Wednesday, May 13, 2015

Pencil Day,పెన్సిల్‌ రోజు

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (...30 march..) ----- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



  
30-మార్చ్ .పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడుతుంది
మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, ఫ్రెండ్షిప్‌ డే లాంటివి మనకు  తెలుసు. మరి  రాసుకునే పెన్సిల్‌కి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉంది ... అదే 'పెన్సిల్‌ డే'. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.

ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.

* ఈ రోజు గురించి తెలుసుకోవాలంటే మొదటిసారిగా చెక్కతో పెన్సిల్‌ తయారుచేసినదెవరో గుర్తు తెచ్చుకోవాలి. 'హైమెన్‌ లిప్‌మ్యాన్‌' అనే వ్యక్తి. తను చేసిన పెన్సిల్‌పై ఈయన మార్చి 30నే పెటెంట్‌ హక్కు తీసుకున్నాడు. అందుకే ఆ రోజు పెన్సిల్‌ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మొదటిసారిగా 1858లోనే ఈయన పెన్సిల్‌ వెనుకే రబ్బరును జోడించి సరికొత్త పెన్సిల్ని తయారు చేశాడు.

* నిజానికి పెన్సిళ్ల వాడకం మొదలైంది 1565కు ముందేనట. అప్పట్లో ఇంగ్లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో గ్రాఫైట్‌ గనులు ఉండేవి. స్థానికులు ఆ గ్రాఫైట్‌ ముక్కలతో గొర్రెలపై గుర్తులు పెట్టుకునేవారు. అలా మెల్లగా ఆ రాయిలాంటి గ్రాఫైట్‌నే పెన్సిల్‌ ములుకుగా మార్చారు. ఈ కొత్త రాత సాధనం ప్రపంచమంతా పాకిపోయింది. తర్వాత గ్రాఫైట్‌తో చాలా ప్రయోగాలు జరిగాయి. గ్రాఫైటును పొడిచేసి దానికి కొన్ని పదార్థాలు కలిపి సన్నని కర్ర ముక్కల మధ్య పెట్టి, రాసుకోడానికి అనువుగా ఉండేలా హైమెన్‌ లిప్‌మ్యాన్‌ తయారు చేశాడు. ఆపై రంగు రంగుల పెన్సిళ్లు కూడా రూపొందాయి.

* పెన్సిల్‌ అనే పదం లాటిన్‌ భాష పెన్సిల్యూస్‌ నుంచి వచ్చింది. దీనర్థం 'లిటిల్‌ టేల్‌'. అంటే చిన్న తోక. మరి కొందరేమో ఫ్రెంచ్‌ పిన్‌సెల్‌ అనే పదం నుంచి వచ్చిందంటారు. దీనిర్థం బొమ్మలేసే చిన్న కుంచె అని.

* గురుత్వాకర్షణ శక్తి లేని చోట, నీటిలో కూడా పెన్సిల్‌ రాస్తుంది. అందుకే వ్యోమగాములు అంతరిక్షంలోనూ వాడతారు.

* ఐరోపాలో 1622 నుంచి, అమెరికాలో 1812 నుంచి పెన్సిళ్ల వాడకం మొదలైంది.

* మొదటి పెన్సిల్‌ ఫ్యాక్టరీని ఇంగ్లాండ్‌లో స్థాపించారు.

* ఒక్క పెన్సిల్‌ సుమారు 45 వేల పదాలు రాస్తుంది. సుమారు 56 కిలోమీటర్ల గీత గీస్తుంది.

* ఇంగ్లాండ్‌లో 'కుంబర్‌ల్యాండ్‌ పెన్సిల్‌ మ్యూజియం' ఉంది. ఇక్కడ అతి పెద్ద రంగుల పెన్సిల్‌ ఉంది. ఇది 26 అడుగుల ఎత్తు, 446.36 కిలోల బరువు ఉంటుంది.

* ఎమిలియో అనే ఆయన 1956 నుంచి 2013 వరకు 16,260 పెన్సిళ్లు సేకరించి రికార్డు కొట్టాడు.

* యూకేకు చెందిన ఎడ్‌ డగ్లస్‌ మిల్లర్‌ 1,061 అడుగుల పొడవైన పెన్సిల్‌ని తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.
  • ========================================= 
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .