Monday, November 1, 2010

World Sight Day , ప్రపంచ దృస్టిదినోత్సవం




అంధత్వ సమస్యలపై ప్రజలకు జాగ్రుతపరిచే ఉద్దేశం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరము అక్టోబర్ రెండో గురువారము World Sight Day , ప్రపంచ దృస్తిదినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినది . 1998 నుండీ ఈ దినం జరుపూ ఉన్నారు . 2010 సం.లో అక్టోబర్ 14 న జరుగును .

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు . కంటిచూపుతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు . కనుసన్నల్తో ఆ ప్రపంచం లో బతికేయవచ్చు . అదే చూపు లోపిస్తే అంతా అంధకారమే . జీవితం చీకటిమయం అయిపోతుంది . రంగుల ప్రపంచము సుదూరతీరాలకు వెళ్ళిపోతుంది . ఆ కటిక చీకటిలో ఆ తీరము ఎప్పటికీ అందకుండానే మిగిలిపోతుంది. అందుకే ఆ చూపును ఎప్పుడూ పదిలం గా కాపాడుకోవాలి .

అంధత్వము అంటే పూర్తిగా గాని పాక్షికం గా గాని చూడలేని స్థితి. కంటి చూపు (Vision) పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం (Blindness) అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును.

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం (వరల్డ్‌ వైట్‌ కేన్‌ డే (అక్టోబర్‌ 15)): అంధులకు దారి చూపేది, ఆస రాగా నిలిచే ది తెల్లటి చేతికర్ర. ఈ తెల్లటి చేతికర్ర ను అంధత్వానికి సంకేతంగా గ్రహించి ఐక్య రాజ్య సమితి 1981 వ సంవత్స రంలో అక్టోబర్‌ 15 వ తేదీని ‘వరల్ట్‌ వైట్‌ కేన్‌ డే’గా గుర్తించింది

దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి." పూర్తి అంధత్వం (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు కాంతి ఉన్నదీ లేనిదీ మరియు ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన అంధత్వం (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మరియు ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.

అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం (Legal blindness) అంటారు. ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా దృష్టి లోపం అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం దృష్టి మాంద్యం (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.

కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత (Colour Blindness) అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి (Night Blindness) అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ Magnitude and causes of visual impairment యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.
అంధత్వానికి కారణాలు : అంధత్వం చాలా కారణాల మూలంగా కలుగుతుంది:
  • 1. కంటి వ్యాధులు

దృష్టి మాంద్యం ఎక్కువగా వ్యాధులు మరియు పౌష్టికాహార లోపం మూలంగా కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంధత్వం కలగడానికి ముఖ్యమైన కారణాలు:

* శుక్లాలు (Cataracts) (47.8%),
* గ్లకోమా (Glaucoma) (12.3%),
* యువియైటిస్ (Uveitis) (10.2%),
* (Age-related Macular Degeneration) (AMD) (8.7%),
* ట్రకోమా (Trachoma) (3.6%),
* కార్నియల్ తెలుపుదనము (Corneal opacity) (5.1%),
* మధుమేహం (Diabetic retinopathy) (4.8%) మరియు ఇతర కారణాలు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాల మూలంగా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ముఖ్యంగా కనిపిస్తుంది. అంచనావేసిన 40 మిలియన్ అంధులలో 70- 80 శాతం మందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును. పాశ్చాత్యదేశాలలో కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది. మరొక కారణం నెలలు నిండకుండా పుట్టే పిల్లలలో కలిగే రెటినోపతీ.

  • 2. కల్తీ సారా

అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. మిథనాల్ (Methanol) ఇథనాల్ (Ethanol) తో ఖల్తీ చేయయడం ... ఇది త్రాగుబోతు శరీరంలో ఫార్మాల్డిహైడ్ (Formaldehyde) .. ఫార్మిక్ ఆమ్లం (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం సంభవించవచ్చును. ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన సారాలో ఉంటుంది.

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం, World Whitecane day

కంటి సమస్యల్లో శుక్లాలు (కాటరాక్ట్‌), ట్రాకోమా, రిఫ్రాక్టివ్‌ ఎర్రర్‌, లో-విషన్‌, గ్లాకోమా, డయాబెటిక్‌ రెటీనోపతీ మొదలైనవి ప్రధానమైనవి. కంటికి సంబంధించిన ఏ సమస్య అయినా అశ్రద్ధ చేస్తే ప్రమాదమని గుర్తించాలి. కంటిచూపు మందగించినా, కళ్ళనుండి నీరు కారుతున్నా, కళ్ళు ఎర్రబడినా, పుసులు కారుతున్నా, తలనొప్పి వస్తున్నా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి. సొంత వైద్యాలతో సరిపెట్టకుండా మంచి ఐ స్పెషలిస్టును సంప్రదించడం శ్రేయస్కరం. దురదృష్టవశాత్తూ మసకవెల్తురులో, ప్రయాణాల్లో చదవకూడదు లాంటి అతి మామూలు, కనీస నియమాలను కూడా ఖాతరుచేయక కంటి సమస్యలను కొనితెచ్చుకునేవారున్నారు.

అంధత్వ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే 50 ఏళ్ళ క్రితం ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్లమంది అంధులు. ప్రస్తుతం ప్రతి ఐదు సెకన్లకీ ప్రపంచంలో ఒక వ్యక్తికి చూపు పోతోందని, ప్రతి ఐదు నిమిషాలకి ఓ చిన్నారి చూపు కోల్పోతున్నదని అంచనా. అలాగే ఏటా దాదాపు డెబ్భయ్‌ లక్షలమంది అంధులుగా మారుతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు 32 కోట్లమంది అంధులు లేదా దృష్టిలోపాలతో బాధపడ్తున్నారు. వారిలో నాలుగున్నర కోట్లమంది గుడ్డివారు కాగా 27.5 కోట్లమందికి కంటి సమస్య. అవగాహన లేని కారణంగా చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లు కూడా అంధత్వాన్ని తెచ్చిపెడ్తున్నాయి. స్త్రీలకంటే పురుషులే కంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారని, అంధులలో రెండింట మూడువంతులు స్త్రీలు, పిల్లలే ఉన్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. వృద్ధాప్యం మీదపడినకొద్దీ కంటి సమస్యలు అధికమవడం సాధారణం. కాగా, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా దృష్టిలోపాలకు కారణమౌతున్నాయి. 90 శాతం అంధులు పేద దేశాల్లో నివసిస్తున్నారు. నిజానికి అంధులలో దాదాపు 80 శాతం మందికి చూపు తెప్పించగలిగే అవకాశం వుంది. ఆర్థిక ఇబ్బంది కారణంగా అంధుల శ్రేయస్సు కుంటుపడుతోంది.

అంధులకోసం ప్రవేశపెట్టాల్సిన పథకాలగురించి, అలాగే నిరుపేదలకు సైతం కంటిచికిత్స చేయించాల్సిన అవసరంగురించి, ఆరోగ్యశాఖా మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులను ప్రేరేపించడం కూడా ఈరోజు కర్తవ్యాల్లో ఒకటి. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కళ్ళు ఎంత ముఖ్యమో, వాటినెలా కాపాడుకోవాలో అనే అంశాలపై చర్చిస్తారు. మన చూపును కాపాడుకోవడంతోబాటు, పిల్లలు కంటికి సంబంధించిన అనారోగ్యాలతో పుట్టకుండా జాగ్రత్తతీసుకోమని హెచ్చరిస్తారు. స్కూలు, కాలేజి పిల్లలకు కంటిచూపుకు సంబంధించిన విషయాలపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. పుట్టుకతో అంధులై, జీవనపర్యంతం చీకటితో సావాసం చేస్తున్నవారిని దృష్టిలో వుంచుకుని దాన్ని నివారించే దిశగా ఆలోచిస్తున్నారు. 2020 నాటికి లోకంలో అంధత్వం అనేది లేకుండా చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం. దీని ఆవస్యకతను నలుగురికీ చాటి, ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని ప్రచారం చేస్తున్నారు.

''ది రైట్‌ టు సైట్‌'' అనేది ఈసారి ప్రపంచ ప్రపంచ దృష్టి దినోత్సవ నినాదం. అంతే కదా మరి. మనకు కేవలం జీవించే హక్కు మాత్రమే కాదు, ఆనందంగా జీవించే హక్కు వుంది. అంధకారంలో సంతోషానికి తావెక్కడిది? పుచ్చపూవులాంటి కాంతిపుంజాలకు ఆస్కారమేది? ప్రపంచ ఆరోగ్య సంస్థ కంటి చూపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఆసక్తికరమైన ప్రదర్శనలు నిర్వహించబోతోంది. అలాగే విషన్‌ 2020ని మరింత ప్రచారం చేసేందుకు గాలాటూర్‌ ను ఏర్పాటు చేస్తోంది. కంటి ప్రాముఖ్యత సామాన్యులకు కూడా తెలీడంకోసం ప్రముఖులచేత ప్రచారం చేయించడం కద్దు. అలాంటి ప్రకటనలు, ప్రోగ్రాములను జాతీయ, అంతర్జాతీయ టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యేలా చూస్తారు.

గుడ్డివారికి లేదా, దృష్టిలోపాలతో బాధపడ్తున్నవారికి వ్యక్తిగతంగా లేదా సంస్థపరంగా మీరేమైనా సాయం చేయదల్చుకుంటే విషన్‌ 2020 వెబ్‌సైట్‌ హోమ్‌ పేజ్‌ చూడండి. అలాగే కంటి డాక్టర్లు, మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, ఐ డోనర్లు, ఇతరత్రా కళ్ళకు సంబంధించిన సంస్థలు కూడా సహాయం అందించదల్చుకుంటే కూడా ఈ సైట్‌ చూడొచ్చు. విషన్‌ 2020 వెబ్‌సైట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుతో సహా కళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురిస్తుంది.

మనిషి తల్చుకుంటే సాధ్యంకానిదేమీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. ప్లేగు, మసూచి, కుష్టు లాంటి అనేక భయానక వ్యాధులు మచ్చుకైనా లేకుండా చేశాడు. ఇంకెన్నో నయం కావనుకున్న అనారోగ్యాలు నామరూపాల్లేకుండా పోయాయి. కొన్ని వేల జబ్బులతోబాటు టీబీ, క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన రోగాలకు మందు కనిపెట్టాడు. పోలియో దాదాపుగా అంతరించిందనే చెప్పాలి. తీవ్ర దృష్టిలోపాలను సర్జరీద్వారా సవరిస్తున్నారు. మరి పుట్టు గుడ్డితనం, లేదా తర్వాత ప్రాప్తించే అంధత్వాలు లేకుండా చేయడం ఎంతమాత్రం అసాధ్యం కాదు. ఎందరో కంటి నిపుణులు ఇప్పుడీ విషయంమీద గట్టిగా కృషిచేస్తున్నారు. కనుక, 'విషన్‌ 2020' ఆశయం నెరవేరుతుందని, అంధత్వం లేని వెలుగుల సమాజం వస్తుందని ఆశిద్దాం. ఇక చీకట్లు మాయమై, అమావాస్యనాడు కూడా చంద్రుడు కనిపిస్తాడు. అందరి కళ్ళూ పండు వెన్నెల్లా, మల్లెపూవుల్లా విరుస్తాయి, మెరుస్తాయి. చీకటి దు:ఖం లేకుండా అందరూ ఆనందంగా నవ్వుల జల్లులు కురిపించే రోజు ఇంకెంతో దూరంలో లేదు.

కంటి... సంరక్షణ

* ఎప్పుడూ కూడా నెంబరులేని కళ్ళజోళ్ళను ధరించకండి.
* చలువ అద్దాలు వాడేటప్పుడు అవి అల్ట్రావైలెట్‌ కిరణాలనుంచి కాపాడేవిధంగా ఉండాలి.
* వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కంట్లో నలుసు పడినప్పుడు చేత్తో నలపడంకానీ, రుద్దడం గానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళికణాలు ,సూక్ష్మక్రిములు కంటిలోకి చేరి అలర్జీలేదా ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే ప్రమాదముంది.
*వంట చేసేటప్పుడు , వేడి అవిరి కళ్ళకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో ధుమ్ము పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతి వేళ్ళతో నీటిని కళ్ళమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి.
* కళ్ళను రోజుకు వీలైనంత వరకు రెండుసార్లు కన్నా ఎక్కువ కడుగవద్దు.
* కళ్ళలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు ఏదో తమకు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి.
* మీచూపు సరిగ్గా కనపడపోయినా దృష్టిలో ఏదైనా లోపం ఉన్నా డాక్టరు సలహాలేకుండా మీకంట్లో రోజ్‌ వాటర్‌ను వేయకండి.
* సంవత్సరంలో ఒక సారైనా తప్పని సరిగా పూర్తి కంటిపరీక్షలు జరిపించుకోండి.
* కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
* కంటికి ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరం
* కళ్ళు అందంగా కనపడాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి.
* కంటి అందాన్ని పెంచేదుకు కంటి మేకప్‌ చాలా అవసరం. గుర్తింపు పొందిన కంపెనీ ప్రోడక్టులనే వాడాలి లేదంటే వేరే వాటి వల్ల కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది.
* కాటుక దిద్దిన కళ్ళ చూపు చాలా శృంగార భరితంగా ఉంటుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు చేతివేళ్ళు శుభ్రంగా లేకపోతే క్రిములు కంట్లోకి ప్రవేశించి లోపలిభాగాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల చేతులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
* కనురెప్పల వెంట్రులకు నలుపు రంగుతో సింగారిస్తే కళ్ళు పెద్దవిగా చాలా అందంగా ఉంటుంది. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
* కళ్ళకు మంచి షేప్‌ రావడం కోసం ఐ లైనర్‌ను వాడతారు .దీన్ని వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.
* కంటి మేకప్‌ అవసరం తీరిన తర్వాత తొలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళకు ప్రమాదం జరగవచ్చు. కొందరు మహిళలు మేకప్‌ తొలిగించడం కోసం దూదిని నీటిలో ముంచి శుభ్రం చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదు.
*కంటి మేకప్‌ను తొలిగించడానికి ప్రత్యేకమైన ఆయిల్‌ను మాత్రమే ఉపయేగించాలి. లేక పోతే బేబీ ఆయిల్‌ వాడవచ్చు
  • ========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .