Thursday, February 25, 2010

భారత్ - గణతంత్ర దినోత్సవం,Republic Day


మనము ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవము (Republic Day) జరుపు కుంటాము . ఇది దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్ రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగమూ తయారైనది , అలా తయారయిన రాజ్యాంగము ఎప్పుదో ఒకప్పుడు మొదలిపెట్టాలి కదా, మనము అలా మొదలు పెట్టిన రోజే .. 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము జనవరి 26 న పండగ జరుపుకుంటున్నాము .

మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది.
---------------------------------------------------------------------------------------------
ఘనతంత్రం మన గణతంత్రం -- ఆంద్రప్రభ దిన పత్రిక సౌజన్యము తో :


అహింసాయుత పోరాటాలూ, సత్యాగ్రహ వుద్యమాలే, నిరాయుధ సమరాలుగా కొనసాగిన భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం, తరతరాలుగా పరాధీనమైన భరతమాత బానిసత్వపు సంకెళ్లు తెంచి, చివరికి బాపూజీ చలవ వల్ల, 1947 ఆగస్ట్‌ 15 వ తేదీన సంపూర్ణ స్వేచ్ఛని సంతరించిపెట్టింది.

కాని, మనకి ఆనాటికింకా, సమగ్రమైన, సులిఖితమైన రాజ్యాంగ నిబద్ధత లేదే? అసలు మనం ఏ మార్గం అవలంబించాలి? కాపిటలిజమా? కమ్యూనిజమా? కాదు కాదు, సోషలిజమా? ఉఁహూఁ, అదీకాదు. అలాగైతే, మరి, ఏ దారి పట్టాలి? సార్వభౌమికమా? రాచరికమా? నియంతృత్వమా? సైనిక పరిపాలనమా? అవీకావు మరి!

ఇన్‌ సైడ్‌ స్టోరీ

దాదాపు 200 వంత్సరాల సుదీర్ఘకాలం, అస్తవ్యస్తమైన దేశంలోని శాంతికాముకులూ, స్వేచ్ఛా ప్రియులైన భారతీయులకి ప్రజాస్వామ్యమే సరైన వ్యవస్థ! కాని, దానికి సమానత్వం కూడా జోడించాలి. అందుకో నిర్దిష్టమైన రాజ్యాంగం రూపొందించుకోవాలి! ఎప్పుడో 1935 లో తిరగరాసిన సామ్రాజ్య వాద భారతీయ చట్టం (కొలొనియల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌, 1935) ప్రకారం, భారతదేశం ఒక 'డొమెనియన్‌' మాత్రమే! అంచేతే, స్వాతంత్య్రానంతరం సైతం, దానికి, జార్ట్‌ దేశాధినేత (హెడ్‌ ఆఫ్‌ స్టేట్‌) గా ఎర్ల్‌మౌంట్‌ బాటన్‌, గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. అయినా, మనదైన శాశ్వతమైన, సుస్థిరమైన రాజ్యాంగం (కాన్ట్సిట్యూషన్‌) నిర్మించాలనే సత్సంకల్పంతోనే, 1947 ఆగస్ట్‌ 29 వ తేదీన డా|| అంబేద్కర్‌, ఛైర్మన్‌గా, ఒక డ్రాఫ్ట్‌ కమిటీని నియమించారు.


శాంతి, అహింసల స్వచ్ఛ శ్వేత కపోతమా? వందకోట్ల ప్రజానీక ప్రవిమల ప్రజాస్వామ్య సంభరితమా? కుల, మత, వర్ణ వర్గాతీత, అలౌకిక (సెక్యులర్‌)సామ్యవాద సంపాతమా? ఏ అగ్ర దేశాల సముదాయాలతోనూ, వుగ్రవాద ముఠాలతోనూ ప్రమేయంలేని, అలీన (నాన్‌ ఎలైన్డ్‌) విధాన సంభరితమా? అనేకానేక సంస్కృతుల, నాగరికతల, భాషల, ''భిన్నత్వంలో ఏకత్వం'' (యూనిటీ ఇన్‌ డైవర్సిటీ) సంతరించుకున్న విభిన్న ప్రాంతాల సంఘటితమా? సమగ్ర లిఖిత రాజ్యాంగబద్ధ (కంప్రెహెన్సివ్‌ రిటెన్‌ కాన్సిట్యూషన్‌) పరిపాలనా సంచలితమా? త్రివర్ణ జాతీయ పతాకాచ్ఛాదిత స్వేచ్ఛా, స్వాతంత్య్ర సంచరితమా?


ఏదైనా మన మహాభారత దేశం, అత్యున్నత ప్రమాణాలతో 1950 జనవరి 26 వ తేదీన నెలగొన్న, 'సావరిక డెమోక్రెటిక్‌ రిపబ్లిక్‌' అంటే, సర్వసత్తాక ప్రజాస్వామ్యం.

అంచేత మనం, 60 సంవత్సరాల నుంచీ, జనవరి 26 న, గణతంత్ర దినోత్సవం, అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ, ఇప్పుడు 61 వ రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌కి సంసిద్ధులమౌతూ, దేశ సమగ్రతకి సమాయత్తమౌతూ, సత్సంకల్ప నిబద్ధులమౌతున్నాం.


భారతరాజ్యాంగ నిర్మాణంలో...

అలా. డా|| అంబేద్కర్‌ ఆధ్వర్యంలోని కమిటీ, అహరహం శ్రమించి, ఒక లిఖిత రాజ్యాంగ ప్రతి (డ్రాఫ్ట్‌ కాన్ట్సిట్యూషన్‌) తయారుచేసి, 1947 నవంబర్‌ 4 వ తేదీన, అసెంబ్లీకి సమర్పించారు. 166 రోజుల పాటు, సామాన్య పౌరులు కూడా పాలుపంచుకోడానికి వీలైన అసెంబ్లీ సమావేశాలలో, భారత రాజ్యాంగ వ్రాత ప్రతికి ఎన్నో సుదీర్ఘమైన చర్చలలో, సవివరమైన సవరణలు ప్రతిపాదించి, మార్పులూ, చేర్పులూ చేసిన తరువాత, ఇంగ్లీష్‌లోనూ, హిందీలోనూ, విడివిడిగా రాసిన రెండు లిఖిత రాజ్యాంగ ప్రతులమీద, 1950 జనవరి 24 వ తేదీన, 308 మంది అసెంబ్లీ మెంబర్స్‌ తమ ఆమోద సూచకంగా సంతకాలు చేశారు.

స్వాతంత్య్ర సమరయోధుల సగౌరవ పురస్సరంగా...

ఆ తరువాత, 2 రోజులకి, అవ్యాజ దేశభక్తి పరాయణులైన అలనాటి స్వాతంత్య్ర సమరయోధుల సమ్మాన పురస్పరంగా, 1950 జనవరి 26 వ తేదీన, భారత రాజ్యాంగం, భరతావనికి మార్గదర్శకమైన సముదాత్త చట్టంగా, ప్రత్యేక ప్రతిపత్తి సంతరించుకుంది. దాంతో, భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్యంగా అవతరించింది. అసలు జనవరి 26 వ తేదీనే, భారత స్వాతంత్య్ర దినంగా పరిగణించాలని ఆశించారా అసమాన స్వాతంత్య్ర యోధులు. కాని, 1950 లో, అదే జనవరి 26 న బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షుడిగా, భారతదేశం 'సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌' గా ఆవిర్భవించి, ప్రపంచ ప్రజాస్వామ్యదేశాలకి ఆదర్శప్రాయంకావడంతో, వాళ్ల ఆనందానికి అవధులేలేకుండా పోయాయి.


విశ్వజనామోదంగా...

'భారత రాజ్యాంగం' విషయంలో, అమెరికన్‌ కాన్ట్సిట్యూషనల్‌ అధారిటీ, గ్రాన్‌విల్లీ ఆస్టిన్‌ అందించిన లిఖిత పూర్వకమైన ప్రశంశా పరంపరలు శిలాక్షరాలలా కలకాలం నిలిచిపోతాయి. డాక్టర్‌ అంబేద్కర్‌ రూపుదిద్దిన భారత రాజ్యాంగం, ''ఫస్ట్‌ అండ్‌ ఫోర్‌మోస్ట్‌ సోషల్‌ డాక్యుమెంట్‌'' అని అభివర్ణిస్తూ, ''సామాజిక విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ధ్యేయంతో, లేదా ఆ విప్లవ ఫలితాలు సాధించడానికి అవసరమైన అనుకూల పరిస్థితులని కల్పించే ప్రయత్నంలో, భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలు సూటిగానే దోహదం చేస్తున్నాయి... ముందుగా వూహించిన విధంగా కాకుండా, రాజ్యాంగాన్ని 'ఫ్లెక్సిబుల్‌'గా, రాష్ట్రాల హక్కులని కూడా పరిరక్షించేలా, అసెంబ్లీ నెలగొల్పిన రాజ్యాంగ వ్యవస్థలోని మూడు యంత్రాంగాలూ (మెకానిజమ్స్‌) వ్యవహరిస్తున్నాయి. ఏ దేశంలోనైనా, ఫెడరలిజమ్‌, బ్రిటిష్‌ పార్లమెంటరీ వ్యవస్థ, సంయుక్తంగా రాజ్యాంగ ప్రాతిపదికని రూపొందించిన సందర్భాలలో, సవరణ విధానాలకంటే, ఎంతో మెరుగ్గా, ఈ మూడు పనిచేస్తున్నాయి... ఇటీవల సంవత్సరాలలో, కొందరు పౌరులకి తమ రాజ్యాంగ ప్రతి రూపకర్తలనీ, రాజ్యాంగ వ్యవస్థాపకులనీ దుయ్యబట్టడమే. ఫ్యాషన్‌గా మారిపోయింది. 1950 నుంచి దేశంలోని పరిణామాల వల్ల నిరాశా, నిస్పృహలకి లోనైన ఈ వ్యక్తులు, ఈ రాజ్యాంగం, సక్రమంగా పనిచెయ్యడం లేదని చెబుతూ, రాజ్యాంగం మార్చాలని పట్టుబడుతున్నారు. అలాంటి ఆలోచనలూ, అభిప్రాయాలూ, పెడతోవ పట్టించేవని నా వుద్దేశ్యం. పౌరులూ, ప్రజలూ ఎన్నుకుని వాళ్ల చేతుల్లో అధికారాలు పెట్టడంతో, 'నాయకులు'గా ఎదిగిన వ్యక్తులు, సరైన రీతులలో సంచరించకపోవడం వల్లే, రాజ్యాంగాలు స్తబ్ధమైపోతున్నాయి. ఏదేమైనా, 1787 లో ఫిలడల్ఫియాలో తొలిసారిగా రాజ్యాంగం ఏర్పరిచిన తరువాత, రూపొందిన అత్యుత్తమ రాజకీయ సాహసిక ప్రక్రియ, భారత రాజ్యాంగమే'' అన్నారు, గ్రాన్‌విల్లీ ఆస్టిన్‌.సకలదేశాధి నేతలకీ ప్రమోదంగా...

ఇండియన్‌ రిపబ్లిక్‌ అవతరించిన తరుణంలో, 1955 ఏప్రిల్‌ నుంచి 1957 జనవరి దాకా, బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా పనిచేసిన, సర్‌ ఆంథోనీ ఈడెన్‌ అన్నమాటలు, ఈ సందర్భంలో సరిగ్గావర్తిస్తాయి.

''అనాదిగా, ప్రభుత్వాలలో జరిగిన అన్ని ప్రయోగాలలో, భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో ప్రవేశించడం ఎంతో ఆసక్తిదాయకమైన విషయం. సువిశాలమైన ఈ వుపఖండమంతా, తన వేలాది వేల మిలియన్స్‌ ప్రజలని. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో భాగస్వాములని చెయ్యాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత దేశం మా విధానాలని, పేలవంగా అనుకరించలేదు. మేము కలలో కూడా వూహించని విధంగా, ఎంతో బృహత్‌ రూపంతో, వేయింతలయిన సృజనాత్మక విధానాలతో భారతదేశం విలసిల్లుతోంది. అదే విజయవంతమైతే, ఆసియా మీద భారతరాజ్యాంగ ప్రభావం వల్ల ఎంత మేలు జరుగుతుందో అంచనా వేయడం కూడా కష్టమే. అయినా, ఫలితం ఎలా వున్నా, అలా, రాజ్యాంగం తీర్చిదిద్దే ప్రయత్నాలు చేసిన వాళ్లని గౌరవించితీరాలి'' అన్నారు, సర్‌ ఆంథోనీ యీడెన్‌.ఇక భారతరాజ్యాంగ నిర్మాత, డా|| అంబేద్కర్‌ సులువుగా సవరణలు చేసుకునే విధంగా, రాజ్యాంగాన్ని తయారుచేసి, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో, ''ఇండియన్‌ ఫెడరేషన్‌ 'రెజిడిటీ, లీగలిజమ్‌' అనే తప్పిదాలకి ఏనాడూ గురికాదు. ఇదో 'ఫ్లెక్సిబుల్‌ ఫెడరేషన్‌' కావడమే, దీని వైశిష్యం'' అన్నారు, సాలోచనగా.

ఏదేమైనా, అనితర సాధ్యమైన రీతిలో, భారతదేశం 1947 ఆగస్ట్‌ 15 వ తేదీన స్వాతంత్య్రం సముపార్జించుకుంది. అలాగే, 3 ఏళ్లు తిరిగీ తిరగకుండానే, అసమానమైన లిఖిత రాజ్యాంగ బద్ధంగా, మహత్తరమైన 1950 జనవరి 26 వ తారీఖున, బృహత్తరమైన, సావరిన్‌ డెమోక్రెటిక్‌ 'రిపబ్లిక్‌'గా అవతరించి, దేశ దేశాలకీ శిరోధార్యమైంది.

ఇప్పుడు, 2010 జనవరి 26 వ తేదీన, 61 వ గణతంత్ర దిన మహోత్సవాలు జరుపుకోబోతోంది. మరి, ఢిల్లీలో, రైసీనా హిల్స్‌ నుంచి, 'లాల్‌కిలా' అంటే ఎర్రకోట దాకా జరిగే మెగా పెరైడ్స్‌, వేడుకల వివరాలు తెలుసుకుందామా?


వేడుకలలో...

ఏటేటా, 'రిపబ్లిక్‌ డే' నాడు భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో, రాష్ట్రపతి భవనం సమీపంలోని రైసినా హిల్స్‌ నుంచి, రాజ్‌పధ్‌ ద్వారా, ఇండియా గేట్‌ గుండా, ఎర్రకోట (రెడ్‌ఫోర్ట్‌) దాకా, ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. కాల్బల (ఇన్‌ఫెంటరీ) నౌకాదళ (నేవీ) వాయుసేన (ఎయిర్స్‌ఫోర్స్‌)ల, త్రివిధ సైనిక దళాలు, తమ తమ అధికారిక అలంకారాలతో, ఇందులో పాలుపంచుకుంటారు. దేశం నలుమూలల నుంచీ, పాఠశాలలో సమగ్ర శిక్షణపొందిన వరిష్ట ఎన్‌.సి.సి. కాడెట్స్‌కి చెందిన పటాలం కూడా, ఈ ఊరేగింపులో పాల్గొంటుంది. భారతీయ సైన్యాధిపతి (కమాండర్‌-ఇన్‌-ఛీఫ్‌) గా వ్యవహరించే భారత దేశాధ్యక్షులైన, 'రాష్ట్రపతి' ఈ సంరంభంలో, సకల అధికారిక లాంఛనాలతో సైనిక వందనం స్వీకరిస్తారు.

విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలతో...

'యూనిటీ ఇన్‌ డైవర్సిటీ' -భిన్నత్వంలో ఏకత్వానికి, బహుముఖ సంకేతంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల, విభిన్న ప్రాంతాల, జానపద, నాగరిక కళాకారులతో, విశిష్టమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ పెరేడ్‌లో చోటుచేసుకుంటాయి. అత్యంత వైభవోపేతమైన ఈ రిప్లబిక్‌ దినోత్సవ సంబరాలు, చివరికి భారతీయ వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) జెట్స్‌, వినువీధులలో చేసే 'ఫ్లైపాస్ట్‌' తో ముగిసిపోతుంది.

నేషనల్‌ బ్రేవరీ అవార్డ్స్‌తో...

భారతదేశంలో, స్వచ్ఛందంగా యువతీ యువకులూ, బాలబాలికలూ, తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి, ప్రకృతి బీభత్సాల, ప్రమాద భూయిష్టమైన సంఘటనల సందర్భాలలో, పౌరులని పరిరక్షించిన వుదంతాలెన్నెన్నో ఏటేటా జరుగుతూనే వుంటాయి. అలాంటి సాహసోపేతమైన యువతని సత్కరించడానికి, భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'నేషనల్‌ బ్రేవరీ అవార్డ్స్‌' ప్రదానం చేసే సత్సంప్రదాయం, ఏటేటా, రిపబ్లిక్‌ డే నాడు కొనసాగుతూనే వుంటుంది.

జాతీయ పతాకావిష్కరణతో...
రిపబ్లిక్‌ డే నాడు న్యూ ఢిల్లీలో, ఎర్రకోట మీద, భారత రాష్ట్రపతి మన మువ్వన్నెల బావుటాని ఎగురవేస్తారని అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీలో జరిగే ఈ గణతంత్రదినోత్సవాలని, దేశమంతటా ఆకాశవాణి వివిధ కేంద్రాలూ, దూరదర్శన్‌, తదితర టీ.వీ. ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుంటే, వీనుల విందుగా వింటూ, కనులపంటగా కంటూ, కుల, మత, వర్ణ, వర్గ వ్యత్యాసాలు లేకుండా, పరస్పరం గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విందులతో, వినోదాలతో మైమరిచి పోతుంటారు.

రాష్ట్ర రాజధానులలో...

అలాగే, భారతీయ రాజ్యాంగ బద్ధమైన వివిధ భారతీయ రాష్ట్రాలలో, గవర్నర్స్‌ జాతీయ పతాకం ఎగురవేస్తారు. రాష్ట్ర గవర్నర్స్‌ కులాసాగా లేని సందర్భాలలో లేదా వేరే విధంగా వ్యస్తమైన సమయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రులకే, ఈ అపూర్వమైన పతాక వందన గౌరవం దక్కుతుంది.

నేషనల్‌ హాలిడేగా...

భారతదేశ చరిత్రలో ఏ తరానికీ మరపురాని మహర్దినం, భారత స్వాతంత్య్ర దినం. అలాగే, భారతీయ రాజ్యాంగం (కాన్ట్సిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా) అమలులోకి వచ్చి, భారతదేశం, సర్వసత్తాక ప్రజాస్వామ్యం (సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌)గా అవతరించి, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అత్యంతాదర్శప్రాయమైన దినంగా రూపొందడంతో, 'ఇండియన్‌ రిపబ్లిక్‌ డే'ని కూడా, జాతీయమైన స్‌ెలవుదినం (నేషనల్‌ హాలిడే)గా పరిగణించింది, భారత ప్రభుత్వం.

సంప్రదాయక లాంఛనానుసారంగా...

ఆగస్ట్‌ 15 వ తేదీన, భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే శుభసందర్భంలో, భారత ప్రధాని త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించడం, అనూచానంగా వస్తున్న ఆచారం.

అలాగే, 'భారత జాతీయ గణతంత్ర దినం' (ఇండియన్‌ రిపబ్లిక్‌ డే) జరుపుకునే రోజున, భారత రాష్ట్రపతి జాతీయ పతాకం ఎగురవేసి, సైనిక వందనం స్వీకరించడం కూడా ఒక సత్సంప్రదాయమే. అంతేకాక, ఈ రోజున, ఎవరో ఒక ప్రముఖ దేశాధినేతని, ముఖ్య అతిథిగా మన దేశానికి ఆహ్వానించి, సకల లాంఛనాలతో సత్కరించడం కూడా, 1976 నుంచీ అమలులో వున్న సదాచారమే. అలా, ఇప్పటిదాకా మనం గౌరవించుకున్న ప్రపంచదేశాధినేతల వివరాలు బాక్స్‌ -1 లో, వున్నాయి.

రిప్లబిక్స్‌ జాబితాలలో...

రిపబ్లిక్స్‌గా వ్యవహరించే దేశాలు ఎన్నో వున్నాయి. అలాంటి రిపబ్లిక్స్‌లో కూడా, ఎన్నో రకాల వ్యవస్థలు చోటుచేసుకున్నాయి. వాటిలో, 1. ప్రాచీన కాలంలో యాంటిక్విటీ రిపబ్లిక్స్‌, 2. మిడిల్‌ ఏజెస్‌ అండ్‌ రినైజాన్స్‌ రిపబ్లిక్స్‌, 3. ఎర్లీ మోడర్న్‌ రిపబ్లిక్స్‌, 4. 19 వ సెంచరీ రిపబ్లిక్స్‌, 5. 20 సెంచరీ రిపబ్లిక్స్‌, 6. యూనిటరీ రిపబ్లిక్స్‌, 7. ఫెడరల్‌ రిపబ్లిక్స్‌, 8. కాన్‌ఫెడరల్‌ రిపబ్లిక్స్‌, 9. అరబ్‌ రిపబ్లిక్స్‌, 10. ఇస్లామిక్‌ రిపబ్లిక్స్‌, 11. సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌, 12. పీపుల్స్‌ రిపబ్లిక్స్‌, 13. డెమోక్రాటిక్‌ రిపబ్లిక్స్‌ ముఖ్యమైనవి. అయితే, భారతదేశం, సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ కనుక, మనం ప్రజాస్వామ్య బద్ధమైన 'సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్స్‌' వివరాలు క్లుప్తంగా బాక్స్‌ -2లో తెలుసుకుందాం.

అనేకానేక, సంకీర్ణ సమస్యల, సంక్షోభాల విషవలయాలలో చిక్కుకున్నా, మనదైన, సామాజిక, సాంస్కృతిక, వైశిష్యం సంతరించుకున్నామనడానికి సంకేతమే -ఈ రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్‌. అదే, గణతంత్రదిన మహోత్సవం. అంచేతే, ఘనతంత్రం మన గణతంత్రం.  • మూలము : ఆంద్రప్రభ దినపత్రిక ... సౌజన్యముతో
  • ===========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .