ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం - World Malaria Prevention Day .
ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి చివరకు దోమకాటుకు గురై మరణించాడని చరిత్ర చెబుతున్న సత్యం. రోనాల్డ్‌రాస్ అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాధి దోమల ద్వారా ప్రబలుతున్నట్లు తొలిసారిగా మన హైద్రాబాద్‌లోనే గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పి వందేళ్లు దాటినా నేటికీ మలేరియాకు 'నూరేళ్లు నిండలేదు'. ఇటీవల అస్సాంలోని ఒక ఆస్పత్రిలో మలేరియా జ్వరంతో 28 మంది ప్రాణాలు విడవడం దేశంలో పెరుగుతున్న వ్యాధి ఉధృతిని సూచిస్తోంది.
ఒకప్పుడు మలేరియా గడ్డు రోగం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించేది. దానికి కారణమేంటో, ఎలా నివారించాలో తెలియని రోజుల్లో ఓ శాస్త్రవేత్త ఏళ్ల తరబడి పరిశోధన చేసి దాని గుట్టు విప్పాడు. అతడే సర్ రోనాల్డ్ రోస్. ఆయన పుట్టిన రోజు ఇవాళే.
మలేరియా వ్యాధికి ఒక పరాన్న జీవి కారణమని, ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని రోస్ కనిపెట్టినదెక్కడో తెలుసా? మన సికింద్రాబాద్‌లోనే. బేగంపేటలోని 'సర్ రోనాల్డ్ రోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్' పేరిట ఉన్న భవనంలోనే ఈ అద్భుత పరిశోధన జరిగింది. ఆ భవనానికి దారి తీసే రోడ్డుకి కూడా ఆయన పేరే పెట్టారు. ఇక్కడే కాదు మన దేశంలోను, ఇతర దేశాల్లోనూ కూడా అనేక రోడ్లు, భవనాలకు ఆయన పేరే పెట్టారు. ఈ పరిశోధన వల్ల ఆయనకు 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
రోనాల్డ్ రోస్ మన దేశంలోని ఆల్మోరాలో 1857 మే 13న పుట్టాడు. తండ్రి భారత సైన్యంలో అధికారి. రోస్‌ను ఎనిమిదేళ్ల వయసులో ఇంగ్లండ్ పంపారు. అక్కడే వైద్యవిద్య చదివి డాక్టరుగా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇండియన్ మెడికల్ సర్వీసులో తొలిసారిగా చెన్నైలో చేరిన ఇతడు ఆపై కలకత్తా, బెంగళూరు, ఊటీలలో పనిచేసి సికింద్రాబాద్‌కు బదిలీపై వచ్చాడు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహస్తూనే మరోవైపు మలేరియాపై పరిశోధనలు చేస్తూ వచ్చాడు. ఎనోఫిలిస్ అనే జాతి దోమల్లో మలేరియా కారక సూక్ష్మజీవి వృద్ధి చెందుతుందని, ఇది కుట్టడం ద్వారా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని ప్రయోగాత్మకంగా నిరూపించి సంచలనం సృష్టించాడు. వ్యాధిని కలిగించే పరాన్నజీవి జీవన ఆవృతి (లైఫ్ సైకిల్)ని పూర్తిగా వివరించగలిగాడు.
మలేరియా గుట్టు తెలిశాక దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వివరిస్తూ దేశదేశాల్లో అవగాహన కలిగించిన రోస్‌కు ప్రతిష్ఠాత్మకమైన అనేక బహుమతులు, పదవులు లభించాయి. ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు ప్రొఫెసర్‌గా వెళ్లిన రోస్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యారు. కలకత్తా, లండన్ నగరాల్లో రోడ్లకు ఆయన పేరు పెట్టారు. లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్టల్‌కు ఆయన పేరు పెట్టడంతో అందులోని విద్యార్థులు తమను 'రోసియన్స్' అని గర్వంగా చెప్పుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా మలేరియా కారణంగా 15 లక్షల నుంచి 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా ఐదేళ్లులోపు చిన్నారులే ఉండటం విషాదకరం. ఏప్రిల్ 25వ తేదీ ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం జరుపుతున్నారు. ప్రజల్లో దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి వారిని చైతన్య పరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
for full details see --- Malaria
- =======================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .