కోటి ఆశల కలలు 'కళ్ల'లో నింపుకుని, రంగురంగుల 'హరివిల్లు'ల్లా 'బెదురుకన్నుల లేడి పిల్ల'ల్లా అచ్చం ఒకప్పటి 'నీ' రూపంలా విజ్ఞాన సౌధంలో అడుగుపెడితే, వారిని స్వాగతిస్తూ, స్నేహ హస్తాన్ని కదా నీవు అందించాలి. కానీ మన సంస్కృతి కాని 'రాగింగ్'కు బానిసలై, శాడిజాన్ని జత చేర్చుకుని, ఆ లేత పాదాల కింద 'ముళ్లు' పరవడం అవమానంతో దహించుకు పోయేలా చేయడం, ఇది నీకిప్పుడు ఆనందాన్నే కలిగించి వుండొచ్చు. కానీ, నీ ఈ పైశాచిక క్రీడకు 'మూల్యం' లెక్క కట్టలేము .
ర్యాగింగ్ హబ్‌గా దక్షిణ భారతదేశం
ప్రపంచవ్యాప్తంగా ర్యాగింగ్ కోరలున్నా, దక్షిణ ఆసియాలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీసు ఒలంపిక్స ప్రారంభమైనప్పుడు ఎనిమిదో సెంచరీ ఎ.డిలో ర్యాగింగ్ మొగ్గ తొడిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ క్యాంపులో ఇది కొత్త పుంతలు తొక్కింది. 20వ శతాబ్దం వచ్చేసరికి పశ్చిమ దేశాల్లో హింసరూపం తీసుకుంది. బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో విదేశాల నుండి ఈ సంస్కృతి మన దేశంలోకి ప్రవేశించింది. ఆర్మీ క్యాంపుల్లోనూ వేర్వేరు రూపాల్లో దీన్ని అవలంభించేవారు. 1970వ సంవత్సరం వరకు పరిస్థితి సాధారణంగా ఉన్నా 1980 తర్వాత మీడియా విస్తరణతో ర్యాగింగ్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. సినిమాల్లో ఆడపిల్లల్ని ఆటపట్టించే దృశ్యాలు, మగవాళ్లని ధీరోదాత్తులుగా చూపేవి. మగపిల్లలు సహజంగానే దీనికి ఆకర్షితులయ్యేవారు. కొత్తగా కళాశాలల్లో చేరి వేధింపులకు గురైనవారు మరుసటి సంవత్సరం అంతకంటే తీవ్రంగా ర్యాగింగ్‌కు పాల్పడడం పరిపాటిగా మారింది. విస్తృతంగా ప్రయివేటు ఇంజరీంగ్, మెడికల్ కళాశాలలు ప్రారంభం కావడంతో ఇది మరింత దారి తప్పింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం 'ర్యాగింగ్ హబ్' గా పేరుగాంచింది.
వికృత చేష్టల వెనుక...
ఇతరులను హింసించి ఆనందించే వ్యక్తిత్వాన్ని ఓ రకంగా మానసిక దౌర్బల్యంగా చెప్పాలి. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, చుట్టుపక్కల వారి ఆదరణ పొందని వ్యక్తులే తమ ఆధిక్యాన్ని చాటుకోడానికి ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడతారనే అభిప్రాయం ఉంది. అన్ని సందర్భాల్లోనూ ఇది నిజం కాకపోవచ్చు. సహచర బృందం నుండి అందే ప్రోత్సాహం, ఆ వయసులో సహజంగా ఉండే దుందుడుకుతనం వల్ల వచ్చే 'మాస్ హిస్టీరియా' విద్యార్థులు రెచ్చిపోవడానికి కారణమౌతోంది. మిగిలిన వారికంటే తాము తక్కువ కాదని నిరూపించుకోవడానికి కొందరు విజృంభిస్తున్నారు. సరదా కాస్తా శృతి మించి ఉన్మాదంగా మారుతోంది. హింసకు ప్రేరేపిస్తోంది.
సీనియర్లు, జూనియర్ల నడుమ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు తగిన పరిస్థితులను కల్పించడమే దీని వెనుక ఉద్దేశ్యమని చాలా మంది చెప్పుకొంటున్నా, శృతిమించిన ఆగడాలతో విద్యార్థులు కళాశాల పేరు చెబితేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరు శాశ్వతంగా అంగవైకల్యానికి గురి కావడమో, విద్యాసంవత్సరాన్ని కోల్పోయి కెరీర్‌కు దూరమవడమో జరుగుతోంది.
ర్యాగింగ్‌లో భాగంగా దృఢమైన వస్తువులతో చితకబాదటం, ప్రమాద భరితమైన పనులు చేయమని బెదిరించడం, దుస్తులు తొలగించమనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసహజ లైంగిక క్రియలకు పాల్పడమని సూచించడం వంటి జుగుప్సాకర పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల బాధితులకు మానసిక వేదన (మెంటల్ ఏగోనీ) అధికమౌతుంది. విపరీతమైన భయం, మానసిక అలజడితో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. కొందరు పిచ్చివారైపోతున్నారు. వెనకబడిన ప్రాంతాలు, గ్రామాల నుండి వచ్చిన వారు ఎక్కువ వేధింపులకు గురవుతున్నారని అంచనా.
అనేక సందర్భాల్లో ర్యాగింగ్ కేసులు వెలుగులోకి రావడం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం ర్యాగింగ్ వల్ల ఏటా పది మంది మృత్యువాత పడుతున్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడడం లేదా మనోవ్యాధులకు గురికావడం సంభవిస్తోంది. ర్యాగింగ్ పైన చైతన్యానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. చట్ట ప్రకారం రిజిస్టరైన 'సేవ్' సంస్ఠ (సొసైటీ ఎగెనెస్ట్ వయొలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్) ఈ అంశంలో చెప్పుకోదగ్గ కృషి చేసింది. అక్టోబర్ 11న 'యాంటీ ర్యాగింగ్ డే' గా పరిగణిస్తున్నారు.
ర్యాగింగ్ నిరోధక చట్టం
1997లో తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటి సారిగా ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే ఏడాది ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడే వారిని విద్యా సంస్థ నుంచి బయటకు పంపేయవచ్చు. ఆరునెలల జైలు శిక్ష, మరే విద్యా సంస్థలోనూ చేరకుండా నిషేధం విధించవచ్చు. ర్యాగింగ్‌కు పాల్పడినవారి ఫలితాలు నిలిపివేయడం, స్కాలర్‌షిప్పులు, ట్రావెల్ కన్సెషన్ లాంటి సౌలభ్యాలను దూరం చేయడం, కళాశాలల్లో నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొనకుండా నియంత్రించడం వంటి చర్యలను సూచించింది. ర్యాగింగ్‌కు విధించే శిక్షలేమిటో విద్యార్థులందరికీ తెలిసేలా బ్రోచర్లు, పోస్టర్లు ముద్రించాలని సూచించింది. కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్‌కు పాల్పడేవారి ఫొటోలు ఉంచాలని చెప్పటమే కాదు, భవిష్యత్తు నాశనం అవుతుందన్న స్పృహ వారిలో కలిగేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరింది.
క్రిమినల్ కేసులు బనాయిస్తే వీసాలు, పాస్‌పోర్టులు లభించటం కష్టమౌతుందన్న స్పృహ కలిగించాలని సూచించింది.
ఈ సూచనల్లో ఏ ఒక్కటి పాటించిన దాఖలాలు లేవు. పోస్టర్ల ప్రచారాన్ని మాత్రం అన్ని రాష్ట్రాలు నిర్వహించాయి.
సుప్రీం హెచ్చరికలు
ర్యాగింగ్ కేసులు విచారణ చేపట్టిన అపెక్స కోర్టు - సీబీఐ మాజీ డైరెక్టర్ రాఘవన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆదేశించింది. దీని తీవ్రత దృష్ట్యా భారత శిక్షా స్మృతిలో ర్యాగింగ్‌ను ప్రత్యేకంగా చేర్చాలని రాఘవన్ కమిటీ ప్రతిపాదించింది. కేంద్రం, రాష్ట్రం, ఆయా కళాశాలల స్థాయిలో యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఏర్పాటుకు, బాధితులు తమ ఆవేదనను తక్షణం పంచుకోడానికి వీలుగా టోల్‌ఫ్రీ నెంబరు సౌకర్యం కలిగించడం, ప్రాథమిక స్థాయిలో కౌన్సిలింగ్ ఏర్పాట్ల వంటివి రాఘవన్ కమిటీ ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి. ఎన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాల్లో ర్యాగింగ్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించింది.
మే 16, 2007లో సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నిషేధించడమే కాదు, ర్యాగింగ్‌కు పాల్పడేవారిపైన తక్షణం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) రూపొందించాలని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సంఘటనల దరిమిలా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోమారు కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో పెరిగిపోయిన మద్యపానమే ర్యాగింగ్ మహమ్మారికి కారణమని తేల్చి చెప్పి తదనుగుణమైన చర్యలను ఆదేశించింది.
అన్ని రాష్ట్రాల్లో కదలిక...
హిమాచల్ ప్రదేశ్‌లో అమీన్ కచ్రూ మరణానికి కారకులైన నలుగురు విద్యార్థులపై ... హత్య, యాంటీ ర్యాగింగ్ ఆర్డినెన్స్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ని తొలగించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న విద్యా సంవత్సరం నుండి ర్యాగింగ్‌ను మానవ హక్కుల అంశంలో పాఠ్యాంశంగా చేర్చాలని ఆ రాష్ట్రం యోచిస్తోంది. విద్యారంగ నిపుణులందరితో చర్చించి ప్లస్-1, ప్లస్-2లలో ఒక భాగంగా చేర్చాలని ఎన్.సి.ఇ.ఆర్.టి ఇప్పటికే సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులను అరెస్టు చేశారు. వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సంఘటన చోటు చేసుకున్న వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌పై ఎటువంటి చర్య తీసుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు దీనిపై వివరాలు పంపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై 11 మంది విద్యార్థులను అరెస్టు చేసి ఆనక బెయిల్‌పై విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాధారణ దుస్తులు ధరించిన (మఫ్టీ) పోలీసుల సహకారం తీసుకుని నిందితులను పట్టుకొంటామని, ఇందులో భాగస్వాములైన వారిని కళాశాల నుంచి పంపేస్తామని హెచ్చరించింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఎంబీఏ విద్యార్థి ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‌లో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులను విద్యా సంస్థ నుంచి తొలగించారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ర్యాగింగ్ నిరోధంపై కొంత కదలిక వచ్చింది. కళాశాలల్లో డిటన్షన్ సెంటర్ల ఏర్పాటుకు సంసిద్ధమౌతున్నాయి.
ఇంకా ఏం చేయాలి?
ర్యాగింగ్ సంఘటన చోటు చేసుకోగానే, అది బయట ప్రపంచానికి తెలిస్తే తమ కళాశాలకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతూ, దాచి పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అది కళాశాల ప్రాంగణంలోనో, హాస్టల్లోనో కాదు. ఇందులో తమ బాధ్యత లేదని తప్పుకోచూస్తున్నాయి. విద్యా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందిని బాధ్యులను చేస్తే తప్ప ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఒకసారి ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే అది మిగతావారికి హెచ్చరికగా మిగులుతుంది. భయంతో కొద్దిగా వెనకడుగు వేస్తారు. హాస్టల్ వార్డెన్లు రాత్రి సమయాల్లో ఆకస్మిక తనిఖీల్లాంటివి చేయాలి. కళాశాలలో చేరిన రోజునే ర్యాగింగ్‌కు పాల్పడమని అందరి దగ్గరా లేఖలు రాయించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సంతకాలు చేయించుకోవాలి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే నిర్భయంగా ఫిర్యాదు చేయగల వాతావరణం కళాశాలల్లో, విద్యాసంస్థల్లో ఉండాలి. ఇందుకు సిబ్బంది దోహదం చేయాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తారు.
కొత్త విద్యార్థులు రాగానే సీనియర్ల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అందరూ సన్నిహితంగా మెలిగేలా కొన్ని క్రీడల పోటీల్లాంటివి నిర్వహించవచ్చు. అప్పుడే విద్యార్థుల్లో హింసాత్మక ప్రవృత్తికి కొంతవరకు అదుపు చేయవచ్చని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఫ్రెషర్లను గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకి సీనియర్‌ని నాయకునిగా నియమించాలి. ఇవన్నీ ర్యాగింగ్ విజృంభణను కొంతవరకు నియంత్రిస్తాయి. ర్యాగింగ్ బెడదతో విద్యార్థులు బెదిరిపోయి చదువు మానేస్తున్నారు. విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారు. ఉన్నత విద్యా రంగంలో ఒక కళాశాల నుండి వేరొక కళాశాలకు బదిలీ అయి చదువుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.ర్యాగింగ్ దుష్పరిణామాలను మీడియా కూడా విస్తృత ప్రచారంలోకి తేవాలి. తమ ప్రవర్తన ఎంత హేయమైందో, అది సాటివారిని ఎంత ఇబ్బందులపాలు చేస్తుందో విద్యార్థులందరికీ అవగతమౌతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అందరూ పూనుకుంటే ఈ జాఢ్యాన్ని తరిమికొట్టడం అసాధ్యం కాదు.
మీకు తెలుసా?
ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం - ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులు కింద పేర్కొన్న వివిధ రకాల శిక్షలకు లోనయ్యే అవకాశముంది.
ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను బర్తరఫ్ చేయడమేకాక, నేర తీవ్రతనుబట్టి వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడానికి సైతం అవకాశం ఉంది.
విద్యా సంస్థల లోపల /బయట ర్యాగింగ్ చేసినా, అందులో పాల్గొన్నా లేక ప్రేరేపించినా, ప్రచారం చేసినా శిక్షార్హులవుతారు.
ఒక విద్యార్థిని అక్రమంగా నిర్భంధించినా, గాయపరిచినా రెండేళ్ల జైలుశిక్ష లేదా అయిదువేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ర్యాగింగ్ వల్ల విద్యార్థి మరణించినా లేక ఆత్మహత్యకు పాల్పడినా యావజ్జీవశిక్ష / పదేళ్ళ జైలు శిక్షతో పాటు యాభైవేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
ర్యాగింగ్ నేరం రుజువై, కొంతకాలం శిక్ష అనుభవిస్తే విద్యాసంస్థ నుంచి బర్తరఫ్ చేయాలి. శిక్ష ఆరునెలలు దాటినట్లయితే ఆ విద్యార్థిని తిరిగి ఎక్కడా చేర్చుకోరాదు.
ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు వస్తే - పరిశీలించి, ప్రాథమిక ఆధారాలున్నట్లయితే ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని సస్పెండ్ చేయాలి.
ర్యాగింగ్ జరిగినపుడు - సంబంధిత విద్యాసంస్థ అధికారులు ఏ కారణంగా అయినా చర్య తీసుకోకపోయినా, ఆ అపరాధాన్ని ప్రేరేపించినట్లు భావించినా వారు కూడా శిక్షార్హులవుతారు.
ర్యాగింగ్ పేరిట విద్యార్థిని వేధించినా, ఇబ్బంది పెట్టినా, చిన్నబుచ్చుకునేలా చేసినా వారికి 6 నెలలు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఒక విద్యార్థికి తీవ్రమైన దెబ్బలు తగిలినా, అపహరించినా, బలవంతంగా ఎత్తుకుపోయినా, అత్యాచారం లేదా అసహజ నేరాలకు పాల్పడినా, ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, పదివేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు.
ఒక విద్యార్థిపై దౌర్జన్యం చేసినా, బలప్రయోగం కావించినా ఏడాదిపాటు జైలుశిక్ష లేదా రెండువేల జరిమానా, లేదా రెంటినీ విధించవచ్చు.--- సీపీఎస్.
----------------------------------------------
Courtesy : Praja Shakti Daily newspaper
- ===============================================
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .