము. ఈ క్రమంలో అందుకున్న పురస్కారాలు అనేకం.. తాజా ఎల్లమ్మ కొడుకు రాములు రూపకానికి  డాక్యుమెంటరీ విభాగంలో జాతీయ పురస్కారం వచ్చింది... ఇది ఈ నెల 16న అందుకోవాల్సి ఉంది. సైకిల్‌ ఉన్నంత వరకు రేడియో ఉంటుంది. ఆదరణ తగ్గింది అని అనుకోవడం అపోహ మాత్రమే...- మంగళగిరి ఆదిత్యప్రసాద్‌, స్టేషన్‌ డైరెక్టర్‌, ఐ.బి.ఎస్‌, ఆకాశవాణి, హైదరాబాద్‌


పాడిపంటలు...
-ఏం పెద్దయ్యా... ఎండలు అప్పుడే ఇలా మండిపోతున్నయ్‌... ఇగ రెండు నెలలు పోతే ఎట్టా ఉంటుందో ఏమో... చేలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతా ఉన్నాము... కనీసం తోటలకు చుక్కల(డ్రిప్‌) తడికైనా నీళ్లు లేవాయే.... అంటూ పాడిపంటలు కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు డా.కె. విజయ. వ్యవసాయ కార్యక్రమాలపై ఆమె స్పందిస్తూ... రోజుకు మూడుసార్లు వ్యవసాయ రంగంపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా సలహాలు, సూచనలు అందిస్తాము. ఒక్కొక్కసారి రైతుల సూచనల మేరకు కూడా ఆయా పంటపై కార్యక్రమాలను ప్రసారం చేస్తాం.. సేంద్రియ ఎరువుల వాడకంపై  ప్రోత్సహిస్తున్నాం. చదువురాని వారికి, పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిలో  జానపదాలు, పాఠల రూపంలో వివరాలను అందిస్తున్నాం.. రైతులు-అధికారులు-శాస్తవ్రేత్తలు- ప్రభుత్వం వీరి మధ్య వారధిగా ఆకాశవాణి పనిచేస్తోంది. వ్యవసాయంపై ఇన్ని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మాధ్యమం మరోటి లేదు..- - - డా.కె.విజయ, కార్యక్రమ నిర్వహణ అధికారి, వ్యవసాయదారుల విభాగం, ఆకాశవాణి, హైదరాబాద్‌


రేడియో అద్భుతమైన, శక్తివంతమైన ప్రసార సాధనం.. దేవుడిలో ఉన్న అద్భుతం అందులో ఉంది. - మహాత్మాగాంధీ, చివరి రేడియో ప్రసంగం (1947 నవంబర్‌ 12)


వ్యవసాయం...
వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పడానికి 1966లో పంటసీమలు   కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడం,  నిర్వహించడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అప్పట్లో పని చేస్తున్న శ్రీ గుమ్మలూరి సత్యనారాయణగారి కృషి ఎంతగానో ఉంది. పంటల గురించి, కొత్త రకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో దగ్గరయ్యారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్కసారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని ఆసక్తి కరంగా వినిపించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు చెప్పాల్సిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందించేవి. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకడం కూడా చక్కగా వివరించేవారు. ప్రస్తుతం టీవీల్లో వస్తున్న కార్యక్రమాలకు స్పూర్తి, రేడియోలో వచ్చే పంటసీమలు కార్యక్రమమే కావడం గమనార్హం. దేశాభివృద్ధిలో రేడియో పాత్ర
దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

సంఘం రేడియో...
దళిత మహిళలు ప్రారంభించిన సంఘం రేడియో ఆసియాలోనే తొలి మహిళా రేడియో. భారత్‌లోనే తొలి గ్రామీణ కమ్యూనిటీ రేడియో. జహీరాబాద్‌కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ఇది మొగ్గతొడిగింది. ఇది జనం కోసం, జనమే నడిపే రేడియో. దీని కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారమవుతాయి. జహీరాబాద్‌ చుట్టుపక్కల పాతిక  కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో సంఘం రేడియో వినొచ్చు. పస్తాపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ(డీ.డీ.ఎస్‌.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరుఫున పోరాడింది. సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ  సారమంతా రికార్డు అవుతుంది. ఇలా వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెబుతారు.. మరి కొందరు సంగీత కచేరీ కూడా చేస్తారు. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈ మధ్యే కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి.

కచ్‌ మహిళా వికాస్‌ సంఘటన్‌(గుజరాత్‌), ఆల్టర్నేటివ్‌ ఫర్‌ ఇండియా  డెవలప్‌మెంట్‌ (జార్ఖండ్‌), వాయిస్‌ ప్రాజెక్ట్‌ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా చెబుతోంది. కమ్యూనిటీ రేడియో లైసెన్సు కింద చాలా విశ్వవిద్యాలయాలు సొంత స్టేషన్లు పెట్టుకున్నాయి. ఒక యూనిట్‌ స్థాపనకు ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతోంది.

మూలము : వివిధ వార్తా పత్రికల కదనాల ఆదారముగా .
  • ================== 
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .