Monday, February 14, 2011

ప్రేమికుల రోజు , Valentine Day




గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 14) - ప్రేమికుల రోజు (Valentine Day) - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

ప్రేమికుల రోజు ... అదే valantine Day ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14న జరుపుకుంటారు . ఈ రోజు ముందు వేలంటైన్‌ వీక్ అని (ప్రేమికుల వారము ) అని జరుపుకునే ఆచారము ఉన్నది . వేలంటైన్‌ వీక్ లో మొదటి రోజు గులాబీ దినోత్సవం (Rose day) ని జరుపు కుంటారు .వేలంటైన్‌ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తోనే ప్రారంభమౌతాయి.ప్రేమకు చిహ్నం గా ఎవరైనా గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు.ఈ వారము మాత్రము కొత్త ప్రేమికుల హవా కనిపిస్తుంది .

The Valentine's Day Week:

* 07 Feb Rose Day
* 08 Feb Propose Day
* 09 Feb Chocolate Day
* 10 Feb Teddy Day
* 11 Feb Promise Day
* 12 Feb Kiss Day
* 13 Feb Hug Day
* 14 Feb VALENTINE'S DAY


పై విధము గా వారమంతా అనందము గా జరుపుకుంటారు . ఇదంతా విదేశీ సంసృతి అయినా మన దేశమంతా బహుళ ప్రచారము చెంది అంటువ్యాధిలా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తిచెందుతూ ఉన్నది.

వాలంటైన్స్‌ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్ళు తొక్కుతాయి. తమ ప్రియతములకు ప్రేమ సందేశాలు పంచుకోవడం కానుకలు ఇవ్వడం, వంటి కార్యక్రమాలు ప్రేమికులు చేసుకునే పండగే ఈ వాలంటైన్స్‌ డే. అయితే ప్రేమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. క్రైస్తవ మత బోధకులైన సేయింట్‌ వాలంటైన్‌ పేరున ఈరోజు ప్రచారంలోకి వచ్చిందని కొందరు చరిత్ర కారులు పేర్కొన్నారు. మరొక వైపు మొదట రోమన్‌ సామ్రాజ్యంలో ప్రారంభంమైనట్లు చరిత్రకారులు ఆధారంగా చెబుతున్నారు. ఈ సామ్రాజ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన జునో అనే ప్రేమదేవత గౌరవహర్షం సెలవు దినంగా ప్రకటించేవారని పేర్కొనేవారు. అయితే లూఫర్‌సియా, లూఫర్‌కాలియా పండగగా చేసుకునే వారని పేర్కొన్నారు. యువత కాగితం ముక్కలపై పేర్లను వ్రాసి ఒక పాత్రలో వేసేవారు. తమ జతను ఎంపిక చేసేందుకు ఆ పేర్లను ఎంపిక చేసేవారట. ఏదిఏమైనా ప్రేమికులకు ప్రేమంటే రెండక్షరాల మాటకాదు. రెండు హృదయాల కలయిక అంటారు. అయితే అది భారతీయ సంస్కృతికి విభిన్నం వ్యతిరేకంగా భావిస్తారు. నేటి సమాజంలో అది ఫ్యాషన్‌గా మారింది. అమ్మాయి ప్రేమించకుంటే చంపేయ్యాలనే ఆలోచన నేటి యువతరంలో పుట్టుకొచ్చింది. ఇది చేతగాని వారు చనిపోవాలనే ఆలోచన చేస్తున్నారు. గత సంవత్సరంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

ఉదాహరణకు విజయవాడకు చెందిన విద్యార్థిని శ్రీలక్ష్మీ, వరలక్ష్మీ దారుణహత్య. అంతేకాదు స్వప్నిక, ప్రణితలపై యాసిడ్‌ దాడులు చెప్పుకోవచ్చు. అందుకే ఇది భారతీయ సంస్కృతికి విరుద్దమైందిగా కొందరు భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నిజమైన ప్రేమను కాపాడుకోవడం ఒక సమస్యగానే ఉంది. అయినా తప్పుడు ప్రేమను దానిలోని పరిమళాన్ని మానవీయ అంశాన్ని కాపాడుకోవాలి. బాల్యంలో పొందిన అమ్మా, నాన్నల ప్రేమను, యవ్వనంలో స్నేహితుల, బందువుల, జీవిత బాగస్వామి ప్రేమను వృద్దాప్యంలో పిల్లల ప్రేమకు అనేక అర్థాల్ని ఏవిధంగా తెలుపుతుందో, అప్పుడే ఆ ప్రేమకు స్వార్ధకత లభిస్తుంది.--Prajashakti news paper

ఇరు హృదయాల తీపి కలయిక.
రసాయన శాస్త్రాన్ని అనుసరించి మనలో ప్రేమ భావనలు చెలరేగడానికి హృదయంతో పాటుగా మెదడు కూడా సహకరిస్తుంది. మెదడులో ఉత్పన్నమయ్యే డోపామైన్ అనే హార్మోన్ మనిషిలో శృంగారపూరిత తలంపులు కలిగించే బాధ్యతను తీసుకుంటుందని అమెరికాకు చెందిన మానసిక శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ పేర్కొన్నారు. అంతటితో ఆగక మనిషిలో తీవ్రమైన ఉత్తేజాన్ని డోపామైన్ కలిగిస్తుంది. ఇదంతా కూడా ప్రేమ సమీకరణలకు దారి తీస్తుంది.

ఇప్పటి వరకు హృదయం, గుండె చప్పుళ్లతో ప్రేమకు ఏదో తెలియని లంకె ఉంటూ వచ్చింది. అయితే ప్రేమ వెనుక దాగిన సంగుతులు ఎన్నో ఉన్నాయి. తొలి చూపులోనే ప్రేమ కలుగుతుందని అనుభవజ్ఞులు చెప్పడంతో పాటు అనేక పుస్తకాలలో చదివి తెలుసుకున్నాము. తొలి చూపులోనే ప్రేమలో పడేందుకు డోపామైన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రేమ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. ఉత్తేజాన్ని కలిగించినట్లుగా ప్రేమ పట్ల విశ్వాసాన్ని డోపామైన్ పాదుగొల్పుతుందా? ఇందుకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ప్రేమతో పాటు విశ్వాసం కూడా సహజసిద్ధంగా ఉద్భవిస్తుందని ప్రేమోపాసకులు పేర్కొంటున్నారు.

రసాయన శాస్త్రంలో ప్రేమ సమీకరణలు వెదుకుకోవలసిన అవసరం ఏముందని మీరు ప్రశ్నించవచ్చు? ప్రేమ తాలూకు పర్యవసనాలను ప్రతిబింబించే అనేక సంఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. వాటిల్లో స్వార్థమెరుగని ప్రేమ ఘటనలు మన దృష్టికి వచ్చి ఉండవచ్చు. అదేసమయంలో అటువంటి ప్రేమకు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో జపాన్‌లో జరిగిన సంఘటనను మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రేమకు భౌగోళిక హద్దులు లేవని తెలపాలంటే రెండు రోజుల సుధీర్ఘమైన ఉపన్యాసం అవుతుంది.

ఇవాళ జపాన్‌లో జరిగింది రేపు భారత్‌లో జరిగే అవకాశం లేదని చెప్పలేం. ఈ సంఘటన ఎక్కడైనా జరగవవచ్చు. 25 సంవత్సరాల దొంగ ఒకడు జపాన్‌లోని పోస్టాఫీస్‌ నుంచి 3,40,000 యెన్‌ల ధన రాశిని దొంగలించాడు. ఈ సంగతి దొంగ ప్రియురాలికి తెలిసింది. తన వ్యవహారం ప్రేమికురాలికి తెలిసిపోయిందన్న సంగతి దొంగకు తెలిసింది. ప్రేమను కోల్పోవడం ఆ దొంగకు ఇష్టంలేదు. అందుకే తన వృత్తికి విరుద్ధంగా ప్రేమికులకు ఆదర్శంగా నిలిచే రీతిలో ఆ దొంగ ఒక పని చేశాడు. తాను దొంగలించిన 3,40,000 యెన్‌ల ధన రాశికి మరో 10,000 యెన్‌లను జోడించి మొత్తం ధనాన్ని పోస్టాఫీస్‌లో చేరవేసి వచ్చేశాడు మన ప్రేమ దొంగ. ప్రేమ అంటే రెండు హృదయాలు కలయిక మాత్రమే కాదు ఒకరిపై ఒకరికి విశ్వాసాన్ని పాదుగొలిపి ప్రేమికుల్లో బాధ్యతను పెంచే మహా మంత్రంగా చెప్పవచ్చు.


పవిత్ర ప్రేమ --/డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి

''భార్యాభర్తల మధ్య అంకురించే ప్రేమ మానవజాతికే శుభకరం. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ మానవాళిని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళుతుంది. కానీ, వ్యసన పరాయణ కాముక ప్రేమ సమస్త మానవుల్ని భ్రష్టుపట్టిస్తుంది'' అన్న బెకన్‌ మహాశయుడి మాటలు 'ప్రేమికుల రోజు'న స్మరించుకోవడం ఎంతో అవసరం. ఫిబ్రవరి 14ను 'ప్రేమికుల రోజు' అనుకునే కంటే 'ప్రేమను ప్రకటించే రోజు' అనడం సబబు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తమకు నచ్చిన వారికి తమ అమలిన ప్రేమ (ప్లెటోనిక్‌ లవ్‌)ను ప్రకటిస్తారు. 'వాలెంటైన్స్‌డే' వెనక ప్రేమను ప్రకటించే గాథలెన్నో ఉన్నాయి.

రోమ్‌లో వాలెంటైన్‌ పేరుగల సదాచారులైన ఇద్దరు రుషులు ఫిబ్రవరి 14న శిరచ్ఛేదానికి గురయ్యారు. వారిపై ఉండే ప్రేమకు గుర్తుగా ప్రేమికుల రోజు పుట్టింది. క్రీ.శ. 1415లో ఆర్లియన్స్‌ ప్రాంతానికి చెందిన ప్రభువు చార్లెస్‌ చరిత్రలో ప్రథమంగా ఈ రోజునే తాను బందీగా ఉన్న లండన్‌ టవర్‌ జైలు నుంచి తన భార్యకు ఓ రసరమ్యమైన ప్రేమలేఖ రాశాడంటారు.

ప్రేమను ఎన్నిరకాలుగా నిర్వచించినా స్వచ్ఛతకు సంకేతం ప్రేమే. స్వచ్ఛతకు, ప్రేమకు అవినాభావ సంబంధం ఉంది గనకే ప్రేమికుల రోజును ఫిబ్రవరిలో జరుపుకొంటారు. లాటిన్‌లో ఫెబ్రువో అంటే పవిత్రీకరణం, శుద్ధీకరణం అని అర్థం. పవిత్రమైన మాసం కాబట్టే ప్రేమికుల రోజు ఫిబ్రవరిలో జరుపుకొంటారు. ప్రేమతో సర్వమానవ హితాన్ని సాధించవచ్చు.

ఓ ఇంటికి ముగ్గురు మునులు వచ్చి తలుపు తట్టారు. ఆ ఇంటికోడలు వచ్చి తలుపు తీసింది. ఆ మునులు తమను ప్రేమ, డబ్బు, విజయం అని పరిచయం చేసుకున్నారు. తమ ముగ్గురిలో ఎవరినైనా ఒకరిని కోరుకుంటే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తామన్నారు వారు. ఎవరిని ఆహ్వానించాలో తోచక ఆ కోడలు ఇంట్లోకి వెళ్లి మామగారికి విషయం చెప్పింది. డబ్బు అనే మునిని ఆహ్వానించమన్నాడు మామ. విజయాన్ని కోరుకుందామన్నది అత్త. ప్రేమనే ఆహ్వానిద్దామని ఆ కోడలు తన అత్తామామలను ఒప్పించింది. బయటకు వచ్చి ప్రేమ అనే మునిని ఆహ్వానించింది. ప్రేమతోపాటు డబ్బు, విజయం ఇద్దరూ లోనికి ప్రవేశించారు. మీలో ఒక్కరే లోనికి వస్తామని ముగ్గురూ వచ్చారేమిటని ఆ కోడలు ప్రశ్నించింది. వెంటనే డబ్బు, విజయం అనే మునులు ప్రేమ వైపు చూపిస్తూ వీరు ఎక్కడుంటే మేమూ వారి వద్దే ఉంటాం అని సమాధానం ఇచ్చారు.

'ప్రేమికుల రోజు' వెనక ఉన్న విస్తృతమైన అర్థాన్ని యువత గ్రహిస్తే అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఉండదు. ప్రేమ మానవ జీవితంలో అవిభాజ్య భాగం. ఈ సత్యాన్ని గ్రహించి ఆచరించేవాడే నిజమైన ప్రేమికుడు. స్వచ్ఛమైన ప్రేమకు మరణంలేదు.


విదేశీ విష సంస్కృతి మనకొద్దు :

విదేశీ విష సంస్కృతి మనకొద్దు స్వచ్ఛమైన ప్రేమే ముద్దు అంటూ ఎబివిపి, బజరంగ్‌దళ్,బిజెవైఎం కార్యకర్తలు ఆదివారం నగరంలో కలియతిరుగుతూ ప్రేమ జంటలను పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే మరికొన్ని గ్రీటింగ్ కార్డుల దుకాణాలపై దాడులు చేస్తూ ప్రేమపేరుతో వున్న గ్రీటింగ్ కార్డులను దగ్ధం చేశారు. అలాగే పార్కులు, రెస్టాంరెంట్లలో అసభ్యకరంగా వ్యవహరించే ప్రేమికులను పట్టుకుని నిలదీశారు. విదేశీ విషసంస్కృతిని వ్యతిరేకిస్తూ ఫూలే విగ్రహం ఎదుట పాశ్చాత్య సంపద దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా ఎబిపివి జాతీయ నాయకులు బాలకృష్ణ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివనాధరెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రదాన కార్యదర్శి రాటకొండ విశ్వనాధ్‌లు మాట్లాడుతూ ప్రేమకు తాము వ్యతిరేకం కాదన్నారు. కొన్ని విదేశీ శక్తులు కూడా భారత సంస్కృతిపై దాడి చేసే కుట్రలో భాగంగానే వాలంటైన్స్‌డేని నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా, విదేశీ విష సంస్కృతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాశ్చాత్య సంస్కృతికి అద్దంపట్టే వాలెంటైన్‌-డే(ప్రేమికుల రోజు)ను బహిష్కరించి దేశ సంస్కృతి, సంప్రదాయాలను యువత కాపాడాలని బజరంగ్‌దళ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టి.యమన్‌సింగ్‌, గ్రేటర్‌ కన్వీనర్‌ భరత్‌వంశీ మాట్లాడారు. సోమవారం పార్కులు, హోటళ్లు, పబ్బులు, రిసార్టుల్లో ప్రేమికులెవరైనా జంటగా కనిపిస్తే పట్టుకుని వీహెచ్‌పీ కార్యాలయానికి తరలించి కౌన్సిలింగ్‌తో పాటు పెళ్లి చేస్తామని చెప్పారు. ఇందుకోసం నగరంలో పది బృందాలను ఏర్పాటుచేశామని వివరించారు. --Andhraprabha

వెండి'తార'ల మనోగతమిదీ...
న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌ ప్రేమ... కేవలం ప్రేమికులకే కాదు. ప్రేమించే ప్రతి మనసుకు ఈ పదం అంకితం. తల్లిదండ్రుల్ని ప్రేమించినా, స్నేహితులపై ప్రేమ కురింపించినా, మూగజీవాలపైనా, దైవంపైనా ప్రేమ కురిపించినా... భార్యను ప్రేమతో ఆలింగనం చేసుకున్నా... ఇవన్నీ ప్రేమైక జీవన సత్యాలే. 'వాలంటైన్స్‌ డే' అనగానే కేవలం ప్రేమికుల రోజే కాదు... ప్రేమించే మనసున్న ప్రతి ఒక్కరి రోజు అంటున్నారు నవతరం హీరోయిన్లు. తమకు నచ్చేవాడు, తమ అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేవాడు కనిపిస్తే... తాము సైతం గులాబీల ప్రేమ సువాసనలకు దాసోహం అంటున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ రియల్‌ హీరోలకు మనసిచ్చేస్తామంటున్నారు.

మనసు కదలాలి. మనుషుల్ని కదిలించాలి. ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. రెండు కుటుంబాలను కలిపేయాలి. అది ఎలాంటి ప్రేమయినాసరే... స్నేహంతో మొదలై, పెళ్లి వరకు తీసుకొస్తుంది. సినిమా పరిశ్రమలో ఇలాంటి ప్రేమ జంటలెన్నో! వారిలో నాగార్జున-అమల, సూర్య-జ్యోతిక, శ్రీకాంత్‌-వూహ, సూర్యకిరణ్‌-కళ్యాణి, జీవిత-రాజశేఖర్‌, రోజా-సెల్వమణి, అమితాబచ్చన్‌-జయాబచ్చన్‌, అభిషేక్‌బచ్చన్‌-ఐశ్వర్యారాయ్‌, కృష్ణవంశీ-రమ్యక్రిష్ణ, మహేష్‌బాబు-నమ్రతాశిరోద్కర్‌, పవన్‌కళ్యాణ్‌-రేణూదేశాయ్‌, అల్లు అర్జున్‌-స్నేహారెడ్డి... ఇలా చెబుతూపోతే చాంతాడంత లిస్టే ఉంటుంది. --24dunia.com

అందమే బహుమానం(కానుకల్లో నయా ట్రెండ్‌)

ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు.. ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్‌ చేసేందుకు మధనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలి మనసును దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు తెగ ఇదైపోతుంటాడు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విశిష్టరీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. పూలు, చాక్‌లెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్‌. మరి నేటి ట్రెండ్‌ ఏమిటి? వారికి అందాన్ని బహుమతిగా ఇవ్వడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నేటి తరం కోరుకునే సరికొత్త కానుక సౌందర్యం.

యుక్తవయసులో ఉన్నవారైనా, మధ్య వయస్కులైనా మహిళలంతా కోరుకునేది అందం. అందులోనే వారికి ఆనందం.. ఆత్మవిశ్వాసం. ఏడాది పొడుగునా ప్రతి రోజూ అందంగా కన్పించాలని కోరుకోవడం సహజం. వాలంటైన్స్‌ డేలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రత్యేక అవసరం మరింత అధికమవుతుంది. ప్రేమికులు ఈ అవసరాన్ని గుర్తించారు. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. లోపాలను సవరిస్తూ సౌందర్యాన్ని పెంచే ఫిల్లర్స్‌, బొటాక్స్‌లాంటి సౌందర్య చికిత్సను బహుమతిగా ఇవ్వడం ఈ వాలంటైన్స్‌ డే పోకడగా ఉంది. 'వ్యక్తిగత సౌందర్య పోషణ, ఆసక్తి పెరుగుతోంది. నాన్‌ సర్జికల్‌ కాస్మొటిక్‌ ప్రొసీజర్లపై మక్కువ అధికమవుతోంది. కొనుగోలు శక్తి, అదాయం అధికం కావడంతో ట్రీట్‌మెంట్‌లను బహుమతిగా అందించడం మొదలైందని' బంజారాహిల్స్‌లోని న్యూవో స్కిన్‌ క్లినిక్‌ వైద్య నిపుణులు రష్మిశెట్టి అన్నారు. -News today


Prema kavita : ప్రేమ కవిత :


కలసిన మనసుల కలవరం ప్రేమ...

పరిచయాల పరితపన ప్రేమ...

మనుగడకి మరో రూపం ప్రేమ...

ప్రతి క్షణం తనకై నిరీక్షిస్తూ,తన పలుకుకై పరితపిస్తూ...

పరుగు పరుగున తనని చేరి తన సాన్నిత్యంలొ సురమదురాలని ఆస్వదించాలని ఆపేక్షిస్తూ...

ప్రేమ నిండిన తన వశమైన హ్రుదయ భారాన్ని మోస్తూ...

తనకై వేచి నడిచే ప్రయాణంలొ ఒక బటసారిగా మసులుతూ...

చేసిన బాసలు చెప్పిన ఊసులు నెమరవేస్తూ...

తనని చేరిన ఆ క్షణమే,క్షణక్షణం నా జీవితంలో మిగిలి పోవాలని...

మా ఇద్దరి ఒక జీవితంలో కలసిపోవాలని ఎదురు చూసే రోజు …..

……………..ఈ ప్రేమికుల రోజు ……………


ఏమిటీ వేలం వెర్రి ప్రేమలు /-పోలిశెట్టి వేణుగోపాల రావు(February 13th, 2011)

ప్రేమల పేరిట నేటి సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమలు అంతకంతకూ వెర్రితలల్ని వేస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విదేశాల నుండి ఈ మధ్య దిగుమతి అయిన ‘వాలెంటైన్స్ డే’ (ప్రేమికుల రోజు) అనే పండుగ సామాజికంగా మరిన్ని అవకతవకలకు అవకాశాల్ని కల్పిస్తోంది. ముందుగా ఒక్కమాటలో చెప్పాలంటే... ఇదొక అంటు జాఢ్యపు వెర్రి పండుగ’’. వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థుడొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధారపోశాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14గా స్థిరీకరించుకుని ఆ రోజున అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. వీరు చెప్పే ఈ అంశంలో చాలా తప్పులున్నాయి. యథార్థ చరిత్రను తిరగేసి చూస్తే అసలు విషయం ఇది. వాలెంటైన్ వివరాలు కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు. 3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ వాలెంటైన్ ఒక సామాన్య రోమన్ పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2చే వధించబడ్డాడు. దీనికో కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించేవాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ వాలెంటైన్‌ను వధించాడు. దీన్నిబట్టి చూస్తే, ఈ 2వ వాలెంటైన్ ఒక పెళ్ళిళ్ళ బ్రోకరు అని తెలుస్తుంది. ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు.
చరిత్రలో ఉన్న మొత్తం వాలెంటైన్ల అసలు చరిత్రలు ఇవి! ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కణ్ణి తీసుకున్నా కూడా వాడు అమర ప్రేమికుడు ఎలా అయ్యాడో అర్థం కాదు. ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన తేదీ కాదు. కనీసం చచ్చిన తేదీ కూడా కాదు.
ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్ర్తిలకు, పెళ్ళిళ్ళకు సంబంధించిన దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో దేవతపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. ఫిబ్రవరి 15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఇన్ని విధాలుగా 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది. అనంతర కాలంలో ఆ ఫిబ్రవరి 14 గురించి తెలుసుకున్న అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియపరచుకోడానికి ఆ రోజున ప్రేమ కార్డులను పంచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో ‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో ఎవడైతే నేమి వారిలో ఒక వాలెంటైన్‌ను తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి వాడికీ, వాడికి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 14వ తేదీకీ ముడి పెట్టేశారు కొందరు. వెర్రివేయి విధాల ముచ్చట!! ఇక చూడండి... ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించాయి. చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ ముదురుతోంది.

మన దేశస్థుల్లో చాలామందికి ఒక వింత జబ్బు వుంది. ‘‘మన దేశం, మన దేశ చరిత్ర, మన దేశ వ్యక్తులు అంటే లోకువ భావం ఉండడం... విదేశీ చరిత్ర, విదేశీ వ్యక్తులు, విదేశాలంటే మోజు చూపడం’’. ఈ జబ్బు లక్షణాలు. చిత్రమేమిటంటే మన దేశపు ఘనత ఏదయినా వుంటే దాన్ని మన దేశస్థులు ప్రకటించినా కూడా, ఈ జబ్బు ఉన్నవారు నమ్మరు. పైగా అదే విషయాన్ని విదేశీయులెవరైనా ప్రకటిస్తే మాత్రం నమ్ముతారు.
గొప్ప ప్రేమికుల విషయంలో ఉదాహరణలు చెప్పాలంటే ప్రతివారూ ‘‘లైలా మజ్ను, రోమియో జూలియట్’’ అంటూ ఎవరెవరివో పేర్లు చెపుతుంటారు. వారికి మన హిందూ ప్రేమికుల పేర్లేవీ మచ్చుకయినా తెలియవు. రాణీ సంయుక్త, పృథ్వీరాజుల పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? నిజమైన అమర ప్రేమికులు వాళ్ళు. వారు తమ పవిత్ర ప్రేమను గెలిపించుకుని పెళ్ళి చేసుకుని, కాపురం చేశారు. దేశభక్తులైన వీరిద్దరూ విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి వీరస్వర్గం పొందారు.
అంతగా ‘ప్రేమికుల రోజు’ అనే పండుగ చేసుకుని తీరాలని భావిస్తే ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా ఎన్నో ప్రేమలను విజయవంతం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినాన్ని (శ్రీకృష్ణాష్టమిని) ‘ప్రేమికుల రోజు’గా నిర్వహించుకుంటే పుణ్యం, పురుషార్థం లభిస్తాయి. శ్రీ కృష్ణుడు తనను మనసారా ప్రేమించిన రుక్మిణిని వీరోచితంగా చేపట్టాడు. అర్జునుణ్ణి ప్రేమించిన తన చెల్లెలు సుభద్రకు ఎదురైన అడ్డంకులను చాకచక్యంగా తొలగించి, విజయవంతంగా వివాహం జరిపించాడు. ప్రేమికులైన ప్రద్యుమ్నుడు, రతీదేవిలను కలిపి, పెళ్లి జరిపించాడు. తన కుమారుడైన సాంబుడు, దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను ప్రేమించగా వారి ప్రేమకు అండగా నిలిచి వివాహం జరిపించాడు. తన మనవడైన అనిరుద్ధుడు, బాణాసురుని కుమార్తె ఉషను ప్రేమించగా, వారిరువురి ప్రేమ వ్యవహారాన్ని గెలిపించాడు. తన ప్రేమనే కాక, ఎన్నో జంటల ప్రేమలను విజయవంతం చేసిన శ్రీ కృష్ణుడు ‘నిజమైన ప్రేమకు ప్రతీక!’ మనం ప్రేమికుల రోజుగాని జరుపదలచుకుంటే ఆయన జన్మదినమే అందుకు అత్యుత్తమం.






  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .