Saturday, February 26, 2011

Cancer Day , ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం , క్యాన్సర్ డే



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 04) Cancer Day , ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం , క్యాన్సర్ డే గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

ప్రపంచములో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మూడు ముఖ్యరోగాలలో క్యాన్సర్ ఒకటి . ఆ వ్యాధి గురించి తలచు కోవడానికే భయం వేస్తుంది . ఆ వ్యాధికి గురైన రోగి అవస్థ చూసునపుడు పగవాడికి కూడా ఇటువంటి కస్టము రాకూడద్నిపిస్తుంది . అయినా మన చేతిలో ఏమీ లేదు ... ఎందుకు వస్తుందో అంతుపట్టని వ్యాధి ఈ క్యాన్సర్ .

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూ.హెచ్.ఓ) వారి అంచనా ప్రకారం 2005-2015 మధ్యకాలంలో 84 మిలియన్ ప్రజలు క్యాన్సర్ బారినపడి మరణిస్తారు. ఇది గుర్తించని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఎగెనెస్ట్ క్యాన్సర్’ వారు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవంగా జరిపి ప్రజలలోకి క్యాన్సర్ అవగాహనను తీసుకెళ్లేందుకు కృషి ప్రారంభించారు.
ఆ సంస్థలో మొత్తం 100 దేశాలు, క్యాన్సర్ వ్యాధి మీద యుద్ధం చేస్తున్న 350 సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీరందరూ మీడియా ద్వారా క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని ప్రచారం చేయాలని, పాలనా విధానాలలో క్యాన్సర్ వ్యతిరేక చర్యలు చేపట్టేల ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటం కూడా వారు చేస్తున్న పని. 2006 నుండి ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే గా జరుపుతూ తగిన చర్యలు చేపట్టారు.

ఇటీవల మనదేశంలో ప్రభుత్వం చేపట్టిన క్యాన్సర్ వ్యతిరేక చర్యలలో భాగంగా పొగాకు వాడకంపై యుద్ధం ప్రకటించడం, సిగరెట్ తయారీ కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇవ్వటాన్ని నిషేధించాయి. అదే విధంగా బీడీ కట్టల మీద పుర్రె గుర్తు ముద్రణతో క్యాన్సర్ భయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళగలిగారు. మత్తు పానీయ ప్రకటనల మీద నిషేధం తీసుకువచ్చారు. మనదేశంలో నోటి క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవటానికి కారణం గుట్కా వాడకమే.
భారత్‌దేశంలో 80 శాతం మందికి క్యాన్సర్‌ ముందుగా గుర్తు పట్టలేకపోతున్నామని, క్యాన్సర్‌పై అవగాహన పెరగాలన్నారు. లేటు వయస్సు వార్కి ఎక్కువగా క్యాన్సర్‌ వస్తోందని, నేడు లైఫ్‌స్టైల్‌ మారిందని, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం వల్ల 40శాతం మందికి క్యాన్సర్‌ వస్తుందన్నారు.

అసలు క్యాన్సర్‌ అంటే ఏమిటి?
సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. క్యాన్సర్‌ మహమ్మారి ఏటా రూ.41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో(WHO) వెల్లడించింది. క్యాన్సర్‌ అనేది ఏ వయస్సు వారి కైనా రావచ్చును. ఆడవారికి, మగవారికి కూడ రావచ్చును. శరీరములో ఏ భాగానికి అయినా రావచ్చును. ఉదా : నోరు, గొంతు, ఎముకలు, రొమ్ము, చర్మము మున్నగునవి .

పేర్ల వెనక కథ

ఇంగ్లీషులో 'టూమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors).

నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.

* అవి నిరవధికం (unlimited)గా, దూకుడుతనం (aggressiveness)తో పెరిగిపోవు,
* అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue),
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize),

కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes)లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

ట్యూమర్లు రకాలు

* మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors): ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
* బినైన్ ట్యూమర్లు (Benign tumors): ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉంది, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.

కేన్సరు సప్త సూచికలు

* మానని పుండు (Ulcer),
* అసహజమైన రక్త స్రావం (Bleeding),
* పెరుగుతున్న కంతి (Tumor),
* తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice),
* మలంలో రక్తం, మలవిసర్జన లో మార్పు,
* తగ్గని అజీర్తి, మింగుట కష్టం,
* పుట్టుమచ్చలలో మార్పు,

కాన్సర్ ఉత్పరివర్తనాలు

* వైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం,
* ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.

పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు.

కేన్సర్‌ రకాలు

* కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ మరియు, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంధులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.

* సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.

* లూకీమియా (Leukemia): గ్రీకు భాషలో 'లూకోస్‌' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.

* లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంధులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి.

అవయవాలు

కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ - పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి.

లక్షణాలు

వృద్ధుల్లో వచ్చే కాన్సర్‌ వల్ల నొప్పి నీరసం, ఆకలి లేకపోవటం, ఆయాసమే కాక ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఇలా ఉంటాయి.

తల, మెడ కాన్సరు : మాననిగాయం, గొంతుల్లో, నోటిలో నొప్పి. ఆహారం మింగటంలో కష్టం. స్వరంలో మార్పు, మెడపై వాపు.

ఊపిరితిత్తుల కాన్సరు : దగ్గు, కళ్లెలో రక్తం, ఊపిరితిత్తుల చికాకు, ఛాతీ నొప్పి తరచుగా శ్వాసకోశ వ్యాధి గ్రస్థత.

అన్న వాహిక, జీర్ణకోశ కాన్సరు : మింగటంలో కష్టం. ఆకలి లేకపోవటం, బరువును కోల్పోవటం, రక్తాన్ని వాంతి చేసుకోవటం, వాంతులు కావటం, యాస్పిరేషన్‌ న్యూమోనియా.

పెద్దపేగు-గుదము-ఆసనం కాన్సరు : జీర్ణకోశ పేగుల కింది మార్గం - (పెద్దపేవు-గుదం- అసనం) పేగుల అలవాట్లలో మార్పులు, మల బద్ధకం/విరేచనాలు, గుదము నుండి రక్తస్రావం లేక రక్తంతో కూడిన స్రావం స్రవించడం, ఆసనంలో నొప్పి, గాలిపోవుట, ఉదరంలో గడ్డ, పేగుల్లో ఆటంకం.

జననాంగ, మూత్రాశయం కాన్సరు : రక్తహీనత, జ్వరం, బరువును కోల్పోవడం.

గర్భకోశ ముఖద్వారం కాన్సరు : యోని నుండి రక్తస్రావం నడుంనొప్పి, ఉదరంలో నొప్పి.

ప్రోస్టేటు కాన్సరు : త్వరగా మూత్రం విసర్జించాలన్న భావన ఎక్కువ కావటం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం చుక్కలు, చుక్కలుగా రావటం, ధారతగ్గటం మొదలగునవి.

మూత్రాశయ కాన్సరు : నొప్పి లేకుండా మూత్రంలో రక్తం రావటం, ఉదరంలో నొప్పి, మూత్రం నిలచి పోవటం.

రొమ్ము కాన్సరు : రొమ్ములో చేతితో తాకి గుర్తించగల గడ్డ, చనుమొనల నుండి రక్తంస్రావం, చంకలో గడ్డ.

రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్‌ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.

కేంద్రనాడీ మండల కాన్సరు : తలనొప్పి వాంతులు, మూర్ఛలు, చూపుతగ్గుట, స్వర్శ కోల్పోవుట లేక కండరాల బలహీనత, మూత్ర కోశ ప్రేవుల ధర్మాల్లో మార్పులు, స్పృహలో మార్పులు.

వ్యాధి నిర్ధారణ పద్ధతులు

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.


చికిత్స :

నివారణ
క్యాన్సర్ కస్ట నస్టాల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పిచాలి , కాన్సర్‌ వ్యాధిని నయం చేయడానికి శస్త్ర చకిిత్స, రేడియేషన్‌, కీమోథెరపీ అవసరం .
ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలి.

చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్‌ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్‌ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

క్యాన్సర్‌ను చంపే పసుపు : పసుపు కు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌ కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.

Courtesy with Dr. Ramanarayana MD(gen)@(ఆంధ్రజ్యోతి 29.10.2009)



  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .