Tuesday, November 22, 2011

అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం ,International Students Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.నవంబర్ 17.) -అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం ,International Students Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...




విద్య “కొరకై” అర్ధించువాడు ‘విద్యార్ధి . విద్యను ఆర్జించడానికి ఫలానా పదతి అంటూ ఉండదు . వయసుతో సంబంధం లేదు . ప్రతిఒక్కరూ జీవించివున్నంతకాలము ఏదోఒక కొత్త విద్యను నేర్చుకుంటూనే ఉంటాం . కనుక ప్రతి ఒక్కరిని విద్యార్ధిగానే భావించాల్సివుంటుంది . కాని నేడు విద్యార్ధి అనే పదానికి పరిమితి కుదించి స్కూలు , కాలేజీ , విశ్వవిద్యాలయము లలో చదివేవారినే విద్యార్ధులుగా భావిస్తున్నారు . .కాలంతో పాటే అన్నీ మారాయి... అంతే వేగంగా చదువుకునే విద్యార్ధుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి... ఒకప్పుడు ఐదేళ్లు నిండితే కాని... అక్షరాభ్యాసం చేసి పాఠశాలల్లో చేర్చే వారు కాదు... అది మారి పట్టుమని రెండేళ్లకే బచ్‌పన్‌ స్కూళ్లు... నర్సరీ విద్యలు... కాన్సెప్ట్‌ పాఠశాలలు అంటూ బుడిబుడి అడుగులు వేయలేని వయస్సులో బడిబాట పట్టి పసి వయసులోనే విద్యార్ధిగా మారుతున్నాడు... పలక బలపం పట్టి అఆఇఈలు దిద్దే చేతులు పెన్ను పేపరు పట్టి ఎబిసిడిలు రాస్తున్నాయి... ఒకప్పుడు ఐదవ తరగతి దాటితే ఆరులో ఇంగ్లీష్‌ విద్య అందుబాటులోకి వచ్చేది... అమ్మా... ఆవు అంటూ పలికే నాలుకలు ఎ ఫర్‌ ఆపిల్‌.. బి ఫర్‌ బాల్‌ అనే దశకు ఎదిగాయి... పలక బలపం మాయమై పెన్ను పేపరుతోనే చదువులు మొదలవుతున్నాయి... పరిసరాల విజ్ఞానం అంటూ అంతో ఇంతో చదివే వయసులోనే కంప్యూటర్‌ ముందు కూర్చొని చేతిలో మౌస్‌ తీసుకొని ప్రపంచ పరిజ్ఞానాన్ని, అంతరిక్ష రహస్యాలు తెలుసుకునే స్థాయికి ఎదిగారు విద్యార్ధులు... అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం జరుపుకుంటున్న ఈ రోజు మారిన విద్యార్ధి స్థితి గతులపై ప్రత్యేక కథనం... బడికి వెల్లరా అంటూ బెత్తం తీసుకొని బెదిరిస్తే కానీ ఐదేళ్లు నిండిన తర్వాత బడి డుమ్మాలు కొట్టే దశ నుండి ఎప్పుడు బడివేళ అవుతుందా అని ఎదురు చూసే విధంగా తయారయ్యారు... నేటి విద్యార్ధులు. పాఠశాల సమయంలోనే ఆటలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు పోయి పుస్తకాల్లో మునిగే స్థితికి మారాయి... బానుని లేలేత కిరణాలు వచ్చిన వెంటనే కాలంతో పరుగులు తీస్తూ చకచకా తయరై స్కూళ్లు, డ్రెస్సులు, మోయలేనంత బరువున్న పుస్తకాల బ్యాగులతో స్కూలు బస్సుల్లో కాన్వెంట్‌ చదువులంటూ పరుగులు.... వచ్చి రాగానే ట్యూషన్‌లు, ఆలోపు స్పెషల్‌ క్లాసులు ఇలా నిద్రించే సమయం తప్ప ఆడిపాడే వయస్సంతా అక్షరాలతో కుస్తీ పడుతూనే కాలం వెలదీస్తున్నారు... విద్యార్ధులు... ఒకప్పుడు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యలు చదవాలంటే మహా నగరాలకు వెళ్లాల్సి వచ్చేది... మారిన కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రొఫెషనల్‌ విద్యలు అందుబాటులోకి రావడంతో విద్యార్ధులు విద్యాభ్యాసంపై ఆసక్తి కనబరుస్తున్నారు...

విద్యార్థులకు జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమైనది .విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది . జీవితంలో విద్యార్ధి దశ మరువలేనిది . విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక రంగాలలో కూడా రాణించాలి . ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుంటుంది . విద్యార్థులు విద్యార్ధి దశను వృధా చేయకుండా జీవితానికి పూలబాట వేసుకునేందుకు వినియోగించుకోవాలి . అదేవిధంగా అధ్యాపకులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలి .

చరిత్ర :
1939 లో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నాజీలను పొరుగు దేశాల మీదికి దూకించాడు .. హిట్లర్ . అప్పుడు వారు ఆక్రమించిన దేశము " జకోస్లోవేకియా" అక్కడ ప్రాగ్ నగరములోని విశ్వవిద్యాలం లోకి నాజీ సేనల ప్రవేశాన్ని విద్యార్ధులు అడ్డుకున్నారు . తమ ప్రవేశాన్ని నిలవరించిన విశ్వవిద్యాలయ విద్యార్ధులపై పాశవికం గా కాల్పులు జరిపి పదిమంది విద్యార్ధి నాయకులను సంహరించి మరో 1200 మందిని నాజీలు సృష్టించిన కాంసంట్రేషన్‌ క్యాంప్ అనే నరకం లోనికి తరలించారు . ఆ సంఘటన జరిగింది 1939 నవంబర్ 17 న . ఆ తర్వాత రెండేళ్ళకు లండన్‌ లో సమావేశమైన అంతర్జాతీయ విద్యార్ధుల సమైక్య మండలి నాటి వీరోచిత విద్యార్ధి పోరాటానికి , వారి బలిదానానికి గుర్తుగా నవంబర్ 17 ను " అంతర్జాతీయ విద్యార్ధి దినోత్సవం " గా ప్రకటించింది . అప్పటి నుండి ప్రతిసంవత్సరమూ పాటిస్తున్నారు .

ఐతే పోరాటాలు విద్యార్ధి జీవితం లో ముఖ్యమైనవి కావు . పైగా ఆ విద్యార్ధి పోరాటాన్ని కమ్యూనిస్టు ఉద్యమం లో భాగం గా సోవియట్ యూనియన్‌ మలచుకుని తన గొడుకు కింద ఉన్నదేశాలలో నవంబర్ 17 న ఉత్సవాన్ని ఘనం గా జరపసాగింది . అది విద్యార్ధి ఉద్యమము నుండి పార్టీ ఉద్యమముగా మారడంతో పలు ప్రజాస్వామ్యదేశాలు నవంబర్ 17 ని అంతర్జాతీయ దినోత్సవం గా జరుపుకోవడాన్ని ఆపివేసాయి. సోవియట్ యూనియన్‌ విచ్చిన్నము , కమ్యూనిస్ట్ భావజాల తిరస్కరణ తరువాత , తూర్పు ఐరోఫాలొ వీచిన కొత్తగాలిలో నవంబర్ 17 విద్యార్ధి దినోత్సవం వీగిపోయింది .

విద్యార్ధి అనే పదానికి ఉన్న అసలు నిర్వవచనము వెలుగులోకి వచ్చినది . డిగ్రీ కోసం కాక విజ్ఞానము కోసం తపించేవారంతా నిజమైన విద్యార్ధులని ప్రపంచము నేడు అంగీకరింస్తుంది . మన దేశములో పురాతన శాసనాల గురించి , ప్రాచీన గ్రంధాల గురించి , చరిత్ర , ఆర్కియాలజీ అంశాలలో కృషి చేసి పేరెన్నికగన్న చాలామందికి డిగ్రీలు లేవు . .. అయినప్పటికీ ఆయా అంశాలలో నిష్ణాతులు వారు . వారు నిత్య విద్యా ర్ధులుగా శ్రమిస్తారు . వయసుతో సంబందము లేనిది విద్య అని అర్ధము చేసుకున్నందునే వయోజన విద్య పధకము మొదలైనది . గృహిణి , ఉద్యోగి , ఏస్థాయిలో , ఏ వయసులో ఉన్నవారైనా విద్యార్ధిగా ఆలోచించవచ్చన్నది నేటి భావన.

విజ్ఞానము సంపాదించడం , అదికూడా సక్రమ మార్గం లో ఉండడం , కృషి , పట్టుదల , క్రమశిక్షణ మున్నగునవి విద్యార్ధికి ఉండాల్సిన లక్షణాలు . పెద్దల పట్ల గౌరవం , సమాజం పట్ల అవగాహన విద్యార్ధికి అదనపు లక్షణాలు . తాను ఆర్జించిన విద్యను సక్రమమార్గము లొ వినియోగిస్తూ విద్యార్జనకు అంతం లేనన్నది గ్రహించననాడే నిజమైన విద్యార్ధి . వారే సమాజానికి ఉపయోగపడతారు . అదే అంతర్జాతీయ విద్యార్ధి దినోత్సవ సందేశము .


  • ==============================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .