Wednesday, September 8, 2010

సంస్కృత భాషాదినోత్సవం , Sanskrit Language Day





  • సంస్కృత భాషాదినోత్సవం--ఆగస్టు .24.

భాషా వైవిధ్యాలను పరిరక్షించడం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 21వ తేదీన మాతృ భాషా దినోత్సవం జరుపుకోవాలని కోరుతూ క్రీస్తుశకం 1999 నవంబర్ 17న ‘యునెస్కో’ ఆమోదించిన తీర్మానంలో ఈ భాషా వైవిధ్యం గురించి ప్రస్తావించారు. భాషా వైవిధ్యాలను భగ్నం చేయడానికి వివిధ దేశాల నిరంకుశ పాలకులు చేసిన యత్నాలు ‘మాతృభాషల’ను పరిరక్షించాలన్న తపనకు నేపథ్యంగా నిలిచాయి. మాతృభాష లక్ష్యం మాతృ సమాజంలోని వివిధ భాషల వైవిధ్యాలను నిలబెట్టడమే! ఇలా భాషా వైవిధ్య (లింగ్విస్టిక్ డైవర్సిటీ) పరిరక్షణకు కృషిచేస్తున్న వారికి, సంస్థలకు కొన్ని అంతర్జాతీయ సంస్థలు బహుమతులు సైతం ఇస్తున్నాయట. మాతృభాషను రక్షించుకొనడం వెనుక వాస్తవ లక్ష్యం తమ జాతీయ మాతృసంస్కృతిని రక్షించుకోవడమని కూడ ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ ‘విద్యాశాస్త్ర సాంస్కృతికవ్యవహారాల మండలి’-యునెస్కో-ప్రవచించింది, ప్రచారం చేస్తోంది!

ఒకే దేశంలో, ఒకే జాతిలో ఇన్ని భాషలు ఉండడం మన దేశంలో తప్ప ప్రపంచంలోని మరే దేశంలోను సంభవించని సహజ పరిణామం! భారత జాతి అనాదిగా వైవిధ్యాలను పరస్పర వైరుధ్యం లేని రీతిలో పెంపొందించడంవల్లనే మన దేశంలో ఇన్ని ప్రాంతీయ భాషలు అంకురించగలిగాయి , పల్లవించి, పరిమళించగలిగాయి. సృష్టి గత వైవిధ్యాలను సమాజగతం చేసుకున్న జాతి మనది
భారత దేశంలో గల ప్రాచీన భాషలలో అతి పురాతనమైన భాష సంస్కృతం. 'జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల'- అన్ని ప్రధాన భాషలకూ సంస్కృతమే తల్లి వంటిదని మన పెద్దలు వక్కాణించి చెప్పినమాట. సంస్కృతం అంటే ఒక చోట చేర్చబడినది, బాగా సంస్కరించబడినది, ఎలాంటి లోపాలూ లేనిది, అనంతంగా విస్తరింపబడినది అని అర్థం. దీనికి దేవభాష, అమరభాష అని మరి రెండు పేర్లు కూడా ఉన్నాయి. మన ప్రాచీన సాహిత్యమంతా ఈ భాషలోనే నిక్షిప్తమై ఉంది. ఈ భాషకు వాడే లిపిని దేవనాగరలిపి అని, బ్రాహ్మీలిపి అని అంటారు. ఇది ఇండో ఆర్యన్‌ భాషాకుటుంబానికి చెందినది అని అంటారు పెద్దలు. దక్షిణాసియా, తూర్పుఆసియా, ఆగ్నేయాసియాలపై సంస్కృతం వెదజల్లిన సంస్కృతీ ప్రభావం బలంగా కనబడుతుంది. భారతీయ భాషలన్నిటి పైనా, నేపాల్‌ భాషపైనా దీని ప్రభావం విశేషంగా ఉంది. అందుకే సంస్కృతం ఇండోఇరానియన్‌ భాషాకుటుంబానికి చెందినది అని అంటారు. ఇండో ఇరానియన్‌ భాషలకు ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం పుట్టిల్లు. కనుక ఇండోఇరానియన్‌ భాషలను ఇండో యూరోపియన్‌ ఉపభాషా కుటుంబాలుగా లెక్కిస్తారు కనుక సంస్కృతాన్ని ఇండోయూరోపియన్‌ భాషా కుటుంబానికి దగ్గర సంబంధాలున్న భాషగా చెబుతారు. ప్రాచీన పెర్షియన్‌, అఫ్గనిస్థాన్‌ భాషలకు కూడా సంస్కృతానికి బాగా దగ్గ‌రి పోలికలుంటాయని భాషావేత్తలు చెబుతారు. సంస్కృత పదధ్వనులు మరీముఖ్యంగా స్లావిక్‌, బాల్టిక్‌ భాషలకు, గ్రీక్‌ భాషకు ఎంతో దగ్గరి పోలికలుంటాయని అంటారు. సంస్కృతాక్షరాలు లాటిన్‌ అక్షరాలకు చాలా సన్నిహితంగా ఉంటాయని కూడా వారు చెబుతుంటారు. హిందూ మతానికి చెందిన సమస్త వాఙ్మయం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధమత గ్రంథాలు కూడా దాదాపు సంస్కృతంలోనే కనబడతాయి. అతి పురాతన సంస్కృత భాషా సాహిత్యానికి మూలరూపం రుగ్వేదంలో కనబడుతుంది. ఇది క్రీ.పూ. 1500 సంవత్సరానికి చెందినది. ఇది ఉమ్మడి పంజాబ్‌ ప్రాంతంలో లభ్యమైంది. ఈ గ్రేటర్‌ పంజాబ్‌ దేశ విభజనకు ముందున్న పంజాబ్‌ అన్నమాట. ఇది ఆఫ్ఘనిస్థాన్‌కు దాదాపు సరిహద్దు ప్రాంతంలాంటిది. సంస్కృతం అందించిన వేదాల వల్లే అతిపురాతన కాలానికి వేదకాలమనే పేరు వచ్చింది. క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన పాణిని అష్టాధ్యాయి పేర 8 అధ్యాయాలతో సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. ఈయన వ్యాకరణం రాసేలోపు సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు పుట్టాయి. వేదకాలం నాటికి పుస్తక రచన అనేది లేదు. అందువల్ల వేదాలను యథాతథంగా బట్టీయం వేయడం ద్వారా కాపాడుకున్నారు అప్పటివారు. ఇందువల్ల వాటి ఉచ్ఛారణతో సహా సాహిత్యం మనకు అందివచ్చింది. సంస్కృత భాష ద్వారా భారతీయులకే సొంతమనదగిన వేదాలు, వేదాంతాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక విషయాలు, తాత్విక అంశాలు, మత, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు, మంత్రాలు, తంత్రాలు, నాటకాలు ఎన్నో సమాజానికి అందివచ్చాయి. కనుక వీటినిబట్టి సంస్కృత భాష పుట్టుకను అంచనావేయాల్సివస్తే అది కనీసం క్రీ.పూ. 1500నాటిదని నిర్థారణగా చెప్పవచ్చు.

వేదవాఙ్మయం తరువాత సంస్కృత భాషలో వచ్చిన మార్పులకు అద్దం పట్టేవి ఉపనిషత్తులు. భారతీయపురాణాలైన రామాయణ, మహాభారతాలలో కనిపించే భాష మరింతగా మార్పుచెందింది. పురాణాలలో కనిపించే భాషలో ప్రాకృత శబ్దాల ప్రభావం కలిగిన సంస్కృతం కనబడుతుంది. పాణిని వ్యాకరణం వచ్చిన తరువాత సంభవించిన మార్పులు వీటిలో ప్రస్ఫుటంగా కనబడతాయి. సంస్కరించబడిన భాష నుంచి పక్కకు తప్పుకున్న భాషాపదాలు ప్రాకృత పదాలుగా పేరుతెచ్చుకున్నాయి. ఈ పదాల వాడకం రామాయణ, మహాభారతాలలో బాగా కనబడతాయి. సహజత్వం చెడని సంస్కృత భాషను ఆర్షభాషగా వింగడించడం అప్పుడే ప్రారంభమైంది. సంస్కృతంలోనూ మాండలికాలు ఉన్నాయి. పశ్చిమోత్తరి, మధ్యదేశి, పూర్వి, దక్షి మాండలికాలుగా వాటిని విభజించారు. వీటిలోనూ పశ్చిమోత్తరి మాండలికంలో సంస్కృతం స్వచ్ఛతను ఎక్కువగా నిలబెట్టుకుందని చెబుతారు. ఒకనాడు దేశమంతటా మారుమోగిన భాష సంస్కృతం. వేదాలలోనే కాదు, జన వ్యవహారంలోనూ బాగా వినియోగంలో గల భాష సంస్కృతం. వాల్మీకి, వ్యాసుడు, భాసుడు, బాణుడు, భారవి, భామహుడు, మాఘుడు, శ్రీహర్షుడు, శూద్రకుడు, అశ్వఘోషుడు, హాలుడు, కాళిదాసు వంటి వారు తమ రచనలతో సంస్కృతభాషను సుసంపన్నం చేశారు. సంస్కృతమే లేకపోతే మనం ఈనాడు సగర్వంగా చెప్పుకునే రామాయణం, భారతం, భాగవతం, రఘువంశం, అభిజ్ఞానశాకుంతలం, మేఘసందేశం, కుమారసంభవం, మృచ్ఛకటికం, కిరాతార్జునీయం, నాగానందం, హర్షనైషథం, విక్రమార్కచరిత్ర, శుకసప్తశతి, గాధాసప్తశతి, ప్రతాపరుద్రీయం, చరకసంహిత, పంచతంత్రకథలు, హితోపదేశ కథలు, కథాసరిత్సాగరం, కౌటిల్యుని అర్థనీతి, భర్తృహరి సుభాషితాలు, ఏవీ మనకు అందివచ్చేవికావు. అలాగే విష్ణుసహస్రనామాలు, లలితా సహస్రనామాలు, దేవీ స్త్రోత్రాలు, ఆదిశంకరుని భజగోవిందం, జయదేవుని గీతగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, బ్రహ్మసూత్రాలు, నారదభక్తిసూత్రాల వాత్సాయనుని కామసూత్రాల వంటివెన్నో మనకు లేకుండా పోయేవి. ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి లేకుండా పోయేది. మన రాజనీతి, అర్థనీతి, సమాజనీతి అంతా సంస్కృతం వల్లే మనదాకా వచ్చాయి. ఆదిదేవుళ్ళేకాదు, ఆదిమ మానవుల చరితలు సైతం సంస్కృతం తెలియకుంటే తెలిసే అవకాశమేలేదు.

ఆ తరువాతి కాలంలో సంస్కృతం పుస్తకాలకే పరిమితమై వ్యవహారంలో లేకుండా పోయింది. లౌకికభాషగా మిగలలేదు కనుక దాన్ని కొందరు మృతభాషగా పరిగణించారు. సంస్కృతం జీవద్భాష అని ఘనంగా వాదించే వారెలా ఉన్నారో మృతభాష అని ఘంటాపథంగా వాదించేవారూ అంత గట్టిగానే ఉన్నారు. పరమ ప్రాచీనమైన భాషగా పేరొందిన లాటిన్‌లాగే సంస్కృతం కూడా వాడేవాడు లేక చచ్చిపోతోందని పోలక్‌ అనే భాషావేత్త వ్యాఖ్యానించాడు. రాజభాషగా ఒక వెలుగు వెలిగిన సంస్కృతం క్రమంగా పోషకులులేక, వాడకందారులులేక క్షీణించిపోవడం ప్రారంభించింది. భూమిపొరలలో శిలాజాలు ఉన్నట్టే ఇతర భాషలలో సంస్కృత భాషావశేషాలు మిగిలి ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 100కోట్ల పైచిలుకు ఉంటే అందులో 14,135 మంది మాత్రమే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడేవారున్నారంటే సంస్కృతభాష వ్యవహారంలో ఎంతగా లుప్తమైపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రాంతీయ భాషలలో చాలా సందర్భాలలో వాడుకోడానికి సొంత పదాలు లేవు. తెలుగులో అయితే ఈ దుస్థితి మరింత ఎక్కువగా కనబడుతుంది.

ఈనాడు ,ఆంధ్రప్రభ, భూమి, వార్త, జ్యోతి, ఉదయం, సూర్య, సాక్షి, ప్రజాశక్తి, జనత, విశాలాంధ్ర, సాయంకాలం, నాయిక, వసుంధర, చెలి, నవ్య ఇవి మనం నిత్యం అనే వినే వార్తాపత్రికల పేర్లు. అసలు వార్తాపత్రిక అన్న మాటే సంస్కృతం.

దూరదర్శన్‌, సప్తగిరి, తేజ, భక్తి, సంస్కృతి, రక్షణ, ఆరాధన వంటి టివి పేర్లలోనూ ఉన్నది సంస్కృతమే!

తిరుమల, తిరుపతి, వేంకటేశ్వరుడు, పద్మావతి, శ్రీదేవి, భూదేవి, గోవిందరాజు, వరాహస్వామి, సుప్రభాతం, సర్వదర్శనం, ప్రత్యేకదర్శనం, మహాద్వార ప్రవేశం, లఘుదర్శనం, శ్రీఘ్రలఘుదర్శనం, బ్రహ్మోత్సవాలు, ఆనందనిలయం, వైకుంఠద్వారదర్శనం, ధ్వజస్తంభం, జయ, విజయులు, పూజ, అర్చన, అర్చనానంతరసేవ, ఆరాధన, మంగళహారతి, తీర్థం, ప్రసాదం, శఠగోపం, ఉచితభోజనం, వసతి గృహం, అతిథిగృహం లాంటి మాటలు గుళ్ళూగోపురాలకు వెళ్లినపుడు వినబడుతునే ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటీ తెలుగుపదం కాదు. వాటికి ప్రత్యామ్నాయ తెలుగుపదమూలేదు. అయినా మనం వాటిని వాడడానికి ఇబ్బంది పడడంలేదు. అవి అర్థంకాకుండానూ పోవడంలేదు.

శాంతి-భద్రతలు, సభాసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, శాసనసభ, విధానపరిషత్‌, సహనం, సంయమనం, ప్రమాదం, అన్యాయం, అబద్ధం, అసత్యం,అక్రమం, అనాగరికం, సామాజిక న్యాయం, భాష, జాతి, నీతి, ప్రజారాజ్యం, రాష్ట్రసమితి, వామపక్షాలు, సిద్దాంతరాద్ధాంతాలు, తర్జన భర్జన, సింహగర్జన, దండోర, ఆరోగ్యశ్రీ, జాతీయ ఉపాధి పథకం, ప్రజాంకిత యాత్ర, జనచైతన్యయాత్ర, శిలాఫలకం, ప్రారంభోత్సవం, శంకుస్ఠాపన, యథతథంగా, యథాపూర్వస్థితి, వాతావరణం, యధావిధిగాd, పర్యావరణం, కాలుష్యం, ద్విచక్రవాహనాలు, జాతీయ రహదారి, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం ఇవి తెల్లవారి లేస్తే పత్రికలలో కనిపించే పదాలు. వీటిలో ఏ ఒక్కటీ తెలుగుకాదు. వాటికి సరైన తెలుగుపదం కూడా లేదు. యథతథంగా అన్న మాటకు ఉన్నది ఉన్నట్టుగా అని తెలుగులో అనే సదుపాయం ఉన్నా ఆ తెలుగు పదం వినేవాడికీ, అనేవాడికీ రుచించదు. అందుకే చాలా మంది జర్నలిస్టు మిత్రులు సంస్కృత పదాల అర్థాలు తెలియకపోయినా వాటిని వాడుకోవాలని ఆరాటపడుతుంటారు. ఏది తెలుగో, ఏది సంస్కృతమో తెలియక కొంత, ప్రయోగం చేయాలన్న దుగ్ధ కొంత కలసి తప్పుడు పదాలు సృష్టిస్తుంటారు. తెలుగు సంస్కృతం మీదే ఎక్కువగా ఆధారపడే భాషే అయినా, ఆ రెండిటికీ తల్లిdబిడ్డల సంబంధం ఉన్నా సంస్కతం నుంచి ఒకపదం, తెలుగు నుంచి ఒక పదం తీసుకుని కలగాపులగం చేస్తే అది దుష్ట సమాసం అంటూ పెద్దలు ఛీ కొడతారు. పదసాంకర్యం చేయవద్దని అంటారు. కొందరు ఎవరైనా పెద్దలు పండితులు చమత్కారం కోసం అలాంటి దుష్టపదాలను తయారుచేస్తే వాటిని అలాగే వాడుకోవాలి తప్ప కొత్తగా మీరాపని చేయకండి అంటూ పరవస్తు చిన్నయ్యసూరి లాంటి పండితులు, వ్యాకర్తలుసలహా ఇస్తారు. భాషాసాంకర్యం చేయవద్దంటారు. కానీ విచిత్రంగా అధికారం చెలాయించే పెద్దలే ఫిల్మోత్సవ్‌ వంటి పదాలు సృష్టించారు. అదేమంటే అదో ప్రయోగమన్నారు. సంస్కృతం అమరభాష అని ఏ ముహూర్తంలో అనిపించు కుందో కాని అది దేవుని సుప్రభాతాలకు, అర్చనలకు, వైదికవిధికి, స్త్రోత్రాలకు, స్త్రోత్రపాఠాలకే పరిమితమైంది. ఎక్కువగా గ్రంథాలయాలకు, పండితుల మేధోగ్రంథాలయాలకు పరిమితమైంది. ఇంటర్మీడియెట్‌లో మాతృభాష తెలుగును నాశనం చేసి సంస్కృతాన్ని రెండోభాషగా ప్రోత్సహిస్తున్న కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థులకు 98శాతం మార్కులు ఇప్పిస్తున్నాయే తప్ప విద్యార్థుల నోటి నుంచి ఒక్క సంస్కృతం ముక్కయినా వచ్చేలా చేయలేకపోతున్నాయి. మార్కులు వస్తాయి. ర్యాంకులు చెడిపోకుండా ఉంటాయి అని తల్లిదండ్రులు కూడా మౌనం వహిస్తున్నారే తప్ప తెలుగును మరిచిపోతున్నాడని అనుకోడంలేదు. ఈ విధంగా పెద్దలు, పిల్లలు కూడా తల్లి బిడ్డలయిన సంస్కృతానికి, తెలుగుకు కూడా యథాశక్తి ద్రోహం చేస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ధర్మశాస్త్రాలు, పురాణతిహాసాలు, నోములు, వ్రతాలు వగైరాలన్నీ నిండిఉన్న సంస్కృతాన్ని నేర్చుకుందాం. మన సనాతనభాషను సంప్రదాయమంత పదిలంగా కాపాడుకుందాం.

మూలము : డా. వంగల రామకృష్ణ @ ఆంధ్రప్రభ దిన పత్రిక .

ఈ సంస్కృత భాషా క్షేత్రం లో వేదాలు ,ఉప వేదాలు , బ్రహ్మసూత్రాలు , ఉపనిషత్తులు , తిహాసాలు , పురాణాలు , కావ్యాలు , నాటకాలు , వీటితో వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదము , వినోదము కోసం నాట్యము , ఆహ్లాదం కోసం సంగీతము , ప్రపంచ రహస్యాలను తెలుసుకునేందుకు గణితము , భౌతికశాస్త్రము , జీవ విజ్ఞానశాస్త్రము , రసాయన శాస్త్రము , జ్యోతిస్యము , ఖగోళ శాస్త్రము , ఇలా ఎన్నో పుట్టుకొచ్చినవే .
  • ==================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .