Monday, January 7, 2013

Iodine awareness day , అయోఢిన్ అవగాహనా దినోత్సవం

  •  
  •  
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (అక్టోబర్ 21) -అయోడిన్‌- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

 ప్రతిసంవత్సరము అక్టోబర్ 21
అయోడిన్‌ :
ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర ఎంతో కీలకమైంది. అయోడిన్‌ లోపం వల్ల గర్భస్రావాలు, మృత శిశువుల జననాలు, బరువు తక్కువ పిల్లల జననాలు, బుద్ధి మాంద్యం, తెలివి తక్కువగా ఉండటం, నేర్చుకోవడంలో ఇబ్బంది, శక్తిహీనత, కండరాల సమస్యలు, వినికిడి లోపాలు, అలసట, గాయిటర్‌ వ్యాధి వస్తాయి. మనకు రోజుకు 150 మైక్రో గ్రాముల అయోడిన్‌ మాత్రమే అవసరం. అయోడిన్‌ సముద్రం నుంచి లభించే ఆహార పదార్థమైన నాచు, గుళ్ల చేపల్లో ఉంటుంది. మన దేశంలో అయోడిన్‌ లోపం సమస్యలకు నివారించడానికి 'అయోడైజ్డ్‌ ఉప్పు' పంపిణీ చేస్తున్నారు. అందరూ ఈ ఉప్పు ఉపయోగిస్తే మంచిది.

అయోడిన్ ఒక మూలకం. ఇది సూక్ష్మ ఆహార పదార్థం. సముద్రం నుంచి లభించే ఆహార పదార్థాలయిన సముద్రపునాచు, గుళ్ళ చేపల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలలో అయోడిన్ ఆయా ప్రాంతాలలో భూమిలో ఉండే అయోడిన్‌ను బట్టి ఉంటుంది. కొండ ప్రాంతాలలో, ఎక్కువగా వరదలు వచ్చే మైదాన ప్రాంతాలలో భూమిలో అయోడిన్ తక్కువగా ఉంటుంది. మన దేశంలో హిమలయాల నుంచి నాగా కొండల వరకు విస్తరించిన జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచలప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్‌లను వాతావరణ అయోడిన్ కొరత రాష్ట్రాలు అంటారు. మిగతా రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో అయోడిన్ కొరత వాతావరణముంది. మన దేశంలో 197 జిల్లాలలో ఎక్కువగా అయోడిన్‌లోపపు వ్యాధులతో బాధపడుతున్నారు. మన దేశంలో 16.7 మిలియన్ల ప్రజలు అయోడిన్ లోపపు వ్యాధులతో బాధపడుతున్నారు.

అయోడిన్ లోపం- ఆరోగ్య సమస్య---
* గర్భవతులలో: వీరిలో అయోడిన్ లోపముంటే గర్భస్రావాలు, మృతశిశువుల జననాలు, బరువు తక్కువ పిల్లల జననాలు, పుట్టిన పిల్లలలో శిశు మరణాలు, పుట్టిన పిల్లలో బుద్ధిమాంద్యం, క్రెటిన్స్‌గా పుట్టడం (అంటే థైరాయిడ్ హార్మోను తక్కువగా ఉండుట), మెల్లకన్నుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది.
* చిన్నపిల్లలలో: వీళ్లల్లో అయోడిన్ లోపముంటే, పిల్లలలో తెలివి తక్కువగా ఉండటం, నేర్చుకోవడంలో ఇబ్బంది, పెరుగుదల లోపాలు, శక్తిహీనత, కండరాల సమస్యలు, పక్షవాతం, వినికిడి లోపాలు, మాట్లాడటంలో లోపం సంభవించవచ్చు.
* పెద్దవాళ్ళలో: వీరిలో కూడా అయోడిన్ లోపముంటే శక్తిహీనత, అలసట, వంధ్యత్వంతో బాధపడతారు.

మనిషికి రోజుకెంత అయోడిన్ కావాలి?---
ప్రతి మనిషి అయోడిన్ లోపం లేకుండా జీవించాలంటే, రోజుకు 150 మైక్రోగ్రాముల అయోడిన్ మాత్రమే అవసరం. అంటే మనకు రోజూ కావలసిన అయోడిన్ గుండుసూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

గాయిటర్ వ్యాధి---
మనం కొందరిలో గొంతుపై బంతిలాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీనినే గాయిటర్ అంటారు. ఈ గాయిటర్‌కు కారణం అయోడిన్ లోపమే.
మన దేశంలో క్రీ.శ.1962లో జాతీయ గాయిటర్ నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రస్తుతం దీనిని జాతీయ అయోడిన్ లోప వ్యాధుల కార్యక్రమంగా నడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మన దేశంలో అయోడిన్ లోపం తగ్గించటానికి మన ప్రభుత్వం ఉప్పు ద్వారా అయోడిన్ అందరికీ అందిస్తోంది. ఇప్పుడు మన దేశంలో అయోడిన్ కలిపిన ఉప్పు ప్రతి చోటా దొరుకుతుంది. దీనికి ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంది.అందరూ అయోడిన్ కలిపిన ఉప్పు వాడండి. మీరు ఉత్సాహంగా ఉండండి. చురుకుగా, ఉత్సాహంగా, తెలివిగా ఉండే భావితరాలు మన దేశంలో జన్మించేలా చూడండి. ఇది మనందరి బాధ్యత.

Courtesy with --- డాక్టర్ ఆరవీటి రామయోగయ్య @ఆంధ్రభూమి దిన పత్రిక  అద్దివారం 15 ఏప్రిల్ 2012
=====================
Visit My Website - > Dr.seshagirirao.com/

1 comment:

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .