Saturday, November 20, 2010

ప్రపంచ మధుమేహ దినం , World Diabetic Day  • Diabetic Logo . Sugar checking meter

నవంబర్‌ 14 ప్రపంచ మధుమేహ దినం.

అంత ర్జాతీయ మధు మేహ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థలు 1991 నుండి ప్రతి సంవ త్సరం నవంబరు 14వ తేదిని మధుమేహ దినంగా పాటిస్తు న్నాయి. 1922లో ఇన్సులిన్‌ హార్మోన్‌ను కనుగొన్న ఫ్రెడరిక్‌ బేంటింగ్‌ జన్మది నాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లి ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న, ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహదినాన్ని ప్రజల్లో అవగాహం , చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్ని అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది , దానివలం వచ్చే ముప్పు ఏమిటి , రాకుండా ఏమి చేయాలి , వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీలుకోవాలి అనే అంశాలను ప్రచారము చేసే ప్రయత్నమే ఈ డయాబెటిక్ డే సెలెబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశము .

అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ఈ వ్యాధికి సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నది. 2009నుండి 2013వరకూ ఐదేళ్ల కాలానికి 'మధుమేహ విద్య -నివారణ' అన్న అంశాన్ని విస్త్రత ప్రజానీకంలోకి తీసుకెళ్లాలని ప్రకటించింది. అందులో భాగంగా 2010కిగాను 'ఈ క్షణమే మనం మధుమేహాన్ని నియంత్రించుకుందాం' అన్న ప్రచార నినాదాన్ని ప్రకటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లమంది రోగులతో ఎపిడమిక్‌ స్ధాయిలో విస్తరిస్తున్న మధుమేహవ్యాధిని ఎదుర్కునేందుకు ప్రపంచ ప్రజానీకం అన్నిరకాలుగా సంసిద్ధమవాలని బెల్జియంలో 2010 ప్రపంచ మధుమేహ దిన క్యాంపెయిన్‌ ప్రారంభ సందర్భంగా అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అద్యక్షులు 'జీన్‌ క్లాడి మెబెన్యా' పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మధుమేహం గురించిన కొన్ని విషయాలు అవగాహన చేసుకుందాం.

ప్రపంచ మధుమేహ దినం లోగో ప్రాధాన్యత ఏమిటి ?

నీలిరంగు వలయం లోగో ఈ దినానికి సూచికగా 2007నుండి ఉనికిలో ఉంది. నీలిరంగు అన్నిదేశాలను ఐక్యంచేసే ఆకాశం రంగును, ఐక్యరాజ్యసమితి జెండా రంగు ను సూచిస్తుంది. వలయం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంటే ప్రపంచ మధమేహ దినం లోగో నీలిరంగు వలయం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచదేశాల ఐక్యతను సూచిస్తుంది.


చక్కెర వ్యాధి... ఈ వ్యాధికి పేరులోనే చక్కెర... దాని ఫలితమంతా ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపుగా దూరమైపోయినట్లే. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్‌ మారిపోయింది. మధుమేహ సమస్య భారత్‌లో అత్యధికంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 15 కోట్ల మంది, దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. 2025 నాటికి భారత దేశంలో ఈ వ్యాధిపీడితుల సంఖ్య 7 కోట్లకు చేరుకోగలదని భావిస్తున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

హైదరాబాద్‌ మధుమేహానికీ రాజధానిగా ఉంటోంది. మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. మధుమేహం, సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది మరణిస్తున్నారు. మధుమేహం ను నిశ్శబ్దహంతకిగా అభివర్ణిస్తారు. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. నవంబర్‌ 14న ‘డయాబెటిక్‌ డే’ ను పురస్కరించుకొని మధుమేహంపై ప్రత్యేక కథనం...

-మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్యభాషలో ''డయాబెటిస్‌ మెల్లిటస్‌'' అని వ్యవహరిస్తారు. డయాబెటిస్‌ అని కూడా వ్యవహరితమయ్యే ఈ వ్యాధి, ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మ త. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), అతిగా ఆకలి వేయడము (పాలీ ఫేజియా), మంద గించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధు మేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన డయాబెటిస్‌ మెల్లిటస్‌.. 3 రకాలు..
అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్‌ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్‌ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్‌ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్‌ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్‌ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్‌ కలుగుతుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ (గర్భిణుల్లో వచ్చే మధుమేహం) లో కూడా ఇన్సులిన్‌ నిరోధకత అగుపిస్తుంది.

జెస్టేషనల్‌ డయాబెటిస్‌ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సున్‌ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటి కీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వ టం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, ఆంటీడయాబెటిక్‌ మందు ల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్‌ వాడకం వల్ల నియంత్రించవచ్చు.

వ్యాధి లక్షణాలు...
మధుమేహం యొక్క లక్షణాలలో ’ప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం), పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. మొదటి రకం డయాబెటిస్‌లో ఈ లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, రెండవ రకంలో మాత్రం వ్యాధి లక్షణా లు చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కో సారి ఈ లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. మొదటి రకం డయాబెటిస్‌ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా), అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గ డం తప్ప మిగతా అన్ని లక్షణాలు, సరిగా నియంత్రణలలో లేని రెండవ రకం డయా బెటిస్‌ రోగులలో కూడా కనిపిస్తాయి.

మూత్ర పిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్‌ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్‌ టుబ్యూల్‌ నుండి గ్లూకోస్‌ రీఅబ్సార్ప్షన్‌ సరిగా జరగదు, కొంత గ్లూకోస్‌ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్‌ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్‌ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌ లో గ్లూకోజ్  పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్‌ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.

రోగుల్లో (ముఖ్యంగా టైప్‌ 1) డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ కూడా ఉండే అవకాశాలున్నా యి. దీనివల్ల మెటబాలిజమ్‌ నియంత్రణ కోల్పోయి శ్వాశలో అసిటోన్‌ వాసన రావడం, శ్వాశవేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. ఈ పరిస్థి తి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభ వించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్‌ 2 లో కలిగే నాన్‌ కీటోటిక్‌ హైపర్‌ ఆస్మొలార్‌ కోమా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.

పాదాలు - జాగ్రత్తలు
చక్కెరవ్యాధి రోగుల్లో పాదాల సమస్యల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువ. చాలా సంవ త్సరాలుగా పాదాల్లో రక్తప్రసరణ క్షీణించడం వలన, నరాల స్పర్శ తగ్గడం వల్ల గాయాలు ఏర్పడి, మానకపోవడం వల్ల పాదాలకు సమస్యలు ఏర్పడుతాయి. న్యూరోపతీ, ఉపరితల రక్తనాళాల వ్యాధి, ఇన్ఫెక్షన్‌ వలన చక్కెర వ్యాధిగ్రస్తుల్లో పాదాల సమస్య తలెత్తుతుంది. మధుమేహం ఉన్న వారు కాళ్ళను పరిశుభ్రం గా ఉంచుకోవాలి. గోరువెచ్చటి నీటితో సబ్బు తో శుభ్రంగా కడగాలి. తరచుగా పాదాలను పరీక్షించుకోవాలి. చర్మం చెడిపోయినా, ను నుపుదనం కోల్పోయినా, డాక్టరును సంప్ర దించాలి.

కాలి వేళ్ళ మధ్యన పగుళ్ళు, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. గోళ్ళను పరీక్షించు కోవాలి. గోళ్ళను వెంట వెంట కత్తిరించు కోవాలి. గోళ్ళ చుట్టూ ఎర్రదనం కన్పించినా, వాపు అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. కాళ్ళు పొడిబారకుండా నూనె రాసుకోవాలి. కాళ్ళు చల్లగా అనిపించినప్పుడు నెమ్మదిగా మర్ధన చేసి, వేడి వచ్చేలా చేయాలి. నీటి బుడగలు, పుళ్ళు, పగుళ్ళు లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. తప్పనిసరి గా అనువైన పాదరక్షలను ధరించాలి.

రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే...
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే చక్కె ర వ్యాధి అని అంటారు. ఈ శాతం తక్కువగా ఉండడం కూడా ప్రమాదకరం. దీనిని హైపో గ్లైసీమియా అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం.

శరీరంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడానికి కారణాలు:
- ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు చేయడం.
- అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ చేయడం.
- నొప్పి నివారణ మందులు విచక్షణారహితంగా తీసుకోవడం.
- ఇన్సులిన్‌, యాంటీ డయాబెటిక్‌ మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం.
- అధికంగా మత్తు పానీయాలు తీసుకోవడం.

క్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు:
-ఈ లక్షణాలు ప్రతీ మనిషికి మారుతుంటాయి. ఒకే మనిషిలో విభిన్న లక్షణాలు కనిపిస్తుంటాయి.
- అతి ఆకలి, అతి చెమట, మూర్ఛపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం
- పెదవులకు తిమ్మిరి పట్టడం.
- చూపు మసకబారడం.
- తలనొప్పి, చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం.
- తికమక పడడం. అలసిపోవడం, బద్దకం మొదలైనవి.

ఈ స్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- నాలుగు పూటలా మితంగా ఆహారం తీసుకోవాలి. (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం)
- కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం.

చక్కెర శాతం తగ్గినప్పుడు జాగ్రత్తలు
- ఈ పరిస్థితి కన్పించగానే రక్తంలోని చక్కెర నిల్వల స్థితి పెంచాలి. 3,4 చెంచా చక్కెర లేదా గ్లూకోజ్‌ తీసుకోవాలి
- వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ కొంత చక్కెర లేదా గ్లూకోజ్‌ దగ్గర ఉంచుకోవాలి.
- అపస్మారక స్థితి వస్తే వెంటనే వైద్యశాలకు తరలించాలి.

చక్కెర వ్యాధిని అశ్రద్ధ చేస్తే వచ్చే ప్రమాదాలు అపస్మారక స్థితి (కోమా)..
ఈ వ్యాధి ఉన్న వారు కోమాలోకి వెళ్ళే అవ కాశం ఉంది. ఇది మామూలుగా రెండు రకాలు. మొదటిది రక్తంలో చక్కెర 400 మి. గ్రా. కన్నా ఎక్కువ కావడం, రెండవది 60 మి.గ్రా. తక్కువ కావడం.

చక్కెర శాతం 400 మి.గ్రా. కన్నా ఎక్కువ కావడం...
Fat_Man-దీనినే డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ అని కూడా అంటారు. ఈ స్థితిలో ఎక్కువగా దా హం, నాలుక తడారిపోవడం, మత్తుగా ఉండడం, వాంతులు, పొత్తి కడుపునొప్పి, తలనొ ప్పి, తలతిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్ళునొప్పులు లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించా లి. ఈ దశలో కూడా తాత్సారం చేస్తే మరణానికి దారి తీయవచ్చు.

రక్తంలో చక్కెర శాతం 60 మి.గ్రా కన్నా తగ్గడం...
దీన్నే లో - షుగర్‌ లేదా హైపోగ్లైసి మియా అంటారు. ఇలాంటప్పుడు చక్కెర, గ్లూకోజ్‌, తేనె, పండ్లరసం, తీపి లేదా పిండి పదార్థం వెంటనే తీసుకోవాలి.

రక్తనాళాలలో మార్పులు...
రక్తంలో చక్కెర శాతం పెరిగితే రక్తం చిక్కగా మారి కొంతకాలం తరువాత రక్తనాళాల రం ధ్రాలను చిన్నగా పూడ్చేస్తుంది. ఈ మార్పు ముఖ్యంగా మూత్రపిండాలకు (డయాబెటిక్‌ నెఫ్రోపతి), కళ్ళకు (డయాబెటిక్‌ రెటినోపతి), నరాలకు (డయాబెటిక్‌ న్యూరోపతి), గుండెకు (కరొనరి ఆర్టరీ త్రాంబోసిస్‌)కు సంబంధించిన రక్తనాళాలలో చోటు చేసుకుంటుంది. వీటి మూలంగా కాళ్ళవాపులు, కంటిచూపు తగ్గిపో వడం, తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, కాళ్ళ గాయాలు మానకపోవడం, ఆయాసం వంటివి అనిపిస్తాయి. ఒకసారి ఈ మార్పులు చోటు చేసుకుంటే తిరిగి యథాస్థితికి రావడం కష్టం. అందుకనే మధుమేహం ఉన్నవారు రక్తం లోని చక్కెర శాతాన్ని క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.

వ్యాధి నిర్ధారణ
మధుమేహ వ్యాధిని రక్త, మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
రక్తపరీక్ష: సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి.గ్రా వరకు ఉంటుంది. ఇంత కన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఖాళీ కడుపుతో ఉన్న ప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ / డీఎల్‌, తిన్న తరువాత 110 నుంచి 140 ఎంజీ / డీఎల్‌ ఉండాలి. ఇంతకన్నా ఎక్కు వ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా వ్యాధిని నిర్ధారించవచ్చు.
మూత్రపరీక్ష: సాధారణంగా మూత్రంలో చక్కెర ఉండదు. ఒక వేళ మూత్రంలో చక్కెర ఉంటే వ్యాధి ఉన్నట్లే.

తీసుకోవలసిన జాగ్రత్తలు
exercise- చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈవ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.

* రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యా యామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
* భోజనానికి అరగంట ముందు మాత్ర లు వేసుకోవాలి. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
* ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
* ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి.
* మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలాఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.

* పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నా యేమో గమనించాలి. డాక్టర్‌ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
* గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి.
* అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.

* మధుమేహం ఉన్న వారికి మూత్ర పిం డాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జిం చబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.
* మధుమేహం ఉన్న వారిలో గుండె కండ రాలకు రక్తాన్ని తీసుకొనిపోయే కరొనరీ రక్త నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రా ల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.
* ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగా యలు ఎక్కువగా తీసుకోవాలి.

మానుకోవలసిన అలవాట్లు
* తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గిం చాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
* కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలే కపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచిస్తే ఇన్సులిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది  సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
* పాదరక్షలు లేకుండా నడవకూడదు.
* పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
* మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
* కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.

-- డాక్టర్‌ అశోక్‌కుమార్‌--జనరల్‌ ఫిజీషియన్‌, డయాబెటిక్‌ స్పెషలిస్ట్‌, గ్లోబల్‌ హాస్పిటల్స్‌,-హైదరాబాద్‌ -ఆయుర్వేదంలో విముక్తి--ayurvedic-for-diabetes
* చక్కెర వ్యాధిని అరికట్టడమనేది మందులు, జీవనశైలి, ప్రశాంత జీవనం లాంటి వాటి యొక్క కలయిక. ఆయుర్వేదంలో వాతజ, కఫజ, పిత్తజ శరీరధర్మాలతో దాదాపు 20 రకాల చక్కెర వ్యాధులను ప్రస్తావించారు. వీటిలో మూడు వంతుల చక్కెర వ్యాధులు తగ్గించడానికి వీలవుతుందని మాధవాచార్యులు పేర్కొన్నారు. అనువంశిక లక్షణాలు ఉన్న వారికి చికిత్స ద్వారా అప్పటి వరకే తగ్గుతుందని, జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు.

* భారతీయ ఆహారంలో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం లాంటి ఆరు రుచుల గురించి ప్రధానంగా పేర్కొన్నారు. ఆహారంలో తప్పని సరిగా ఆరు రుచులు ఉండాలన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు కారం, వగరు, చేదు, రసాలు కలిగిన కూరగాయలు బాగా తీసుకోవలసి ఉంటుంది. శక్తిని ఇచ్చే అన్నం ఎక్కువగా తీసు కోకుండా, పొట్టు కలిగిన జొన్నరొట్టె, గోధుమ పుల్కాలు, సజ్జ రొట్టె తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది.
* అలజడి, కోపం తగ్గించుకొని మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. యోగా, ధ్యానం, నడక లాంటివి చక్కెర వ్యాధి రాకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రివెంటివ్‌ పద్ధతులు పాటిస్తూ ప్రతీ 6 నెలలకోసారి రక్తపరీక్ష చేయించుకుంటూ, కొద్ది గా తేడా కనిపించినా, మందుల అవసరం లేకుండానే తగ్గించుకోవడం మంచిది.

* బిల్వపత్రం, నేరేడు ఫలాలు, కాకర విత్తనాలు, పొడపత్రి, కరక్కాయ, తిప్పతీగె, ఉసిరి, అశ్వగంధ సమానభాగాల్లో తీసుకొని పొడి చేసి భద్రపర్చుకోవాలి. రోజూ పొద్దున, సాయం త్రం ఒక టీ స్పూన్‌ చొప్పున తీసుకుంటే చక్కెర వ్యాధిని నియంత్రించుకోవడం, తగ్గించు కోవడం తేలికే.
* వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది.ఆ కాలంలో మధుమేహాన్ని 'అశ్రవ' అనే పేరుతో గుర్తించారు.ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత, శుశ్ర వసంహిత, నాగభట్ట గ్రంథాలలో వివరించారు. క్రీస్తుశకానికి వెయ్యి సంవత్సరాల కిందటనే ఈ వ్యాధి వర్ణన ఉండడం విశేషం. యజ్ఞ సమయాలలో దేవతలకు సమర్పించే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు పేర్కొన్నారు.

దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన. 1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధిని పత్యం,ఔషధం,వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు. దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం అదే కావడం గమనార్హం.

  • ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు
- అతిగా పాలుతాగడం. పాల ఉత్పత్తులు భుజించడం.
- అతిగా చక్కెర ఉపయోగించడం. చక్కెర రసాలు తాగడం.
- కొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
- తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం.
- అతిగా నిద్ర పోవడం, శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం.
- మానసిక ఆందోళన, భారీ కాయం, అహారపు అలవాట్లు.
- ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.
- ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.
- అతిగా ఆహారం తీసుకోవడం.

డాక్టర్‌ బుక్కా మహేశ్‌ బాబు-ఆయుర్వేద వైద్యులు-హైదరాబాద్‌, సెల్‌:


  • హోమియో చికిత్స
హోమియోపతి వైద్యవిధానంతో చక్కెర వ్యా ధిని నియంత్రించవచ్చు. రోగ లక్షణాలతో పాటు రోగి ప్రత్యేక లక్షణాలను పరిగణన లోకి తీసుకొని హోమియోవైద్యులు మందు లు ఇస్తారు. ఈ మందులు వాడడంతో పా టు సాధారణంగా చక్కెర వ్యాధి నియంత్రణకు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. హోమియోపతి వైద్య విధానం సారూప్య పద్ధతి ఆధారంగా రూపుదిద్దుకున్నది. ఈ వై ద్యాన్ని జర్మన్‌ శాస్తవ్రేత్త శామ్యూల్‌ హానిమన్‌  1796 లో కనిపెట్టారు. ఈ విధానంలో వ్యాధి ఆధారంగా గాకుండా వ్యక్తి లక్షణా లను పరిగణనలోకి తీసుకొని మందు నిర్ధారిస్తారు. కొన్ని సాధారణ హోమియోపతి మందులను కింద సూచించినా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

1. సైజిజీయం జంబోలినమ్‌,
- అధిక దాహం, నీరసం.,
- అధిక మూత్రం,
- సాధారణ ఆహారం తీసుకున్నా కూడా శరీరం చిక్కిపోవడం,

2. అబ్రోమా అగస్టా--
- ఉదయం, రాత్రి వేళలో అధిక మూత్రం,
- గొంతు ఎండిపోవడం, అధిక దాహం,
- మూత్రవిసర్జన అయిన వెంటనే దాహం కలగడం,
- మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడం,

3. సెఫలాండ్ర ఇండికా--
- భయం, పనిమీద ఆసక్తి లేకపోవడం, సున్నితమైన మనస్తత్వం,
- నీరసం, మూత్ర విసర్జన అయిన తరువాత కళ్ళు తిరగడం,
- అధిక దాహం, అధిక మూత్రం,
- శరీరమంతా మంటగా ఉండడం,
- జిమ్నీమా సిల్విస్ట్రా,
- లైంగిక సంబంధ సమస్యలు,
5. పాస్ఫారిక్‌ యాసిడ్‌,
- నీరసం, ఉత్సాహం లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం,
- నడిచినా లేదా నిలబడినా కళ్ళు తిరగడం,
- రాత్రివేళ అధికంగా మూత్రవిసర్జనకు వెళ్ళడం,
- మూత్ర విసర్జనకు ముందు ఆతృత, తరువాత మంటగా ఉండడం,
- రాత్రిపూట కాళ్ళనొప్పులు అధికమవడం,
- ఉదయం, రాత్రి వేళలో అధికంగా చెమట పట్టడం.

  • కళ్ళు- జాగ్రత్తలు
-మధుమేహవ్యాధి లక్షణాలు బయటపడక ముందే చాలా సందర్భాల్లో కళ్ళు దెబ్బతినడం గానీ, రోగగ్రస్తం కావడం కానీ జరుగు తుంది. కంటికి సంబంధించి ఏ బాధ కలిగి నా వెంటనే కంటిడాక్టర్‌ను సంప్రదించాలి. సంవత్సరానికి కనీసం రెండు సార్లు కంటి పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారిలో సాధారణ కంటివ్యాధులు :- శుక్లాలు, గ్లకోమా (ద్రవాల పీడనం పెరగడం), రెటినోపతి (కంటి లోని నరాలు దెబ్బ తినడం).. వస్తాయి.
  • =================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .