Sunday, November 16, 2014

Sandwich day,శాండ్‌విచ్‌ దినము

  •  

  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు... ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.నవంబర్ 03 వ తేదీన.) - Sandwich day,శాండ్‌విచ్‌ దినము - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



ప్రతి సంవత్సరము నవంబర్ 03 వ తేదీన .
అయిదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో తినేయొచ్చు. శాండ్‌విచ్‌ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. కానీ దాని కథ మాత్రం అంత చిన్నది కాదు. దానికో చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ఎన్నో లెక్కలున్నాయి...
ఓ పక్కన స్నేహితులతో పేకాటలో నిమగ్నమైపోయాడు 'జాన్‌ మొంటగు'. మరో పక్కన ఆకలి దంచేస్తోంది. దాంతో తన దగ్గర పనిచేసే ఉద్యోగిని పిలిచి రెండు బ్రెడ్‌ ముక్కల మధ్యలో కాస్త మాంసాన్ని పెట్టి తీసుకురమ్మన్నాడు. ఏదో ఆటలోంచి లేవకుండా సులభంగా తినేయడానికి వీలుగా ఉంటుందని అలా తెమ్మన్నాడు. కానీ తిని చూస్తే దాని రుచి అతనికి చాలా నచ్చేసింది. అతడి స్నేహితులూ ఆ రుచికి ఫిదా అయిపోయారు. అలా 1760 లలో ఇంగ్లండ్‌లో మొదలైన శాండ్‌విచ్‌ రుచులు ఇప్పుడు ప్రపంచంలోని మారు మూల పల్లెలక్కూడా పాకాయి. రోజు రోజుకీ ఎన్నెన్నో కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి శాండ్‌విచ్‌ తయారీకి ప్రత్యేకమైన విధానం ఏమీ లేదు. రెండూ లేదా అంతకన్నా ఎక్కువ బ్రెడ్డు స్త్లెసుల మధ్య వేరు వేరు రకాల కూరగాయల ముక్కలూ, ఆకు కూరలూ, బటర్‌, చీజ్‌, జామ్‌, ఉడికించిన మాంసం, గుడ్డూ లాంటి వాటిని వేరు వేరు కాంబినేషన్లలో పెట్టి తయారు చేసుకోవచ్చు.

దేశాలూ ప్రాంతాలను బట్టి కూడా శాండ్‌విచ్‌లో వాడే పదార్థాలు మారిపోతుంటాయి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో శాండ్‌విచ్‌ను ఎక్కువగా మాంసాహార వెరైటీలతో చేస్తే మన దగ్గర శాకాహార రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. భారత్‌లో చాలామంది ఇష్టంగా తినేవాటిలో 'మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ టోస్టీ శాండ్‌విచ్‌' ఒకటి. ఉడికించి మసాలా వేసిన ఆలూ ముక్కలూ, క్యాప్సికమ్‌, బీట్‌రూట్‌, టొమాటో, కీరా ముక్కలను బ్రెడ్‌ స్త్లెసుల మధ్యలో పెట్టి ఆ పైన కొత్తిమీరా పుదీనా చట్నీ, చీజ్‌, వెన్న వేసి దీన్ని తయారు చేస్తారు. అమెరికాకు చెందిన 'ఫుడ్‌ సర్వీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌' ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో 10,090కు పైగా హాట్‌ శాండ్‌ విచ్‌ రకాలూ దాదాపు మూడువేల రకాల కోల్డ్‌ శాండ్‌విచ్‌లూ ఉన్నాయని తేలింది. ఇంకా ఈ లెక్కల్లోకి రానివి ఎన్నో. ఇక, హాట్‌ శాండ్‌విచ్‌లలో చాలామంది ఇష్టంగా తినేది గ్రిల్డ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌ అయితే, కోల్డ్‌ శాండ్‌విచ్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది ట్యునా సలాడ్‌ శాండ్‌విచ్‌.
మనందరికీ పరిచయం ఉన్న శాండ్‌విచ్‌ వెనుక ఇంత కథ ఉందనీ దాన్లో అన్నిరకాలున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!
లక్షల కోట్ల వ్యాపారం
శాండ్‌విచ్‌ను కనిపెట్టిన జాన్‌ మొంటగు బ్రిటన్‌లోని 'శాండ్‌విచ్‌' పట్టణ పరిపాలనా విభాగంలో కీలక నాయకుడు. అందుకే దానికా పేరొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు రూ.1.66 లక్షల కోట్ల శాండ్‌విచ్‌ వ్యాపారం సాగుతోంది. అందులో బ్రిటన్‌ వాటా 29,500 కోట్ల రూపాయలు.

బ్రిటన్‌కు చెందిన 'ది బ్రిటిష్‌ శాండ్‌విచ్‌ అసోసియేషన్‌(బీఎస్‌ఏ)' సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాండ్‌విచ్‌లు తినేవారి సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 'ఇంటర్నేషనల్‌ శాండ్‌విచ్‌ అండ్‌ స్నాక్‌ న్యూస్‌ మ్యాగజైన్‌'ను ప్రచురించేది కూడా ఈ సంస్థే. బీఎస్‌ఏ ప్రతి ఏటా శాండ్‌విచ్‌ డిజైనర్‌ పోటీలను కూడా పెడుతుంది.

1931లో మొదటిసారిగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో బేకన్‌ శాండ్‌విచ్‌ పదం చోటు సంపాదించింది.

తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని స్టార్‌ హోటళ్లలో శాండ్‌విచ్‌ ధరలను చూస్తే- అత్యంత ఖరీదైన క్లబ్‌శాండ్‌విచ్‌లను అమ్మే నగరాల్లో స్విట్జర్లాండ్‌లోని జెనీవా మొదటి స్థానంలో(రూ.2000) నిలిచింది. రెండో స్థానంలో (రూ.1800)ప్యారిస్‌ ఉంటే న్యూఢిల్లీ (రూ.515) 28వ స్థానంలో ఉంది.

శాండ్‌విచ్‌కి ఇంత ఆదరణ ఉంది కాబట్టే అక్టోబర్‌ నెల మొత్తాన్నీ అంతర్జాతీయ శాండ్‌విచ్‌ మాసంగా ప్రకటించారు. అంతేకాదు, నవంబర్‌ మూడో తేదీని కూడా 'శాండ్‌విచ్‌ డే'గా పిలుస్తున్నారు.

'లవ్‌ శార్నీస్‌' పేరుతో శాండ్‌విచ్‌ కోసం ఓ ఆప్‌ కూడా ఉంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన ఫోన్‌ జీపీఎస్‌ ద్వారా దగ్గర్లో శాండ్‌విచ్‌ దుకాణం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అయితే, ఈ ఆప్‌ దాన్లో నమోదు చేసుకున్న షాపుల వివరాలను మాత్రమే తెలుపుతుంది

  • Source : Eenadu news paper sunday 16/11/2014

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .