గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 2 వ వారము ) - గర్భిణీలలో అవగాహన వారోత్సవాలు(Pregnancy awareness week ) - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
అమ్మతనము అనేది ఒక అద్భుత అనుభవము . ప్రతి అమ్మాయి కోరుకునే అనుభవము . అయితే తాను అమ్మకాబోతున్నాన్న ఆనందముకంటే ఆదుర్దా , భయము ఎక్కువగా ఉంటుంది . ఆ భయాలను పోగొట్టేందుకె ఈ గర్భిణీ అవగాహన వారోత్సవాలు ప్రతిసంవత్సరమూ జరుపుతాము.
చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రంలో చివరి రోజుకు రెండు వారాలు కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.
గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.
ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.
భార్యాభర్తల అనురాగానికి తీపిగురుతులు పిల్లలు. స్ర్తి గర్భం దాల్చిన తర్వాత పుట్టింటివారు ఆమెను అపురూపంగా చూసుకుంటారు. సీమంతం చేసి తమ ముచ్చట తీర్చుకుంటారు. ముత్తయిదువులు పండంటి బిడ్డను కనమని ఆ స్ర్తిని దీవిస్తారు. వారి దీవెనలు ఫలించి ఆమె పండులాంటి బిడ్డకు జన్మనిస్తుంది.
అయితే గర్భం దాల్చిన వెంటనే ఆ స్ర్తి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి డెఫిషియన్సీకి లోనుకాకుండా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో తనిఖీలు చేయించుకుంటూ ఉండాలి. తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అటువంటి స్ర్తిలు చేయకూడని కొన్ని పనుల గురించి మన దేశంలో చాలామందికి పూర్తి అవగాహన లేదనే చెప్పాలి.
గర్భం దాల్చిన తర్వాత వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. చీటికి మాటికీ ఇబ్బంది కలిగించే తలనొప్పి, ఇతర రుగ్మతలకు సొంత వైద్యం చేసుకోకూడదు. అలాగే తల్లీ బిడ్డలకు నలత కలిగించే ఆహారం తీసుకోకూడదు. గర్భిణీ వేళకు ఆహారం తీసుకోవాలి. అయితే నేడు నూటికి తొంభై మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ప్రెగ్నెన్సీ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలు మన దరికి చేరవని వైద్యులు తెలియజేస్తున్నారు. నిర్ణీత వేళల్లోనే మన పనులు ముగించుకుని కాస్త పెందలాడే ఆఫీసుకు బయలుదేరిపోవాలి. లేదంటే ఆలస్యంగా వచ్చే బస్సు కోసం టెన్షన్ పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టెన్షన్ అనేది గర్భిణులకు చేటుచేస్తుంది. దీనివల్ల బీపీ పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు, ఊరికినే చెమటలు పట్టేయడం వంటివి జరుగుతాయి.
అదేవిధంగా ఆఫీసుల్లో మగవారితోపాటు స్ర్తిలు కూడా పదే పదే ఒత్తిడిని తట్టుకోవడానికి టీ, కాఫీలు కాస్త ఎక్కువసార్లే తాగుతూ ఉంటారు. అలా చేయకూడదు. టీ, కాఫీల్లో ఉండే హానికారక పదార్థాలు గర్భస్త శిశువుకు చెరుపు చేస్తాయి కనుక సాధ్యమైనంత వరకు టీ, కాఫీలు తగ్గించేయాలి. దానికంటే బాగా మరగబెట్టిన చల్లార్చిన పాలు శ్రేష్ఠం. అదేవిధంగా ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకూడదు. అలాగే ప్యాకెట్లలో విక్రయించే నీటి వినియోగం కూడా మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కనుక ఇంట్లో బాగా మరిగించిన నీటినే చల్లార్చుకుని బాటిల్లో పోసుకుని ఆఫీసుకు వెళ్లాలి.
గర్భంలో శిశువుకు ఇబ్బంది కలిగించేలా భీకర శబ్దాలు వినిపించే చోట్లలో ఎక్కువ సమయం గడపకూడదు. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో పెద్దవారు వినలేని అల్ట్రాసౌండ్ తరంగాలకు కూడా గర్భస్థ శిశువులు చక్కగా స్పందించగలరని, అయితే అవి వారికి చేటు చేస్తాయని తేలింది. అందుకే వైద్యులు పిండం మరీ ఎదగకముందు స్కానింగ్‌కు అనుమతించరు. భీకర శబ్దాలు గర్భస్థ శిశువులను ఉలిక్కిపడేలా చేస్తాయని, పదే పదే అటువంటి శబ్దాలు వింటూ ఉంటే వారు ఎంతో అనీజీనెస్‌కు గురికావడమే కాకుండా నలతల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. కనుక గర్భిణీలు భీకర శబ్దాలు ఉత్పన్నమయ్యే చోట ఎక్కువసేపు ఉండకూడదు. అటు వెళ్ళకపోవడమే మేలు.
అదే వీనుల విందైన సంగీతమైతే తల్లి గర్భంలో ఉండే శిశువులు పరవశిస్తారని, తరచూ అటువంటి సంగీతం తల్లి వింటూ ఉంటే ఆమె గర్భంలో ఉండే శిశువు చక్కటి ఆరోగ్యంతో పెరిగి పెద్దదవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఈ విధంగా గర్భం దాల్చిన స్ర్తిలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అత్తమామలు, తల్లిదండ్రులు కోరుకున్నట్లు పండంటి బిడ్డకు జన్మనిచ్చి తమ జన్మను సార్థకం చేసుకుంటారు.
ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే, ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన నాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.
ప్రెగ్నెన్సీలో 1-3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 4-6 నెలలు సెకండ్ ట్రైమిస్టర్‌గా, 7-9 నెలలు థర్డ్ ట్రైమెస్టర్‌గా డాక్టర్లు పరిగణిస్తారు.
1 - 3 నెలల వరకు...
సాధారణంగా ఈ నెలలో విపరీతమైన అలసట, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కాళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, ఆకలి, అరుగుదల తక్కువ, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి
సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలు మరీ భరించలేనివిగా ఉన్నప్పుడు మాత్రమే అడ్మిషన్, ట్రీట్‌మెంట్ అవసరం. ఈ సమస్యలన్నీ పిండాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం పెరిగే హెచ్.సి.జి, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల వల్ల కలుగుతాయి. అందువల్ల అసౌకర్యంగా ఉన్నా ఈ బాధలను ఎంతో కొంత తట్టుకోక తప్పదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం, నూనెలు, కారాలు, మసాలాలు తక్కువగా వాడటం వంటి జాగ్రత్తలు ఉపశమనాన్ని ఇస్తాయి. డాక్టర్ సూచనలమేరకు ఫోలిక్‌యాసిడ్ మాత్రలు అవసరాన్ని బట్టి హార్మోన్ ఇంజెక్షన్లు లేదా మాత్రలు, వాంతులు వికారం తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి సిరప్‌లు అవసరం పడవచ్చు. ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఇతర సమస్యలకై మందులు వాడుతున్న స్ర్తీలు డాక్టర్ని కలిసి, ఆ మందులు కొనసాగించగలిగినదీ, ప్రెగ్నెన్సీకి నష్టం చేకూర్చని మందులు మొదలుపెట్టవలసినదీ తెలుసుకోవడం మంచిది.
4 - 6 నెలలో...
పై మూడు నెలల్లో ఉన్న సమస్యలన్నీ ఈ నెలల్లో తగ్గుముఖం పడతాయి. తల్లి బరువు పెరగడం, ఆకలి పెరగడం, కడుపులో బిడ్డ పెరగడం, ఆరవ నెల నుంచి బిడ్డ కదలికలు తెలియడం వంటివి ఈ నెలలో ముఖ్యమైనవి. కొన్ని సందర్భాలలో బి.పి., షుగర్ వంటివి పెరగడం, కాళ్లకు నీరు పట్టడం, నడుం నొప్పి వంటివి గమనిస్తాం. ఈ నెలల్లో చేసే టిఫా స్కానింగ్ ఎంతో ముఖ్యమైనది. ఈ నెలలో పిండం అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఇక ఇప్పటి నుంచి పిండం పరిమాణంలో పెరగడమే తప్ప అవయవాలేవీ ఆరవ నెల తర్వాత ఏర్పడవు. అందుచేత ఈ నెలల్లో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డ అన్ని అవయవాలు ఏర్పడిందీ లేనిది తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇచ్చే టి.టి ఇంజెక్షన్ 4-6 వారాల వ్యవధితో రెండు డోసులు ఈ నెలలోనే ఇవ్వాలి. రెగ్యులర్‌గా బరువు, బి.పి., చెక్ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు, బ్లడ్ గ్రూప్ పరీక్షలు ఈ నెలల్లో చేయించుకోవాలి. ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ వాడాలి. చాలామంది ఈ మాత్రలు వేసుకోవడం వల్ల బిడ్డ బరువుగా పుడతుందని, అందువల్ల సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. అందువల్లే గర్భిణీ స్ర్తీలను ఈ మాత్రలు వాడవద్దని సలహాలు ఇస్తుంటారు. కాని కేవలం ఈ మాత్రలు వాడటం వల్ల బిడ్డ బరువు పెరగదని, ఆరోగ్యంగా మాత్రమే పుడుతుందని అర్థం చేసుకోవాలి.
7 - 9 నెలలో...
ఈ నెలలో గర్భిణీ బరువు పెరగడం, బిడ్డ వల్ల భారంగా ఉండటం, నడుం నొప్పి, నీరసం, అలసట వంటివి కలుగుతుంటాయి. బి.పి., షుగర్ ఎక్కువవడం, ఉమ్మనీరు తగ్గడం, బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, కాళ్లకు వాపులు రావడం, కొద్దిగా తిన్నా కడుపు నిండిపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఈ నెలలో ఉత్పన్నం అవుతుంటాయి. పదిహేను రోజులకోసారి డాక్టర్ చెకప్‌కు వెళ్లి, విపులంగా డాక్టర్‌తో మాట్లాడటం, అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొమ్మిదవ నెల దగ్గర పడినకొద్దీ డెలివరీకి అవసరమైన జాగ్రత్తలు గురించి డాక్టర్‌తో చర్చించి తగిన సూచనలు పొందాలి. నడుం నుంచి కడుపులోకి వచ్చే నొప్పులు, ఉమ్మనీరు కారిపోవడం, బ్లీడింగ్ అవడం, బిడ్డ కదలికలు తగ్గడం... వంటివి ఈ నెలల్లో వెంటనే హాస్పిటల్‌కి వెళ్లవలసిన సందర్భాలు. క్యాల్షియం, బి-కాంప్లెక్స్ మాత్రలు డెలివరీ దాకా వాడి, డెలివరీ తర్వాత డాక్టర్ సూచనమేరకు మరో మూడు నుంచి ఆరు నెలల వరకు వాడటం .. తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం.
ఆరోగ్య సిబ్బంది , డాక్టర్లు , నర్సులు , ఎ.ఎన్.ఎం.లు అంతా కలిసి కట్టుగా ఈ వారం రోజులు గర్భిణీ స్త్రీల గురించి ప్రజలకు అరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తారు . టార్గెట్ కపుల్ అందరికీ ... బేనర్లు , పాంప్లెట్శ్ (కర్పత్రాలు ) మున్నగు వాటి ద్వారా తెలియజేస్తారు . ఇదే ఈ వారం యొక్క ముఖ్య ఉద్దేశము .
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
chala manchi suchanalu
ReplyDeletechala manchi suchanalu
ReplyDelete