Tuesday, July 27, 2010

ప్రపంచ నీటి దినోత్సవం , world water day



ఉత్సవం అంటే - కేళి , పండుగ , సంబరం , జాతర ,వేడుక . ఉత్సవం అంటే గొప్పయజ్ఞమనీ, మిక్కిలి ఆనందాన్ని కలిగించేదని అర్థం ఉంది. జీవితంలో ఒక సంగీతం ఉండదు. ఒక నాట్యం ఉండదు. జీవితం ఉన్నంత వరకు అలా పనిచేస్తూనే ఉండిపోతారు. ఉత్సవమంటే ఏమిటో తెలియకుండానే జీవితం గడిచిపోతుంది. అలా కాకుండా గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
  • ప్రతిసంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది .
ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, " పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ '' (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 సంవత్సరాన్ని " ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం, పరిశుభ్రమైన నీరు " అనే, నిర్దిష్ట భావనతో పాటించడం జరుగుతుంది.

మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.

ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా , 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా , అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.

నీళ్లు-నిజాలు
వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల తల్లి నెర్రెలిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. ఇలాంటి కఠోర వాస్తవాలు కొన్ని...

ప్రపంచంలో 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రాల వాటా 97 శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో 0.008 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.

క్రీశ 2025 నాటికి 48 దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరించింది.

3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.

నీటిమూలంగా సంభవించిన 43 శాతం మరణాలకు అతిసారవ్యాధే కారణం.

పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14 ఏళ్ల లోపువారే.

98 శాతం మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే.

భూమిమీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకునేలా వున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికివాడల్లో నివసించే ఒక వ్యక్తి రోజుమొత్తంమీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్‌ స్నానానికి వాడే నీటితో సమానం.

లీటరు నీటికి మురికివాడల్లో నివసించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10 రెట్లు అధికధర చెల్లిస్తున్నారు.

ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు.

ప్రతి 15 సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతోంది.

లక్షలాది మంది మహిళలు, పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాలనుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.

రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు :

వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే.

గొంతునొప్పి, టాన్సిల్స్‌ : నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.

జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ : నీటిని మరి గించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.

తలనొప్పి : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.

జ్వరం : తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది.

ఎక్కిళ్ళు : గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.

కుక్క కరిస్తే : సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, చొంగపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.

చర్మం కాలితే : వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.

దగ్గు : వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

చిన్న చిన్న గాయాలు : చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.

నిద్రపట్టకపోతుంటే : చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.

ఒళ్ళు నొప్పులు : వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి.

మలబద్దకం : ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.

వాపులవల్ల కలిగే నొప్పి : ఐస్‌ ముక్కతో బాగా రుద్దాలి.

ముక్కులోంచి రక్తం పడుతుంటే : చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.

దంతాల నొప్పి : గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి.

శరీరంలోనొప్పులు : వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.

రుమాటిజం : ఎక్కువనీరు త్రాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. యూరిన్‌ ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ : ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

కంటిలో నలక పడితే : నలపకూడదు. గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. దానిలో కన్ను ముంచి చికిలించాలి. కంటిలోని దుమ్ము, ధూళి, నలకలు వంటివి నీటిలోకి వచ్చి బయటికి పోతాయి.

విరోచనాలు, వాంతులు : శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.

రసాయనాలు చర్మంపై పడితే : ఎక్కువసేపు, ఏకధారగా నీరుపోస్తూ కడగాలి. తీవ్రత తగ్గుతుంది.

మూత్ర పిండాలలో రాళ్ళు : ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌ యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.

ఎక్కువగా నడవడంవల్ల కలిగే కాళ్ళనొప్పులు : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. కొద్దిసేపు ఆ నీటిలో పాదాలు ఉంచాలి.

కడుపునొప్పి : హాట్‌వాటర్‌ బేగ్‌ ఆ ప్రదేశంలో ఉంచాలి.

జ్వరం : గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.

శరీరంలో ఏ అవయవమైనా వాపు, నొప్పి : ఐస్‌ముక్కలతో రాయాలి.

ఒంటికి నీరు పడితే : పెరుగు ఎక్కువగా వాడాలి. ఇది కఫాన్ని కరిగిస్తుంది కూడా.

ముక్కులో, గొంతులో శ్లేషం : దోసిట్లో నీరు పోసుకొని ముక్కుతో లోనికి లాగడం.

నీరు తక్కువగా తాగితే :
  • డీహైడ్రేషన్‌ కలుగు తుంది ,
  • మలబద్దకం ఏర్పడుతుంది ,
  • తలనొప్పి , తలతిరగడం , అలసట , నిస్రాణం , అందోళనం కలిగే అవకాశముంది .
  • మూత్రవిసర్జన తగ్గుతుంది , ఒక్కొసారి మూతవిసర్జన ఆగిపోవచ్చును ,కండరాల నొప్పులు, బలహీనత , కాళ్ళు చేతులు చల్లబడడం జరుగవచ్చును .
  • చర్మము పొడిబారుతుంది , కాంతివిహీనమవుతుంది . నోరు పొడిబారుతుంది . అజీర్ణము - అనేక జీర్ణసంబంధిత బాధలు కలుగుతాయి.
  • మూత విసర్జన సమయము లో మంట , నొప్పి కలుగుతాయి. మూతవిసర్జన సక్రమముగా జరగకపోతే రక్తం మలినాలతో నిండిపోయి విషపదార్ధాలు శరీరములో పేరుకు పోతాయి . అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది .
  • వయసు పెరిగినకొద్దీ దాహము తగ్గుతుంది . నీరు తాగాలని అనిపించకపోయినా తగినంత నీరు తాగాలి ,లేకపోతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. రోజుకు వ్యక్తి బరువు కిలోగ్రాములు /30 తో భాగించగా వచ్చే సంఖ్య లీటర్లలలో తీసుకుని సుమారుగా అన్ని లీటర్ల నీరు త్రాగాలి .
  • ఎక్కువ రక్తపోటు , ఆస్థమా , విపరీతమైన శారీరక నొప్పులు రావడానికి తక్కువ నీరు తాగడం ఒక కారణము .
నీటి వల్ల కనిగే వ్యాధులు :

* డయేరియా ,
* టైఫాయిడ్ ,
* డిసెన్ట్రి ,
* అమిబియసిస్ ,
* కలరా ,

నీరు తాగే సరియైన సమయాలు : Correct timings to take water->

ఒక గ్లాసు నీరు = సుమారుగా 200 మి.లీ.

* 2 గ్లాసులు నీరు -- నడక వ్యాయామం తర్వాత తీసుకుంటే శరీరములోని అవయవాలు ఉత్తేజితమగును,
* 2 గ్లాసులు నీరు-- 30 నిముషాలు భోజనము ముందు తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగును ,
* 2 గ్లాసులు నీరు-- 60 నిముషాలు భోజనము తరువాత తాగితే జీర్ణసంభందిత రుగ్మతలు పోవును .,
* 2 గ్లాసులు నీరు--05 నిముషాలు స్నానము చేసే ముందు తాగితే రక్తపోటు (బి.పి) తగ్గును ,
* 2 గ్లాసులు నీరు--05 నిముషాలు పడుకునే ముందు త్రాగితే గుండె పోటు వచ్చే అవకాశము చాలా శాతము తగ్గును ,
* 2 గ్లాసులు నీరు-- పరగడుపున త్రాగితే ఎసిడిటీ బాదలు లేకుండాపోవును .. మూత్రపిండాల వ్యాధులు దరిచేరవు

రోజుకు ఎంతనీరు త్రాగాలి :
మనిషికి రోజుకు 2.5 లీటర్ల నీరు అవసరము , ఆరోగ్యము . కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది ... మిగతాది త్రగావలసిందే .
ఒక మనిషి రోజుకి ఎంత నీరు త్రాగాలి అంటే : సుమారుగా
మనిషి బరువు కిలోగ్రాములలో / 30 = లీటర్లలో .
ఉదా : మనిషి బరువు =60 కి.గ్రా.
రోజూ త్రాగవలసిన నీరు =60/30 - 2.0 లీటర్లు .(సుమారు అటు .. ఇటు గా )

  • నీటి కోసం ఒక రోజును ఎందుకు కేటాయించారు?

    నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువైనదో అర్థం అవుతుంది.
    * భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునేవారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.
    * భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ, మేఘాలుగా మారుతూ, వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు డైనోసార్లు ఎంగిలి చేసిన నీటినే ఇప్పుడు మనం కూడా తాగుతున్నామన్నమాట.
    * భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97 శాతం ఉప్పునీరే. కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలో ఉంది. మిగతా ఒక శాతం నీరులో 0.59 శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదులు, సరస్సుల్లో ప్రవహిస్తోంది.
    * ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.
    * అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియాలాంటి చాలా దేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.
    మనమేం చేయాలి?
    * ఎక్కడైనా కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెంటనే కట్టేయండి.
    * షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి. దీని వల్ల రోజులో 150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.
    * పళ్లు తోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది.
    * టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8 లీటర్ల నీరు పడుతుంది. లీటర్‌ నీరు పట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్న చిన్న రాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండు లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి.
    * అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.
    * కొళాయిలకి లీకేజీలు ఉంటే దానిని అరికట్టండి. దీనివల్ల నెలలో 300 గ్యాలన్ల నీరు ఆదా అవుతాయి.
    * స్కూల్లో, మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచండి
    మీకు తెలుసా?
    * ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది.
    * ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది.
    * ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.
    * అరకిలో కాఫీ తయారవడానికి 11,000 లీటర్ల నీరు అవసరం.
    * ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్‌ డాలర్లు.

source : wikipedia.org
  • =================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .