Friday, April 30, 2010

ప్రపంచ పర్యావరణ దినం , World Environment Day
ప్రపంచ పర్యావరణ దినం (ప్ర.ప.ది.)(World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.


మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతారణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతాయి. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. కాగా ప్రకృతి లోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. మొక్కలు సూర్యుని శక్తి వలన కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని జీవ రాశులకు ప్రధానంగా ఆహారం మొక్కల నుండి అందుతోంది. జీవుల మధ్య ఉండే పర్యావరణ సంబంధాల్లో ఇటీవలి కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో పంట దిగుబడి పెంచేందుకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం చాలా ఎక్కువైంది. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది కానీ గాలి, నీరు, నేల కలుషితమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1972 సవంత్సరం జూన్ 5 వ తేదీన స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఒక ప్రధాన సమస్యగా తయారైంది. సౌకర్యాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాథమిక సౌకర్యాలు అందరికీ అందడం లేదు. అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజు రోజుకు దారిద్య్రం పెరిగిపోతోంది. ఉద్యోగ, ఉపాధి పనులను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడమే గాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికి వాడలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పర్యావరణంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కాగా ప్రతి పనికి శక్తి (ఇంధన) వనరులు అవసరం. వంట పనుల కోసం, యంత్రాలు, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గృహాలలో, విద్యుత్ అవసరాల కోసం ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం. ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు (పెట్రోలియం సహజ వనరులు), థర్మల్ విద్యుత్, జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల ఇంధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిలాజ ఇంధనాలు అంతం అయిపోకముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడమే గాక వృధాను అరికట్టాలి. కాగా నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదలుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటున్నవి. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికినీరుగా, కొన్ని ఘన రూపంలోనే విష రసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియబెట్టినప్పుడు విష వాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. కాగా పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. వ్యర్థాల శుద్ధికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయాలు లేవు. దీనివల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోంది. నీళ్లలో ఉన్న రసాయనిక వ్యర్థ పదార్థాలను వడగట్టి పెద్ద పెద్ద ట్యాంకర్లలో కదలకుండా ఉంచి వేరే రసాయనాలతో స్థిరీకరించి రకరకాలుగా ఆ మురికి నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వాడాలి. అలాగే పొగ గొట్టాలను ఎక్కువ ఎత్తులో ఉంచి పొగ వదిలేలా ఏర్పాట్లు చేయాలి. విష రసాయన వ్యర్థ పదార్థాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చి బూడిద చేయాలి. ఒకే ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నట్లయితే వీటన్నింటిని ఒకేచోట శుద్ధి చేసే ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాగా మార్పు మానవ జీవితంలో ముఖ్యమైన అంశం అయినప్పటికీ అది ఆహ్వానించదగినదిగా ఉండాలి. అభివృద్ధి అనేది వినాశనానికి దారి తీయరాదు. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో విస్తరిస్తున్న నగరాలు చిత్తడి నేలలను ఆక్రమించి ఎన్నో జీవ రాశులకు నిలువ నీడలేకుండా చేస్తున్నాయి. కాగా ఇటీవల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఎక్కువైంది. ఇవి పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునే వారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమి మీద మూడు వంతులు నీరు, ఒక వంతు భూ భాగం ఉన్న సంగతి తెలిసిందే. మూడు వంతులు నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే. చెరువులు, నదులు, భూ గర్భంలో ఉన్న నీరు త్రాగేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఒకే ఒక్క భాగం నేలలో మనం మూడు వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికిమయం చేస్తున్నాం. భూమిపై ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరై తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతోంది. మనం వాడిన నీరు మురికి నీళ్లుగా మారి మళ్లీ ఆవరణ వ్యవస్థలోకే చేరుతున్నాయి. వాటిల్లో ఉండే రసాయనాలు చేపల్లోకి చేరి అలాగే ఆ చేపలను తినే అన్ని రకాల జంతువుల్లోకి చేరి ఒక జీవి నుండి మరో జీవికి కాలుష్యం విస్తరించి మొత్తం ఆవరణ వ్యవస్థకే నష్టం కలిగిస్తోంది. కాగా పట్టణాల్లో నగరాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లను పొదుపుగా వాడి వృధాను తగ్గించాలి. మంచి నీటి కొళాయిలు, బోరింగుల చుట్టూ మురికి నీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన సురక్షిత నీటిని త్రాగాలి. కాగా పర్యావరణ కాలుష్యంలో గాలి కాలుష్యం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో రసాయనికి ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల కాలుష్యం ఎదురవుతుంటే పట్టణాలు, నగరాల్లో ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుగోలు చేయడం ఫ్యాషన్‌గా మారింది. కార్లు, స్కూటర్లు, రోడ్ల మీదకు కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి. కాగా విమానాలకు వాడే ఇంధనం అధిక కాలుష్యాన్ని పుట్టిస్తోంది. ద్రవ్య చలామణి పెరగడం, విమాన చార్జీలు తగ్గడం, ప్రైవేటు విమానాల సంఖ్య పెరగడంతో ఎయిర్ ట్రాఫిక్ పెరిగి గాలి కాలుష్యం మరింత ఎక్కువైంది. వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాద కరమైన రసాయనాలు చేరుతున్నాయి. నేలపైన, నీటిలో ఉన్న అన్ని జీవరాశులు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. కాలుష్య నియంత్రణా మండలి నామ మాత్రంగా పని చేస్తూ ఎడా పెడా లైసన్సులు జారీ చేస్తుండడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను పెంచడం వల్ల ఈ సమస్యను కొంత వరకు నివారించవచ్చు. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. కాగా పర్యావరణ కాలుష్యంలో శబ్ద కాలుష్యం మరొకటి. ఆధునిక కాలంలో శబ్ద కాలుష్యం ప్రమాదకరంగా మారింది. వినికిడి పరిమితికి మించి వచ్చే ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యం క్రిందికే వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని త్రెషోల్డ్ లిమిట్‌తో కొలుస్తారు. కొన్ని శబ్దాలు త్రెషోల్డ్ పరిధిలో ఉన్నప్పటికీ భరించరానివిగా ఉంటాయి. ఇవి మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ శబ్దం పెరుగుతోంది. వాహనాల హారన్‌ల మోతతో మనిషి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. శబ్ద కాలుష్యం మన శరీరంపై, మెదడుపై ఎంతో ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రణగొణ ధ్వనుల మధ్య ఎక్కువ కాలం ఉన్నట్లయితే మనిషి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని కోపం, ఆదుర్దా, చికాకు ఇవన్నీ శబ్ద కాలుష్యం వల్ల వస్తాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలు, జీర్ణ శక్తి, జీవ క్రియ, రక్త ప్రసరణల్లో కూడా మార్పులు కలుగుతాయి. ట్రాఫిక్ పోలీసులు, ఫ్యాక్టరీలలోని కార్మికులు శబ్ద కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కటాల్లో శబ్ద కాలుష్యం తీవ్రంగా ఉంది. ప్రపంచంలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు మాస్క్‌లు ధరించి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వాహనం పొల్యూషన్ చెక్ చేయించుకొని సర్టిఫికెట్ పొందేలా చర్యలు చేపట్టాలి. పొల్యూషన్ చెకింగ్‌ను పెట్రోల్ పంపుల వద్ద మాత్రమే కాకుండా బయట కూడా చేసేలా చూడాలి. నకిలీ, నాణ్యత లోపించిన లూబ్రికెంట్స్ వాడకాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. కాగా నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బి.ఇడి కళాశాలల్లో నేషనల్ గ్రీన్ కోర్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎ స్పిరిట్ డీ కోర్ అనే ఫ్రెంచ్ పదం నుండి కోర్ అనే పదాన్ని తీసుకున్నారు. కోర్ అంటే కలిసి (జట్టుగా) పని చేయడం. నీరు, నేల, గాలి, చెట్లు, పక్షులు, జంతువులు వీటన్నింటి కోసం పని చేయాలని అర్థం. కాగా పాఠశాల స్థాయిలో హెచ్ఎం ఎన్‌జిసి (నేషనల్ గ్రీన్ కోర్) ఛైర్మన్‌గా, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలోని ఉపాధ్యాయులను గ్రీన్ టీచర్స్ అంటారు. రాష్ట్ర స్థాయిలో ఎన్‌జిసి పర్యవేక్షణ కోసం మానిటరింగ్ కమిటీలో పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ అండ్ డైరెక్టర్, టూరిజం శాఖ కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. కాగా పాఠశాలలో ఏర్పాటైన ఎన్‌జిసి టీం పాఠశాలలోని మంచి నీటిని, చెత్తను జాగ్రత్తగా నిర్వహిస్తూ చెట్లను కాపాడుకుంటూ విద్యుత్‌ను పొదుపుగా వాడేలా పని చేస్తుంది. ఈ విధంగా చేస్తే సహజ వనరులను ఎలా వాడాలో అలవాటవుతుంది. అంతేగాక గ్రీన్ టీచర్స్ ఎప్పటికప్పుడు పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పిస్తూ మన పరిసరాల్లో ఉండే జంతువులు, పక్షులను ఎలా సంరక్షించుకోవాలో అవగాహన కల్పిస్తారు. కాగా మానవ తప్పిదాల వల్ల పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే కాలక్రమంలో అడువులు కనుమరుగవుతాయి. త్రాగేందుకు మంచి నీరు లభించని పరిస్థితి కలిగితే జీవ రాశుల మనగడ ప్రమాదకరంగా మారుతుంది. అరుదైన జాతులు అంతరించిపోయే ఆస్కారం ఉంది. కాగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

  • ========================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .